కొంపెల్ల శర్మ
కదలివచ్చెను 'మకర సంక్రాంతి లక్ష్మీ హేమంతవీధి!
మానవజీవితంలో పండుగల ప్రాశస్త్యం
అన్ని రోజులెట్టివో, పండుగరోజు లట్టివే। ఒకరోజు పండుగరోజు కావడానికి దానికి మనం ఆపాదించుకునే ప్రత్యేకతే కారణం, దానికి మనం సమకూర్చుకునే వైశిష్ట్యమే కారణం. పండుగలన్నీ సంవత్సరాని కొకసారి చొప్పున తిరిగి, తిరిగి వచ్చేవే. అంతమాత్రం చేత వాటి అర్ధం తగ్గదు; అందం తగ్గదు; ఆనందం తగ్గదు. ప్రతి సంవత్సరం వచ్చేది కనుక, వసంతం విలాసం, పూర్ణిమ శోభ తగ్గదు సరికదా, ప్రకౄతి విలాసాలలోని నిత్యనూతనత్వం జాతీయ పర్వదినాల్లో కూడ వుంటుంది. భారతదేశపు సంస్కౄతీసంపదలను ప్రతిబింబించే పండుగల్లో ప్రధానంగా - ఉగాది, శ్రీరామనవమి, కౄష్ణాష్టమి, వినాయకచవితి, దసరా, దీపావళి, సంక్రాంతి, శివరాత్రిలతోపాటు ఎన్నో, మరెన్నో చెప్పుకోవాలి. మన ప్రధాన పర్వదినాలకు ప్రకౄతివిలాసాలతో సన్నిహిత సంబంధం ఉన్నది కూడా. తన కడుపు పంటతో మన గరిసెలను, గాదెలను బంగారు రాజనాలతో నింపివేసే ధాన్యలక్ష్మికి మన మెత్తే నివ్వ్వాళి - సంక్రాంతి. ఆంగ్లసంవత్సరపు కాలండర్ లో మనకు జనవరి 1 నాడు జరుపుకొనే నూతనసంవత్సరం తర్వాత, వెనువెంటనే వచ్చేది 'సంక్రాంతీ పండుగనే విశేషంగా చెప్పుకోవాలి.
సంక్రాంతి వైభవం
మన తెలుగువాళ్ళకు పెద్దపండుగగా స్థిరపడిపోయిన పండుగ - సంక్రాంతి। నవ్యాంధ్రకవి శ్రీ రాయప్రోలు సుబ్బారావుగారి పలుకులలో తిరిగి మనకు - "వచ్చింది వచ్చింది పచ్చ సంక్రాంతి - వచ్చింది వచ్చింది లచ్చి సంక్రాంతీ అని ఎంత సహజంగా చెప్పారో! ఊకబంతి, పోకబంతి, రేకబంతి, ముద్దబంతి - ఇలాగే మరెన్నో రకాల బంతిపూల పసిడి కాంతులను విరజిమ్ముకుంటూ "పచ్చ సంక్రాంతి" వచ్చింది; సీమసీమ, ఊరూరు, వాడవాడ కొత్త పంటలతో తొలుకాడుతుండగా "లచ్చి సంక్రాంతి" వచ్చింది. ఇంత ఫ్వైభవంతో వచ్చిన ఈ సంక్రాంతిలక్ష్మికి స్వాగతంగానే మన వాకిళ్ళలో ముగ్గులు, ఆ ముగ్గులమధ్య గొబ్బెమ్మలు, ఆమెకు ఆహ్వానంగానే మన మండిగాలకు పసుపుకుంకాలు, వాటికి మరింత శోభకోసం బంతుపూదండలు, ఆమె పేరుతో బొమ్మల కొలువులు,ఆ కొలువులకు చుట్టపక్కాలకు పిలుపులు.
'సంక్రాంతీ సాహిత్యంలో తొలి ప్రస్తావన
'తత్ర మేషాదిషు ద్వాదశరాశిషు క్రమేణ సంచరత: సూర్యస్య పూర్వస్మా ద్రాశే ఉత్తరాశౌ సంక్రమణ ప్రవేశ: సంక్రాంతి:" అని జయసింహ కల్పద్రుపమున సంక్రాంతి పదం కనిపిస్తుందని 'హిందువుల పండుగలు - పర్వములూ అన్న వ్యాసపరంపరలో 'మకరసంక్రాంతీ లో వివరించారు. శ్రీనాధుడు 'పెనుబందువూ అన్నాడు. చలికాలం వస్తుంది కనక, శివరాత్రిమాహాత్మ్యం లో సంక్రాంతి ని చక్కగా వివరించాడు.
"ఇండ్ల మొదలను నీ రెండు నీదికలను, అనుగుతమ్ముడు, అన్నయు ఆటలాడు, అత్తయును కోడలును కుమ్ములాడు, కుమ్ముగాచు చోటికి మకరసంక్రాంతివేళా అన్నాడు।
యింత పెద్దపండుగను, ప్రాచీనకవులు ఎక్కువగా ప్రస్తావించకపోవడానికి మాత్రం కారణాలు గోచరించవు, ఎందుకనో.
మార్గశిర పుష్యమాసాల్లో వచ్చేది సంక్రాంతి పండుగ। సంక్రాంతి లేక సంక్రమణం అంటే చేరుట, మారుట అని అర్ధం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. నిజంగా, సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులుంటాయి. అయినా, పుష్యమాసంలో హేమంతౠతువులో శీతగాలులు వీస్తూ మంచుకురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే 'మకరసంక్రాంతీకి ఎంతో ప్రాముఖ్యం, ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది జనవరి మాసంలో వస్తుంది. మకరసంక్రాంతి రోజున, అంటే జనవరి 14 న సూర్యుడు ఉత్తరాయణ పథంలో ప్రవేశిస్తాడు. దక్షిణాయన పర్వం నుంచి నిష్క్రమిస్తాడు. ఈ రోజునుంచి స్వర్గద్వారాలు తెఋరచివుంటాయని పురాణాలు ఘోషిస్తున్నాయి.
విశ్వావ్యాప్తంగా 'సంక్రాంతీ విధానాలు
సంక్రాంతి - అనే పేరుతో పిలవక పోయినా, ప్రతి దేశం, ప్రతి జాతి చేసుకొంటున్నట్టిదే ఈ పండుగ। దున్ని, విత్తి, పైరు చేయడాన్ని మానవుడు ఏనాడు నేర్చుకొన్నాడో, తన కష్టాన్ని మెచ్చి భూదేవి పంటరూపంలో తనకు బంగరు వరాలిస్తుందని ఏనాడు తెలుసుకొన్నాడో ఆనాడే దేశదేశాలలోఈ పండుగ ఏ పేరుతోనో ఒక పేరుతో పుట్టింది. కోతకోసి,కుప్ప వేసి, కళ్ళం చేసి, పంట నూర్చి, గింజలను ఇంటికి తెచ్చుకొనడం జరిగినంత కాలం ఈ పండుగ జరుగుతూనే వుంటుంది.
విదేశాల్లో సంక్రాంతి పండుగలు
మకరరాశి జలచర స్థలచరముల ద్వందరూపంగా భావించబడింది. ఈ జంతువు శరీరం పైభాగం బంగారు కొమ్ములతో మేక ఆకారంగాను, కిందభాగం మొసలి ఆకారంగాను దర్శనం యిస్తుంది. యిదే వరసలే, గ్రీకులు పై శరీరభాగాన్ని మేకగాను, వెనుకసగభాగం చేప ఆకారంగాను భావించడం, ఈ భావనకు కొన్ని గ్రీకుగాధలు కూడ చెప్పుకుంటారు. గ్రీకు గాధలను బేకన్ దేవత, టైఫన్ మహాభూతముల కధనం ప్రకారం వింతమేక ఆకాశాన మకరరాశిలో నిలిచిపోయినట్లు గోచరిస్తుంది. పాన్ దేవత నైలునదిలో పడిపోవడం, ఒక మునకపాటుకి లేవడంతో మేకరూపం వచ్చింది అన్న కధనాల్ని బట్టి, గ్రీకు, లాటిన్ గాధలలో మకరరాశిని జాలాధిదేవతగా పేర్కొన్నారు. వర్షప్రసాదితమైనది, తుఫాన్ రాకను తెలిపేది - మకరం. ఈజిప్టు సంస్కౄతీ పరంపరలో మకరరాశిని 'నం' అనే జలాధిదేవతకు, సూర్యుని మకరరాశి ప్రవేశానికి, నైలునది పొంగటానికి, సమన్వయాన్ని చేసుకుంటారు. నైలునదీ ప్రాంతాల్లో తుఫానులు మకరరాశిలో సూర్యుడు ప్రవేశించడంతో ప్రారంభమవుతాయని శాస్త్రీయం.
మన మకరసంక్రాంతి ప్రాశస్త్యం
ద్వాదశరాశుల దివ్యయాత్రను కావించే దివాకరునికి ప్రధాన ఘట్టాలుగా, మేష, కటక, తుల, మకర సంక్రమణాల్ని పేర్కొంటారు। సూర్యుడు ఈ దశలను చేరుకోగానే, ప్రకౄతి పులకించి పలువిధాల విలాసవంతమవుతుంది. ఆ విశిష్టవిలాససమన్వయమే మకరసంక్రాంతి. తొలకరి, దానివల్ల మెట్టపైర్లు, మాగాణిపంటలు కార్తీక మార్గశిరాల్లో కాపుకురావడం, కలకలలు, కనులపండువలు గోచరిస్తాయి. పొలాల్లో వరివేలు, చేమంతి, బంతిపూలతో చెందే బంగారుకాంతులు, పశుగణాభివౄద్ధి, కర్షకులు మురిసిపోవడంతో ఈ సస్యసమౄద్ధిని చూసి, గీతలో కౄష్ణుడు 'మాసానాం మార్గశీర్షోహం' అని ప్రాధాన్యతను విన్నవించాడు. ఈ మార్గశిర సమాప్తంతో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణం దేవతలకు ముఖ్యంతో ఉత్తమకాలంగా విశ్వసించబడుతోంది. దక్షిణాయనకాలం వానలు, వల్లప్పలు, బురదలు, చీకట్లు,మబ్బులతో తబ్బిబ్బవితే, ఉత్తరాయణంలో గాదెలునిండిన పంటలు, గరిసెలు, ధాన్యాలు, ఆరోగ్యైశ్వర్యాల సహితమైన ఉత్తమకాలంగా, సుఖమయంగా భావిస్తూంటారు. ఉత్తరాయణకాలంలో గతించిన ఉత్తమగతులు ప్రాప్తిస్తాయని, భీష్ముని నిర్యాణం, శౄతి, స్మౄతి, ఇతిహాస పురాణాల్లో ఉత్తరాయణ పుణ్యకాల ప్రాశస్త్యాన్ని వివరించడం జరిగింది.
మన సంవత్సరాది సంక్రాంతియే అనుకోవచ్చు
మనం చాంద్రాయనశైలిలో జరుపుకునే సంవత్సరాదిని చైత్ర శుద్ధ పాడ్యమిని పరిగణిస్తున్నా, ఒక విధంగా మకరసంక్రాంతి రోజు సంవత్సరాదిగా పరిగణించడానికి అనువైన విషయాలు అధికంగా గోచరిస్తాయి అని కూడ పండితులు భావించారు. ప్రకౄతియందు గోచరించే ప్రధానమైన మార్పులు మకరసంక్రమణం నుంచే సత్యంగా ప్రారంభమవుతాయని, చైత్రశుద్ధపాడ్యమి రోజుకి పరిపక్వతను పొందుతాయి. శీతవాతాల తగ్గుదల, పాడిపంటలతో నవనవోన్మేషిత జీవనశైలికి శ్రీకారం చుట్టడం, సంక్రాంతి పురుషుణ్ణి 'సంకురుమయ్యా వీక్షణం సంవత్సరం మొత్తం కలుగుతుందని, దేశం సస్యశ్యామలంగా ఏడాది ప్రభావంగా వుంటుందని, భావిస్తారు.
మూడురోజుల ముచ్చట్లు మన సంక్రాంతులు
ప్రాచీనాచారాలకు ప్రతీకగా జరుపుకునే సంక్రాంతి మూడురోజులుగా - భోగి, సంక్రాంతి, కనుము, అంతేకాక, నాల్గవరోజు ముక్కనుము అనికూడ జరుపుకుంటారు।
మొదటిరోజు - భోగి
పంటసంపదను తస్కరించకుండ పహారా చేసే చీకటి చలి సమయాన కల్పించుకునే కాంతులవింతలు, మంటలమధ్య, ప్రదక్షణాలు, భజనలమధ్య కాలయాపనలు ప్రాధాన్యం వహించాయి. పాతబడిన వస్తువులు కూడ అగ్నిహోత్రంపాలవుతాయి. భోగి - 'భుజ్' అన్న పదం యింద్రుని ప్రీతికి జరుపుకునే పండుగగాను, పోగు, పొంగులనుంది పుట్టిన 'భోగీగాను, ఉత్తరదేశాన 'లోడీగాను, మంటలు పీడవదలినట్లుగాను, నూతనజీవితారంభంగాను విశ్వసించడం కూడ కద్దు. పంటల తండులాలు, కూరగాయలతో పాలుపోసి, పొంగళ్ళు - పులగం వండుకుంటారు. యిది అనాది దినుసు అనే చెప్పాలి. పిల్లలకు భోగిపండ్లు పోయడం ద్వారా దౄష్టిని పోగట్టడం కూడ విశేషంగా చెప్పాలి.
రెండవరోజు - సంక్రాంతి
సూర్యుడు మకరరాశిలో ప్రవేశంచేసే రోజు. మకరరాశ్యాధిపతి 'శనీ వాతప్రధానగ్రహమని, వాత నివారణ కోసం తైలస్నానం, నువ్వులు, బెల్లం, గుమ్మడిదానం యిస్తారు. ఉన్నవారు, లేనివారు సమంగా దానం యివ్వడం కూడ జరుగుతుంది. 'నాస్తీ అన్న మాటలేకుండా దానం చేయాలని ధర్మ పరంపర వివరిస్తోంది. స్త్రీలు మాంగళ్యాభివౄద్ధికై కుంకుమ, సుగంధద్రవ్యాలు, బెల్లం, పువ్వులు, వస్తాలు దానం యివ్వాలని కూడ అంటారు. తిల వస్త్రదానాదులవల్ల రోగవిముక్తి, నల్లనూవులతో స్నానం చేసి నువ్వులదానం, శివాలయంలో నువ్వులనూనెతో దీపం పెట్టడం కూడ ఆచారమే. పిల్లలు పెద్దలకు నమస్కరించడం ముఖ్యభాగంగా చెలామణి అవడం, 'మొక్కుల పండుగా గా సంక్రాంతిని భావిస్తారు. కుటుంబపరంగా కూడ, సుఖ సంతోష సరస సల్లాప సహిత సమావేశాలు, కొత్తదంపతుల సంక్రాంతి సత్కారాలు ఈ పండుగలో అనివార్యాలు. కొత్తసంవత్సరం జనవరిలో జరుపుకున్న వెంటనే మనసంస్కౄతిని ప్రతిబింబించే సంక్రాంతి పండుగ సరిసములులేని పర్వోత్సవసమాహారం.
మూడవరోజు - కనుమ
కనుమ పూర్తిగా కర్షకుల పర్వదినోత్సవాల మయమే। పశువులను గౌరవించడం గోధనం దేశధనంగా వస్తున్న భావన, పశువులను సొమ్ములుగా పిలుచుకోవడం సదాచారసంపన్నతకు మారుపేరు అయింది. గ్రామాల్లో పశుబలి, పశువుల కొట్టాల్లో పాలపొంగలి తయారీలో 'పాలపొంగలి పసుల పొంగలీ అని కేరింతలు, దేవతానైవేద్యం తర్వాత దాన్ని పొలాల్లో జల్లడం - పొంగలి మెతుకులు - 'పొలిచల్లడం' వల్లన పంట పొల్లుపోక, గింజ రాలుబడి పెరుగుతుందనే విశ్వాసం అధికం. దిష్టితో గుమ్మడికాయను పగలకొట్టడం కూడ ఆచరిస్తారు. ముందున్నది ముసర్ల పండగ (పొలాలలో పొలి అన్నపు మెతుకులు) నాడు మిడిసిపాటుతనం వెల్లడవుతుందనే గుర్తుచేయడం కనిపిస్తుంది. పశువుల సంబరాల్లో భాగంగా, అలంకరణలు, రంగుపూతలు, గంటలుకట్టడం చాలా హడావుడిగా జరుగుతాయి. భూమాతను అభ్యర్ధించడం, కౄషిచేయడం, కోడెలను, ఆవులను ఆదరించడంలాంటి చర్యలు కౄతజ़్జతాసంకేతాలు అనే చెప్పాలి. గంగిరెద్దాటలు, డూడూ డూడూ బసవన్నా అంటూ సన్నాయిమేళాల మధ్య మాటలు, ఎద్దుతల ఊపులాటలు, భావిధోరణి చెప్పించడం గౌరవచర్యలు. ఎడ్లపోటీలు, కోడిపందాలు, గొర్రెపొట్టేళ్ళ కుమ్ములాట ఊరేగింపులు, సరదాల మధ్య ప్రాణభయం కూడ కలుగుతాయి. విజేతలకు కన్యాస్వయంవరాలు కూడ జరిగేవట. తమిళనాడులోని మధుర, తిరునల్వేలి ప్రాంతాల్లో, ఎడ్లకొమ్ములకు నగనాణ్యాలు, వస్తాలు కట్టి పరుగులెట్టించడం, చప్పట్ల తప్పెట్ల మధ్య వేగం పుంజుకోవడం, ప్రమాదాలు జరుగుతున్నా, కట్టినవాటిని విప్పే ప్రయత్నంలో తీవ్రతరపోటీలు మరింత వెర్రితనం ముదరడం వలన, న్యాయస్థానం కూడ జోక్యం చేసుకున్న వెర్రిధోరణులు కూడ గమనిస్తాం. ప్రజల తీవ్ర అభ్యంతరధోరణులు కూడ గమనిస్తున్నాం. ఆచారాలు అవాంతరాలకు దారితీయరాదు అన్న స్పౄహలోపిస్తున్న కలికాలంలో సంక్రాంతి జరుపుకుంటున్నాం.
మూన్నాళ్ళ తర్వాత ముక్కనుమ
మూడవరోజైన కనుమ తర్వాత జరుపుకునే పండుగ ముక్కనుమ కూడ చాలాచోట్ల ఆచారంగా వస్తోంది. స్త్రీలు ఆచరించే శ్రావణ మంగళ గౌరీవ్రతం, సంక్రాంతి బొమ్మలకొలువులు, పుట్టింటిని క్షేమాభివౄద్ధిని కోరి 'కాకి పిడచ పెట్టడం' కూడ ఆచారమే.
బలి కధనం
బలిచక్రవర్తి రాజ్యపు ఆబాలగోపాలం స్మరణలతో ఉత్సవాలు, దక్షిణాయనంలో పాతాళానికెళ్ళి తిరిగి రావడంపై ప్రార్ధించడంలో నరకచతుర్దశి రోజున బలికి రాజ్యం కోరగా, సూర్యుడు బలిని వదలి మరల అగుపడు గాక అని కోరిన పిదప సంక్రాంతినాడు బలిస్మరణం జరుగుతుంది। దీన్ని బట్టి మకరసంక్రమణం సూర్యారాధ్యోత్సవం గా తెలుస్తుంది.
ప్రముఖ తెలుగుకవి - తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారి కవిత - 'సంక్రాంతీ అందచందాలని వివరించిన తీరుకి మచ్చుతునక।
కదలి వచ్చెను భాగ్యాల కడలిపోలి, మకర సంక్రాంతిలక్ష్మి హేమంతవీధి.
మధుర మధురానురాగసామ్రాజ్యపీఠి, జగము కొలువుండె మకరధ్వజంబు నెత్తి.
యింక పండుగనాడు ఎదురయ్యే భోజన భక్ష్యాదుల గురించి -
లేగటిపాలలో క్రాగి మాగిన తీయ తీయ కప్పురభోగి పాయసంబుచవులూరు కరివేపచివురాకుతో గమగమలాడు పైరవంకాయకూరతరుణకుస్తుంబరీదళమైత్రిమై నాల్క త్రుప్పుడుల్చెడు నక్కదోసబజ్జిక్రొత్తబెల్లపుదోడికోడలై మరిగిన ముదురుగుమ్మడిపండు ముదురుపులుసుజిడ్డు దేరిన వెన్నెల గడ్డపెరుగు, గరగరికజాటు ముంగారు చెరకురసముసంతరించితి విందుభోజనము సేయ, రండురండని పిలిచె సంక్రమణలక్ష్మి.
పైవిధంగా వడ్డించిన విస్తరి మనందరిముందు తయారు చేశారు, మన ప్రాచీనులు, పురాణీకులు, ఐతిహాసికులు, కవిఘనులు. ఆహారాన్ని ఆరగిద్దాం, ఆచారాల్ని ఆచరిద్దాం. జాతీయతని జారవిడవకుండ, సదాచారాన్ని సగౌరవంగా పాటిద్దాం. మకరసంక్రమణలక్ష్మికి మదిలో అర్చనలు చేద్దాం.
రావమ్మా మహలక్ష్మీ రావమ్మా, కౄష్ణార్పణం అంటూ పలవరిద్దాం. పండుగను పర్వదినంలా జరుపుకుందాం.
మకరసంక్రాంతి పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు, శతసహస్రాలు. శతధావిన్నపాలు. ఓం తత్సత్.
No comments:
Post a Comment