Monday, January 26, 2015

విశ్వాస వాస్తవాలు - జీవన శ్వాసకోశాలు




విశ్వాస వాస్తవాలు - జీవన శ్వాసకోశాలు  

విశ్వాసం వాస్తవం కాకపోవచ్చు, కాని  

వాస్తవాన్ని విశ్వసించక తప్పదు

విశ్వాస వాస్తవం, వాస్తవ విశ్వాసం

ఉభయచరాలు; అభయహస్తాలు

కప్ప శ్వాస ధ్వని “బెక బెక బెక” రాగం  

ఏ ‘బెక’ ముందో వెనకో ఎవరికెరుక?

విశ్వాస వాస్తవాలు, వాస్తవ విశ్వాసాలు  

ఆమ్రేడితాలు, ఉభయపద ద్వందాలు

విశ్వాస వాస్తవాలు జీవన శ్వాసకోశాలు 

మనుషుల్లో కన్నా మానవేతర ప్రాణుల్లో అధికం

విశ్వాస రాహిత్యం, దుర్బలతకు చుట్టరికం   

నమ్మకం లేని జీవితం, విప్పి చెప్పలేని ప్రహేళిక

జవాబు లేని పొడుపుకథ, నక్షత్రం లేని రాత్రి

అర్థం లేని కథనం, గమ్యం లేని ప్రయాణం

బతుకుపైన, మనిషికి తనపైన తనకే లేని నమ్మకం.

విహంగం లేని పక్షి జీవితం, పాడైపోయిన గూడు    

శ్రద్ధ లేని ఆధ్యయనం, రాణించని వాణిజ్య వ్యావృత్తులు.

వాసనలేని విరికృత్రిమం, ఫలానికి నోచుకోని పుష్పం      

తోడేలు మచ్చిక, వెలయాలి ప్రతిన, వ్యాపారి సేవానిరతి

      ‘అభిలాష’, ‘అవసరం’ - విశ్వాసానికి మూల ప్రతీకలు      

అనంత శక్తి, అనిర్వచనీయ ప్రేరణ, అగణిత ప్రోద్బలం

మూగజీవికి స్వర రాగ తాన పల్లవిని నేర్పిస్తుంది

వికలాంగుల్ని హిమాయలయారోహాణం చేయిస్తుంది

మహాగిరులను సైతం కదిపి కుదిపే పవతాత్మజ శక్తి

మహోధధులను అంబరాల్ని చుంబించే చకితవైనం 

దావాగ్నులను శీతలీకరించే అనంతాద్భుత బలోపేతం     

సత్కార్యాలకి పునాది, అదృశ్యపు అదృష్టం,

అలతి నాదాల మిత్రశునకం, పరిపరిణామ తరుమొలక

అవసరాన ఆదుకునే సంకల్పం, ఎదురుచూసే వస్తుసారం

అతివిశ్వాసాల జీవనం – సంద్రంలో చిరు మరకల తుంపరలు

విశ్వాసవంతులు విశ్వవ్యాప్తులు , విజయపతాకధారులు

మానవజాతి విశ్వాసానికి – మహాసముద్రమే మహాసాక్షి.

తరచుగా భ్రమింపజేసే యాంత్రిక కళ ‘వాస్తవ’ ప్రక్రియ

ఆరోహణావరోహణలు కావించే ఎగుడుదిగుడుల నిచ్చెన

కదలికల మధ్య నడయాడే స్తబ్ధతలో జీయనయానం

ఊహలతో కప్పిపుచ్చే, సుదూరపు స్వప్నసాక్షాత్కారం

అసలు సిసలు వాస్తవాల్ని భరించలేని ఆధునిక మానవాళి

సమగ్ర, సంపూర్ణ, సత్య, నిత్య, సత్వర విశ్లేషణలకు నోచుకోనితనం

సత్యనిరోధం, స్వప్నలోక విహారం, వాస్తవాన్ని త్రోసిరాజనడమే

వాస్తవ విశ్లేషణకు శాస్త్రీయ శక్తిసూత్రాలు నిరుపయోగహారాలు

కవితలాగా  కలకాలం నిలవాలంటే సహజత్వం అనివార్యం

వాస్తవాన్ని కప్పిపుచ్చే ప్రగతి శీల ప్రవచనాలు, విప్లవపల్లవాలు

యిష్టాయిష్టాలకి స్వరూపాల్ని మార్చుకోలేని వాస్తవాలు

విలువలకి, తీర్పులకి, నేర్పులకీ, కూర్పులకీ అతీతాలు వాస్తవాలు

సిద్ధాంతాలు రాద్ధాంతాలు కావచ్చేమో ఎవరి కెరుక?

నవ్య భావాలకు ఒరవడి రగిలించే లక్షల వాస్తవాలకు

లక్ష్య లక్షణాలను ఆపాదించే ప్రక్రియ ప్రధానం

కళాదృష్టి, విజ్ఞానసృష్టి, సర్వసమ్మత త్రిగుణాత్మక సంగమ స్ఫూర్తిమంత

వాస్తవాలకు  సత్యయోగ సిద్ధ సాధ్యతలు జోడవాలి

వాస్తవాలని విలువైన వలువలుగా జీవధారణయోగ భరితమవ్వాలి

వాస్తవాలని విశ్వసించాలి, విశ్వాసాల్లోని వాస్తవాలని గ్రహించాలి.

         

              

No comments: