Wednesday, March 26, 2008

జగమే ఒక నాటకరంగం

జగమే ఒక నాటకరంగం
"కావ్యేషు నాటకం రమ్యం" అని, "నాటకాంతం హి సాహిత్యం" అని, "నాటకాంతం కవిత్వం" అన్నవి అనాదిగా సోదాహరణంగా చెప్పబడుతున్న సూక్తులు. వీటితోపాటు దశవిధ రూపాకాల్ని, నవరసాల్ని, చతురాభినయ విభాగాల్ని, నాయకానాయికల లక్షణాల్ని ఉదాహరించడం కూడ మనకు ప్రాచీనతత్వం నేర్పిన సత్సంప్రదాయం. జగమే ఒక నాటకరంగమని ప్రతీతి. నిజానికి కల్పనాశక్తితో, నటనాకౌశలముతో రంగస్థలంమీద జగత్తుగా భ్రాంతి కలిగించడం నాటకం. ఈ సౄజనాఅత్మక కళ సామూహికమైంది. రెండు దశల్లో వికాసం చెందుతున్న ఈ కళ, రచనాపర్వం మరియు ప్రదర్శనాపర్వం. తెలుగులో స్వతంత్ర నాటకరచన 1850 లో అంకురించిందని అనుకుంటే, దాదాపు రెండు దశాబ్దాల తదుపరి, ధార్వాడ నాటకసమాజాల ప్రేరణతో ముందడుగు వేసింది. కొత్తగా నాటకాలాడిన ప్రముఖుల్లో కందుకూరి వీరేశలింగం పంతులుగారు ఒకరు. 1883 లో వడ్డాది సుబ్బారాయుడు 'వేణీసంహారం' నాటకంలో పద్యపఠన్నాన్ని ప్రవేశపెట్టి కొత్త మలుపు తిప్పారు. దాదాపు ఈ రోజుల్లోనే ఆధునిక సాహితీయగకర్త గురజాడ వారు 'కన్యాశుల్కం' రచించడం, ధర్మవరం కౄష్ణమాచార్యులుగారు 'చిత్రనళీయం' లాంటి పాటపద్యాలతో కూడిన రసవత్తర నాటకాలు వ్రాసి అనేకమంది నాటక రచయితలు ప్రదర్శనకు దోహదం చేశారు.
కాలానుగుణంగా మార్పులు
ఆధునిక నాటకం, నాటిక, ఏకాంకికలుగా సన్నగిల్లడం, వామనరూపాన్ని పొందడం, నాటకరంగం కూడ అంతంతగా మార్పుపొందడం, కాలానుగుణంగా వచ్చిన, వస్తున్న ఊహలకందని మార్పుచేర్పులు, నాటకరంగం, నటరత్నాలు కొనసాగుతున్నా, బళ్ళారి రాఘవ లాంటి సంకల్ప దీక్షా కంకణ సమరబద్ధత్వ ధోరణి నాటకకళారంగం లో క్రమేపీ లోపించింది అంటే కొందరికి ఆశ్చర్యం, కోపం కలగచ్చు కాని, సత్యానికి దూరం మాత్రం కాదు.
నాటకరంగానికి ఆకాశ పాతాళాల దిక్కులు
ఈ సందర్భంగా, మహాకవి శ్రీశ్రీ ఒక నాటకం చూస్తూండగా, ఒక నటుడు 'ఆకాశాన్ని చేత్తో చూపిస్తూ, పొరబాటున నేలమీదకు చూపించాడట. ఈ సన్నివేశానికి, మహాకవి వెంటనే, ఆ నటుడు చేసినది అలవాటు లో పొరబాటు మాదిరి, నాటకరంగస్థితిని యధాస్థితిగతుల్ని చూపించాడని చెప్పాడట. ఆకాశమే భూమిలోపల వుంటే, పాతాళం సంగతి ఏమిటి అని చమత్కరించాడట, మన మహాకవి.
'నాటకం', 'నాటికా లు చేసే పని, కలిగే ప్రయోజనం
పై అంశం పై ప్రముఖ నాటక రచయిత గొల్లపూడి మారుతీరావు - 'మారుతున్న విలువలు - నాటకం' అన్న వ్యాసంలో రమారమి నాలుగు దశాబ్దాల క్రిత్రమే వ్రాసిన వ్యాసం లో భావం యిలా వ్యక్తపరచారు.
'స్వీట్ బర్డ్ ఆఫ్ యూట్ అన్న నాటకం లో ప్రఖ్యాత నాటక రచయిత 'టెన్నిసీ విలియంశ్ తన ముఖ్య పాత్ర చేత, చివరగా చెప్పించే, భరతవాక్యం, 'నేను మీ దయాదాక్షిణ్యాలను అర్ధించడం లేదు. మీ అవగాహనను కోరుతున్నాను. అది కూడా కాదు, నన్ను, మీలో మిత్రునిగా, శత్రువుగా, కాలంపై, అన్నిటా గుర్తింపుచేసుకోవడం. అంతే" అని నాటకాన్ని ముగించాడు. దీనితో, అతను కధను ముగించలేదు, చివరికి ఎత్తుకున్న సమస్యలన్నీ అలాగే ఆగిపోతాయి. అయితే ఆ ముఖ్యపాత్ర మనల్ని ఎందుకో చివరంటా జిజ్ణాస కలిగిస్తూనే వుంటుంది. చివరికి పైవిధంగా ఆపాత్ర చెప్పాక ఒక్కసారి తుళ్ళిపడతాం, ఏం జరిగిందని ఆలోచించేలోగా నాటకం ముగుస్తుంది. తర్వాత ఆ పాత్రని గురించి, ఆసమాజం గురించి మనం ఆలోచించకుండా వుండలేం. ఆ ఆలోచనే, ప్రయోజనం, ప్రయోగాత్మకత, ప్రభావం, ప్రేరణాత్మకతలను కలిగిస్తాయి. కళ వల్ల మనకు కలిగే లాభం సరిగ్గా యిదే అని చెప్పక తప్పదు. యిటువంటి స్ఫూర్తిదాయక సంఘటనలు, బళ్ళారి రాఘవ నటించిన నాటక పాత్రల ద్వారా అందచేశాడు అన్నది చరిత్ర చెప్పిన సాక్ష్యం.
చివరి మాట కాదు - చివరిగా మరచిపోకూడని మాట
రక్తికట్టించే నాటకాలు, చాలావరకు మన నటుల పసవల్లనే కాని, నాటకాల పసవల్ల కాదేమో. నిజానికి పస తక్కువ నాటకాలే సమర్ధుడైన నటునికి అతని ప్రతిభావికాసానికి, ప్రాగల్భ్యప్రదర్శనకు ఎక్కువ అవకాశాలిస్తాయి. ఇది కొంతమందికి విడ్డూరంగా తోచవచ్చు. నిజనిష్టూరం. కాని, యిదే అభిప్రాయం ప్రపంచవ్యాప్తంగా వుందనే అనుభవశీలురు తరచు చెప్పుతుంటారు.
ప్రపంచ ప్రసిద్ధ నటశేఖరుల్లో ఒకరైన 'శ్టానిస్లొవస్కీ' (మాస్కో ఆర్ట్ థియాటర్ సంస్థాపకు లిద్దరిలో ఒకడు) అన్న మాట : 'మహానటుడే మెలోడ్రామాను జయప్రదం చెయ్యగలడు. సామాన్యనటుడు మెలోడ్రామాలో నెగ్గుకు రాలేడు. దానిలో లేని ఎత్తులను, లోతులను మెలోడ్రామాలో నటుడైనవాడు ఊహాకల్పన చేసి చూపించాలి. దానిలోని పాత్రలకు లేని బిగిని, పసను అతడే ఇవ్వాలి. ఇది సామాన్య నటులకు అసాధ్యం."
పైన వివరించిన మెలోడ్రామా, దానిలోని ఎత్తులు, లోతులు, వాటిల్లోంచి వచ్చే ఊహాకల్పనలు, పాత్రద్వారా అందించే బిగి, పస, యీవన్నీ, మహానటుడైన బళ్ళారి రాఘవ చుట్టూ అనేక ప్రదక్షణాలు చేశాయి.
ప్రభుత్వం పాత్ర సంగతి
తెలుగు నాటక రంగంలో, నటనా వైదుష్యాన్ని రంగరించుకున్న నటీనటుల, సౄజనాత్మకతను కలిగిన ప్రతిభావంతులైన రచయితలకు, దర్శకులకు సాంకేతిక నిపుణులకు కొదవలేదు. ప్రేక్షక లోకాన్ని రంజింపచేయగల సామర్ధ్యం వున్న కళాకారులెందరో వున్నారు. ఏ దౄష్టి కోణం నుంచి చూసినా తెలుగు వాడం ఏ ఇతర భాషల్లోని నాటకాలకు తీసిపోని సమాన స్థాయిలో వుంది. కాని దురదౄష్టవశాత్తు మన తెలుగు నాటకాలలో అత్యుత్తమంగా గుర్తింపబడినవి కూడ ఇతర భాషల్లోకి అనువాదం కాకపోవడం చేత మన నాటకం ఆంధ్రప్రదేశం ఎల్లలు దాటి బయటకు పోవడం లేదు. ఈ విషయం పైన కూడా ప్రభుత్వం తన దౄష్టి సారించవలసిన అవసరం ఎంతైనా వుంది. మంచి నాటకాలను, నాటికలను ఇతర భాషలలోకి అనువదింపజేసి, ఆయా భాషా రాష్ట్రాలలో అవి ప్రదర్శింప చేయాలసిన బాధ్యత కూడ మన ప్రభుత్వంపైన వుంది. ఈ బౄహత్తర కార్యం ప్రభుత్వేతర సంస్థల ప్రయత్నాలవల్ల సాధ్యం కాకపోవచ్చు కనక, ప్రభుత్వం ఒక నిర్దిష్ట ప్రణాళికను రూపొందించి, ఆచరించాలి. తెలుగు నాటక రంగానికి ప్రభుత్వం అందించవలసిన ప్రోత్సాహం ఎంతైనా వుంది. ఆరంభమంటూ జరిగితే బయటకు రావాలని ఇంకా ఎన్నో చూచనలు, సలహాలు వాటంతట అవే దూసుకు వస్తాయి.
కేవలం పురుషులకే కాదు - స్త్రీ ప్రాధాన్యత, స్త్రీపాత్రలతోనే
అనుభూతి కలగటం సరిసమమైనా, స్త్రీ పురుషులకు ప్రత్యేక ఒరవడిని కూడ రూపొందించడం జరిగింది. రాశిలో తక్కువైనా, స్త్రీల ప్రయోగ సౌలభ్యంకోసం పురుషపాత్రలు లేని నాటక సాహిత్యం కూడ కనిపించిన దాఖలాలు కనిపించాయట. కోకొల్లలుగా స్త్రీపాత్రలు లేని నాటకాలు రావడం నాటకరంగ చరిత్రలో ప్రముఖ భాగం అయితే, పురుషపాత్రలు లేని నాటకాలు రూపొందించి, ప్రదర్శించిన సంఘటనలు కూడ ఉన్నాయట. వీటిని, ప్రముఖ రచయితలు - నార్ల, ఆత్రేయ, బుచ్చిబాబు, జంధ్యాల లాంటివారు కనిపిస్తారు. అలాగే, స్త్రీ పాత్రల ప్రాధాన్యంతో కూడ నాటకాలు వచ్చాయి. ప్రముఖ రచయిత అంగర సూర్యారావు నాటిక పేరే - స్త్రీలకు ప్రత్యేకం. స్త్రీల సమస్యలను స్త్రీలచే ఆవిష్కరింపజేసి, వారిచేతే పరిష్కారమార్గంలో ప్రదర్శింపచేసిన తీరు, చక్కని రచనా సంవిధానంతో పేరు వచ్చింది. అలాగే స్త్రీలకు ఏకపాత్ర రూపకాలు, రామలక్ష్మి ఆరుద్ర - తెగతెంపులు కూడ చెప్పుకోదగ్గది.
నాటకరంగం భవిత
తెలుగు నాటకరంగం మరింతగా ముందుకు దూసుకు పోవాలంటే - నాటకం ఆరోగ్యవంతంగా బతకాలి. కలకాలం బతకాలి. నాటకాల కొరతతో పాటు, ప్రోత్సాహ ప్రోద్బలాల్ని అందించాలి. రంగశాలల కొరతతోపాటు, ఉన్నవాటిని మరింత అందంగా, సాంకేతిక సదుపాయాలను కలిగించాలి. వౄత్తిని ప్రోత్సహించాలి. కళ కళ కోసమే అన్న భావనతో పాటు కళ కాసుకోసం కూడ అన్న ఆలోచనకు ఒక కొత్త ఊపును, రూపును తీసుకురావాలి. సమాజాభ్యుదయానికి నాటకం ఒక పనిముట్టు అని గ్రహింపచేయాలి.
యితర రంగస్థల కళలకు ప్రోత్సాహం
నాటకం, నాటికలతో పాటు, యితర రంగస్థల కళలను - బుర్రకధ, యక్షగానం, తోలుబొమ్మలాట, జానపద ప్రదర్శనలు, సంగీత రూపకాది ప్రక్రియలకు ప్రోత్సాహం, ప్రోద్బలం కలిగించాలి.
రంగస్థల కళకు, తత్సంబంధిత రంగస్థల కళాకారులకు తగినన్ని సదుపాయాలను, ప్రోత్సాహలను, తమ కళావౄత్తుల్లో మనసావాచాకర్మణా కొనసాగేటట్లు, తగిన రంగస్థలాలను, నూతనమైన సదుపాయాలను అందజేయాలి.
జవసత్వాలు వొడికిపోతున్నాయా నాటక కళకు అన్న అందోళన, ఆవేదనల మధ్య నాటకరంగానికి, రంగస్థలానికి తగినంత చేయూతని అందించాల్సిన బాధ్యత మన తెలుగు పాలకులకు ఉంది అని ప్రస్తావిస్తూ, ప్రపంచ రంగస్థల దినోత్సవాల సందర్భంగా, రంగస్థల కళాకారులకు అభినందనలను తెలియజేసుకోవడం కనీస కర్తవ్యం గా భావిస్తూ - కొంపెల్ల శర్మ - తెలుగురధం.

No comments: