Friday, January 11, 2008

'తెలుగుదనం'ను తెల్లవారనీయకండి!

'తెలుగుదనం'ను తెల్లవారనీయకండి!
మానవజన్మ సార్ధకత
భగవంతుడు గావించిన మొట్టమొదటి సౄష్టి కార్యక్రమంలో 84 లక్షల మొత్తం జీవరాసుల్లో కేవలం ఒక లక్ష మాత్రమే మానవులను సౄష్టించడానికి పూనుకున్నాడని గర్భోనిషత్తు ప్రస్తావించినట్లు పెద్దల ఉవాచ. మానవజన్మకున్న ప్రాశస్త్యం అన్యధా వివరణ అనవసరం. వివరిస్తే, పునరుక్తి దోషం. మన సంస్కౄతి ఘోషిస్తున్న నానుడి 'జననీ, 'జన్మభూమీ, 'మాతౄభాషాల అవిభాజ్య గౌరవ ప్రపత్తుల గురించి కూడా ప్రస్తావన అధికభాష్యం అనక తప్పదు. మానవ జీవితం ప్రవహించే నది, జీవనది. ప్రవహించే నదీతీరాన్ని పరిశీలన, పర్యవేక్షణ పర్వాల్లో వౄధాజీవనపు కాలయాతన గావిస్తుంటారు. జీవననదీ పరీవాహంలో కొట్టుకుపోతూ, తేలియాడే సత్య, సత్వర ప్రయత్నం చేయాలి. రామాయణంలో శ్రీరాముడు భరతునకు 'యధాకాష్టంచ కాష్టంచా అని ఉపదేశించినట్లు, జీవితంలో కట్టె మరో కట్టెను కలిసి, అనుభూతి చెంది, విడిపోతుంది.
వౄత్తి - ప్రవౄత్తి ల సరి మేళవింపు
వౄత్తిపరంగా స్పౄశిస్తున్న రంగాలతో ప్రమేయం లేకుండా, ప్రవౄత్తి పరంగా 'సాహితీ, సంస్కౄతీ, కళారంగాల్లో నిత్యాధ్యయనం గావిస్తూ, ఆదరణ, అభిరుచుల్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలి. ఆయా వౄత్తుల్లో వున్న కళాకారులు ఎలాగూ ఆయా రంగాలపై దౄష్టి పెట్టి రాణించడం అన్నది రివాజే కదా. సాహిత్యం, సంగీతం, నాట్యం, జానపదం, చిత్రకళ, యిత్యాది కళలను ఉదాహరణగా చెప్పవచ్చు.
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఛిన్నాభిన్నం కాకుండా, ఏ కుటుంబ వైద్యుడైనా, ప్రస్తుత రుజ, రణ, రోగ దుస్థితికి దివ్యౌషధాన్ని అన్వేషించక పోతాడా అనే ఆశకి ప్రాణం పోస్తూండాలి.
విదేశీసంస్కౄతి
'విదేశీసంస్కౄతీ వ్యాపిస్తున్న తీరుతెన్నులు, రానున్న వినాశకాలపు వ్యవస్థపై వర్తమానంలోనే వెనువెంట దాడి చేసి జయించగల యుద్ధసామగ్రి కోసం వెదకులాడాలి.
లలితకళలు
లలితకళలపై, ప్రత్యేకంగా, తెలుగు నేలపై వెలసి, పేరుపొందుతున్న, వెలుగు చూడలేకపోతున్న కళలపై మరింత కౄషి, ప్రచారాలు జరగాలి. గ్రామీణ కళలు, క్రీడలు లాంటివి.
తెలుగు, సంస్కౄత భాషలు
విద్యార్ధులకు ముఖ్యంగా బాలబాలికలకు తెలుగు, సంస్కౄత భాషల్లో ఆధ్యయనం జరిపించాలి. సంస్కౄత భాష ప్రభావంవల్ల తెలుగుభాష సొగసులు, సొబగులు మరిన్ని వంటబట్టి ఉపయోగం మరింతగా పెరుగుతుంది. ఈ దిశలో విస్తౄతంగా సదుపాయాలతోపాటు, అధిక ప్రేరణ, ప్రోత్సాహం కలిగించాలి. భాషలలోని మెలకువలను నేర్పడానికి ఉచితసేవలని అందించాలి.
ఛందోబద్ధకవిత్వం
సాహిత్యంలో కవిత్వ ప్రక్రియ, కవిత్వంలో ఛందోబద్ధతని ఆదరించడానికి కావలసిన శిక్షణని ఆసక్తి వున్న వాళ్ళకైనా అందించాలి. తెలుగువారికే స్వంతమైన పద్యాన్ని, శతకం, అవధానాది ప్రక్రియ ప్రదర్శనలను విరివిగా అందించాలి.
గ్రామానికో కవిత్రయం, భువనవిజయం
మననేల త్రిలింగసంభూతం. మనకున్న కవనసంపన్నత కవిత్రయంతో శుభారంభం. తెలుగుభాషని, సాహిత్యాన్ని వౄద్ధిపరచాలనే ఉద్దేశ్యంతో, ప్రతీ గ్రామంలో కనీసం కవిత్రయాన్ని తయారుచేసి, భువనవిజయాల్ని జరిపించేలా సంసిద్ధులను చేయాలి.
తెలుగులోనే ఆలోచించాలి
ప్రతీ తెలుగుజీవి, మనసు, హౄదయం తెలుగులోనే ఆలోచించాలి. కనీసం ఒక గంట సమయంలోనైనా, తెలుగులో ఆలోచనలని తమ మాతౄభాష అయిన తెలుగులోనే ఆలోచించి, కార్యసాధనకు ఉపక్రమించాలి. దినచర్యగా నిర్విఘ్నంగా నిర్వహించాలి. ఈ ఆలోచనావిధానానికి కావలసిన సదుపాయాలని, పరిస్థితుల్ని కలిగించి, ఆలోచనలని ఆచరణకు దారితీసే వాతావరణ పరిస్థితుల్ని కల్పించాలి. ఈ తెలుగు ఆలోచనాలోచనాలతో ఆదర్శవంతంగా మన నడకను, నడతను తెలుగులోనే నిర్మించుకోవాలి.
గతవైభవాన్ని విడవద్దు
తెలుగు సంస్కౄతీగతవైభవ చరిత్ర, భాషాచరిత్ర, తెలుగు మహానుభావుల జీవనసారాంశాన్ని, వారి ప్రత్యేకతలని, తెలుగు ప్రజలందరూ అర్ధం చేసుకుని, ఆనందిస్తూ, అనుభూతి చెందడం సహా గ్రంధస్థం చేసేందుకు కౄషి సలపాలి. కనీసం మన తెలుగు మహానుభావులను వీలైనంతమంది ఘనచరిత్రలను సంపుటీకరణం చేసి భద్రపరచాలి. సాంకేతికంగా భావితరానికి వరప్రసాదంగా, సుసంపన్నమైన ఆస్థిగా అందించాలి.
దైనిక సమాచారాన్ని 'తెలుగు కరదీపికాలా అందించాలి
తెలుగు ప్రజలకు నిత్యం తమ అవసరాలకు ఉపయోగించే 'కరదీపికాని, వార్షీక ప్రాతిపదికగా, డైరీ రూపంలో అందించాలి. తెలుగువారి సంవత్సరాది - ప్రత్యేకతను ప్రదర్శించేలా 'ఉగాదీ నుంచి ప్రారంభమవ్వాలి. జనవరి సంబరాలకు భరతవాక్యం పలకాలి. దాని అవసరం అన్యధా అని భావించాలి. తెలుగు డైరీ తోపాటు, ప్రముఖ 'మలయాళ మనోరమా మాదిరి ప్రతీ సంవత్సరం తెలుగుసంస్కౄతిని ప్రతిబింబించేలా - తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రచురించాలి. ఈ ప్రచురణల్ని, ఎప్పటికప్పుడు సవరిస్తూ, తాజా సమాచారాన్ని అందిస్తూ, ప్రజలకు ప్రయోగపూర్వకమైన ప్రయోజనకారిగా అందించాలి. అంతేకాక, మన మతగ్రంధాలుగా భావించే, భగవద్గీత, బైబిలు, ఖురాన్ లా ప్రతీ తెలుగువాడు, తన మతంతో ప్రమేయంలేకుండా, నిత్యం పారాయణ మాదిరి ఆధ్యయనం చేసుకునేలా సంకల్ప దీక్షలని కలిగించాలి. వీటిని, తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణలుగా త్వరితగతిని చేపట్టి, ప్రజలకు విలువను చాటేలా అందించాలి. భావి తరానికి ఆధునిక సాంకేతిక సమాచార మాధ్యమంలో ప్రచురణ కావించి, సురక్షంగా భద్రపరచుకునేలా, భావితరానికి వరప్రసాదంలా, వారసత్వపు సిరిసంపదల్లా, ఆస్థులు-అంతస్థులులా అందించాలి.
తెలుగు మాటల మూటలను కోటల్లో భద్రపరచాలి
తెలుగు సమాచారంతో పాటు, మన నానుడి, నుడి, సూక్తి, సామెత, చెణుకు, సుభాషితం, సూక్తిముక్తావళి, హాస్య, పరిహాస మాటల మూటల సంపదలని సురక్షిత సంస్కౄతీప్రాకారాల్లో, కోటల్లో, భద్రపరచాలి. కేవలం భద్రపరచుకోవడమే కాక, ప్రజల నిత్య వాడుకలో వినియోగమయ్యేలా, హృౠదయం, మనస్సు, నాలుకల్లో నిత్యం నర్తనం చేయాలి. హౄదయోల్లాసభరితుల్ని చేయాలి.
తెలుగే ఊపిరిగా
తెలుగు ప్రజలు నిత్యం గావించే ఉఛ్ఛ్వాస, నిశ్వాసాల్ని, ప్రతీ క్షణం తీసుకునే ఊపిరిలో కూడా, తెలుగులోనే చేయాలి. మన నరనరాల్లో, నాడుల్లో, కండలో, రక్తనాళాల్లో, చీమునెత్తురులో తెలుగువర్ణం, తెలుగుస్వరం గుంభనంగా ప్రస్థానం చేయాలి.
చివరిగా - నేను సైతం - అంటూ ప్రతీ తెలుగువాడు ...
చాచాయమాత్రంగా పేర్కొన్న పై సలహా, ఆశ, ఆశయం, ఆచరణ, అభిలాష, ప్రణాళికల్ని, తెలుగుప్రజలందరూ, ప్రతీ తరం, కుటుంబం, గడప, - నేను సైతం ... అంటూ తెలుగుయాగంలో పాల్గొని, మనదైన శైలిలో ఆజ్య సమిధల్ని మనమే సమర్పింపగలిగితే, రవంతైనా సుఖసంతోషాలతో ఆనందభూతుల్ని చేస్తుంది. మన తెలుగుతేజాల్ని, తెలుగువెలుగుల్ని, తెలుగుసంపదని, మనదైన 'తెలుగురధం'లో, తెలుగుకేతనాన్ని రెపరెపలాడిస్తూ, తెలుగుతల్లిని రధయాత్ర వినువీధుల్లో ప్రతీ పల్లెలోను, వాడలోను, నగరసంకీర్తనం చేస్తూ, హరిదాసులా అభంగభజనల్ని కావిద్దాం. పుణ్యాన్ని, ముక్తిని, మోక్షాన్ని పొందుదాం. మన తెలుగురధాన్ని, తెలుగుతేజంతో, తెలుగైనవెలుగుతో నడిపిద్దాం ... నడుంకట్టి, నడుంబిగించి, అందరూ నడుద్దాం ... నడిపిద్దాం. అస్తు, తదాస్తు, అని సకల దేవతలనీ ప్రార్ధిస్తూ, ఆశీర్వదించమని కోరుకుంటూ, మన తెలుగురధాన్ని తనగమనంలో లక్ష్యలక్షణాల్ని సాధించాలని దీవించాలని, వరం ప్రసాదించాలని, కోరుకుందాం.
పునరపి జననం, పునరపి జననం - తెలుగువాడిగానే జన్మని ఆహ్వానిద్దాం!
వ్యాకరణంలో పునరుక్తి దోషంగాను, అలంకారంగాను పరిగణిస్తారు. కాని, తెలుగుదనంలో పునరుక్తి ఎంతమాత్రం దోషం కానేకాదు. సర్వాలంకారభూషితమైన కోరిక. పునరపి జననం, పునరపి జననం అన్నట్లు, మళ్ళీ, మళ్ళీ, తెలుగువాడిగానే జన్మని కోరుదాం. తెలుగు భౌతికాన్నే అభిలషిద్దాం. తెలుగు జీవితాన్నే జీవిద్దాం.
తెలుగుదనం అంటే -
తెలుగు పతాకం యెగరని దిశయే లేదు, తెలుగు దివ్వె వెలుగనట్టి నిశయే లేదు. తెలుగు పులుగు చేరలేని దేశం లేదు. తెలుగు వెలుగు దూరలేని కోశం లేదు. (దాశరధి కౄష్ణమాచార్యులు)
తరపి వెన్నెల ఆణిముత్యాల సొబగు, పునుగు జివ్వాజి ఆమని పూలవలపు, మురళి రవళులు కస్తూరి పరిమళములు, కలసి యేర్పడె సుమ్ము మా తెలుగుభాష.
కవిత-శిల్ప-చిత్ర-గాన విన్యాసముల్, క్షాళనమ్ము చేయగలవు - హౄదిని తీర్చిదిద్దగలవు విద్యసంస్కారమున్, అమౄతయోగసిద్ధి నవఘళించి. (నండూరి రామకౄష్ణమాచార్య)
కడలి అంచులు దాటి కదిలింది తెలుగు, ఎదల లోతులు మీటి ఎగిసింది తెలుగు. (సి.నారాయణరెడ్డి)
తెలుగు కవితలో తెలుగుదనం - పాలు, పంచదార, పసిపాపల నవ్వు, చందమామ వన్నె, అందమైన కన్నె, మల్లెపూల తావి, మాయలేని మనసు, కోకిలమ్మ పాట, కోపంలేని మాట, తేనె, జున్ను, ఎడారిలో నీరు, ఎదురుచూడని సిరి, మేలిమి బంగరు, మేనమామ కూతురు, అత్తరు పన్నీరు, చిత్తజు బాణం, వీటన్నిటికన్న - తెలుగు కవితయే మిన్న. (సముద్రపు శ్రీమహావిష్ణువు)
శుభమంగళం
తెలుగు తల్లికి మంగళం, మా కల్పవల్లికి మంగళం, కొలుచు మా యెద నిలుచు మా రాజ़్జీమతల్లికి మంగళం. (దేవులపల్లి కౄష్ణశాస్త్రి).
మహానుభావుకతకు, మహానుభావులకు వందనాలు
ఎందరో తెలుగు మహానుభావులు, తెలుగుతేజాలు, తెలుగు వెలుగులు, అందరికీ, అన్నింటికీ, శతసహస్రవందనాలు। సర్వదా తెలుగుదనానికి వందనాలు, అభినందనాలు.

కొంపెల్ల శర్మ