Tuesday, January 15, 2008

దక్షిణవేదం - 'తిరుక్కురళ్' సౄష్టికర్త, మహాకవి, 'తిరువళ్ళువఋ

కొంపెల్ల శర్మ

దక్షిణవేదం - 'తిరుక్కురళ్' సౄష్టికర్త, మహాకవి, 'తిరువళ్ళువఋ

త్రివేణీ మహత్తు

మన తెలుగుదేశం త్రిలింగదేశం। మన తెలుగు సాహిత్యానికి ప్రప్రధమంగా స్మరించతగ్గగణం - కవిత్రయం అనబడే నన్నయ్య, తిక్కన్న, ఎర్రన. అలాగే దక్షిణాంధ్రసంస్కౄతికి ప్రాణంపోసిన రాజధానికి సుక్షేత్రమైన తమిళనాడులో కూడ త్రివేణీసంగమానికి ప్రాధాన్యం వహించింది. ప్రధమంగా త్రిమూర్తులైన సంగీత వాగ్గేయకారులు - శ్రీ శ్యామశాస్త్రిగారు, శ్రీ ముత్తుసామి దీక్షితులుగారు మరియు శ్రీ కాకర్ల త్యాగరాజుగార్లను మన ధరణిపై కళల ప్రస్తావన వున్నంతకాలం మరువరాని, మరువలేని, మహానుభావులు, మహామనీషిమూర్తులు. అలాగే దక్షిణభారతానికి, ద్రవిడభాషాకుటుంబానికి తలమానికమైన భాష - తమిళం - భాషలో కూడ మనకు త్రివేణీసంభూతమైన కవిత్రయం కానవస్తుంది. తమిళభాషా కవిత్రయం అని నిర్ద్వందంగా నిత్యం, నిరంతరం ప్రస్తావించుకునేవారు - ఎవరు అని మనం చెప్పడం కాదు, మరొక తమిళభాషా మహాకవి, పండితుడు - భారతీయార్ అని పిలువబడే, సుబ్రహ్మణ్య భారతి పలవరించిన తీరు యిలా వుంది.

" మేమెరిగిన మహాకవులలో కంబన్, వళ్ళువన్, ఇళంగో అంతటివారు ఈ భూలోకములో పుట్టలేదు"
అంత గొప్పగా భారతీయార్ వంటి మహాకవియొక్క హౄదయమును చూరగొన్నారు। ప్రపంచమహాకవులందరిలోను వళ్ళువర్ మహాకవి. ప్రజలకు ఆవశ్యకమైన యొక దివ్యప్రబంధమును రచించిన వళ్ళువర్ ను -

" వళ్ళువర్ వంటివాడు తన్ను లోకమునకు అర్పించుకొన్నందున, మిన్నందిన కీర్తి పొందినది ఈ తమిళనాడు" అని తమిళనాడును స్తుతించునంతటి విధాన తిరువళ్ళువర్ ను ప్రపంచరంగం ముందు నిలిపి సాటిలేని కవిగా నిలిపాడు. కేవలం ఒక్క భారతీయార్ మాత్రమేకాదు, ప్రపంచపందలి పెద్దలందరును తిరువళువర్ మహాకవిని, వారి తిరుక్కురళ్ ను ప్రశింసించుచున్నారు. దానికి తమతమ భాషలలో వ్యాఖ్యలు వ్రాసి, అనుభవించి, ఆనందించుచున్నారు.
అంతేగాక, మనకు తెలుగులో మాదిరి, కవిత్రయం లో మధ్యన నడయాడే 'తిక్కనా లాగ, తమిళ కవిత్రయంలో కూడ 'వళ్ళువాఋ మధ్యస్థానాన్ని ఆక్రమించి, భీమునివాటాలాగున మనకు విశ్వరూపంలో గోచరిస్తారు.
తిరువళ్ళువర్ వ్యక్తిత్వం - తిరుక్కురళ్ మహత్తు

