Wednesday, July 2, 2008

సర్. చిర్రావూరు యజ్ఞేశ్వర చింతామణి - పత్రికారంగానికి అధిష్టాత

పత్రికారంగానికి నావికుడు, నాయకుడు హోప్ ఆఫ్ యిండియన్ జర్నలిజం -
సర్. చిర్రావూరు యజ్ణేశ్వర చింతామణి
చిర్రావూరి చింతామణి ( 1880-1941 ) - 1 జూలై - వర్ధంతి
బాల్యం పూర్తి కాకుండానే పెళ్ళీ
ఆ రోజు 1880, ఏప్రిల్ 10. అది మహారాజసంస్థానసామ్రాజ్యం, విజయనగరం, లో ఒక సనాతన, సంప్రదాయ, సామాన్య కుటుంబం. ఆ కుటుంబంలో, ఒక మహిళలో తల్లికావాలన్న తపన ప్రసవవేదన ద్వారా శారీరకంగా బాధపడుతోంది. కానీ కళ్ళలో చెప్పలేని ఆనందం. పైగా ఆరోజు తెలుగువారి తొలిపండుగ, యుగాది కూడాను. సకలశుభసంగమం. చిర్రావూరు వారి కుటుంబం. ఆ కుటుంబ యజమాని, చిర్రావూరు రామసోమయాజులుగారికి పుత్రప్రాప్తి. పున్నామ నరక విముక్తి. పుత్రుడికి నామకరణం, చిర్రావూరి యజ్ణేశ్వర చింతామణి అని చేశారు. వేదపండితులు, శిల్పశాస్త్రం లో ప్రావీణ్యంతో ఆనాటి విజయనగరసంస్థానాధీశ్వరులు విజయరామ గజపతిరాజు గారికి రాజగురువు, సలహాదారులు - రామసోమయాజులుగారు. పుత్రుడు యజ్ణేశ్వర చింతామణి చిన్నప్పుడే చాలా చురుగ్గా వుండేవాడు. ఆనాటి చాందసభావగాఢరుగ్మతలు అలుముకున్న రోజులు కనుక మన చింతామణికి పదేళ్ళు నిండకుండానే పెళ్ళి చేశారు.
ఆనందగజపతి కి ఆప్తమిత్రుడు
చింతామణికి ఆప్తమిత్రుడు, మహారాజుగారి కొడుకు ఆనందగజపతివారు. మహారాజా కాలేజీలో తన మిత్రుడికి మంచి విద్య వచ్చేలా ఏర్పాట్లు చేశాడు. లలితకళలపై ఆధ్యయనం కావించేందుకు కాలేజీలో చేరే సమయం, 18 ఏళ్ళలోనే, పత్రికలకు రచనలు పంపడం మొదలైంది. తెలుగు హార్ప్ అన్న పత్రికలో చింతామణి వ్యాసాలు ప్రచురింపబడేవి. కొడుకి తెలివితేటలకు లోపల సంతోషిస్తున్నా, అల్లరిచిల్లరిగా తిరగడం తల్లిదండ్రులకు బాధగా వుండేది. ఎంతచెప్పినా బుర్రకెక్కని వయసు ప్రభావం. ఫలితంగా, ఆనాటి ఎఫ్.ఎ. పరీక్షలో తప్పాడు. కాని పూర్తిగా చదువులోపం కాదు; అనారోగ్యం తోడయింది. విశాఖపట్టణం వైద్యానికి పంపడం, ఆరోగ్యం కుదుటబడడం జరిగింది.
నేను సురేంద్రనాధ్ బెనర్జీలా కావాలి
ఆరోగ్యం కుదుటబడినా, బంధువులు అనుకున్నట్లు చింతామణి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ యువకునికి, కొన్ని ఆదర్శాలు మనసులో నిండిపోయాయి. కన్యాశుల్కంలో, గిరీశం, వెంకటేశంతో, నిన్ను సురేంద్రనాధ్ బెనర్జీ అంతటి వాణ్ణి చేస్తాను చూడు అంటూ, చుట్టలకు డబ్బుల్ని తెమ్మంటాడు. కాని మన చింతామణి కి గిరీశం లాంటి గురువు దొరకలేదు కాని, అక్షరాలా సురేంద్రనాధ్ బెనర్జీ లాగే తయారవ్వాలన్నది కృౠతనిశ్చయం అన్నది తేలిపోయింది. చింతామణి మొదటిమెట్టుగా స్థానిక రాజకీయాల్లోకి ప్రవేశించాడు. కాని వైజాగ్ నుంచి ప్రచురించే వైజాగ్ స్పెక్టేటర్ లో రచనలను చేయడం, వెంటనే మన చింతామణిప్రతిభను గమనించి, పత్రిక సంపాదక బాధ్యతలను, నెలకు ముప్ఫై రూపాయల జీతంతో కూర్చేబెట్టారు. కొద్దికాలానికి, ఆ పత్రికను 300 రూ. కి స్వంతం చేసుకుని, తనతోపాటు పత్రికను విజయనగరం కు మార్చాడు. తర్వాత, దాన్ని, యిండియన్ హెరాల్డ్ గా మార్చారు. ఆ సందర్భాన్ని స్మరించుకుంటూ, చింతామణి తన సవ్యసాచితనాన్ని, బహుముఖప్రతిభను పరోక్షంగా, చెప్పిన తీరు యిలా వుంది. పత్రికకు నేనుకేవలం సంపాదకుణ్ణేకాదు; నేను కార్మికుణ్ణి; నేనే అక్షరాలను పేర్చడం, తప్పులను సరిదిద్దడం, విలేఖరుణ్ణి, ఉప సంపాదకత్వంతో, నిర్వాహకుణ్ణి కూడాను; అన్ని కలగలిపి సర్వకార్యమిశ్రమనిర్వాహకుణ్ణి, అని అన్నారు. ప్రతిభతో ఆదరణ వేరు, ఆర్ధికంగా నిలదొక్కుకుందుకు ఆదరణ వేరు. రెండోతరగతి సమస్యలు మన చింతామణిని, ఏడాది కాలం లోపునే, పత్రికకు కాలం చెల్లింది. కష్టాలు ఎప్పుడూ వంటరిగా రావు అన్నట్లు, ఈ కష్టకాలంలోనే, చింతామణికి భార్యావియోగం కలిగి మరింత విచారంలో మునిగాడు. దురదౄష్టం, అనారోగ్యం కలసి చింతామణిని మద్రాసుకు తీసుకెళ్ళడం, అక్కడ మద్రాసు స్టాండర్డ్ పత్రికలో, జి.సుబ్రమణ్య అయ్యర్ సంపాదకత్వపుగురుత్వంలో, ఏడాదిపాటు పని చేశాడు. అప్పుడే, చింతామణికి అలహాబాదులో ఉద్యోగం గురించి ఎవరో చేసిన సలహాకు నవ్వాలో, ఏడ్వాలో తెలియని చమత్కార పరిస్థితి ఆవరించింది.
విధి గీసిన జీవనరేఖలు - అలహాబాదుకి కొత్త రూపురేఖలు
మానవుడు అనుకుంటే, దేవుడు నిర్ణయిస్తాడంటారు. సరెగ్గా, మన చింతామణి జీవితంలో అనుకోని మలుపు, మైలురాయి. పండిట్ మదనమోహనమాలవ్యగారు స్థాపించిన 'లీడఋ పత్రికకు సంపాదకత్వ బాధ్యతలకు పిలుపు రావడం - అదౄష్టం కలిసివస్తే, నడిచివచ్చే కొడుకు అన్నట్లు, చింతామణికి అద్భుతావకాశం. పత్రిక రూపురేఖలే కాదు, మొత్తం అలహాబాదు నగర సంస్కౄతినే మార్చివేశాడు. చింతామణి మళ్ళీ వెనక్కి తిరిగి ఆలోచించాల్సిన అవసరం రాలేదు. దేశంలోనే ప్రముఖ దినపత్రికగా మారిపోవడం, అందరికీ గ్రహితవిషయమే.
లీడర్ పత్రికకు లీడర్ మన చింతామణి
పత్రికకు సంపాదకత్వం అంటే వర్ణించలేని బరువు బాధ్యతలు. యాజమాన్యంతో సంపాదకునికి నిత్యం మిత్రశతౄత్వాల మిశ్రమమే. రాజీలేని ప్రతిభావ్యక్తులకు మరింత విషమపరీక్ష. యాజమాన్యం అనవసర విషయాలపై జోక్యం చేసుకోవడం నచ్చక, చింతామణి సంపాదకునిగా తనవంతు విధిని, న్యాయాన్ని చేశేవాడు. దానికి ఎవరినైనా లెఖ్ఖచేసేవాడుకాదు. చింతామణి ఏడాదికే సంపాదకత్వపు బాధ్యతలను చూస్తున్న చింతామణికి, పత్రిక యాజమాన్యసంఘాధ్యక్షులైన మోతీలాల్ నెహ్రూతో విరోధం వచ్చింది. యిద్దరూ ధౄవాలే. ఫలితంగా, చింతామణి కొనసాగినా, మోతీలాల్ నెహ్రూ సంస్థనుంచి, పత్రికలో భాగస్వామ్యం నుంచి తప్పుకోవడం జరిగింది. పత్రికాస్వాతంత్ర్యం, స్వేచ్చలకు భంగం ఆనాటి యాజమాన్యపు దుర:కారానికి బలవ్వడం అనాడే ప్రధానపాత్ర వహించిందని చెప్పడానికి చింతామణి ఒక ఉదాహరణ. 1904-1936 మధ్య మూడుదశాబ్దాల కాలం చింతామణి లీడర్ పత్రికకు ముఖ్యసంపాదకుడిగా కొనసాగారు. చింతామణి యిండియన్ హెరాల్డ్, స్టాండర్డ్ పత్రికలను వ్యవస్థీకరించడం కూడ జరిగింది. పత్రికాబాధ్యతలను నిర్వహిస్తూనే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రశాసనసభలో ప్రతిపక్షనాయకుడి హోదాలో కూడ కొనసాగేవారు. రాజకీయాలు కాంగ్రేసు వైపుకి నడిపించాయి. కాంగ్రేసు నుంచి తర్వాత తప్పుకోవడం, గాంధీ నడపిన సహకారనిరాకరణలాంటి ఉద్యమాల్లో పాల్కొనకపోవడం జరిగింది. నిరంతరం అనారోగ్యంతో జీవితాన్ని పోరాడినా, చింతామణి మాత్రం లీడర్ పత్రికలో రచనలు మాత్రం జీవితాంతం వరకు మానలేదు. చింతామణి తన చివరి ఆలోచనని, శ్వాసని కూడ పత్రికావేత్తగానే గడపడం, మహామార్గదర్శిగా భావించాలి.
సుప్రసిద్ధ పాత్రికేయుడు, ఉదారవాది, రాజకీయ నాయకుడు గా ప్రఖ్యాతమైన చింతామణి, ఆంధ్రులకు ఎప్పటికీ గర్వకారణం. తెలుగుపత్రికాపుటల్లో, ప్రత్యేక అధ్యాయపుటల్ని కేటాయించుకోవడం పట్ల, ఆయనకు వచ్చిన పేరు అసామాన్యం. 1916లో, తిరిగి 1927లో, అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనమండలికి ఎన్నికైనాడు. 1921-23 లో అప్పటి యునైటడ్ ప్రెసిడెన్సీ, ఈనాటి ఉత్తరప్రదేశ్ కు, విద్య, పరిశ్రమల శాఖామంత్రిగా పనిచేశారు. 1930-31 మధ్య జరిగిన మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రతినిధిగా హాజరయ్యారు. బ్రిటిష్ ప్రభుత్వం 'సఋ బిరుదుతో సత్కరించిన ప్రతిభామూర్తుల్లో, చింతామణి ఒకరు. బనారస్ విశ్వవిద్యాలయం వారు చింతామణికి గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది.
సర్. చిర్రావూరు యజ్ణేశ్వర చింతామణి, 1941 జూలై 1 న, పరమపదించారు.
చింతామణి షష్టిపూర్తికి ప్రశంసల జల్లు
చింతామణి 60వ జయంతి సందర్భంగా, సర్. తేజ్ బహదుర్ సప్రూ, అన్న ఆయన - మూడు దశాబ్దాల క్రితం ఈ రాజ్యాలు జడత్వంతో, కదలని నీటిచెరువులా స్థబ్దతతో వుండేవి; వాటిని చింతామణి ఆ తటాకాలకి రివ్వుమని కెరటాలను, తరంగాలతో కదిలించాడు; ప్రజలకు మాట్లాడడంలో ధైర్యసాహస ప్రవౄత్తులను కలగచేసింది చింతామణే; ధైర్యంగా ఎదుర్కోవడం కూడ చింతామణే నేర్పాడు; ఫలితంగా లీడర్ అవతరణ, ఆవిర్భావం, అభ్యుదయం, విప్లవం, కేవలం చింతామణే కారణం" అన్నారంటే, మన తెలుగుతేజం ప్రతిభాకెరటాలు ఎంతెత్తుగా పొంగాయో చెప్పనలవికాదు.
పత్రికారంగంలో వౄత్తి, ప్రవౄత్తిలను గడుపుకుంటున్న వారు, ప్రతినిత్యం స్మరించదగ్గవ్యక్తి, మన తెలుగుబిడ్డ, చిర్రావూరు యజ్ణేశ్వర చింతామణి - సి.వి. చింతామణి -. ఆయన వర్ధంతి సందర్భంగా, నివాళులనర్పించడం తెలుగువారిగా మనందరి కర్తవం, క్రతజ్ౙత.
చింతామణి గారి వర్ధంతి సందర్భంగా 'తెలుగురధం' సవినయ ప్రణామాలు సమర్పించుకుంటోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురధం.

1 comment:

Rajendra Devarapalli said...

శర్మ గారు,ఫాంటు సైజు కాస్త్ పెంచగలరా?