Thursday, March 20, 2008

ప్రపంచ ’కవిత’ దినోత్సవం - మార్చి 21

ప్రపంచ ’కవిత’ దినోత్సవం - మార్చి 21
కవి, కవిత్వం మధ్య భావపరంపర
కళ ఒక విశ్వజనీనమైన భాష. మన: ప్రపంచానికి బాహ్య స్వరూపం భాష. భాష అనేది భావం దాల్చే వేషం. వేషమునకు తగ్గ భాష వుండాలి. రసాత్మకమైన వాక్యమే కావ్యం. ధార, ధారణాశక్తి, రసస్ఫూర్తి గల కవితలు రాణిస్తాయి. అక్షరాలు, మాటలు మన అందుబాటులో వున్నాయి కదాని, స్వేఛ్ఛాప్రయోగాలు అర్ధరహితమవుతాయి అన్న భావాన్ని, "అక్షరాల్ని నిత్యం శంకించి ఉపయోగించేవాడే నిజమైన కవి" అని నగ్నముని అంటాడు. కవిగా నేను సృష్టించిన ప్రతిదాని జన్మస్థలం నా హృదయమే, జీవితంలో కూడా దానికి స్థానం వుంది అని ఒక కవి పలవరిస్తే, ’తమ ఆత్మల అంతర్గత లోకాలను ఆవిష్కరించే రచయితలే సమాజానికి అవసరం’ అన్న మహానుభావుడి టాల్ స్టాయ్ భావన మాత్రం మరువరానిది. రచనా సామర్ధ్యం భగవంతుడిచ్చిన వరం అయితే, గొప్ప రచయిత తన దేశంలో మరో ప్రభుత్వం పాత్ర వహిస్తాడు. అందుకే, గొప్ప రచయితలను ఏ రాజ్యమూ ప్రేమించదు అని మరొక కవి నిర్మొహమాటంగా ప్రవచించాడు. కప్పి చెప్పేది కవిత్వం అయితే విప్పి చెప్పేది విమర్శనం అన్న ప్రముఖకవి సి.నారాయణరెడ్డిగారే, కవిత్వం నా మాతృభాష అన్న సత్యవాక్యంతో అందరూ ఏకీభవించక తప్పదు.
లోకం, కవి - వెరసి కవిలోకం
సమాజం, లోకం లో భాగమైన వ్యక్తిని ముందుగా చెప్పుకోవాలి. ఆ తర్వాతే, వృత్తి, ప్రవృత్తిని ప్రస్తావిస్తూ కవిని, కవిచుట్టూరావున్న లోకాన్ని చెప్పుకోవాలి. లోకంలో కవి అంతర్భాగమే. లోకంలో పుట్టిపెరిగిన కవి లోకాన్ని విడిచి కవిత్వం చెప్పలేడు. ఎక్కడైనా కొన్ని లోకానుభూతులు దొర్లుతుంటాయి. లోకాన్ని త్రోసిరాజని కవి ఎంతగా రాణిస్తాడు అంటే చెప్పలేము కాని కవి తన కవిత్వం ద్వారా సమాజానికి ఒక దిశను, దశను నిర్ధారిస్తూ, మార్గదర్శకుని పాత్రలో రాణించేందుకు తనముందున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే అంతకన్న.
