Saturday, February 16, 2013

మయూరమహాకవికృతం శ్రీ సూర్య శతకమ్


సూర్యజయంతి – రథసప్తమి సందర్భంగా
“ఆరోగ్యం భాస్కరాత్ ఇచ్చేత్”

మయూరమహాకవికృతం శ్రీ సూర్య శతకమ్


సూర్యస్తుతిరూపమగు మనోహర సంస్కృత కావ్యము – భావార్థ వివరణ సహితము

వ్యాఖ్యాత : బ్రహ్మశ్రీ పోతూరి సీతారామాంజనేయులు గారు

సూర్యద్యుతి (ప్రభా) వర్ణనమ్

జంభారాతీభకుంభో-ధృవమివ దధత-స్సాంద్రసిందూరరేణుం

రక్తాస్సిక్తా ఇవౌఘై-రుదయగిరితటీ-ధాతుధారాద్రవస్య

అయాంత్యా తుల్యకాలం-కమలవనరుచే-వారుణా వో విభూత్యైః

భూయాసుర్భానయంతో-భువనమభినవా-భానవోద్య భానవీయాః (1)

భావార్థం:
ఉదయకాలపు సూర్యుని నూతనకిరణములు భూలోకమును స్వర్గలోకమును కూడ ఒకే సమయమున ప్రకాశించజేయుచున్నవి. అందు స్వర్గలోకమున వ్యాపించుచుండిన ఆ కిరణములు దేవేంద్రుని ఐరావతగజపు కుంభస్థలమునందలి దట్టమగు సిందూరపు ధూళిని తమయందు నిలుపుకొనెనేమో అనునట్లు ఎర్రనై కనబడుచున్నవి. భూలోకమున వ్యాపించిన ఆ లేత రవికిరణములు ఉదయపర్వతమునందలి గైరికధాతువుల ద్రవముల ప్రవాహములచే తడిసెనేమో అనదగినట్లు రక్తవర్ణము కలవయి తోచుచున్నవి. స్వర్గమునను భూలోకమునందును కూడ సూర్యోదయముతోపాటే ఒకే సమయమునందు సరస్సులందో గంగానదులయందో వికసించుచుండిన పద్మసమూహముల కాంతిచే ఎర్రదనమును పొందెనేమో అనునట్లు అవి ఎర్రనికాంతి కలవిగా కనబడుచున్నవి. అట్టి ఆ నూతనసూర్యకిరణములు మీకు శుభమును ఐశ్వర్యమును కలిగించునవి అగుగాక!

No comments: