విశ్వదాభిరామ వినుర వేమ
'విశ్వదాభిరామ వినుర వేమా అన్న తెలుగు పద్యపాదానికి పరిచయం చేయడం దుస్సాహసం కదా! ఈ మకుటంతో ఉన్న పద్యం కనీసం ఒకటైనా రాని తెలుగువాడు ఉండడు; అధవా, ఉన్నా, వాడు తెలుగువాడా! ఏమో మరి, ఆలోచించాల్సిన విషయమే! విశ్వజనీనమైన వేదం - వేమన్న పద్యం. మానవత, సౌమ్య, సామ్యవాదాల త్రివేణీసంగమం.
కవి నుంచి యోగి
మనది త్రిలింగదేశం. మన సాహిత్యనికి కవిత్రయం అందరికీ తెలిసినదే. నన్నయ, తిక్కన, ఎర్రన. అయితే, మహాకవి శ్రీశ్రీ చెప్పిన తీరు వేరేలా వుంది. తిక్కన, వేమన, గురజాడ అన్నాడు. ప్రజాకవి గా పేరు తెచ్చుకున్న వేమన, ఈ అధునిక కవిత్రయానికి మధ్యస్థమైనా, ఆయువుపట్టు అనే చెప్పాలి. కేవలం వేమన కవి మాత్రమే కాదు. తెలుగు ప్రజానీకానికి వేమన్న ఒక మహాయోగి. మట్టిలో పుట్టి మహోన్నత శిఖరాలను అందుకున్న మానవతామూర్తి. మనుష్యుల మధ్య తిరుగుతూనే మానవజీవిత సత్యాసత్యాలను సత్యాన్వేషణశీళంతో దర్శించి విమర్శించిన వివేకి. ఆయన యోగమంతా అన్వేషణ. అన్వేషణలో అందివచ్చిన అనుభవాలను ఆటవెలదుల్లో అలవోకగా లోకానికి అందించిన అపరకవియోగి. ఆయన సూక్తుల్లోని శక్తి మాత్రం జాతికొక నూతన వ్యక్తిత్వాన్ని ప్రసాదించింది అన్నదాంట్లో సందేహం లేదు. అందుకే వేమన, మహానుభావుడు, సాధకుడు, బోధకుడు. జీవిత మహాసాగరాన్ని మధించి చేదును కుతుకలో, అమౄతాన్ని అంతరంగంలో నిలుపుకొన్న విధం ఆయన సాధనం. అమౄతమయమైన సత్యాన్ని చేదునిజాలతో నిరూపించి చిత్తాలకు హత్తేటట్లు చెప్పటం ఆయన బోధన విధానం. సరళమైన దేశీయఛ్ఛందంలో చెప్పాడు. ఆయన దర్శించిన అపూర్వ సత్యాలు ద్రష్టను చేశాయి. చెప్పిన సూక్తిమౌక్తికాలు స్రష్టను చేశాయి. ప్రజలకు కావలసిన దర్శనం, యోగి సాక్షాత్కారం లభించాయి. అందుకే వేమన, ప్రజాకవిగా, మహాకవిగా నేటికీ ప్రజల నాలుకలపై నిత్యనౄత్యం చేస్తున్నాడు.
గంగగోవు పాలు
వేమనకు సంబంధించిన ప్రతి సమస్యను గూర్చి వాదోపవాదాలు చెలరేగాయి. అతని కులం, కాలం, వంశం, వ్యక్తిత్వం, పుట్టినిల్లులాంటివాటి గురించి పండితులు, పరిశోధకులు చర్చలు, వాగ్వాదాలు ఎన్నో చేశారు. వేమనలు ఎందరో వున్నారు. అసలు వేమన ఎవరనీ, అతడు స్వయంగా రచించిన పద్యాల సంఖ్య గురించి విమర్శకులు తర్జన భర్జనలు చేయడం విస్తారంగా జరిగాయి. అభిప్రాయ భేదాలు, కట్టుకధలు ప్రచారానికి వచ్చినా, కొన్ని ప్రాధమిక విషయాల్లో ఏకీభావం కుదరడం జరిగింది అనే చెప్పవచ్చు.
తమిళ కురళ్ - తెలుగు వేమన
17వ. లో జీవనం, కాపు కులాన జననం కాగా, తిండికి తిప్పలు పడిన కుటుంబం కాదు ఆయనది. చదువు గురించి పట్టించుకొనకున్నా సామాన్య భాషాజ़్జానం సంపాదించుకున్నాడు. పఠన పాండిత్యం కన్నా, గురుముఖంగా చదువుకొని గడించిన విద్యలకన్నా, నిశితమైనలోక పరిశీలన ద్వారా సంపాదించిన జ़్జానమే వేమన అసలైన సిసలైన జ़్జానధనం. అతనిని కవిగా ఆనాటి సమాజం గుర్తించలేదు. విశౄంఖల విహారి, స్వేఛ్ఛాప్రియుడు అయిన వేమన ఒకరి అదుపుతో పెరిగినవాడు కాదు. రసికుడు. వేశ్యాలోలుడు. జీవితసుఖాన్ని తౄప్తితీర అనుభవించాడు. లోకంలోని అన్ని రంగాలను ప్రత్యక్షంగా పరిశీలించినవాడు. ప్రతీ హౄదయంలోని అగాధ సముద్రాన్ని తరచి చూచినాడు. రత్నాలవంటి భావాల్ని రాసులుగా తన హౄదయంలో దాచుకొన్నాడు. సమయసందర్భం వచ్చినప్పుడు ఒక్కొక్క రత్నాన్ని పద్యంలో పొదిగినవాడు. ఆయన సమాజపు తీరుతెన్నులను నిశితంగా పరిశీలించి, విశ్లేషించి, తన అనుభవసారాన్ని నిష్కర్షగా చెప్పాడు. అలా చెప్పిన భావానికి సవరణలు, పొడిగింపులు లేనేలేవు. అందుకే 'విస్సన్న చెప్పిన వేదం' అని లోకోక్తి. కాని వేమన చెప్పినదే వేదంగా, వాదంగా చెలామణి అయింది. నేడు అక్షరాల నిజమని నిరూపణ అవుతున్నది. మహాకవి ఆరుద్రగారు చెప్పినట్లు, తమిళులు 'కురళ్'ను వేదసమానంగా గౌరవిస్తారని చెప్పుతూ, మనకు వేమన పద్యాలటువంటివీ ఎన్ని పద్యాలు చెప్పినాడన్నది తీరని సమస్యా వేమనకే జ़్జాపకం లేనప్పుడు, మనమావిషయంలో స్పష్టంగా చెప్పలేం' అని చెప్పారు.
పద్యాలే, శతకం కాదు
వేమన పద్యాలు, వేమన శతకం అని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. బహుళ ప్రచారానికి నోచుకున్న పద్యరచన చేసిన వేమనకు శిష్య, అనుచర వర్గాలు ఏర్పడ్డాయి. పిల్ల వేమనలు కోకొల్లలుగా పుట్టుకొచ్చారు. మనకు వేమన పద్యాలుగా చెలామణి అవుతున్న వేలాది పద్యాలను ప్రకటించిన వారికి, వేమన తత్త్వాన్ని గుర్తించి జల్లెడ పట్టితే మిగిలిన పద్యాలే వేమన్న కౄతులు అని చెబుతూ, ఆరుద్రగారు, ఆ జల్లెడను తెలుగుకవులు, పండితులు, విమర్శకులు, చారిత్రకులు, పరిశోధకులు, రూపొందించడం ఎంతో అవసరం అని కూడ చెప్పారు. కొన్ని పరిశోధనలు జరిగినా, వేమనపై వేదాలు, వాదాలు రచించబడినా, మహానుభావుడి పద్యాలపై విస్తౄతమైన వ్యాఖ్యానాలు, విశ్లేషణలు యింకా రావలసిన అవసరం ఎంతైనా వుంది. శతక లక్ష్యలక్షణాలు పుష్కళంగా చోటుచేసుకున్న పద్యాలు కేవలం సంప్రదాయ శతకంలా పరిమితం చేయక, అధిగమించడం జరిగింది. పూర్వం శతక రచనలో, కవులు ఎవరి దారి వారు అనుసరించినా, వేమన మాత్రం 'ఆటవెలదీ మాధ్యమాన్ని ఎంచుకున్నాడు. వేమన్నను, యిటు సాహిత్యంలోను, అటు సంసారంలోను, వేమనను వరించి, వలచి, మురిపించింది, ఈ ఆటవెలది మాత్రమే అని చెప్పవచ్చు. మనందరి హౄదయాలను అలరింపజేస్తున్న ఆటవెలది పద్యాలు అక్షరరూపంలో ప్రత్యక్షమై, వేమన హౄదయాన్ని ఆకర్షించి, అలరించిన ఆ ఆటవెలది ఊరు, పేరు తెలియనేలేదు. తాళికట్టిన భార్యకంటె ఆరాధ్యదైవంగా మన్నించిన రసికుడు, మన వేమన. రచించటానికి పూనుకుని, రచనను నియమితకాలంలో పూర్తిచేయాలన్న ఆనాటి సత్సంప్రదాయాన్ని వేమన పాటించలేదు. వేమన కలం పట్టిననాటి నుంచి, ఊపిరున్నంతకాలం, పద్యాలను ఆశువుగా చెప్పడం జరిగింది. అందుకే, దీనిని శతకం అనడానికి వీరులేని పరిస్థితి. కేవలం, ప్రచురణకర్తలు, ధనార్జనకోసం, శతకాలుగా విభజించి వ్యాపారంగా మార్చుకున్న వైనంగానే భావించాలి.
వేదం, వాదం - రెండూ వేమన్నవే
వేమన్న సౄష్టించిన ప్రతిభావంతమైనది, ప్రభావితమైనది అయిన సాహిత్యం, ప్రముఖంగా పద్యాలను కేవలం శతకంగా పరిగణించడం సబబు కాదు. ఆంధ్రసాహిత్య నిర్మాత, ఆరుద్ర వేమనవేదం అని భావిస్తే, ప్రముఖ కవి గోపి వేమన్నవాదంగా వర్ణించారు. రాచరికాలు, ఆర్ధిక, మత, సాంఘిక భావాలతోపాటు, అనేక విలువలను స్ఫురించే పద్యాలను అనేకం రచించాడు. కందం, ఆటవెలది ఛందస్సులను సమశైలిలో తులనాత్మకం చేసిన తీరు అమోఘం. వేమన కాలం నాటి ప్రజాపాలనను, రాజులను - పిరికిపందలు, దుర్మార్గులు, అజ़్జానులుగా వర్గీకరించాడు. అందుకే, పిరికి బంటు కేల బిరుదు గొడుగూ అని, తరచు కల్లలాడు ధరణీశులు అని అంటాడు. వేమన్న రాచమూకలను, భూపతికౄపలను నమ్మరాదంటాడు. అల్పబుద్ధివానికి అధికారం తగదని, వెర్రిగొల్వరాదు విభుడెంతవాడైనా అని హెచ్చరించాడు. మతాల శిధిల సంధ్య, కల్ల గురువులు, శైవ వైష్ణవాల సంఘర్షణ, మహమ్మదీయ మతపు లేతనీడలు వేమనకు నిత్య యితివౄత్తాలు.
వేమన నీతి పద్య రత్నావళి
పోతన, త్యాగరాజు, తిక్కన కవీంద్రుడు మున్నగువారి శ్రేణిలోనివానిగా వేమనను పరిగణించక తప్పదు. వేమన పద్యాలు స్వానుభవపూరితాలు. వేమన తన పద్య పరంపరను 18 విభాగాలుగా విభజించాడు. అవి యిలా వున్నాయి. మూర్ఖ, దాంబిక, విద్వత్, అర్ధ, సజ్జన, దైవ, కర్మ, దైవ, మోహ, యోగి, బ్రహ్మస్వరూప, గురుభక్తి, ప్రపంచ స్వభావ, స్వభావ, కూట వేదాంత, జీవన్ముక్తి పద్ధతులతోపాటు, ఫలశౄతిని కూడ రచించాడు. అజ़్జానమే శూద్రత్వము, సుజ़్జానము బ్రహ్మమాట,శౄతులను వినరా, అజ़్జాన మణచి వాల్మీకి సుజ़్జానపు బ్రహ్మమొందె చూడర వేమా' అని మూర్ఖపద్ధతిలో పద్యాలను ప్రారంభించిన వేమన, తానునింద్రియముల దనర జయించిన, తత్త్వమరసిచూడ తానెయగును, రాజయోగయట్లు దేజరిల్లగ వలె, విశ్వదాభిరామ వినుర వేమా అని తన జీవన్ముక్తి పద్ధతిలో తన నీతిపద్య రత్నావళి ని ముగించాడు.
వేమన జ़్జానమార్గ పద్యావళి
ఈ రచనల్లో, నీతి, ఆచారం, ధర్మం, వేదాంతం, మొదలైన విషయాల గురించి రచించాడు.
వేమనను వీడని ఆటవెలది
తెలుగు ప్రజానీకానికి వేమన ఒకమహాయోగి. మట్టిలో పుట్టి, మహోన్నత శిఖరాల నందుకున్న మానవతామూర్తి. ఆయనయోగమంతా అన్వేషణ. అన్వేషణలో అందివచ్చిన అనుభవాలను 'ఆటవెలదీ ఛందస్సులో, అలవోకగా లోకాని కందించిన మహానుభావుడు మన వేముడు.
వేమన ముత్యాలమూటలు
వేమన రచించిన వాటిలో మచ్చుకు ఏరి ప్రస్తుతించడం కష్టతరమైన పని. మచ్చులో మచ్చులు కొన్ని.
అనగననగ రాగ మతిరమ్యమై యుండు, తినగతినగ వేము తియ్యనగును, సాధనమున పనులు సమకూరు ధరలోన.
ఉర్వివారి కెల్ల నొక్క కంచము బెట్టి, పొత్తు గుడిపి కులము పొలయజేసి, తలను చెయ్యెబెట్టి తగ నమ్మ చెప్పరా.
చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు, కొంచెమైన నదియు కొదవ కాదు, విత్తనంబు మర్రివౄక్షంబునకు నెంత.
కులము గలుగువారు గోత్రము కలవారు, విద్యచేత విర్రవీగువారు, పసిడి గల్గువాని బానిసకొడుకులు.
ఉప్పు కప్పురంబు నొక్కపోలిక నుండు, చూడ జూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్యపురుషులు వేరయా.
యిలా ఎన్నో, మరెన్నో, దర్శనమవుతూనే వుంటాయి. తెలుగువారు చేసుకున్న పుణ్యపరంపర - వేమన ఆటవెలదుల పరంపర.
వేమన ఆటవెలదులన్నీ ఉప్పులకుప్పలు. తెలుగునీతికి, తెలుగుజాతికి, ఆడపడుచులు.
జీవన ప్రస్థానం
రమారమి 1650 - 1750 మధ్య జీవించాడన్న బహుళ ప్రచారంలో వున్న వేమన, కొండవీటి, మూగచింతపల్లె, రాజవంశ సంబంధీకుడు. యవ్వనంలోనే జీవితంపై విరక్తి చెంది, తపోనిధితో యోగిగా మారాడు. 24 ఏప్రిల్ 1691 న జన్మించాడని ఒక అభిప్రాయం. అధికంగా, వేమనను 17 వ. శతాబ్దపువాడుగా పరిగణించినట్లు గోచరిస్తోంది. చివరకి కడప దగ్గర పామూరు గుహలో సమాధి పొందినాడని, కదిరి తాలూకా, కటారుపల్లె లో కూడ వేమన సమాధి గోచరిస్తుంది. లౌకిక స్పౄహను విస్మరించి, వైరాగ్యంతో దిగంబరాన్ని ధరించి, సమాజ రీతులకు అతని ప్రతిస్పందనలే ప్రజలకు ఉపదేశాలుగా మారినట్లు సాక్ష్యాలున్నాయి. నగ్నవేమనను చూసి లోకులు, తొలుత పిచ్చివేమన అని హేళన చేసినా, క్రమంగా సిగ్గుపడడం ప్రారంభించారు. ఎవరు విన్నా, వినకపోయినాఅ,జ़్జానమార్గాన్ని ఉపదేశించి, దేశమంతా తిరిగి, రొష్టుపడి, ఉద్రేకపడి, అన్వేషించి, ఎప్పుడో,ఎక్కడో, వేమన తనువు చాలించాడు అన్న వాదం కూడ ప్రబలింది.
బ్రౌన్ సేవలు చిరస్మరణీయాలు
చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ వేమన పద్యాలను వెలుగులోకి తేవడం జరిగింది. తెలుగుసాహితీచరిత్రలో ఒక చరగని మైలురాయి. వేమన ఆటవెలది పద్యాలు, సాధారణంగా, మొదటి రెండు పాదాల్లో నీతి ప్రతిపాదన, మోడోపాదంలో తగిన సామ్య ప్రదర్శన జరిగింది. నాలుగో పాదం, 'విశ్వదాభిరామ వినుర వేమా అని ముగించబడింది. వేమన ఆలనా పాలనా చూసిన ఆయన వదిన విశ్వదనూ, ఆయన ఆప్తమిత్రుడు అభిరాముడినీ మకుటంలో చేర్చి, వీరికి శాశ్వతత్వాన్ని ప్రసాదించిన ప్రతిభాశాలి. విశ్వద అంటే విశ్వానికి కారకుడికీ, అభిరామ అంటే ప్రియమైన వాడని, అంటే, సౄష్టికర్తను ప్రియమైన వేమా, వినుము - అని మకుటానికి అర్ధవంతమైన భావాన్ని పండితులు విశ్లేషించారు.
వేమన కవిత్వం గాయపు మందు గాయానికి కాక, కత్తికే పూసినట్లుండును - రాళ్ళపల్లి అనంత కౄష్ణ శర్మ గారు.
భాగ్యనగర వారధి పై వేమనకు సుప్రతిష్ఠ
యిది ఒక చిరు నిదర్శన మాత్రమే. వేమన పేరున ఒక విజ़్జాన, సారస్వత ప్రదర్శనశాలను, స్మారక చిహ్నాలను ప్రతిష్ఠ చేయవలసిన అవసరం ఎంతైనా వుంది.
ప్రజాకవి వేమన కు ఈ సందర్భంగా తెలుగురధం ఘన నివాళిని సమర్పిస్తోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురధం
No comments:
Post a Comment