కవితకు ప్రపంచవ్యాప్తంగా దినోత్సవం
’ప్రపంచం ఒక పద్మ్యవ్యూహం, కవిత్వమొక తీరనిదాహం’ అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ప్రపంచ కవితాపర్వంలో శ్రీశ్రీ ప్రత్యేకంగా ఒక యుగాన్ని నిర్మించుకోవడం, తరువాతి కవులతరాలు ఆయన ప్రభావానికి గురయి, ప్రతిభావంతమైన కవిత్వాన్ని సృష్టించడం, పేరుపొందడం కూడ జరిగాయి. యిటువంటి కవిత్వానికి ప్రపంచవ్యాప్తంగా ఒక రోజు కేటాయించి, వందల దేశాల్లో, విశ్వవ్యాప్తంగా కవులపై, కవిత్వాలపై పరిశీలన, విశ్లేషణ కూలంకషగా జరిగే కార్యక్రమాల్ని రూపొందించడం సర్వత్రా హర్షనీయం. ఈ అద్భుతమైన ఆలోచన జరపాలని ఏదో రూపాన కలగడం 1505నాటికే వచ్చింది. యునెస్కో 1999 లో మార్చ్ 21 గా ప్రకటన జరిగింది. కవిత్వాన్ని చదవడం, ప్రచురించడం, బోధించడం, విశ్వవ్యాప్తంగా విస్తరించాలన్న సంకల్పంతో వెలసింది. అంతే కాక, కవిత్వానికి విశ్వవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును, ప్రాధాన్యతను ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ కవిత్వపు ఉద్యమాలను అర్ధవంతంగా, ప్రతిభావంతంగా నడపడం ముఖ్యోద్దేశ్యం. ప్రస్తుతం అక్టోబర్ లో జరుగుతుండగా, ప్రస్తుతం విశ్వవ్యాప్తంగా అక్టోబర్ ౧౪, ౧౫ తేదీల్లో జరుపుకుంటున్నారు. ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా, కవిత్వం, కవుల తీరుతెన్నుల గురించి సింహావలోకనం చేసుకోవడం సముచితం, సమంజసం.
కవిత్వం
కవులు, వారి కవిత్వాలు పుంఖానుపుంఖాలుగా దర్శనీయమవుతున్న స్థితిగతుల్ని పక్కకు పెడెతే, కవులు ’కవిత్వానికి అందించిన నిర్వచనీయాలు, భాష్యాలు, సంకలనంచేస్తే, ఒక ఉద్గృంధం తప్పక ఉద్భవిస్తుంది. అయినా కొన్ని ప్రముఖ కవుల భావాలు, పలవరింతలు ప్రస్తుతించుదాం.
పుట్టని ఒక భవిష్యత్తులోకి పుట్టెడు వూహల చేతులు చాచి, అక్కడి అందాలు చందాలు ఆవిష్కరించడం కవిత. (నాటినినాదాలు - కుందుర్తి)జనత గాఢనిద్రాలగ్నం, కవిత దీర్ఘస్వప్న నిమగ్నం (త్వమేవాహమ్ - ఆరుద్ర)ఆకులందున అణిగిమణిగీ కవిత కోకిల పలక వలెనోయ్, పలుకులను విని దేశమందభిమానములు మొలకెత్తవలెనోయి. (దేశభక్తి - గురజాడ).కవిత్వమనేది తన హృదయాన్ని యితరులకు విప్పి చెప్పే వుద్దేశంతో పుడుతుంది. (కధలు,గాధలు - చెళ్ళపిళ్ళ)అవసరం ఆలోచింపజేస్తుంది, ఆలోచనలో భావం పుడుతుంది, భావానికి అంద్మైన భాష పేరే కవిత్వం. (అరికకూడు - పులికంటి కృష్ణారెడ్డి)కవిత్వం ఒక ఆల్కెమీ, దాని రహస్యం కవికే తెలుసు, కాళిదాసుకు తెలుసు, పెద్దన్నకి తెలుసు, కృష్ణశాస్త్రికి తెలుసు, శ్రీశ్రీకి తెలుసు. (నవత-కవిత - తిలక్)ఎక్కాల పుస్తకమయినా ఛందస్సులో పెట్టేసరికి కవిత్వమేమో ననిపిస్తుంది. (వసంతం వస్తేనా - పాలగుమ్మి పద్మరాజు)తనకోసం ఏడిస్తే దు:ఖం, లోకం కోసం ఏడిస్తే కవిత్వం. (పాపికొండలు - కృష్ణారావు)కవిత్వం వైన్ కన్నా నిషా. (పంజరం - సూర్యారావు)మతం పేరిట యే వికృతమైనా చెలామణి ఐనట్లే, కవిత్వం పేరిట ఏ అసందర్భమైనా మెప్పుపొందుతుంది. (మ్యూజింగ్స్ - చలం).
శ్రీశ్రీ మాటల్లో కవిత్వవిధానం
’సమానదర్శుల హృదయస్పందనం శిర:కంపనం, అదీ గీటురాయి అసలైన కవిత్వానికి, వానలాగ ప్రజల హృదయాల్లో వర్షించి, కొత్తభావాల బీజాలు జల్లేది కవిత్వం’ అని, ’మనిషికోసం కవిత్వం, మంచికోరి కవిత్వం, నవ్యత్వం ప్లస్ మానవత్వం ఈజిక్వల్ టు కవిత్వం’ అని గణితశాస్త్రసూత్రప్రాయంగాను, ’కవిత్వం సైన్సు కారాదు, కవి రచన కఠినమైన థీసిస్సు, కావాలి అది ఎడారిలో ఒయాసిస్సు, అనుభవాలతేట సరస్సు’ అని కవనపర్యావరణాన్ని కవులస్థావరశిబిరాల్ని సోదాహరణంగా విశదీకరించడం జరిగింది. మొన్నటి కావ్యపరిధిని, మహాకావ్య విస్తృతిని సరిపోల్చి చెప్పడంలో ’నిన్నటి మహాకావ్యం పద్ధెనిమిది పర్వాలైతే, నేటి మహాకావ్యం పద్ధెనిమిది పేజీలే’ అన్నడం గమనిస్తే, ’రాశి కన్న వాసి’, ’సూక్ష్మం లో మోక్షం’ అన్నవి సత్యాలుగా అనిపిస్తున్నాయి.
’కవిత్వం’ పై యితరకవుల భాష్యాలు
’రసాత్మకమైన వాక్యమే కావ్యం’ అన్న విశ్వనాధుడి భావాన్నిబట్టి చూస్తే, శ్రీశ్రీ నిర్వచించిన పర్వాలు, వాక్యాలు అనవసరం. కేవలం రసస్ఫూర్తినికలిగించే ఏకైక వాక్యం’ చాలు అనాలి. కవిత్వాన్ని సంగీతంతో సంథానించి, ’ఆలోచనాసంగీతమే కవిత్వం. దీన్ని మనకు భాషా సంగీతం అందిస్తుంది’ అంటాడు ’వాట్ ఫీల్డ్’. కవిత్వం వ్రాయడం, చదవడం, వినడం కాదు, ’ఆకాశహర్మ్యనిర్మాతలు, గగనకుసుమ ఆఘ్రాతాలు’ అంటాడు ’కాళోజి’. కవిత్వమంటే ఆషామాషీ కాదు, దీని షరా మామూలు కానే కాదు, ’కవిత్వం ఒక మెరుపు. కాదది పొడిమాటలకూర్పు’ అంటాడు ’జిబ్రాన్’. మన అచంచల విప్లవకని ’చలం’, "గొప్ప కవిత్వం ప్రధాన లక్షణాన్ని - ఎవరి తాహతును బట్టి వారికి ఎంతో కొంత అనుభూతిని అందించగలగడం’ అంటాడు. బిందువుని బిందువు కలవడం సింధువుగా మారే ప్రయత్నం మాదిరి, ’అక్షర రూపము దాల్చిన ఒకే ఒక సిరాచుక్క, లక్ష మెదళ్ళకు కదలిక’ అంటాడు ’కాళోజి". బాధాసర్పద్రష్టులను వర్ణించిన శ్రీశ్రీ ’బాధకు పర్యాయపదం కవిత్వం’ అని నిఘంటువునే సంక్షిప్తకరణం చేశాడు. ఆ బాధనే, మనసు కవి ఆచార్య ఆత్రేయ, ’బాధ నుంచి కవిత ప్రభవించు, అందుకే అక్షరము రాక ఐతి కవిని’ అని అక్షరరహిత కవిత్వం బాధ అని తీర్మానించాడు. ఆధునికాంధ్రసాహిత్యం సృష్టికర్త, ప్రజాకవి, సాహితీరుద్రుడు, ఆరుద్ర కవిత్వానికి ఒక పిప్పరమెంట్ లాంటి నిర్వచనాన్ని "కావ్యం ఏదైనా సరే కనీసం ఒక రిక్వైరుమెంటు, కావాలి కవిత హృదయానికి నరిష్మెంటు, కారాదు ఏనాడు మెదడుకి పనిష్మెంటు’ అంటాడు. ఆ ఆరుద్రే మరొక సందర్భంలో ’ఎప్పటికయినా మానవ పధికుడు చేరుకునే గొప్ప విశ్రాంతి మందిరం కవిత" అని కవితను రెస్ట్ హౌస్ గాను, గెస్ట్ హౌస్ గాను, కవిని కాపలాదారునిగాను అధ్బుతశైలిని ప్రదర్శిమ్చాడు. ’కవిత్వాన్ని జీవితానికి అన్వయించి, నిర్వచనం చెప్పడం కూడ కత్తిమీదసాము అనే చెప్పాలి. ఈ భావాన్ని, ’తిలక్’ , ’చావు పుట్టుకలమధ్య సందేహంలాంటి జీవితంలో నలువైపులా అంధకారం,మంచిగంధంలాగ పరిమళించే మావనత్వం మాకున్న ఒకే ఒక అలంకారం’ అన్నది కవితాకన్యకు నిత్య భూషితాలంకరణంగా మరింది. ఈ తిలక్ చెప్పిన మరొక నిర్వచనం - ’కవిత్వం అంతరాంతర జ్యోతిస్సీమల్ని బహిర్గతం చెయ్యాలి, విస్తరించాలి చైతన్యపరిధి, అగ్ని జల్లినా, అమృతం కురిసినా, అందం ఆనందం దాని పరమావధి" అని అవధుల్లేని పరిధుల్ని నిర్మించాడు. కవిత్వమంటే, యింత తతంగం, కధ, కమామీషూ ఉన్నాయి. అందుకే, అల్లసాని పెద్దన ’ఊరక కృతుల్ రచియింపు మటన్న శక్యమే!’ అని కవితోపాసనకు కావలసిన లలితమైన హంగులమర్చారు. ఈయనగారు ఈనాడు పునర్జన్మ ఎత్తి సారస్వతసేవ చేయపూనుకుంటే, కవిత్వం చెప్పడానికి ఆయన పెట్టిన షరతులు, గొంతెమ్మకోరికలవుతాయి. కోర్కెలగుర్రాలవుతాయి. మృగతృష్ణలవుతాయి. పెద్దనగారు చెప్పిన షరతుల ప్రకారం మనసును అటువంటి ఉల్లాసమైన ఊయల్లో ఊపి సత్యాత్మికమైన కవనం చెప్పడానికి సాధ్యమూకాదు, వ్యవధిలేదు. కవిత్వం - చరిత్ర పోలిస్తే, ’చరిత్ర కంటే కవిత్వం సత్యానికి దగ్గరగా వుంటుంది,అంటాడు, ’ప్లేటొ"
కవులపై కవులు
వృధాకాలయోజన చేస్తున్నట్లు ’కవీ నీ కాలాన్ని వృధా చేస్తున్నావు, సంఘటలన్నీ లిఖించడమే నీపని, చివరికి పక్వానికి తేవలసినది నువ్వు కానేకాదు, విప్లవమే ఆ కర్తవ్యాన్ని నెరవెరుస్తుంది’ అన్నది మాక్సిమ్ గోర్కే. కష్టజీవికి ఆ చివర ఈ చివర కాపుకాసేవాడు కవి’ అని మాక్సిమ్ గోర్కీ అని, ’కవి చెప్పేది కవిత్వమైతే, విప్పిచెప్పేది, ’కష్టజీవికి ఆ చివర ఈ చివర కాపు కాసేవాడే కవి’ అని శ్రీశ్రీ, ’అందమైన అబద్ధం చెప్పేవాడు కవి’ అని ప్లేటొ, ’కవులు ప్రపంచంయొక్క గుర్తింపబడని శాసనకర్తలు’ అని షెల్లి’, ’ప్రతిమనిషి అంతరార్ధంలో ఒకటే’ అని ఎమర్సన్, ’కవి జన్మిస్తాడు, తయారు కాడు’ అన్న ’అనామిక’.
రకరకాల కలువులు
పదాలకు నానార్ధాలు లాగానే, కవులు కూడా నానారకాలు. కొమ్దరు కొన్ని సమయాల్లో కవులు. కొంతమంది, కొంత కోమ్ట భాగం కవులు. గతించిన కవులు, కవులమని విభ్రాతిలో విహరిమ్చే కవులు, కవులమని తెలియమని కవులు, కవులమని తెలియని కవులు, ఆపాదమస్తకం - ఆమరణాంతం కవులు, శతాధిక స్వీయగ్రంధభారంతో అణగిపోయిన కవులు, పూవులు వెదజల్లినట్లు స్వీయరచనాఖంఢాలు, అక్కడ, యిక్కడ పారవేరుసుకున్న కవులు, తమ రచనలు ఏవో తమకు తెలియని చెవులు, తమ రచనలు తప్ప యితరమెరుగవని కవులు, అచ్చులో వుండి చచ్చిన కవులు, అచ్చు ఎఅగకపోయినా మెచ్చబడే కవులు, నవ్వేకవులు, మాట్లాడే కవులు, వెరసి కవుల్లో నానాకవులు. వీరందరిలో - తన సృష్టికి అతీతంగా ఉండేవాడే సరియైన కవి, ఆశకు అతీతంగా ఉండగలవాడే సృష్టికర్త కాగలుగుతాడు. యిని రకాల కవుల్ని వర్గీకరించే బదులు, ’పురాతన కాలం’ నుంచి, ’సుకవి’, ’కుకవి" అని యిరుతెగలను కూడ ప్రకటించడం, పాటించడం జరుగుతూ వస్తూంది.
అనాదిగా వస్తోందికవిత్వం. క్షరము లేని అక్షరసత్యం. రవిరుక్కులా, కవివాక్కునిత్యం. కవితాక్షేత్రంలో యిది పరమసత్యం. తీరని కోరికలు, ఆశలు,ఆశయాలు కవితలోనైనా తీర్చుకునే తాపత్రయం, భారతదేశంలో కవి-కవితలు అక్షరత్వం, రసమయంగా, రంజకంగా కవిత్వం, తిమిరాన్ని పారద్రోలే తెలుగుతత్వం, ప్రతిబింబితమవ్వాలి.
తెలుగు - మన కవిత్వం సౌందర్యానుభూతులు
తెలుగదేల యన్న దేశంబు తెలుగేను, తెలుగువల్లభుండ తెలుగొ కండ, యెల్ల నృపులు గొలువ నెఋగవే బాసాడి, దేశభాషలందు తెలుగులెస్స (శ్రీకృష్ణదేవరాయలు)తెలుగు వెలుగు జిలుగు నిలువుటద్దాలలో ప్రతిఫలింపజేయు పసిడి మేడ. (నండూరి రామకృష్ణమాచార్యులు)తేనెకన్న మధురంరా తెలుగు, ఆ తెలుగుదనం మా కంటి వెలుగు. (ఆరుద్ర)మా తెలుగుతల్లికి మల్లెపూదండ (శంకరంబాడి)సంస్కృతంబులోని చక్కెర పాకంబుమ్ అరవభాషలోని అమృతరాశి, కన్నడంబులోని కస్తూరి వాసన, కలిసిపోయె తేట తెలుగునందు. (మిరియాల రామకృష్ణ)కవులకంటే తుహిన కర్పూర నిభకీర్తి, తెచ్చిరెవరు నీకు తెలుగుతల్లి. తరపి వెన్నల ఆణి ముత్యాల సొబగు, పునుగు జవ్వాజి ఆమని పూలవలపు, మురళి రవళులు కస్తూరి పరిమళములు, కలసి యేర్పడె సుమ్ము మా తెలుగుభాష. అరయ తెలుగువాడు వరి వంగడము వోలె, వేరు చోట నాట వృద్ధి చెందు, అభ్యుదయము నొందు, అన్యదేశము నందు, ఆంధ్ర ప్రతిభ వేగ అతిశయించు.(నండూరి రామకృషమాచార్య).తీరి బంగారు పండెదు తెలుగు నేల, తేట నీటితో ప్రవహించు తెలుగు నదులు, తెలుగు వాసిని ప్రకటించు తెలుగు గిరులు, తలచుకొన్నంత నా మేను పులకరించు. (వేదుల సత్యనారాయణ శాస్త్రి)మళ్ళీ నరజన్మ ఎందుకంటే, మనుషులంటే యిష్టం నాకు, దేవుడి కంటే మనుషులు యిష్టం, దేశం యిష్టం, తెలుగు యిష్టం. (కుందుర్తి).పదవోయి తెలుగువాడా, అదే నీ తెలుగు మేడా, సంకెళ్ళు లేని నేల, సంతోష చంద్రశాల (శ్రీశ్రీ).ఏదేశ మేగినా ఎందు కాలిడిన, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమిభారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవము (రాయప్రోలు సుబ్బారావు)తెలుగు పతాకం యెగురని దిశయే లేదు, తెలుగు దివ్వె వెలుగనట్టి నిశయే లేదు, తెలుగు పులుగు చేరలేని దేశం లేదు, తెలుగు వెలుగు దూరలేని కోశం లేదు. కలకాలం మన ఐక్యత కాపాడాలి, తెలుగుజాతి గౌరవాన్ని నిలబెట్టాలి. (దాశరధి)తెనుగుదనము వంటి తీయందనము లేదు; తెనుగు కవులవంటి ఘనులు లేరు; తెనుగుతల్లి సాధుజన కల్పవల్లి రా, లలిత సుగుణజాల! తెలుగు బాల! (కరుణశ్రీ)చేయెత్తి జైకొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి కలవాడా (వెములపల్లిశ్రీకృష్ణ).ఓ తెలుగుతల్లీ శ్రీ కల్పవల్లీ వందనమ్ము చేకొమ్మ వందనం, (కళ్యాణం వీరస్వామి)సిరుల నిచ్చే కన్నతల్లి, సుభము గూర్చే కల్పవల్లి, దీవెనల దయచేయవే భూదేవి మాకిక తెలుగుతల్లి(కమ్మిశెట్టి)తెలుగు బాలుడ యింపునింపుము, తెలుగు బాలుడ పేరు పెంపుము. (త్రిపురనేని రామస్వామి చౌదరి)ఆంధ్రమన్నపూర్ణగ చేయునట్టి వారి దేశసేవా దురంధరుల్ ధీనిధులను కన్న తెల్గుతల్లికి సమస్కార శతము.అదెవో తెలుగుతల్లి, అందాల నిండు జాబిల్లి, ఆనందాల కల్పవల్లి, అదె నీ తెలుగుతల్లి. (శ్రీశ్రీ)జయము జయము తెలుగు తల్లి, ప్రియతమధాత్రీమ తల్లి (నండూరి రామకృష్ణమాచార్య)తెలుగుజాతి మనది, నిండుగ వెలుగుజాతి మనది. (సి.నారాయణరెడ్డి).తెలుగు దేశమే నాది, తెలుగు బిడ్డనే నేను, తెలుగు పేరు వింటేనే మురిసిపోతాను, తెలుగుభాష అంటే మైమరచిపోతాను. తెలుగువాడు ఏడ నున్న, తెలుగువాడు, తెలుగుభాషనే సొంపుగ పలుకుతాడు(కొసరాజు)
ఈ దేశం నాదనడం ఎప్పటిదో పాతమాట, ఈ దేశం నేననడం ఇది నవకవితా సూక్తం, నా లోపలి సిరాధమనులలో పారే రక్తం, గంగా సింధూ యమునలు, కావేరే కృష్ణమలు. (డా. ముదిగొండ శివప్రసాద్).
నవ్యసాహిత్య సింహాసమున నీకు ఆంధ్ర కవితాకుమారి, దీర్ఘాయురస్తు. (జంధ్యాల పాపయ్య శాస్త్రి)
మన తెలుగు - మన కవిత
పాలు పంచదారకన్న, పసిపాపల నవ్వు కన్న, చందమామ వన్నె కన్న, అందమైన కన్నె కన్న,మల్లెపూల తావి కన్న, మాయలేని మనసు కన్న, కోకిలమ్మ పాట కన్న, కోపంలేని మాటకన్న, తేనెకన్న జున్ను కన్న -తెలుగు కవిత ఎంతో మిన్న.
ఎడారిలో నీటి కన్న, ఎదురుచూడని సిరి కన్న, మేలిమి బంగరు కన్న, మేనమామ కూతురుకన్న, అత్తరు పన్నీరు కన్న, చిత్తజు బాణాని కన్న - తేనె కన్న జున్న కన్న -తెలుగు కవితయే మిన్న. (సముద్రపు శ్రీ మహావిష్ణు).
ప్రపంచ కవితా దినోత్సవాల సందర్భంగా, తెలుగు - మనకవిత్వాన్ని, మనభాషాసౌందర్యాన్ని, కవితలద్వారా తమతమ అనుభూతుల్ని ప్రకటించిన ఎందరో మహానుభావులకు వందనములు సమర్పిస్తూ, తెలుగురధం అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ ...
కొంపెల్ల శర్మ - తెలుగురధం.

No comments: