Wednesday, March 26, 2008

మహిమాన్విత మాయావి - కాలం

కాలం - మహిమాన్విత మాయావి
సౄష్టిక్రమం
చరాచరాత్మకమైన ఈ జగత్తుకి కర్త నారాయణుడు. సౄష్టి చెయ్యవలసే కాలం వచ్చిందని, 'మహత్తూని రూపొందించాడు. సాత్త్వికము, రాజసము, తామసము అని మహత్తు మువ్విధాలు. వైకారికము, తైజసము, భూతం తామసం. మూడు కలసి వికారం. ఈ వికారమే 'అహంకారం' - ఆ మహత్తునుంచే వచ్చింది. రూపొందిన ప్రాణులలో, ఆవశ్యకమైన ధ్వనిప్రధానంగా ఆకాశం, స్పర్శప్రధానంగా వాయువు, రసమ్రధానంగా జలం, గంధప్రధానమైన పౄధివి - మాత్రరూపాలుగా భూతసౄష్టి జరిగింది. ఈ సౄష్టి తామసమైన అహంకారం నుంచి ఏర్పడింది. అలాగే, జ़్జానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సులతో ఒక రూపం ఏర్పడడం, ఒక అండం, గ్రుడ్డురూపంతో సౄష్టి జరిగింది. అదే మానవులకు, కొండలకు, సముద్రాలకు, ద్వీపాలకు, అడవులకు, క్రిమికీటకాదులకు మూలపదార్ధం అయింది. హరి రజోగుణమూర్తియై బ్రహ్మరూపముతో సౄష్టికర్త కల్పాంతం వచ్చేవరకు నరసింహాది రూపాలతో ఆ సౄష్టిని పాలిస్తూ, లయ సమయం రాగానే రుద్రరూపంతో అంతమొందిస్తున్నాడు. అదీ సౄష్టికధ. అవిఛ్ఛన్నమైన సౄష్టియందు కాలం అనంతమైంది. భగవత్స్వరూపమే కాలమని శౄతులు ఘోషిస్తున్నాయి. కాలం లేక మానవ మనుగడ లేదనడం సత్యం. యుగాలు, మన్వంతరాలు, కల్పాలు మొదలుగా బ్రహ్మమానం వరకూ కాలనిర్ణయాల్ని వివరించడం జరిగింది. అయితే సూక్ష్మాతిసూక్ష్మమైన మానవకాలాన్ని గుర్తించడం మాత్రం బహు దుర్లభం.
కాలమానం
సౄష్టికార్యక్రమంలో ఆయు: ప్రమాణం నూరేళ్ళు. ఆ గణనం యిలా సాగింది. పద్దెనిమి నిమిషాలు ఒక కాష్ఠ. ముప్ఫై కాష్ఠలు ఒక కళ. ముప్ఫై కళలు ఒక ముహూర్తం. ముప్ఫై ముహూర్తాలు ఒక అహోరాత్రం. అహోరాత్రం అంటే ఒక పగలు, ఒక రాత్రి - అది మనుష్యమానం. అలాంటి పదునైదుదినాలు ఒక పక్షం. రెండు పక్షాలు ఒక నెల. ఆరు నెలలు ఒక ఆయనం. వాటికి ఉత్తరాయణం, దక్షిణాయణం అంటారు. ఈ రెండు ఆయనాలు కలిసి ఒక సంవత్సరం. దేవతలకు దక్షిణాయనం ఒక రాత్రి. ఉత్తరాయణం ఒక పగలు. మానవుల గణనలో ఒక మాసం - పితౄదేవతలకు ఒక దినం. వసువులకు ఒక దినం - మానవులకు ఒక సంవత్సరం. దేవమానములో వెయ్యి సంవత్సరాలు ఒక యుగం. అదే త్రేతాదులు. అలాంటి యుగాలు వెయ్యి బ్రహ్మకు ఒక దినం. బ్రహ్మకు ఒక దినమైన కాలంలో పద్నాలుగురు మనువులు ప్రవర్తిస్తారు. ఒక మన్వంతరం ఇంద్రాదులకు దేవమానం ప్రకారం కొన్ని వేల సంవత్సరాల కాలం అవుతుంది. విశ్వసౄష్టికి ముంది దేవతలను, పితౄదేవతలను ఈ వరుసలో గంధ్వరులను, రాక్షసులను, యక్షులను, పిశాచాలను, గుహ్యకులను, ౠషులను, విద్యాధరులను, మనుష్యులను, పశువులను, పక్షులను, స్థావరములను, పిపీలికలను, పాములను సౄష్టించాడు. ఆ తర్వాత గుణకర్మ విభాగాలతో నాలుగు వర్ణాలను ఏర్పరచడం జరిగింది. సౄష్టిని ఇలా పగలు నడిపి రాత్రికాగానే ముల్లోకాలను ఉపసంహరించి, ఆ ప్రభువు ఆ రాత్రి శేషశాయిపై యోగనిద్రలో ఉంటాడు. ఆ రాత్రినే కల్పాంతమంటారు. దానికే బ్రహ్మకల్పమని పేరు. ఇలా సౄష్టించి నైమిత్తికమనే ప్రళయంలో ఆ సౄష్టిని సంహరించి, ఆదిదేవుడైన శ్రీహరి యోగనిద్రాముద్రితుడవుతాడు.