తమిళవేదం అని పొగడబడు 'తిరుక్కుర్కళ్'ను తమిళులకు ప్రసాదించి వారికి శాశ్వతముగ నిలువదగిన పేరు ప్రతిష్ఠలను తెచ్చినవారు - తిరువళ్ళువర్. ఆయనొక దైవిక పండితుడు. రెండువేల సంవత్సరాలకు మునుపే ఈ తమిళనేలపై అవతరించిన తపస్సంపన్నుడు. అతని గురించి పలువురు పలు విధాలుగా తన జీవితకధను చెప్పుకున్నారు. తన ఏకైక రచన - తిరుక్కురళ్ - ద్వారా పలువుర ప్రశంసలనందుకుంటూనే వున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ రచనపై నిత్యం, నిరంతరం, ఆలోచించుకుంటూ, విశ్లేషించుకుంటూనే వున్నారు. ప్రపంచ తిరుక్కురళ్ సమాఖ్య దీనికి నిదర్శనం. దైవంపై, కర్మ సిద్ధాంతంపైనా నమ్మకం కలవాడు. ప్రజలు భూలోకంలో భాగా గౄహస్థ ధర్మాన్ని నిలిపి స్వర్గలోక సుఖాన్ని అనుభవించాలని ఆకాంక్షించాడు. బీదసాదలయెడ అపరిమిత కారుణ్యతను కలిగాడు. యాచకుల స్థితిని చూసి మనోవేదన భరించలేకపోయాడు. మానవుడు పొందదగిన సుస్థిర విషయాన్ని తమ రచనలో పొందుపరచాడు. ఈయన వలె నేటివరకూ ఎవ్వరూ ధర్మానికి విశిష్ట విమర్శను చెప్పలేదనే చెప్తారు. అర్ధశాస్త్రం విప్పిచెప్పే విషయాల్ని నేటికీ ఉపయోగపడేలా స్థిరమైన, రాజకీయం, ఆర్ధికం, సాంఘికం, మనస్తత్వం లాంటి సత్యమైన విషయాల్ని ఈ తిరుక్కురళ్ వివరిస్తోంది. చతుర్విధ పురుషార్ధాల్లో, తౄతీయ పురుషార్ధం - కామం - ను ప్రేమికుల మనసు అనురాగపూరితమై మానవుల పరిపూర్ణతను పొందడానికి సూచికగా ఉపయోగపడుతోంది. 'తిరుక్కుర్కళ్' జీవిత సౌధం నిర్మించే గ్రంధం' అని సమస్తభావన.
'తిరువళ్ళువఋ జీవనప్రస్థానం
తమిళభాషకు గౌరవాన్ని తెచ్చిన గొప్ప తమిళ రచయిత - తిరువళ్ళువర్, ఆయన రచన, 'తిరుక్కురళ్' అవిభాజ్యాలు। తిరువళ్ళువర్ జీవితం గురించి చెప్పిన అభిప్రాయాల్లో, ఆయన 1వ శ. (100-300 క్రీ.శ.)(600 అని కూడ) వాడని తమిళసంస్కౄతి చాటిచెప్పుతున్న సత్యం. చేనేత వౄత్తికార కుటుంబం. వాసుకి ధర్మపత్ని. తిరు - తమిళంలో గౌరవ సంబోధన - శ్రీ). వళ్ళువన్, వళ్ళువార్ (గౌరవవాచకం), కుల/వౄత్తిని కూడ సూచించే పదం. జన్మనామం కాకపోవచ్చని పలువురి వాదన. ఈనాటి వరకు అదేపేరుగల 'కులం' (నేతవారు), 'తిరువాళ్వాఋ తన వంశస్థుడు/పూర్వీకుడని వారి అభిప్రాయం.

మరచిపోలేని జీవన కధనాలు

ప్రస్తుతం చెన్నై మహానగరంలో ప్రముఖ ఆవాసంగా చెలామణి అవుతున్న మైలాపూర్ లో తిరువళ్ళువర్ జన్మించాడని పలువురి భావన. కొందరు మధురై (పాండ్యరాజుల రాజధాని) అన్నదానికి బలం కనిపిస్తోందంటారు. మధురై తమిళ సంఘం లో పాల్గొన్న ప్రముఖుడు. తమిళభాషని, కవులని ప్రోత్సహించిన వైనంలో ఈయనను ప్రస్తావించకపోవడం, జరగని పని, అసంభవాన్ని సంభవంగా చూపించడం. జానపద సంస్కౄతి ఆధారాల ప్రకారం తిరుక్కురళ్ ని పరిచయం చేయడం జరిగిందంటారు. పాండ్యరాజులు చాలాకాలం నిర్వహించి, ప్రోత్సహించిన కధనం - నేటికీ, విద్వాంసులు, పరిశోధకులు, వేదికను నడుపుతున్న సాక్ష్యకధనం. కన్యాకుమారి చారిత్రక, సంస్కౄతీ పరిశోధనాకేంద్రం అభిప్రాయం ప్రకారం - కన్యాకుమారి జిల్లా, కొండప్రాంతం 'వల్లువనాడూని పరిపాలించిన రాజప్రభువులని చెప్తారు. యిది ఆధునికంగా వచ్చిన వాదన. కాని, అనేక ప్రశ్నలకు సమాధానాలు కూడ అలభ్యం. వల్లువనాడు - కేరళలోని, 9వ శ. నాటి ప్రాంతం. తిరువళ్ళువర్ విశ్వాసాల్ని, అభిప్రాయాలకు కూడ అనేక వాదోపవాదాలు - హిందువని, జైన్ వంశస్థుడని కూడ ప్రచారాలు కానవస్తాయి. వీటన్నింటికీ త్రోసిరాజన్నది - తమిళనాడు. వారి నిశ్చితాభిప్రాయం ప్రకారం - మునిసాధు పుంగవుడు, కవి, అని, తిరుక్కురళ్ ని - 'పొయ్యమొళీ (అసంబద్ధతను) దరిచేరని, సత్యరచన, 'అనంతసత్యం'. వేదాలు, తక్కువజాతి హిందువులు, జైనులు, బౌద్ధులు, కిరస్తానీలు, ఉన్నతవర్గపు హిందువులు, బ్రాహ్మణులు, అరబ్రాహ్మణులు, యిటువంటివి ఏమైనా కూడ పట్టించుకోకుండా, మతాల అంతరాల్ని వదలి, సమ్మతవాదాన్ని స్వీకరించిన సత్పురుషుడు, మహామనీషి.
తల్లిదండ్రులు

తిరువళ్ళువార్ జన్మస్థలం గురించి వాదోపవాదాలు ఎలా వున్నాయో, ఆయన పుట్టుక గురించి కూడ కొన్ని చర్చలున్నాయి. ప్రముఖాధారం ప్రకారం - తండ్రి భగవాన్, బ్రాహ్మణుడు, అస్పృఅశ్యురాలుగా భావించబడిన తల్లి. ఫలితంగా, సమాజంనుంచి బహిష్కరించబడి, బ్రాహ్మణేతరురాలు, వెల్లల - భూస్వామి కులం, యితణ్ణి 'తిరు-వళ్ళువఋ అని నామకరణం చేసిందట. అయితే, చుట్టుప్రక్కలవారి పోరుతో, ఆమె కూడ అతణ్ణి వదిలేసిందిట. ఈసారి, మరొక అస్పౄశ్యవర్గం - పెరియార్లు, కుటుంబం ఆదరించిందట. తర్వాత, మైలాపూర్ చేరుకోవడం, అక్కడ చేనేతకారుడుగా పని చేశాడుట. తిరువళ్ళువర్ జీవితం మాత్రం సరిగ్గా, సాదాగా మాత్రం జరగలేదని చెప్పవచ్చు. అయితే, ఆయన మహాకవి. మహాకవి నుంచి ఉద్భవించిన మహాగ్రంధం మాత్రం - మానవసౄష్టి వున్నంతకాలం సజీవంగా వుంటుంది అన్నదాంట్లో ఏమాత్రం సంశయం, సందేహం లేవు, రానేరావు.
తిరుక్కురళ్ - దక్షిణ, ద్రవిడ వేదం

తిరువళ్ళువర్ రచించిన తిరుక్కురళ్ - ద్రావిడవేదంగా చాలా ప్రసిద్ధి. మహాకవి ఆరుద్ర, తిరుక్కురళ్ ని 'దక్షిణవేదం'గా అంధ్రీకరించాడు. తమిళంలో ప్రావీణ్యం ఉన్న ఆరుద్ర, తమిళ సాహిత్యాన్ని ఆధ్యయనం చేశాడు. తమిళంలోని తిరుక్కురళ్ అపార ప్రాచుర్యం పొందింది. జీవిత సూత్రాలను చిన్న అనుష్టుప్ శ్లోకాల్లాగ, చెప్పబడ్డాయి. పిట్టకొంచెం, కూతఘనం అన్నట్లు గోచరిస్తుంది. మన ఆధ్యాత్మక భక్తి స్తోత్రావళి మాదిరిగా కనిపిస్తుంది. హేమాహేమీలు సహితం 'కురళ్ చర్చలు జరిపి ఇంకా ఇంకా కొత్త అర్ధ నిర్ణయాలు చేయాలని చూస్తూనే వున్నారు. మాట విరుపులో అర్ధం మారిపోయే కురళ్ లని అనువదించడం కత్తిమీద సాము విద్యలో సమగ్రాంధ్రసాహితీకర్త - ఆరుద్ర విజయవంతం అయ్యాడు. చక్కని భాషాశైలిలో వ్రాసి, తమిళ, తెలుగు ప్రజలనుంచి ప్రశంసలు అందుకున్నాడు.
ఆరుద్ర తిరుక్కురళ్ నుంచి - మచ్చుతునకలు

శాశ్వతమ్ముగాని సకలమ్ము తిరమని, ఎంచువాని బుద్ధి కొంచమనుము.
ఉన్ననాడు తాను సన్యాసి కావలె, వీడ సుఖములెన్నో కూడగలవు.
కాకి తిండి దొరుక మూక నెల్లను పిలుచు, అట్టి గుణము వలన అబ్బు సిరులు.
భాష సూటిగా, సంస్కౄతిని ప్రతిబింబించేలా దర్శనం యిస్తే, అది అనువాదం కానేకాదు కదా. అందుకే, కొంతమంది కవులు, అనుసౄజనం అని పేరు పెట్టారు.

తిరుక్కురళ్ స్వరూపం

దక్షిణ ద్రవిడ వేదం అయిన తిరుక్కురళ్ ని సంపూర్ణ కావ్యం గా భావించాలి.
తమిళ మూల రచన లో 1330 ద్విపాద పద్యాలుగా వున్నాయి. ధర్మశాస్త్రం, అర్ధశాస్త్రం, కామశాస్త్రం అని మూడు ఖండాలుగా విభజించబడ్డాయి. ఉపఖండికలు యిలా వున్నాయి.
ధర్మశాస్త్రం - దైవీకం, గార్హస్థం, సన్యాసం, విధి బలీయత।అర్ధశాస్త్రం - రాజకీయం, రాజ్యాంగం, యితరాలు (వీటికి అతీతాలు).కామశాస్త్రం - సంయోగం, పతివ్రతా వియోగం.

పై విభజనలతో, మొత్తం 133 అధ్యాయాలున్నాయి। ప్రతీ అధ్యాయానికి, 10 చొప్పున ద్విపాద పద్యాలుగా రచింపబడ్డాయి.

తిరుక్కురళ్ లో, ప్రతీ పద్యం - మొదటి పాదం నాలుగు గణాలు, రెండవ పాదం మూడు గణాలతో తనదైన ప్రత్యేకశైలితో చదువుటకు తేలికగా, విపులమైన భావాల్ని నిముడ్చుకొని, తమిళంలో వేదమని పేరుపొందింది. శ్రీ దివ్యసూక్తులు - ధర్మార్ధకామశాస్త్రములను - 'అరత్తుప్పాళ్ అనే ధర్మశాస్త్రనీతులు, 'పొరుట్పాళ్ అనే అర్ధశాస్త్రనీతులు, 'కామత్తుప్పాళ్ అనే కామశాస్త్రనీతులు అని వ్రాయబడ్డాయి. వ్యక్తిగతమైనవి ధర్మశాస్త్రంలోను, సంఘపరమైనవి అర్ధశాస్త్రంలోను కనిపిస్తాయి. సమాజానికి అవసరమైన పాళ్ళలో మోక్షసిద్ధిని సాధించేలా కామశాస్త్రపు రాగధోరణుల్ని కూడ వివరించాడు. దైవప్రార్ధన తో ప్రారంభమైన కురళ్ రచన, పొలయలుక ప్రేమ తో పరిసమాప్తమయింది. ఈ వేదంలో లేని అంశాలు, వివరణలు, కర్మ సిద్ధాంత జన్మ మర్మాదులు, మన ప్రజాకవి వేమనకవి మాదిరిలా తేటతెల్లంగా రచించడం జరిగింది. తీపిరుచులూరే షడ్రసోపేతమైన విందుభోజనం. ముక్తి, భుక్తి, రక్తి కలుగుతాయి.
ఆచంద్రతారార్కం నిలిచిపోయే రచన తిరుక్కురళ్, రచయిత తిరువళ్ళువర్ చిరస్థాయిగా ఈ భూమి పై సుస్థిరస్థానం సంపందించారు అన్నది మాత్రం అక్షరాలా నిజం।

మన మహానుభావుల్లో, తప్పక తిరువళ్ళువర్ ని, మహానుభావుకత కి తిరుక్కురళ్ ని ఉదాహరించక తప్పదు. ఈ వేదసారాన్ని చదివి, ఆలోచనలతో ఆనందించండి. పరిపూర్ణ మానవతని అలవడి చేసుకుని, నూటృఇకి నూరుశాతం మానవతామూర్తిగా ప్రతీ పౌరుడు మారవలసిన అవసరాన్ని, మహాకవి దినోత్సవం రోజు 16 జనవరి రోజున తీర్మానించుకుని, ఆచరణకు పూనుకోవాలి. శుభం భూయాత్.

No comments: