Tuesday, February 19, 2013

మయూరమహాకవికృతం శ్రీ సూర్య శతకమ్



సూర్యజయంతి – రథసప్తమి సందర్భంగా

“ఆరోగ్యం భాస్కరాత్ ఇచ్చేత్”
 
మయూరమహాకవికృతం శ్రీ సూర్య శతకమ్
సూర్యస్తుతిరూపమగు మనోహర సంస్కృత కావ్యము – భావార్థ వివరణ సహితము
వ్యాఖ్యాత : బ్రహ్మశ్రీ పోతూరి సీతారామాంజనేయులు గారు

సూర్యద్యుతి (ప్రభా) వర్ణనమ్-3

గర్భైష్యంభోరుహాణాం-శిఖరిషు చ శితా-గ్రేషు తుల్యం పతంతః

ప్రారంభే వాసరస్య-వ్యుపరతిసమయే-చైకరూపా స్తదైవ

నిష్పర్యాయం ప్రవృత్తౌ-స్త్రిభువనభవన-ప్రాగణే పాంతు యుష్మా

నూష్మాణం సంతతాధ్వ-శ్రమజమివ భృశం-బిభ్రతో బ్రధ్నపాదాః (3)

భావార్థముః

బ్రధ్నపాదములు (బ్రధ్నుడు అను ఒక పురుషుని పాదములు-సూర్యుని కిరణములు) మిగుల విలక్షణమగు స్వభావము కలవి. లోకమున కొందరి పాదములు మెత్తని ప్రదేశములందు పడినట్లు ముండ్లతో రాలతో నిండిన ప్రదేశములయందు పడవు; రవిపాదములు (కిరణములు) అట్లు కాక సుకుమారములగు పద్మముల ) అంతర్భాగములందును  వాడియగు మొనలు కలిగి కఠినములగు పర్వతాగ్రములయందును సమానముగానే పడును (ప్రసరించును); లోకమున సాధారణముగ చాలామంది పాదములు జీవితారంభమున సుకుమారములగును సుందరములుగను ఉండినను వార్థకమున తమ సౌకుమార్య సౌందర్యములను కోల్పోవును. రవిపాదములు పగటి ఆరంభమునను (ఉదయ కాలమునను) అవసానసమయమునను (సాయంకాలమునను) ఒకే విధముగ ఉండును; లోకమున ఎవరి పాదములును అనేక ప్రదేశములందు ఒకేమారు పడవు. రవిపాదములు భువనత్రయము అను భవనపు ప్రాంగణమునందు (ముంగిటి యందంటను) ఒకేమారు పడును (ప్రసరించును). ఎవరికై (పయి)నను పాదములు నిరంతరమును నడచుటవలని శ్రమచేత వెచ్చదనము నందియుండును. రవి పాదములు అట్టి నిరంతరమనముచే కలిగిన నిరంతర శ్రమచే అనునట్లు వెచ్చగా నుండును. అట్టి బ్రధ్న (రవి) పాదములు మిమ్ము రక్షించుగాక!

No comments: