Wednesday, January 9, 2008

పద్మభూషణ్ సంగీతసుస్వరదాస్ కె.జె.ఏసుదాస్

పద్మభూషణ్ సంగీతసుస్వరదాస్ కె.జె.ఏసుదాస్
అనుభవాస్వాదం, మధుర బానిసత్వం
బహుభాషలలో సంగీతప్రియత్వం కలిగిస్తున్న ఏసుదాస్, 'దేవుడే యిచ్చాడు వీధి ఒకటీ, 'గాలివానలో వాననీటిలో పడవ ప్రయాణం' లాంటి మధుర గాత్రస్వరంతో తెలుగు సినీమా గీతాభిమానుల్ని చిరస్మరణీయమైన సంగీతయానం చేయిస్తున్న ఏసుదాసు చిత్రగీతాల్ని,శాస్త్రీయసంగీతాన్ని మరచిపోవడం అన్న ప్రశ్నే వుండదు, వుండకూడదు. ఆయన ఎన్ని పాటలు పాడాడన్నది కాదు, ప్రజాదరణ ప్రజాదరణ పొందినవి ఎన్ని అన్న ప్రశ్నే రాని ప్రతిభ. ప్రతీ పాట, ఒక సంగీత మధురస్వర సహిత గీతాప్రవచనమే అంటే అతిశయోక్తి కాదు, లేదు. ఆయన స్వరానికి, గీతాలాపనలో ఒక విధి, విధానపూరితమైన బద్దతను నిరంతరం పాటిస్తున్నట్లు కనిపిస్తే, అభిమానులకు మాత్రం జేసుదాసు సంగీతకళం పట్ల అనుభవాస్వాదపూరిత మధురబానిసత్వం అని చెప్పవచ్చు.
వీడని ప్రతిభాప్రాతినిథ్యం
కట్టాస్సెరి జోసెఫ్ ఏసుదాస్ జనవరి 10, 1940 న్ ఫోర్ట్ కొచ్చిన్ లో జన్మించిన, ఈయన తండ్రి అగశ్టైన్ జోసెఫ్ చాలా ప్రసిద్ధ గాయకుడు,నాటక కళాకారుడు. నలుగురు కుమారులు, కుమార్తె వున్న కుటుంబంలో ఏసుదాసు పెద్దకుమారుడు. అతిచిన్న ప్రాయంలోనే, తండ్రిద్వారా సంగీతాభ్యాసం ప్రారంభించడం, అయిదేళ్ళలోపే, కర్ణాటక సంగీత ప్రాధమిక సూత్రాలని క్షుణ్ణంగా ఆకళింపు చేసుకున్నాడు. తండ్రితో పాటు, 12వ ఏటనే ఎర్నాకుళంలో సంగీతకచేరీలో పాల్గొన్నాడు. పళ్ళురుతిలోని సెబస్టియన్ స్కూలు నుంచి, ఉత్తమగాయకునిగా, అనేక సంవత్సరాలు ఏసుదాసే ప్రాతినిథ్యం వహించాడు. ఆర్.యల్.వి. మ్యూజిక్ అకాడమీలో సంగీతాభ్యాసం చేసిన ఈ దాసుకు శాస్త్రీయసంగీతంలో గట్టి పునాదుల్ని నిర్మించుకున్నాడు.
సంగీతానికి 'గళస్వరం' ఘన భాగస్వామ్యం
సంగీతంలో ముఖ్యపాత్ర వహించే 'గళస్వరం' గురించి, "అది భగవద్ప్రసాదమని, మంచిస్వరం సంప్రాప్తమైతే, ఆ గళస్వర సమన్వయతని బహుజాగ్రత్తగా కాపాడుకోవాలని, ఈ విషయంలో అవలంబించే మంచి అలవాట్లను నిరంతరం పాటించడం వలన, గళస్వరపేటికను భద్రపరచుకోవడం జరుగుతూందీ అని ఒక సందర్భంలో వివరించారు. ఆలాపించే ప్రతీఅంశం, సంగీతశాస్త్రీయావగాహనతో, దైవసంకల్పంగా భావించి గానంచేయడం మూలాన, తన వౄత్తికి సార్ధకతను సంపాదించుకోగలుగుతున్నానని కూడ అనడం జరిగింది.
గాయకుడికి ఎనలేని బాధ్యతలు
కళాకారుడికి కళాసేవపట్ల చాలా అనిర్వచనీయమైన బాధ్యతలుంటాయని, సంగీతదర్శకులు చేసే మార్పులన్నింటినీ తక్షణమే తన శక్తిసామర్ధ్య శైలీవిన్యాసాలతో ఆకళింపు చేసుకుని, తనదైన భాగస్వామ్యంతో పున:దర్శనం, పున:ప్రతిష్ఠ ఒక బాధ్యతగా భావించి, నిర్వర్తించడం జరుగుతుందని తన సుదీర్ఘానుభవాన్ని తనదైన శైలిలో తెలియపరచారు.
శాస్త్రీయత నుంచి లలితానికి తరచు బదలీలు సాధ్యం కాకపోవచ్చు
బాధ్యతాపూర్వకమైన నిర్వహణాప్రయత్నం నిష్ణాతపూర్వకంగా సాధించలేనివారు, శాస్త్రీయశైలినుంచి లలితసంగీతానికి, లలితంనుంచి శాస్త్రీయానికి తరచు దాటులు వేయడం సంగీత కళాకారునికి సాధ్యపడకపోవచ్చు. భాషలు వేరైనా, భావం ఏకమే, ప్రాధమిక సంగీతపర సూత్రాల్లో వేరువేరు దారులు గమ్యాలు లేనేలేవని, గాయకవౄత్తిలోని వ్యక్తి ఒక ప్రత్యేక స్వరకంపనాన్ని సౄష్టించుకుని, గ్రహించుకుని, ఆచరిస్తూపోవాలని, ఈ ప్రయత్నంలో సార్ధకమైతే, కళాకారుడికి ప్రదర్శించే కళపట్ల విజయం సాధించినట్లేనని తన విశ్వాసాత్మకమైన భావనని ప్రకటించారు. విశ్వాసం, భావం మిళితమైతే నిరంతరం విజయం వెంటనే వుంటుందని కూడ తెలిపారు.
సంగీతశిక్షణ పాఠ్యాంశాలుగా ప్రాధాన్యత
సాధారణ చదువులోనే సంగీత పాఠ్యాంశాలు అంతర్లీనంగా అభ్యసింపబడాలని, ఈ పంథాలో అంత ప్రాధాన్యత, శ్రద్ధ ప్రకటించడం జరగడం లేదని, దీనికి అధికారాన్ని అనుభవించే కళాకారుల బాధ్యత కూడ వుందని, ఈ విషమసంస్కౄతినుంచి ప్రభుత్వాలు, అధికారులు, కళాకారులు, కళాసంస్థలు మూకుమ్మడిగా కౄషిని చేసి ఫలితాలను సాధించాలని, ఎప్పుడో తమిళ సంగీత మహాసభలో అధ్యక్షోపన్యాసంలో పేర్కొనడం గమనార్హం.
సంగీతం, గీతం, గాత్రం - ముప్పేట కలయిక
సంగీతం, గీతం, గాత్రం - మూడింటి ముప్పేటముడివేసి, అన్యులకు అంత సాధారణంగా ఆ ముడిని విప్పలేని ప్రతిభాపాండిత్యాలతో, భారతదేశపు సంగీతచిత్రప్రేక్షలచేత కేరింతలు, జేజేలు (కేజేలు) పలికింపచేసుకునే గానగంధర్వమూర్తి, జేసుదాసుగారి జన్మదినం సందర్భంగా, శుభాకాంక్షలను, అభినందనలని, తెలియజేసుకుంటూ - మహాకళాకారుడికి వినమ్రపూరిత ప్రణామాలు సమర్పించుకుంటూ - ఒక సంగీత పరిచయం లేని జీవుడు.
కొంపెల్ల శర్మ - తెలురురధం.

No comments: