ప్రపంచ పుస్తక దినోత్సవం - 23 ఏప్రిల్ ప్రముఖ కవి, నాటకకర్త 'విలియం షేక్సిపియఋకు అంకితం (1564 - 1616)
మానవాళి కి వీలునామా
విశ్వంలో తిరుగాడుతున్న భూగోళం గురించీ, మానవ జాతిని గురించీ చర్చించడం లాంటి కోవలోకే వస్తుంది, ప్రముఖ కవి, నాటకకర్త, విల్లియం షేక్సిపియర్ గురించి చర్చించడం. ప్రపంచంలోని అన్నిదేశాలు నిత్యం ఈతని ప్రతిభాపాటవాల్ని చర్చించుకోవడం ఒక పరిపాటి అవుతున్నది. మరేకవికి సమకూరని యింత పేరుప్రతిష్టలు ఈయనికి కలగడం, ఈయన గురించి వచ్చిన పుస్తకాలు మరేకవి గురించి రాలేదు అన్నది సత్యం. షేక్స్పియర్ గురించి వ్రాయడం నాగరక ప్రపంచానికి ఒక తీరిక సమయపు వ్యాపకం అయిపోయందని ఒక విశ్లేషకుడు అభిప్రాయపడ్డాడు. 'షేక్స్పియర్ రచనలు, ప్రత్యేకంగా, నటకాలు, మానవాళి కి వీలునామా' అని ప్రముఖ రచయిత, 'సాహితీస్రవంతీ సౄష్టికర్త, 'చివరికి మిగిలేదీ రచయిత అయిన 'బుచ్చిబాబూ అన్నారు. కేవలం ఆంగ్లసాహిత్యమే కాదు, యావత్తు విశ్వసాహిత్య విశ్లేషణ పూర్తి కాదు, షేక్స్పియర్ ని, ఆయన సాహిత్యసర్వాన్ని కలపకుండా. సాహిత్యాభిమానులు, వయసు, దేశం లతో ప్రమేయం లేకుండా, షేక్స్పియర్ రచనల ప్రభావం లేకుండా మనలేరు అన్నది సత్యం.
జీవిత సారాంశం
షేక్స్పియర్ వ్యక్తిగత జీవితం గురించి యిదమిద్ధంగా పరిశోధన చేసి తెలుసుకున్న విషయాలు సమగ్రంగా అలభ్యం అనిపిస్తుంది. ఆయన 1564, ఏప్రిల్ 23 న స్ట్రాట్క్ ఫర్డ్ గ్రామంలో జన్మించి, పాఠశాలలో చదువుకున్నాడు. ఆయన కన్న 7-8 ఏళ్ళు పెద్దైన 'ఏన్ హతావే ను 1582 లో వివాహమాడి, 'సుసన్నా(పుత్రిక) మరియు మగ కవలలు - జుడిత్, హామ్క్నెట్ అన్న కొడుకులు కలిగారు. లండన్ నగరం వచ్చి, నాటకం కంపెనీ లో చిన్న చిన్న పనులు చేస్తూ, కొన్ని నాటకాలు వ్రాశాడు. స్వగ్రామం వెళ్ళి, కుటుంబానికి వీలునామా వ్రాసి, తన 52వ ఏట (1616) మరణించాడు. ఈయన సాహిత్యం చాలా సుస్ఫష్టం గా నేటికీ విరాజిల్లుతున్నా, వ్యక్తిగత జీవితపు వివరాలు మాత్రం అంతంతగానే లభిస్తున్నాయని పరిశోధకుల అభిప్రాయం. క్రమేపీ జీవితవిశేషాలను కొన్ని లభిస్తున్నా, 'అసలు ఈ నాటకాలు వ్రాసింది ఈయనేనా అని, ఈయన పేరుతో ఫలానా వారు వ్రాశారు అన్న వాదాలు కూడ నేటికి ప్రకటిస్తూనేవున్నారు.
రచనాపరంపర
రెండున్నర దశాబ్దాల మేరకు విస్తరించిన రచనవ్యాసాంగం లో, ఈయన ముప్ఫైఏడు నాటకాలని, వందకు పైగా యితర కవితలు, రచనలను అందించాడు. మొట్టమొదటి ప్రయత్నంగా దీర్ఘకవిత - 'వీనస్ - అడోనిశ్ 1593 లో ప్రచురణ జరిగింది. ఈయన వ్రాసిన ప్రముఖ నాటకాలు - విషాదాంతాలు, సుఖాంతాలు వున్నాయి. ప్రముఖమైన విషాదాంత నాటకాలను ప్రస్తుతించాలంటే, తప్పని సరిగా మనని నేటికీ వెంటాడేవి : 'రోమియో - జులియట్', 'జులియస్ సీజఋ, 'ఆంటనీ - క్లియోపాత్రా', 'హాంలెట్', 'ఒథెల్లో', మాక్ బెట్, 'కింగ్ లియఋ ప్రముఖ్మైనవి. వీటిలో తలమానికస్థాయికి చేరుకున్నది మాత్రం 'హాంలెట్' నాటకం అని చెప్పక తప్పదు. షేక్స్పియర్ నాటకాల్ని పరిశీలిస్తే, యువకులైన నాయికానాయకులను సుఖాంతాలు లో కనిపిస్తే, విషాదాంతాల్లో మాత్రం మధ్య వయసు వ్యక్తులే అన్నది కూడ స్పష్టం అవుతుంది. 1611 లో నాటకానికి స్వస్తి చెప్పి, స్వగ్రామానికి వచ్చేసిన, ఈయన 1616 వరకు యిక్కడే గడిపాడు. మరణించిన దాదాపు 200 ఏళ్ళవరకు, సంక్షిప్తాలు, మార్పుచేర్పులతో నాటకాలను ప్రదర్షించేవారట. 19వ శ. లో యధాతధ నాటక ప్రచురణలు, వాటికి వ్యాఖ్యాన, విశ్లేషణాత్మక విమర్శలు పుంఖానుపుంఖాలుగా వచ్చిపడ్డాయి. వాదోపవాదాలు, వ్యక్తిగత జీవితం గురించి వచ్చినా, విలియం షేక్స్పియర్ అన్న వ్యక్తి జీవించడం, 'నభూతోనభవిష్యతీ అన్నట్లు సమగ్రసాహిత్యాన్ని ప్రపంచానికి అందజేయడం సత్యం. అందరిచే కొనియాడబడిన వాడు, నేటికీ సాహితీప్రేమికుల నోళ్ళ, హౄదయాల్లో, నిరంతరం సంచరిస్తూనే వుంటాడు. ఆయన ప్రతిభకు తార్కాణంగా, ఆయన స్మౄతికి నివాళిగా, ఐక్యరాజ్యసమితి అనుబంధసంస్థ - యునెస్కో, ఆప్రిల్ 24 న 'ప్రపంచ పుస్తక దినోత్సవం' గా ప్రకటించి, విశ్వవ్యాప్తంగా ఈయన ప్రతిభాపాటవాలను పున:స్మరణం, సింహావలోకనం చేసుకుంటున్న శుభతరుణం అన్నది తధ్యం.
రచనాశైలి
మానవుడి అంతరంగ వికాసానికి దోహదమిచ్చే దౄక్పధం, ప్రక్రియలు, ఈయన నాటకాలలో చొప్పించడం జరిగిందని పలువులు విశ్లేషిస్తారు. మానవనిజస్వరూపాన్ని, విషాదాంత నాటకాలలో సుస్ఫష్టంగా ప్రదర్షించారు. మానవాళి ఏకాంతంగా, రహస్యంగా సాగించే ఆలోచనలు, ఆశలు, ఊహాలు, ప్రధాన పాత్రల ద్వారా వివరించబడ్డాయి. మన ఆలోచనల్ని, వాంచల్ని తెలుసుకుని, మనమే ఆశ్చర్యపడేలా చేస్తాయని అందరూ ఒప్పుకున్న సత్యం. కనీసం కొంత సేపైనా, మానసిక వైరాగ్యం అలవడుతుంది. ఆయన రచనలపై కాకుండా, మనస్తత్వం, తత్వం, స్వరూపం, జీవితసమస్యలమీద అలవరచుకున్న దృౠక్పధం పైన ఎన్నో పుస్తకాలు వ్రాసిన కవులు, విమర్శకులు అనేకమంది తారసపడతారు. ఆయన రచనలతో బాటు, ఆ రచనల గురించి, ఆయన గురించి, యిన్ని రచనలు వుండటం బట్టి, షేక్స్పియర్ ని ఎరుగున్నంతగా మరే వ్యక్తి, కవిని ఊహించలేము అని ఒక ప్రముఖ రచయిత 'జె.బి.స్రీస్ట్ లీ' అన్నాడు. ఈయన వ్యక్తిత్వాన్ని పోల్చాలంటే, 'హేంలెట్' లాంటి వాడే అన్నవాళ్ళు కూడ ఎక్కువే. ఫలితంగా, సమస్యతో కూడుకున్న నాటకం గా మారింది. మానవుడి విధి నిర్వహణలో విషాదం - 'తెలివిహీనులు బల్లగుద్ది చెప్పడం, తెలివైనవారు నోరుమెదపరు, యిదే ప్రపంచానికి అరిష్టం' అన్న ప్రముఖ తత్వవేత్త 'బ్ర్ ట్రండ్ రస్సెళ్ సందేశ్భావాన్ని అందజేయడం జరిగింది. షేక్స్పియర్ ని, ఆయన రచనల్ని, ప్రముఖంగా, 'హేంలెట్' నాటకాన్ని విమర్శించిన ప్రముఖుల్లో, 'టి.యస్. యిలియట్', 'టాల్స్ టాయ్', 'బెర్నాడ్ షా' చోటుచేసుకోవడం, ఒకవిధంగా ఆశ్చర్యం కూడ కలుగుతుంది. షేక్స్పియర్ నాటకాల్లోని 'రసహీనాపు లక్షణాల జాబితాలను, 'లోగన్ పెర్సాల్ స్మిట్ అన్న ప్రముఖుడు పుస్తకాన్నే వ్రాశాడు. కేవలం విమర్శలేకాదు, ఈ నాటకకర్త రచనల్లోని నిర్వచనాల్ని, ఉపమానాల్ని, విశేషాల్ని, సమాసాల్ని, ప్రధానంగా భావించిన వాటిని, మరింత విపులంగా, 'కారెలైన్ స్పర్జిణ్ అన్న రచయిత్రి ఒక ఉద్గ్రంధాన్నే విడుదల చేశాడు.
నాటక రచన కు సరిసములు లేని శైలీసంపద
నాటకాల్లో చాలా చోట్ల వచనం తో నడిపినా, అన్ని నాటకాలని, వచనకావ్యాలు గానే విరాజిల్లాయి. ప్రభావితమైన స్వగతాలు, ప్రకౄతివర్ణనలు, జీవితనిర్వచనాలు, మనుషుల అంతరంగాల్ని స్వయంవిశ్లేషణం చేసుకునేందుకు చక్కటి అవకాశం గా పరిణమించాయి. చలోక్తులను విసరడం లో అద్వితీయుడు, నాటకాల్లోని సూక్తులను ప్రత్యేక ప్రచురణలుగా వచ్చేయి. నాటకాలను చదవడం లో వున్న ఆనందం, తరచు వింటూన్న సూక్తులను పసిగట్టడం లోనే వుందని పలువురి భావన.
విశిష్ట పదప్రయోగాలు
'ఆకుపచ్చ కళ్ళ రాకాసి - అసూయా, 'నిశీధి చాచిన ఇనప నాలుకా, 'సమానమైన చేతులుగల న్యాయం', 'అతుకులు, సాగెయ్యడాలూ, త్వరితంగా జరిగే కర్మాగారం (మెదడు)', 'శాంతి చేసే బలహీనమైన గానం', 'తడిసిన కళ్ళలో ధర్మం మూతి బిగించి చేసిన రొదా, 'నిశీధి నడుమ మౄతి వైశాల్యం', 'దగ్ధమైన పగటి వెలుగూ, 'ధనంతో వంకర తిరిగిన జాతి ప్రియులూ, 'కళ్ళు తెరుచుకున్న గూడుపుఠాణీ, 'పంగలకర్రలా రెండుగా వీడిన మనిషీ, 'జమకొచ్చిన ప్రేమలో యాచనా, 'సామ్రాజ్యాలను ముద్దుతో తుడిచివేశామూ, 'జీవితం ఒక నడిచేనీడా, 'నీ తల్లిపాలిటి అద్దానివి నువ్వూ, 'కన్యలాంటి ముల్లుమీద వాడిన గులాబీ, 'కాలం కూర్చిన సంక్షిప్త సారాంశం' 'జీవితం నడిచే నీడా, యిలా చెప్పుకుపోతే, ఎన్నో, వందలు, వేలు, వేనకువేలు. వాటిని క్రోడీకరించడం కాదు, చలం చెప్పినట్లు, అనుభవించి, పలవరించాలి.
మరిన్ని అనువాదాలు, విశ్లేషణలు, రావాలి
తెలుగులో కొన్ని అనువాదాలు వచ్చాయి. కాని, సమగ్రసాహిత్యానికి అనువాదాలు, అనుసౄజనలు, రావాలి. ఈ నాటకకర్త రచనల్లోని మూలాల్ని, మూల్యాల్ని, అందించాలి. కేంద్ర సాహిత్య సంస్థలు అన్ని భాషలలోకి అనువాదాల్ని ప్రచురించి, తరచు వెలుగులోకి తేవాలి. సాహిత్యానికి, సహితభావనలే ముఖ్యం, భాష కాదు ప్రధానం. షేక్స్పియర్ జీవిత విశేషాలు, నాటకాల చరిత్ర, ఇతివౄత్తం, పాత్రల స్వరూపచిత్రణలు, తాత్వకధోరణులు, సమగ్రంగా, గంభీరంగా వ్రాసిన ప్రముఖుల్లో, 'వాల్టర్ రాలే, 'ఇవార్ బ్రౌణ్ రచనలను సాహిత్యాభిమానులు అవకాశాన్ని జారవిడువకుండ చదివి ఆనందించడం మాత్రం మరువకూడదు.
విశ్వవ్యాప్తంగా పుస్తకం, రచన,రచయిత లను ప్రస్తావించాలంటే, మొదటసారిగా, మానవ మస్తిష్కానికి స్ఫురించేది - మహాకవి విలియంస్ షేకెస్పియర్. ఆ మహానుభావునికి, మహామనీషికి, అత్యధ్బుత ప్రతిభావంతునికి - ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ఘన నివాళిని సమర్పిస్తూ -
కొంపెల్ల శర్మ - తెలుగురధం.
No comments:
Post a Comment