రోజులు - సంవత్సరాలు
భూమి గుండ్రముగా ఉండి తన చుట్టూ తాను తిరుగుతున్నందున ఎదురుగా ఉన్న సూర్యగ్రహం వెలుగు (ఎండ) భూమిపైన ఒకే ప్రక్కన పడుతుంది. అంటే సూర్యునికి ఎదురుగా వున్న భూభాగముపైన ఎండ పడుతుంది. వెనుక వైపు పడదు. కాబట్టి చీకటిగా ఉంటుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నందున సూర్యకాంతి మొత్తం భూభాగంపై పడుతూంది. కనుక ప్రతి భూభాగానికి వెలుతురు (పగలు), చీకటి (రాత్రి) క్రమంగా మారుతూంటుంది. ఇలా మనకు పగలు, రాత్రులు ఏర్పడుతున్నాయి. అలా మనకు పగలు, రాత్రులు ఏర్పడుతున్నాయి. ఒక పగలు, ఒక రాత్రి కలిపి ఒక రోజు అనుకుంటున్నాం.
రోజు నుంచి సంవత్సరం
కనురెప్ప పాటు కాలం సెకను, అరవై సెకన్లు ఒక నిమిషం, 60 నిమిషాలు ఒక గంట, పన్నెండు గంటలు పగలు, మరో పన్నెండు గంటలు రాత్రి, పగలు, రాత్రి కలసి ఒక రోజు అవుతుంది. పదిహేసు రోజులు ఒక పక్షం, రెండు పక్షాలు ఒక నెల, పన్నెండు నెలలు ఒక సంవత్సరం. పన్నెండునెలలు ఒక సంవత్సరం. ఫిబ్రవరి సాధారాణంగా యిరవై ఎనిమిది రోజులు. కాని, నాలుగు సంవత్సరాలకొకసారి, ఆ నెలలో 29 రోజులుంటాయి. దాన్ని లీపు సంవత్సరం, ఆ సంవత్సరం మూడొందల అరవైఆరు రోజులుంటాయి. ఒక సంవత్సరానికి, ఏభైరెండు వారాలు, పన్నెండు నెలలు, మూడు కాలాలు, ఆరు ౠతువులు, రెండు ఆయనాలు వుంటాయి.
నెలలు, ౠతువులు, కాలాలు, సంవత్సరాలు
సంవత్సరానికి మూడు కాలాలు - ఆరు ౠతువులు - పన్నెండు నెలలు.
వేసవికాలం - వసంత ౠతువు (చైత్ర, వైశాఖం), గ్రీష్మ ౠతువు (జ్యేష్ఠ, ఆషాఢం)వర్షాకాలం - వర్షౠతువు (శ్రావణం, భాద్రపదం), శరదౄతువు (ఆశ్వయుజం, కార్తీకం)చలికాలం - హేమంతౠతువు (మార్గశిరం, పుష్యం), శిశిరౠతువు (మాఘం, ఫాల్గుణం)
తెలుగు సంవత్సరాలు - 60. 'ప్రభవా నుంచి 'క్షయా వరకు - ఒక ఆవౄత్తం.
జ్యోతిషశాస్త్రం - కాలక్రమానుసారం
జ్యోతిషశాస్త్రపరంగా, కాలక్రమానుసరణ ఈ విధంగా చెప్పబడింది అని పండితుల అభిప్రాయం.
క్రీ.పూ.10000 కు ముందు కాలం - అంధకారయుగం.క్రీ.పూ.10000 నుండి క్రీ.పూ.500 వరకు - ఉదయకాలం.క్రీ.పూ.501 నుండి క్రీ.శ. 500 వరకు - ఆదికాలం.క్రీ.శ.501 నుండి క్రీ.శ. 1000 వరకు - పూర్వ మధ్యకాలం.క్రీ.శ.1001 నుండి క్రీ.శ. 1600 వరకు - ఉత్తర మధ్యకాలం.క్రీ.శ.1601 నుండి క్రీ.శ. 1946 వరకు - ఆధునిక కాలం.
వేదకాలానికి ముందుగానే జ్యోతిశ్శాస్త్రం అభివౄద్ధి చెందింది. వేదకాలం అనేదానికి నిర్వచనం చెప్పడం చాలా కష్టతరమైనా, క్రీ.పూ.6000 సంవత్సరాలు వేదకాలం అని పండిత బాలగంగాధర తిలక్ తెలిపారు.
ఉత్తరధ్రువ హి ప్రళయానంతర యుగారంభం క్రీ.పూ.10000 లేక 8000, అదితి లేదా పునర్వసు యుగం క్రీ.పూ. 8000 - 5000 ప్రాచీన వైదిక విజ़్జానం మౄగశీర్ష యుగం క్రీ.పూ. 5000 - 3000 వేద విజ़్జానం భద్రపరపడిన కాలం కౄత్తికాయుగం క్రీ.పూ. 3000 - 1000 సామవేదం అధర్వణ వేదం సమగ్రత పొందిందని కూడ పలువురి పండితుల భావన. ఈ విధంగా వేదయుగం క్రీ.పూ.10000 - 1400 గా చెప్పబడిందని, తరువాత కాంతకాలం, అంధకారయుగాలుగా చెప్పవచ్చని పలువురి భావన.
కాలం - కాల విభజన
ప్రాచీనకాలం నుండి కాలాన్ని గుర్తించడం అనేది సాంఘికజీవితంలో ప్రాధమికావసంగా పరిగణనలోకి వస్తూంది. అసలు కాలం అంటే ఏమిటి? క్రమంగా రెండు కాలవ్యవధుల్లో వరుసగా సంభవించు సంఘటనలు మధ్యన వుండే వ్యవధి కాలం అని చెప్పబడింది. ఈ భూమిపై కాలజ़్జానాన్ని కలిగించేవి ఆకాశంలోని జ్యోతిర్గోళాలే. పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు, నక్షత్రముల నడకల ఆధారంగా కాలగణన చేసేవారు. ఇదే అన్నింటికన్నా ముందు గుర్తించిన కాలవిభజన, తరువాత కాలంలో సాంఘిక జీవనం సంక్లిష్టం కావడంతో స్థూలంగా, సూక్ష్మంగా కాలనిర్ణయం చేయవలసివచ్చింది. ఆ క్రమంలో అనేక కాలవిభజనలు ఏర్పడ్డాయి. రోజులు, ఝాములు, ఘడియలు, విఘడియలు, లిప్తలు, వరలు -- శతాబ్దములు, దశాబ్దములు, సహస్రాబ్దములు, యుగాలు, కల్పాలు - ఈ విధంగా చిన్న, పెద్ద కాల విభజనలు జరిగాయి.
సూర్యసిద్ధాంతంలో కాలం గురించి యిలా ప్రస్తావించబడింది.
లోకానా మంతకత్ కాల: కాలోస్య: కలనాత్మక:తద్విధాస్థూల సూక్ష్మత్వా సూర్తశ్చా మూర్తి ఉచ్యతే.
ఆ సౄష్టిలో ప్రళయాంతంగా ఉండేకాలం మహాకాలం, మానవుడు కొలవదగు కాలం కలనాత్మకమని చెప్పి తిరిగి ఆ కలనాత్మక కాలం మూర్తకాలమని, అమూర్తకాలమని, రెండువిధాలుగా చెప్పబడింది. మహాకాలం కొలవడానికి ఎలా సాధ్యపడదో అదేవిధంగా అమూర్తకాలం కూడా కొలవడానికి సాధ్యపడదు.
యుగాలు - విభజన
మనకు చెప్పబడిన గ్రహాలు తొమ్మిది, నవగ్రహాలు. ఈ నవగ్రహాలు, వాటికక్ష్యా దూరబిందువులు, వాటి కక్ష్యలు సూర్యుని మార్గాన్ని ఖండించే బిందువులు. ఇవన్నీ 'అశ్వనీ నక్షత్రంతో కలిసి ఉన్న కాలం నుండీ, 'కాలం లెక్కింపూ మొదలయిందని పూర్వీకుల భావన. ఈ నవగ్రహాల చలన బిందువులన్నీ తెలుసు కనక, వాటి ప్రదక్షిణ కాలాలన్నీ పూర్ణ సంఖ్యలో ఉండడానికి ఎంత వ్యవధి కావాలో,కనిష్ఠ సామాన్య గుణిజాన్ని లెక్కవేసి, ఆ కాలవ్యవధిని ఒక 'కల్పకం' అన్నారు. అది 432 కోట్ల సౌర సంవత్సరాలకు సమానం. అంటే ఒక కల్పక ఆరంభంలోనవగ్రహాలన్నీ అశ్వనీ నక్షత్రంలో కలిసి ఉన్నట్లయితే, మళ్ళీ మరోకల్పక ఆరంభంలో కూడా అలాగే ఉంటాయి. ఈ కల్పకంలో 1000వ వంతును (అంటే 43,20,000 సం.) ఒక 'మహాయుగం' అన్నారు. ఈ మహా యుగాన్ని, 4 యుగాలుగా విభజించారు. ఒక మహాయుగంలో పదవవంతు కలియుగం, కలికి రెట్టింపు ద్వాపరం, కలికి మూడు రెట్లు ద్వాపరం, నాలుగు రెట్లు కౄతయుగాలుగా చెప్పారు. యుగాల్ని నాలుగు - కౄత, త్రేతా, ద్వాపర, కలి యుగాలు. వీటి కాల పరిధి - కౄత (17,28,000), త్రేతా (12,96,000), ద్వాపర (8,64,000) మరియు కలి (4,32,000) సంవత్సరాల పరిమితిగా నిర్ణయింపబడ్డాయి. ఈ నాలుగు యుగాలు కలిపి ఒక మహాయుగంగాను, 71 మహాయుగాలు ఒక మన్వంతరంగాను పరిగణించారు. అలాంటి 14 మన్వంతరాలు కలిస్తే, ఒక కల్పకం. అదే బ్రహ్మదేవుని గారికి (అనగా ప్రకౄతికి) ఒకకల్పకకాలం ఒక పగలుగాను, మరోకల్పకం రాత్రిగాను గణనం. అంటే, 432 కోట్ల సంవత్సరాలని చెప్పుకునే కాలంతో ప్రకౄతి తిరిగి ప్రారంభమవుతుంది. బ్రహ్మదేవునికి ఒక పగలు, ల్క రాత్రి అంటే - రెండు కల్పకాల కాల వ్యవధి. ప్రకౄతి ఒక గ్రహంపై అంతరించి, మళ్ళీ మరో గ్రహంపై ఉద్భవించడానికి మధ్య నుండే కాలం 'మరోకల్పకం'. దేన్నే బ్రహ్మదేవుని రాత్రీ అంటారు. పురాణాలు చెప్తున్న ఈ కల్పకాల సిద్ధాంతం, ఆధునిక శాస్త్ర విషయాలకు అనుకూలంగా ఉందని చెప్తారు. అయితే, యింతటి బౄహత్తర కాలమానాన్ని భూమిపై మరోజాతి ఏదీ చెప్పలేకపోయింది, అదే మన హిందూజాతి ఘనత!. భూమి మీద సూష్టి ప్రారంభమై ఇప్పటికీ సుమారు 200 వందల కోట్ల సంవత్సరాలైనట్లుగాను, హిందువులు తమ బౄహత్తర కాలమానంలో చెప్పిన విషయాలు, ఆధునిక శాస్త్రవేత్తల అంచనాలతో సరిపోవడం నిజంగా మనకు గర్వకారణం.
ప్రస్తుతం కలియుగంలోని 5109 వ సంవత్సరం లోకి అడుగిడుతున్నాం. శ్రీమత్ శంకర భగవత్పాద పూజ్యావతాబ్దం 2079, క్రీ.శ. 2008-09, శాలివాహన శకపు 1930, హిజరీ 1428-29, ఫసలీ వత్సరపు 1416-1417 లోకి ప్రవేశిస్తున్నం. అలాగే, స్వతంత్ర భారతావని తన శకాన్ని 61-62 వ సంవత్సరంలోకి ప్రవేశిస్తోంది. మన తెలుగు శ్రీ సర్వధారి నామ సంవత్సరం లోకి ప్రవేశిస్తున్నాం. అరవై సంవత్సరాల ఆవౄత్తంలో, వచ్చే సంవత్సరం - శ్రీ సర్వధారి - సర్వజిత్ నుంచి వాయనం అందిపుచ్చుకొంటోంది. 1948, 2008, 2068 సంవత్సరాల్లోని కధనదౄశ్యం. శకాలు - కాలమానం
సంవత్సరాల లెఖ్ఖల కోసం శకాలు ప్రారంభమైనాయి. పూర్వంనుంచి, మనదేశంలో అనేక శకాలు వాడుకలోకి వచ్చాయి. ముఖ్యంగా - శాలివాహన శకం (దక్షిణ భారతదేశం), విక్రమార్క శకం (ఉత్తరభారతదేశం) పాటించడం పరిపాటి అయింది. భారతదేశపు స్వాతంత్ర్యం తర్వాత, దేశం మొత్తానికి ఒకే శకం ఉండాలన్న భావనతో, శాలివాహనశకాన్ని జాతీయశకంగా నిర్ణయించారు. శ్రీ వౄష నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ అష్టమీ శుక్రవారం 1924 (పంతొమ్మిది వందల యిరవైనాలుగు) శకారంభమని గ్రహించాలి.
రోజుకు - ఉదయం బాల్యం. పగలు యవ్వనం. సాయంత్రం వార్ధక్యం. రాత్రి మౄత్యువు. పునరపి జననం. ఇది ప్రకౄతి విధానం. సమస్తానికి వర్తిస్తుంది.
కాలోయం బ్రహ్మ:
కాలోయం బ్రహ్మ: కాలమే బ్రహ్మయగుచున్నాడు. కాలానికి, బ్రహ్మకు ఆద్యంతాలు లేవు. మానవుడు తన సౌకర్యం కోసం సంవత్సరాన్ని ఓ కొలతగా పెట్టుకున్నాడు. భూమి సూర్యుని చుట్టూ తిరిగి వచ్చింది సంవత్సరం. కాని ఆరు గంటలను లెక్కించలేకపోతున్నాడు. అందుకే అధిక మాసాలు, లీపు సంవత్సరం మొదలైంది. నక్షత్రం, తిధిలాంటివాటి ప్రమాణాల్లోన్ని హెచ్చుతగ్గులు కలగడం, ఆయనధర్మాలనిబట్టి, కొంతకాలం పగటికాలం, మరికొంతకాలం రాత్రికాలం, అధికంగా సంభవిస్తాయి. ఫలితంగా, చాంద్రమాన సంప్రదాయాన్ని అనుసరించేవారు అధిక, శూన్య మాసాలను ఎదుర్కొనవలసివస్తోంది. సూర్యుడు మీనరాశి (చైత్రం), మిధునరాశి (ఆషాఢం), కన్య (భాద్రపదం), ధను:రాశి(పుష్యం) శూన్యమాసాలు అవుతాయి. ఏ మాసంలోనైనా, రవికి వేరొక రాశియందు ప్రవేశించుటయుండదో (శుక్లపక్షపాడ్యమి నుంచి అమావాస్య వరకున్న కాలం) అధికమాసంగాను, ఒకేమాసంలో రెండు రాశుల్లో సూర్యప్రవేశం జరిగిన క్షయమాసంగాను, శుభకర్మలకు యోగ్యంకానివిగా చెలామణి అవుతున్నాయి.
స్వామి బొంగరం తిప్పాడు, భూమి గిరగిరా తిరుగుతూనే వుంది.
కాలవిభాగం - యుగాలు, సంవత్సరాలు, ఆయనాలు, ౠతువులు, మాసాలు, రోజులు, అదే విధంగా ప్రాణి, తౄటి వరకు కాలవిభజన జరిగింది.
వివిధ సంవత్సరమానాలు - సౌర (365 1/2), సావన (360), నక్షత్ర (36.256), చాంద్ర (354).
మన తెలుగు వారిదిచాంద్రమానం. మన నెలలు చైత్ర, వైశాఖలు లా కొనసాగుతాయి. చాంద్రమానపు తెలుగు నెలకు ముప్ఫై రోజులుండవు. అయినా కాలపురుషుని గడియారానికి సూర్యభగవానుడు పెండ్యులం అనే చెప్పాలి.
కాలం సాగే తీరుతెన్నులు
తౄటి - లిప్త
అతి సన్నని మొన కలిగిన సూదిని తామరపువ్వు రేకుపై గుచ్చిన దాని మొదటిపొర దిగుటకెంత సమయం పట్టునో, దానిని తౄటికాలంగా చెప్పారు. దీన్నే పుష్కరకాలం అని, దీనిని గుర్తించుటకు బ్రహ్మకైనా సాధ్యపడదని పండితుల భావన. అలాంటి వంద తౄటి కాలాలు - ఒక నిమేషము (నిమిషం), యిరవైరెండు నిమిషాలు ఒక గుర్వక్షరం, అట్టివి పది కలసిన ఒక ప్రాణం, ఆరు ప్రాణములు ఒక వినాడిక, అరవై వినాడికలు ఒక నాడిక. ఈ ఘడియనే యిరవైనాలుగు నిముషములుగా వర్తమాన కాలమానం చెలామణిలో వుంది. ఒక ఘడియకు అరవై విఘడియలు, ఒక విఘడియకు అరవై లిప్తలుగా పరిగణనలో వున్నాయి. యిది తౄటి - లిప్త సంబంధ కాలప్రమాణం.
దైనందిక కాలస్వరూపం
దైనందిక జీవన విధానాల్లో కాలం యొక్క ప్రాముఖ్యం చాలా విశిష్టమైంది. చాంద్ర, సౌరాది మానాల రీత్యా కాలం - సంవత్సరం, ఆయనం, ౠతువు, మాసం, పక్షం, వారం, తిధి, నక్షత్రం, యోగ, కరణాది పంచాంగయుక్తమై కాలప్రమాణం సూచితమౌతోంది. భారతీయ సనాతన సంప్రదాయాన్ని బట్టి, సూర్యోదయం నుంచి దినం (రోజు, వారం) ప్రారంభమై, తిరిగి మరురోజు సూర్యోదయం వరకూ పరిగణనకు తీసుకోవడం, ఈ మధ్యకాలం అరవై ఘడియలు లేఖ యిరవైనాలుగు గంటలుగా శాస్త్రాలు నిర్ధారించాయి. ఒక దినం యొక్క ప్రమాణం అరవై ఘడియలు లేక యిరవైనాలుగు గంటలు. క్షణక్షణం చలించే భూమి యందు ఆయా కాలాల ప్రభావాల్ననుసరించి - నక్షత్రాత్మకమైన పన్నెండు రాశులుగా, ప్రతీదినం నిర్ణీత సమయాన భూమిపై తన ఛాయ(కాంతు)లను ప్రసరింప చేయగలుగుతున్నాయి. ప్రతీ రాశి కిరణశక్తి భూమిపై ప్రసరింపుచు యెంతకాలముండునో, ఆకాలమంతయు, ఆరాశి సంబంధిత లగ్నంగా భావించాలి. ఒక లగ్నం యొక్క కాలం సుమారు అయిదు ఘడియలుగా (రెండు గంటలు) భావించాలి. కొన్ని లగ్నాలు ఎక్కువ, తక్కువగా వుంటాయి. అట్టి లగ్న కాంతి కాలమందు ఒకానొక అత్యద్భుత రెప్పపాటు కాలం సంపూర్ణ శుభప్రదంగా వుంటుంది. దీన్నే 'సుముహూర్త పుష్కరకాలం' అని, ఈ కాంతి సూక్ష్మకాలంగాను, బ్రహ్మకైనా తరంకాదని తీర్మానించారు.
తమసోమా జ్యోతిర్గమయ - చీకటినుంచి వెలుగునకు సాగుదాం!

1 comment:

Sirulu said...

http://sirulu.blogspot.in/2012/12/blog-post.html కాలం గురించి నేను వ్రాసిన చిన్న టపా, మీ అభిప్రాయం తెలప గలరు.