Monday, April 14, 2014

మన ప్రతిభావంతులు - పి బి శ్రీనివాస్

మన ప్రతిభావంతులు

పి బి (ప్రతివాద  భయంకర) శ్రీనివాస్ - ప్రథమ వర్ధంతి.



ప్రతివాది భయంకర శ్రీనివాస్ (1930-2013)
అందరికీ పి బి శ్రీనివాస్ గా పరిచయమైతే – ఆయన అసలు పేరు – కిళాంబి శ్రీనివాసాచార్యులు.
మరువలేని పరిచయం
నేను చెన్నైలో (1998-2003) వృత్తి-ప్రవృత్తి రీత్యా గడుపుతున్న రోజులవి. తెలుగు భాషా సాహిత్య సాంస్కృతిక కళా రంగాల్లో ఉద్యోగంతోపాటు సేవ చేస్తున్న రోజులవి. ‘మార్గళి’ కాలపు శాస్త్రీయ సంగీత విందు భోజనాల సమాహార ప్రక్రియని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీటితోపాటు, ప్రతినిత్యం ఏదో ఒక తెలుగు కార్యక్రమం తప్పక జరిగేది. ఎక్కువ కార్యక్రమాల్లో ఆశ్చర్య ఆనందానుభూతుల్ని తరచుగా అందించేది శ్రీనివాస్ గారే. అతిథిగా అయితే అర్థం చేసుకోవచ్చు. కాని, శ్రీనివాస్ గారు – నిరంతర శ్రద్ధా భక్తులను ప్రకటించే ప్రేక్షకుడిగా, సంగీత రసికుడిగా, యావన్మందిని తన శైలి, బహుముఖీన పాండిత్యం, ప్రతిభతో సభలకు ఓ ప్రత్యక్ష సాక్షిగా నిలిచేవారు. ఏవైనా సన్మాన సత్కార బిరుదుల ప్రదాన సభల్లో – పి బి శ్రీనివాస్ గారు తప్పకుండా ఆ ప్రదాన స్వీకర్తపై పద్యం, కవిత, పంచరత్నాలు, నవరత్నాలు, గీతాలు వ్రాసి, సభలో స్వంత గాత్రంతో పాడి, ఆ కాగితాన్ని ముఖ్య అతిథి ద్వారా అందించడమే సభలో ప్రముఖ అంశంగా అందరూ భావించేవారు.
అంతేకాదు, ఇదివరలో ‘తెలుగు జర్నల్’ అనే అంతర్జాల పత్రిక హైదరాబాద్ నుండి ప్రచురణ అయ్యేది. ఆ సందర్భంలో నేను ‘మన మహానుభావులు’ అనే నిత్య వ్యాస ప్రచురణకు నావంతుగా సహయ సహకారాలు అందించేవాడిని. అందులో భాగంగా – పత్రికాబృండం నా కోరిక మేరకు హైదరాబాద్ నుండి చెన్నై ప్రత్యేకంగా వచ్చి, ‘వీడియో’ ముఖాముఖి జరిపిన తెలుగు తెజాల్లో – వెంపటి చిన సత్యం, మాలతీ చందూర్, పొట్టి శ్రీరాములు స్మారక మందిరం పై ప్రత్యేక కథనంతోపాటు – పి బి శ్రీనివాస్ గారితో ముఖాముఖి జరిపిన ఆనాటి దివ్యానుభూతులు నేడు నన్ను తిరిగి వెంటాడాయి. ఆయన ప్రతీ రోజు సాయంసంధ్య సమయంలో గడిపే ‘ఉడ్ లాండ్స్’  హోటల్ లో ఏదో సమస్య వస్తే, ఆయన్ని వెంటపెట్టుకొని, మా అధికార నివాసంలోనే ముఖాముఖీ జరపడం, దానికి ఆయన ఎంత పరవశించిపోయారో చెప్పడం మాటలతో సరికాదు.
ప్రతివాద భయంకర శ్రీనివాస్ (పిబి యస్) గారి వర్థంతి సందర్భంగా ఆ మహామాహానుభావునికి, ఆ మహాగాయకునికి, రచయితకు, భయంకరం కాని మానవతామూర్తికి నా శత సహస్ర ప్రమాణాలు సమర్పిస్తున్నాను.   
పి.బి.శ్రీనివాస్ - కవిగా, స్వరకర్తగా, గాయకుడిగా అందరి హృదయాల్లో మెదలుతూ ప్రతినిత్యం పరవశింపజేసే  ప్రముఖ చలనచిత్ర నేపథ్యగాయకుడి సహజ నామం ప్రతివాది భయంకర శ్రీనివాస్. అష్టభాషా ప్రవీణుడిగా పేరుపొందిన శ్రీనివాస్, దినదినాభివృద్ధి చెంది, సర్వజ్ణానశూన్యత్వం నుంచి సర్వవిజ్ణానమాన్యత వరకూ కొనసాగుతున్నారంటే, ఆయన ప్రతిభే తార్కాణం.  భక్తిగీతంనుండి హాస్యగీతం వరకు ఏ తరహా పాటనైనా పాడగల సమర్థులని చిత్రరంగ ప్రవేశంనుండి నేటి వరకూ తిరుగులేని సరాగప్రస్థానం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా, కాకినాడలో 22 సెప్టెంబరు 1930న ఫణీంద్రస్వామి, శేషగిరమ్మ దంపతులకు జన్మించిన పదహారణాల తెలుగుబిడ్డ మాతృభాషే కాకుండా కన్నడ, తమిళ, మలయాళ, హిందీ బాషల్లోని చిత్రాల్లో అధికంగా తన స్వర్ణగళాన్ని అందించిన ఘనుడు. 1954 లో జాతకఫలంచిత్రంతో తెలుగులో గాయకునిగా రంగప్రవేశం చేసిన పి బి కన్నడ చిత్రసీమని అత్యధికకాలంపాటు ఏకచత్రాధిపత్యం వహించారనే చెప్పాలి. మార్దవం మూర్తీభవించిన చిత్రగీతాలు ఈయన ప్రతిభకు తార్కాణంగా నిలిచిపోయాయి.   
ఓహో గులాబిబాల, అందాల ప్రేమమాల’ (మంచిమనిషి), ‘నీలి మేఘాలలో’ (మదనకామరాజు కథ), ‘తలచినదే జరిగినదా’ (మనసే మందిరం), ‘ఎవరికి ఎవరు కాపలా’ (ఇంటికి దీపం యిల్లాలే) లాంటి గీతాలు కొన్ని వేలు శ్రీనివాస్ గళప్రసాదాలే       . కేవలం చిత్ర గీత గానమే కాక, ఎన్నో గజల్స్ ని వ్రాయడం, పాడడం, ‘మహాసాధ్విచిత్రానికి సంగీత దర్శకత్వం వహించడం ఆయన సుదీర్ఘ ప్రస్థానంలో కేవలం కొన్ని తునకలు మాత్రమే.
మొట్టమొదటిసారిగా జాతక ఫలం చిత్రంలో పాడాడు. ఆయన సుమారు 3000 లకు పైగా పాటలు పాడాడు. అవి తెలుగు, కన్నడం , తమిళం , మళయాళం , హిందీ , ఉర్దూ , ఆంగ్లం , సంస్కృతం. ఆయన అనేక గజళ్ల ను తెలుగు లో పాడాడు. శ్రీనివాస్ యుగళ గీతాలను కోరస్ పాటలను గీతా దత్, షంషాద్ బేగమ్ మరియు జిక్కీ లతో కలిసి ఆలపించారు. ఆయన ఆర్.నాగేంద్ర రావు యొక్క జాతక ఫలం అనే చిత్రం ద్వారా తమిళం, కన్నడం, తెలుగు చిత్రాల లో పరిచయమైనాడు. ఆయన దేశంలోని ప్రధానమైన భాషలలో ఎన్నో పాటలు పాడినప్పటికీ ఎక్కువ పాటలను కన్నడ భాషలోనే పాడాడు. తెలుగు చిత్రాల్లొ ఎన్నో ప్రజాదరణ పొందిన పాటలను తన మధుర గాత్రంతో ఆలపించాడు. శాంతినివాసం చిత్రం లో మహానటుడు నాగయ్య గారికి "శ్రీ రఘురాం జయ రఘురాం " అనే పాటను పాడటం విశేషం.
శ్రీనివాస్ 1952 లో జెమిని వారి హిందీ చిత్రం "మిస్టర్ సంపత్" తో తన చలనచిత్ర జీవితం ప్రారంభించాడు. అందులో ఆయన పాడిన పాట "ఆజి హం భారత్ కీ నారి" ఒక యుగళ గీతం. దీనిని "గీతా దత్త్ " తో కలిసి పాడి ప్రాముఖ్యత పొందాడు. 1955 లో మళయాళ చిత్రం "హరిశ్చంద్ర" లో పాడాడు. ఆయన మొదటి సోలో సాంగ్ "ప్రేమ పాశం" చిత్రంలో పి.సుశీల తో పాడాడు. ఇది ఎంతో విశేషతను సంతరించుకుంది. తర్వాత కన్నడ కంఠీరవరాజ్ కుమార్ కు చాలా కాలంపాటు పాటలు పాడాడు. ఇవి విమర్శకులచే, అభిమానులచే మరియు పరిశ్రమలచే కొనియాడబడ్డాయి. తమిళ పరిశ్రమలో జెమిని గణేశన్ కు, ఎం.జి.రామచంద్రన్, శివాజీ గణేశన్, ముత్తురామన్, రవిచంద్రన్, జైశంకర్ లకు పాడాడు. 1964 లో మై భీ లడకీ హూ అనే హిందీ చిత్రం లో లతా మంగేష్కర్ తో కలిసి పాడిన పాట "చందా సె హోగా వో ప్యారా" ఎంతో విశేషతను పొందింది. ఆయన కంఠం తమిళంలో అనేక మంది నటులకు ఉపయోగపడింది. శ్రీనివాస్ ప్రముఖ ఆయన ఆధ్యాత్మిక పాటలను కూడా పాడాడు. అవి "శారదా భుజంగ స్తోత్రం", "శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్" , "ముకుంద మాల" , "శ్రీ మల్లిఖార్జున స్తోత్రం" , పురందరదాసు సంకీర్తనలు.
పాత పాటకు మంచి రోజులు వస్తాయిఅన్న దృఢవిశ్వాసంతో కొనసాగుతున్న పి బి చిత్రరంగం అరవై ఎనిమిది సంవత్సరాల తెలుగు సినీమా ప్రస్థానం సందర్భంగా ఆంధ్రప్రభ మోహినిఅన్న రెండు భాగాల బృహద్గ్రంథాన్ని వెలువడడం, దానిలో జరిపిన ప్రత్యేక ముఖాముఖీలో అనేక ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించిన తీరు శ్రీనివాస్ గారి ప్రతిభకు సరిసములు లేవని అనిపించక మానదు.
కొన్ని విషయాలను యిక్కడ ప్రస్తావించడం పరమ ఔచిత్యంగా భావిస్తూ, పొందుపరచడం జరుగుతోంది.
·         మా తల్లిగారికి సంగీలో ప్రవేశముంది. సినీమాలు చూసి అప్పటికప్పుడు పాటలను కంఠతా పట్టి నేర్చుకునేవాడిని; నాకంటూ స్వంతగ్రాఫ్స్ తయారు చేసుకుని వాటికి అనుగుణంగా వివిధ గాయకులు పాడిన పాటలను ఇమిటేట్ చేస్తూ పాటలు పాడేవాడిని; ఇలా సినీమారంగంపై ఆసక్తి పెరిగింది.
·         సుప్రసిద్ధ వైణికులు ఈమని శంకరశాస్త్రిగారు మా కుటుంబానికి సన్నిహితులు; నా చేత ఒక పాట పాడించి, మంచి భవిష్యత్తు ఉందన్నారు; మొదట్లో చిన్న చిన్న దోహాలు (కవిత్వపు పంక్తులు) పాడే అవకాశాలు వచ్చాయి.
·         ఎవరికైనా సరిపోయే విధంగా బేస్ వోయిస్ ఉండటం నాకున్న ప్లస్ పాయింట్ గా భావిస్తాను.
·         చెబితే ఆశ్చర్య పోతారు కాని నాకు ఈ రోజువరకు శాస్త్రీయ సంగీతం అంటే పూర్తిగా తెలియదు; చిన్నప్పుడు ఇంటి ప్రక్కన ఒక అమ్మాయి సంగీతం నేర్చుకుంటుంటే వెక్కిరించేవాడిని కూడా!
·         భావం తెలియని సాధన శుద్ధ దండగ అనే భావనలో ఉండేవాడిని; నాకు అప్పట్లోనే సర్వజ్ణానశూన్యుడుఅనే టైటిల్ వుండేది; అయితే, ఎవరివద్ద శిక్షణ తీసుకోలేదు; నాకున్న అవగాహనతోనే ఆ రంగంలోనూ అనుభవం సాధించాను.
·         చీకటి రోజుల గురించి ఆలోచించే అలవాటు నాకు లేదు; నేను వెలుగుని కోరుకునేవాడిని.
·         మార్పు అనేది సహజం; మనం ఒంటెద్దు బండి కాలం నుంచి రాకెట్ యుగం వరకు వచ్చాం; కాలంతోపాటు మనమూ మారాలి; ఇప్పటి సంగీతం మీద వెష్ట్రన్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది; వాయిద్యాల విషయంలోనూ ఇదే జరుగుతోంది; అంటే జనం మెచ్చడం లేదని కాదు; వచ్చిన చిక్కంతా ఏమిటంటే సంగీతంలో సాహిత్యం కనిపించడంలేదు; ప్లోర్ మీదికి వచ్చాక పాటలు రాయించుకుంటున్న రోజులివి; ఇప్పుడి సింగర్స్ ఎవరి ట్రాక్ లో వారు పాడుకుంటున్నారు; కొంతకాలంపోతే వాయిద్యాలది ఇదే పరిస్థితి అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు; అయితే కాలం ఎప్పటికైనా మారి తీరుతుందని గట్టిగా నమ్మేవారిలో నేనొకడిని; మళ్ళీ పాత పాటలనే ప్రేక్షకులు కోరుకునే రోజు దగ్గర్లోనే ఉంది.
·         నాపై అందరి ప్రభావం ఉంది; సినీమా రంగానికి వచ్చిన తర్వాత మాత్రం నాకంటూ సొంత గొంతు ఉండాలనే తపనతో అలా పాడుతూ వస్తున్నాను.
·         మొదటినుంచి సాహిత్యంపై నాకు మక్కువ ఎక్కువ; అన్ని భాషలలోని సాహిత్యంపై కూడ పరిశోధన చేశాను; నిరంతర పఠనమే నాకు సాహిత్యంలో స్ఫూర్తిని కలిగించింది; ఇంతవరకూ తెలుగులో లేని చందస్సును కనుగొని శ్రీనివాస గాయత్రీ వృత్తాలు’  పేరిట పుస్తకరూపంలో ప్రచురించాను; అలాగే గజల్స్ పై అభిమానంతో వాటిని ప్రచురణ రూపంలోకి తెచ్చాను.
·         సంగీతం డామినేషన్ లో వారి ప్రతిభ మూలన పడకూడదు; పాట పాడటం ద్వారా అనుభూతి పొందగలగాలి; ఇది యువతరం నేర్చుకుంటే మంచిది;
·         ఆర్టిష్టుకు రిటైర్మెంటు అనేది లేదు; చివరి క్షణం వరకూ పాడుతూనే ఉంటాను.
పి బి శ్రీనివాస్ గారు 1998 లో వెలుబుచ్చిన భావాలు నేటికీ చిత్రరంగానికి వర్తిస్తాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేనేలేవు. ఈ విషయాలనే తిరిగి శ్రీనివాసు గారితో ప్రస్తావిస్తే వచ్చే భావాలు ఎలా వుంటాయో ఆసక్తికరమైన విషయం కదా!
చెన్నైలో నివాసం వుంటున్నప్పుడు తెలుగు జర్నల్’’ అంతర్జాల పత్రిక పక్షాన ఒక వీడియో సంభాషణ ద్వారా వెలుబుచ్చిన అభిప్రాయాలు మరింత ఆసక్తికరాలు అన్న వాస్తవం స్ఫురణకు రావడం ఒక అనుభూతిగా గోచరిస్తోంది.
చైన్నై లోని ఆయన ఉంటున్న వుడ్‌లాండ్స్ డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ లో ఏ సమయము నందు ఆయనను సందర్శించినా ప్రశాంతంగా కవితలు వ్రాసుకుంటుండేవాడు. పి.వి.శ్రీనివాస్ ఏప్రిల్ 14, 2013 లో తన 82 వయేట చెన్నై లోని ఆసుపత్రిల్ లో గుండె పోటుతో అస్తమించాడు.
ప్రతివాద భయంకర శ్రీనివాస్ గా పేరొందిన – ఆయన (అసలు పేరు) కిళాంబి శ్రీనివాసాచార్యులు అన్నది చాలామందికి తెలియని విశేష విషయం. ఆయనకి నా సవినయపూర్వక ప్రణామాలు. 

కొంపెల్ల శర్మ 

No comments: