ఆధ్యాత్మికం,
సూర్యజయంతి
– రథసప్తమి సందర్భంగా ప్రారంభం
“ఆరోగ్యం భాస్కరాత్
ఇచ్చేత్”
మయూరమహాకవికృతం
శ్రీ సూర్య శతకమ్
సూర్యస్తుతిరూపమగు
మనోహర సంస్కృత కావ్యము – భావార్థ వివరణ సహితము
వ్యాఖ్యాత :
బ్రహ్మశ్రీ పోతూరి సీతారామాంజనేయులు గారు
సూర్యద్యుతి (ప్రభా) వర్ణనమ్ (2)
భక్తిప్రహ్వాయ
ధాతుం-ముకులపుటకుటీ-కోటరక్రోడలీనాం
లక్ష్మీ
మాక్రష్టుకామా-ఇవ కమలవనో-ద్ఘాటనం కుర్వతే యే
కాలాకారాంధకారా-ననపతిజగ-త్సాధ్వసధ్వంసకల్యాః
కల్యాణం
వః క్రియాసుః-క్రియాసుః-కిసలయరుచయ-స్తే కరా భాస్కరస్య. (2)
అపుడే
ఉదయించుచుండు సూర్యుని ప్రాతఃకాలీనకాంతులు చిగురుటాకుల వన్నెవంటి వన్నె కలిగి ప్రకాశించుచునట్టివి.
కాలుని (యముని) ఆకారమును పోలు ఆకారము (నల్లని రూపము) కల అంధకారపు నోటిలో పడియున్న లోకముల
భయమును ధ్వంస మొనర్చుట విషయమున (ధ్వంసమొనర్చు పనియందు) పూనిక వహించి యుండునవి. తాము
ఆయా దిక్కులందు ప్రసరించుచునే ఆయా సరస్సులందలి తామరల గుంపులను తెరచు (వికసింపజేయు)
చుండునవి. సంపదధిదేవత యగు లక్ష్మీదేవి పద్మనివాసిని. ఆమె తామరపూమొగ్గల డిప్పలు అనెడు
కుటీరముల తొర్రల నడిమిభాగములయందు దాగినట్లు మరుగుపడి యుండగా లక్ష్మిని ఈయదలచి ఆమేను
బయటకు లాగుటకే ఇట్లు తామరపూమొగ్గలను తెరచుచున్నవో ఏమో అని తోచుచుండును. అట్టి ఈ సూర్యకిరణములు
మీకు శుభములను కలిగించునుగాక!
No comments:
Post a Comment