Saturday, November 14, 2009

జవహరునికి జగతి నిత్యనివాళి






జవహరునికి జగతి నిత్యనివాళి
సుదీర్ఘజీవనప్రస్థానం ( 14 నవంబర్ 1889 - మే 27, 1964 ) రాజకీయ రారాజు. భారతీయ జాతీయ కాంగ్రెస్ కి రాజీలేని రాజకీయనేత. భారతస్వాతంత్ర్యసమరంలో ప్రధానపాత్ర వహించిన ప్రజ్ణాని. స్వతంత్రభారతావనికి ప్రప్రధమ ప్రధానమంత్రి. ప్రపంచచయుద్ధం తర్వాతకాలంలో అంతర్జాతీయ రాజకీయాల్లో అందరినీ అవాక్కయేలాచేసిన అఖండుడు, అలీనవిధాన స్థాపకుల్లో ఆద్యుడు, విద్వన్మూర్తి - పండిట్ గా ప్రఖ్యాతుడు, చివరైనా, ముందువరసలో చెప్పవలసిన చారిత్రాత్మక అంశాలను విశ్వపరిణామంలో గ్రంధస్తం చేసి - భారతీయదర్శనాన్వేషణం, విశ్వచరితావలోకనాసారం, స్వీయచరిత్ర, సాహిత్యత్రయాన్ని సౄష్టించిన అధ్బుత రచయిత, నెహ్రూ-గాంధి కుటుంబానికి వారధి, భారతీయ రాజకీయప్రాస్థానంలో అపరచతురుడుగా రాణింపులు అందుకున్నవాడు, మోతీలాల్ కు ప్రియతనయుడు, యిందిరాగాంధికి తండ్రి, రాజీవగాంధికి తాత, రాహుల్ గాంధికి ముత్తాత, నెహ్రూవంశపరంపరకు మధ్యవారధి - మరెవరోకాదు - పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, పిల్లలకు చాచాజీ, ఎర్రగులాబితో ఆజన్మాంతం అవిభాజ్యనేస్తం. దేశస్వాతంత్ర్యసమరంలో ప్రధానపాత్ర వహించిన కుటుంబం మనిషి ఓ అధ్బుతమైన లక్ష్యాన్నినిర్దేశించుకుని, ఆ లక్ష్యసాధన కోసం నిరంతరం నిరాటంకంగా నిజాయితీతో కౄషి చేసుకుంటూ ముందుకు సాగితే, అది అన్నిటినీ మించిన ఆనందానికి నాంది అవుతుంది. ఆ సమయంలో సుఖశాంతులు మనిషి చరణాల వద్ద సదా సంసింద్ధంగా వుంటుంటాయి. పైగా అలాటి మనిషికి తాను అనుకున్నది సాధించడం అనే ఆత్మ సంతౄప్తి కూడా పుష్కలంగా లభిస్తుంటుంది. మనసు నిండా నిజాయితీ పెల్లుబుకుతుండాలే గాని, అటువంటి మనిషి తక్కిన ఎంతో మంది కన్నా మిన్నగా దేశానికి సేవలు అందించగలుగుతాడు. ఈ భావపరంపరతోనే, ఒక ప్రముఖ, సుసంపన్న, సంస్కౄతీపరంపరలను పుణికిపుచ్చుకున్న త్యాగధారను అర్పించి, భారతదేశాన్ని బానిసత్వపు కోరలు, సంకెళ్ళనుంచి విముక్తి కావించడానికి చేసిన సేవలను ప్రస్తావించాలంటే, ఈ కుటుంబాన్ని ప్రప్రధమంగా పేర్కొనవలసిందే. ఆ కుటుంబం వంశానుగతంగా దేశానికి సేవలను నిత్య, సత్య, సత్వరధోరణుల్లో తనదైన శైలిలో చెరగని ముద్రలను వేయగలిగిన కుటుంబం అది. ఆ కుటుంబంలో ప్రస్తావించతగ్గ వ్యక్తి మోతీలాల్ నెహ్రూ. ఈ మహానుభావుని దేశభక్తిసేవలు వంశానుగతంగా, క్రమంగా, జవహర్ లాల్ నెహ్రూ, యిందిరాగాంధి, రాజీవగాంధి, సోనియాగాంధి, ప్రస్తుతం యువతరానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధి, ప్రియంక, లను ముఖ్యంగా ప్రస్తావించాలి. మనదేశస్వాతంత్ర్యానికి పూర్వాపరదశల్లో ప్రముఖ పాత్ర వహించిన ఈ కుటుంబం మధ్యతర ప్రతినిధిగా భారతీయదేశ తొలి ప్రధానమంత్రి, జవహర్ లాల్ నెహ్రూ ని స్మరించకుండా, జరగనిపని. యదార్ధం యీనాటి వాస్తవమయితే, ఆదర్శం రేపటి వాస్తవం అన్న సూక్తి ఈ కుటుంబానికి సంపూర్ణంగా అన్వయం అవుతుంది. పూలలో సుగంధాలు ఎంత దాచినా దాగవు. మనుషుల్లోని యోగ్యతలూ అంతే. అవి దాచినా దాగని వస్తువులు. ఈ భావన కూడా ఈ కుటుంబానికి మనసావాచాకర్మణా వర్తిస్తుంది.
ఆణిముత్యం జవహరుడు పరమపావన గంగానదీతటప్రదేశం, త్రివేణీసంగమపుణ్యస్థలి, ఉత్తరప్రదేశంలోని ప్రముఖ నగరం, అలహాబాదుకి తరలివచ్చిన కాశ్మీరుప్రాంతంలోని పరంపరగా వస్తున్న హిందూశాఖ, సరస్వతి బ్రాహ్మణకుటుంబం మోతీలాల్ నెహ్రూ - స్వరూపరాణి దంపతులకు పుత్రసంతానభాగ్యఫలంగా 14 నవంబర్ 1889 రోజు పుణ్యతిధి, దంపతుల్ని పున్నామనరకంనుంచి విముక్తి చేయబడ్దారు అన్న భావన ప్రతిబింబించిన సమయం అది. ఆ ముద్దులబిడ్డకు సార్ధకనామధేయం - ముత్యం, వజ్రం, వైఢూర్యం ముప్పేటతో కలగలిపినట్లు, 'జవహర్ లాళ్ అని పేరుపెట్టారు. ప్రతిభాశాలి, సుసంపన్నశీలి, న్యాయవాది మోతీలాల్ కు మరింత సిరిసంపదల్ని అందించిన ఆనందడోలికల్లో ముంచెత్తిన శిశువు. న్యాయవాదంతోపాటు, భారతదేశంలో అప్పటి అతిపెద్ద రాజకీయసంస్థ - భారతీయ జాతీయ కాంగ్రెశ్ లో అతిచురుగ్గా పాలుపంచుకునేవాడు. నెహ్రూకి ప్రియసోదరీమణులైన విజయలక్షి, కౄష్ణలతో ఆ కుటుంబం మహారాజప్రాకారం 'ఆనందభవనం' లో ఆంగ్లేయుల సదాచారాలు, సంస్కౄతి,వేషభాషలతో జీవనంగావించేవారు. ఆంగ్లం, హిందీలతోపాటు స్వచ్చమైన ఆంగ్లం కూడ పరిభాషలుగా చలామణి అయ్యేవి. నివాసంలోనే విద్యతోపాటు, ప్రముఖ విద్యాసంస్థల్లో విద్యాభ్యాసం చేసిన నెహ్రూ 15వ ఏట ప్రకౄతిశాస్త్రం ఆధ్యయనం చేసేందుకు, యింగ్లండు, ట్రినిటి సంస్థలో, న్యాయశాస్త్రంలో మిడిల్ టెంపుల్, లండన్ లో చదువులు సాగించాడు. లండన్ లోని రంగస్థలం, ప్రదర్శనశాలలు, ఒపేరాహౌస్ పర్యటనలు, యూరోపు లో సెలవుల్లో తరచు విహారయాత్రలు చేయడం జరిగింది. ఒకవిధమైన ఆకర్షణ, స్ఫురద్రూపి, కలుపుకోరుదనం, చురుకైన తెలివైన యువకుడుగా నెహ్రూని పలుమంది పరిశీలనతో భావించేవారు. దీనికితోడుగా, భారతీయ విద్యార్ధి బౄందంలో రాజకీయ కార్యకలాపాల్లో కూడ పాల్గొనేవాడు. స్వామ్య, స్వేచ్చావాదాల్లో ఆకర్షితుడై, యూరోప్ లోని రాజకీయ, ఆర్ధికరంగాల్లో ప్రేరణకు గురయ్యాడు. స్వదేశానికి రాక - స్యయంకౄషితో వ్యక్తిత్వనిర్మాణత స్వదేశానికి రాకతో 27ఏళ్ళ యువప్రాయంతో, నెహ్రూకి ఫిబ్రవరి 8, 1916 న పదహారేళ్ళప్రాయంగల కమలా కౌల్ తో వివాహం జరగడం, తొలిదఫా దాంపత్యం విభిన్న సంస్కౄతీసంప్రదాయ ధోరణిలో కొనసాగుతున్నా, మరుసటి ఏటే, ఆడపిల్ల, ఏకైకసంతానం, 'యిందిరాప్రియదర్శనీ కలగటంతో - భావిభారతరాజకీయభాగ్యదర్శకురాలు అవతరించిదని ఆనాటి జ్యోతిష్కులకు కూడా తోచనట్లే జన్మించింది. న్యాయవాద వౄత్తిలో సుస్థిరంగా కొనసాగే ప్రయత్నాలు చేసుకున్నా, మనసుమాత్రం, ప్రపంచయుద్ధం తదుపరిదశలో తలేత్తిన వేర్పాటుధోరణి నేపథ్యంలో మార్పుచెందే భారతీయ రాజకీయజీవనం వైపే, మొగ్గుచూపింది. ఫలితంగా, సంకల్పదీక్షాకంకణబద్ధతతో లక్నో లో జరిగిన 1916 కీలక కాంగ్రెస్ సమావేశం ఆధునిక, తీవ్రభావశక్తులవిభాగాలన్ని ఏకీకౄతమయ్యాయి. భారతరాజకీయవేత్తలందరూ ముక్తకంఠంతో స్వదేశీపరిపాలన, భారతదేశానికి సర్వస్వతంత్రతను నొక్కి వక్కాణించారు. తండ్రితో సహా, తెల్లసంస్కౄతినేపథ్యంలో వున్న కాంగ్రెసు రాజకీయవేత్తలపై నెహ్రూకి అధికంగానే నిరాశ, నిరాసక్తి కలుగుతున్న తరుణంలో, మదిలో భావాలు మారుతూండడంతో పాటు, మస్తిష్కంలో అలలు, అలజడులు కదలాడాయి. భారతీయ కాంగ్రెసుకి, భారతదేశానికి కూడ భావినేత అని పలువురి భావనగా ప్రకటనలు వస్తున్నా, మహాత్మాగాంధి రాజకీయోద్యమంలో కాలిడిన తర్వాతే, నెహ్రూ రాజకీయజీవితానికి ఒక రూపు, ఊపు సంతరించుకున్నాయి. గాంధి గురుతత్వప్రేరణ - నెహ్రూ యువనాయకత్వం గాంధివాదానికి, నాయకత్వానికి ప్రభావితుడై, ఆకర్షితుడైనాడు నెహ్రూ. భారతదేశం ఉద్యోగులకు వకాల్తా తీసుకున్న దక్షిణాఫ్రికా న్యాయవాదిగా గాంధికి చాలా గుర్తింపు వచ్చింది. భారతదేశానికి తిరిగివచ్చి, గాంధి ఉద్యోగులను, రైతులను సమావేశపరచి, చంపరన్, ఖేద ప్రాంతాల్లో తెల్లదొరలు అమలుపరుస్తున్న పన్ను విధానాలపై వ్యతిరేకతను ప్రకటించడంలో వరుసగా ప్రదర్శనలను నిర్వహించడంలో ప్రముఖపాత్రను వహించాడు. వ్యతిరేకోద్యమంలో భారతీయ విశిష్టశైలిలో నిర్మాణం చేసుకున్న హింసరహితవిధానసహిత సామూహికనిరాకరణోద్యమానికి - అహింసాసత్యాగ్రహం - సంపూర్ణ అహింసాధోరణిలో నూతన ప్రక్రియను రూపొందించడంలో గాంధి ఒక కొత్త వొరవడి ప్రారంభించాడు. అంతవరకు, తెల్లదొరల పరిపాలనపై వ్యతిరేకధోరణులను ప్రకటించే పలువిధానాలు అవలంబించడానికి బదులుగా, గాంధీజీ ఒక సమైక్య వ్యతిరేకవిధానానికి రూపకల్పన కలిగించడం, భారతీయులను ఒక్క త్రాటిపై నిలబెట్టింది. ఈ తరుణంలో నెహ్రూ గాంధీని కలవడం, ఆయన వాదాలని, భావాలని ఆకళింపుచేసుకోవడం, చంపరన్ ఉద్యమంలో గాంధికి సహాయసహకారాలను అందించడంలో నెహ్రూ ముందుకురావడం అనూహ్య పరిణామంగా భావించబడింది. గాంధి అనుసరణలో భాగంగా నెహ్రూ తో తనపూర్తికుటుంబం, పాశ్చాత్యధోరణులు, వస్త్రధారణ, సుసంపన్నజీవనవిధానాలు, ఆస్థిపాస్థులపై తగ్గించుకున్న మమకారం, ఖాదీవస్త్రధారణను పూర్తిగా అమలుపరచడం లాంటి విధానాలతో, నెహ్రూకుటుంబం పూర్తిగా గాంధికి ధౄఢసహకారాన్నివ్వడం జరిగింది. అదే ప్రేరణతో, గాంధితో పాటు నిత్యం భగవద్గీత పారాయణం, యోగభ్యాసం పాటించేవారు. గాంధితో పాటు తన దినచర్య, పర్యటనల్లో వెనువెంటే వెంటాడడమే కాకుండా, నెహ్రూ తన వ్యక్తిగత జీవనవిధానంలో కూడ సలహాసంప్రదింపులను అర్ధించేవారు. 1919లో రౌలత్ చట్టాలపైనా, ఖిలాఫత్ వుద్యమానికై, గాంధితోపాటు భారతదేశంలో గ్రామగ్రామాలు తిరిగి, భారతీయకాంగ్రేస్ లో యువసభ్యులను స్వీకరించే కార్యక్రమంలో భాగంగా, అమోఘమైన రాజకీయోపన్యాసాలనివ్వడంలో ఘనాపాటిగా నెహ్రూ చాలా పేరుప్రతిష్టలను తెచ్చుకున్నాడు. ఈ వేదికలపైనే, హిందూ-మసలమాన్ ల ఐక్యత, విద్యావిధానం, స్వయంశక్తి, సాంఘికదురాచాలనిర్మూలనాంశాలు - అంటరానితనం, బీదరికం, అవగాహనారాహిత్యం, నిరుద్యోగ సమస్యలను కూలంకషతో చర్చించేవారు. ఆనాటికి సభలను ప్రతిభావంతంగా నిర్వహించే శక్తిసామర్ధ్యాలతోపాటు, అపర వుపన్యాసకేసరి అన్న పేరుతో, ఉత్తరభారతానికి తిరుగులేని, ప్రశ్నించలేని, సమాధానపరచనక్కరలేని రాజకీయప్రతిభానాయకునిగా నెహ్రూని అభివర్ణించేవారు. ప్రముఖంగా, ఉమ్మడిప్రాంతాలతోపాటు, బీహారు, మధ్యప్రాంతాల్లోని ప్రజలనాల్కలపై నిత్యస్మరణీయమంత్రంగా నెహ్రూ పేరే చెప్పుకునేవారు. సామాజికన్యాయంకోసం ఆరాటం, సమానతకై పోరాటం, నెహ్రూకున్న యువకభావాలు, చొరవ, భారతీయ ముసలమానులను, మహిళలను, యితరమతవాదులను కూడ సమానంగా ఆకర్షింపబడేవి. తనతండ్రి, గాంధిలతోపాటు, పెద్దనాయకులతోపాటు, తనని, తల్లిని బందీలనుచేయడంలాంటి విషయాల్లో, నెహ్రూ పాత్ర చాలా బాధ్యతాయుతంగా పరిణమించింది. హింసాత్మక సామూహిక ఉద్యమాల్లో చౌరిచౌరాలో 1922, ఫిబ్రవరి 4 న 22మంది పోలీసులు చంపబడ్డకారణంగా, గాంధి ఉద్యమానికి కొంత విరామం ప్రకటించడంపట్ల నెహ్రూతండ్రి మోతీలాల్ తోపాటు కొంతమంది కలసి కొత్తగా స్వరాజ్ పార్తీని స్థాపించినా కూడా, నెహ్రూమాత్రం బహిరంగంగా గాంధికి చేయూతనిచ్చాడు. ఈ పరిణామం, జాతీయోద్యమంలో కొంత ఊపు తగ్గడం, స్థానిక పరిపాలన, సాంఘికసమస్యలపై దౄష్టి మరల్చడంలో భాగంగా, నెహ్రూ 1924లో అలహాబాదు స్థానికసంస్థకు అధ్యక్షుడుగా ఎన్నికవడం, నగరముఖ్యపరిపాలకుడిగా రెండేళ్ళు వ్యవహరించాడు. యింట్లోని సమస్యలపోరున్న తరుణంలోకూడ, కమల నెహ్రూతోపాటు ప్రయాణాలు, సభల్లోపాల్గొని ఉపన్యసించడం, అమె స్వగ్రామంనుంచి కూడ జాతీయోద్యమంలో ప్రాతినిధ్యం వహించమని కోరడం జరిగేది. వివాహప్రారంభంలోని దాంపత్యముసలం, క్రమేపీ అన్యోన్యతను పెంచడం, ప్రియపుత్రిక యిందిరకు కూడ ప్రేమాభిమానాల్ని అందివ్వడం జరిగింది. 1926లో నెహ్రూ స్వయంకుటుంబం, కమల వైద్యం నిమిత్తం యూరోప్ తో పాటు, యింగ్లాండ్, స్విడ్జర్ లాండ్, ఫ్రాన్స్, జర్మని విదేశయాత్రలు చేస్తూ, అధికారదాహం, పదవీవ్యామోహం, నిరంకుశత్వం, గర్వం, దర్పం తోపాటు, అపాయాన్ని కలిగించగల సామ్రాజ్యవాదం పై వ్యతిరేకతను నిస్సంకోచంగా ప్రకటించడం జరిగింది. సోవియట్ Yఊనియన్ పర్యటనలో సైనికదళాధిపత్యపు ఆర్ధికవ్యవస్థపై నెహ్రూకి ప్రేరణ కలిగించినా, స్టాలిన్ పరిపాలన - నిరంకుశత్వ, నియంతౄత్వ, సంపూర్ణాధికారసహిత ఏకాధిపత్యవాదంపై మాత్రం తీవ్ర అసంతౄప్తి అవహించింది. యువ, స్థానికనాయకత్వం నుంచి పటేల్ ని ఢీకొన్న జాతీయనేత వరకు 1929లో అఖిలభారతీయ ట్రేడ్ యూనియన్లకాంగ్రెస్ కి అధ్యక్షుడుగా నెహ్రూ ఎన్నిక, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ లిద్దరు అతిప్రాముఖ్య యువనాయకులుగా రాజకీయస్వాతంత్ర్యమే భారతావనికి శఋరణ్యమని ప్రకటించారు. 1927లో బ్రుస్సెల్స్ లో నిరంకుశత్వానికి వ్యతిరేకంగా నెహ్రూకి లీగ్ సభ్యత్వంతోపాటు, 1928లో బ్రిటిష్ పరిపాలనలో భాగంగానే, భారతదేశానికి ప్రత్యేకగుర్తింపు యివ్వాలన్న నెహ్రూతండ్రే 'నెహ్రూనివేదికా అన్నదానికే నెహ్రూ వ్యతిరేకతావిమర్శలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. నెహ్రూ, బోసుల సమూల సంస్కరణవాదం, తీవ్రధోరణుల్లో, 1928లో జరిగిన గౌహతి కాంగ్రెసు సభల్లో తలెత్తాయి. తస్మాత్ జాగ్రత్త! అన్న ధోరణిలో సామూహిక ఉద్యమంవైపు పయనిస్తామని బ్రిటిష్ ప్రభాత్వానికి సవాళ్ళను విసరాలన్న వీరి ప్రతిపాదనలకు అనేక యువకుల హౄదయాలను ఆకట్టుకున్నాయి. ఈ విషయానికి గాంధిజీ ప్రతిపాదించిన రెండేళ్ళ గడువుకై వేచిచూడాలని, సంపూర్ణస్వాతంత్ర్యం రానిదశలో, సంపూర్ణ సమగ్రస్థాయిలో జాతీయోద్యమం చేపట్టాలన్న సలహాకు, నెహ్రూ,బోసులు పట్టుపట్టి, ఏడాది గడువుకు తగ్గించడం కూడ వీరి యువప్రతిభకు తార్కాణం. గడువులు ఎప్పుడోకాని గడప దాటవు, దాటాలని ప్రయత్నాలు జరిగినా, ఎన్నో శక్తులు అడ్డుకుంటాయి. విఫలమైన చర్చలు 1929 డిసెంబరు 29 లాహోర్ కాంగ్రెసు సమావేశానికి దారితీయడం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకశక్తులసంఘటనస్థలిగా మారడం, స్వతంత్ర్యప్రతిపాదనల్లో భాగంగా గాంధీ ప్రోత్సాహంతో, నెహ్రూని అధ్యక్షుడిగా సమావేశం ఎన్నుకోవడం జరిగింది. భారతదేశపు సామాన్యప్రజానీకం, అల్పసంఖ్యాకవర్గప్రజలు, మహిళలు, యువవాహిని, గాంధిపట్ల అత్యంతాకర్షితులైనాకూడా, తీసుకున్న నిర్ణయంపట్ల, నెహ్రూతోసహా, పలువురి కాంగ్రెసువాదులు, రాజకీయపరిశీలకులు, విశ్లేషకులు ఆశ్చర్యం ప్రకటించకపోలేదు. ఈ ఆశ్చర్యంలో భాగంగా, మరింతమంది, గాంధికాని, బర్దోలి సత్యాగ్రహనాయకుడు సర్దార్ వల్లభాయిపటేల్ కాని కాంగ్రేసు అధ్యక్షపదవిని చేపట్టి, సంపూర్ణస్వరాజ్యోద్యమానికి పున:ప్రారంభాంకితంచేస్తూ శుభారంభం చేయాలని పట్టుపట్టారు. యిక్కడే భారతీయ రాజకీయ చరిత్రలో అనూహ్యమైన మలుపు తిరిగింది. అనేకమంది కాంగ్రెసువాదులు, నెహ్రూని వరించిన అధ్యక్షపీఠం, అనుభవంలేని వ్యక్తి ఆధ్వర్యంలో అతిపెద్దభారతీయరాజకీయవ్యవస్థ పగ్గాలని నడిపించడం, ఆవిద్యలో రాణించడం కష్టతరమని భావించడంతోపాటు, నెహ్రూకూడ యిదేవరసపలకడం, స్వయంప్రతిభను విశ్లేషించుకోవడమో, రాజకీయ చతురతో అంతుపట్టలేదనేది పరమసత్యం. నెహ్రూ తన ప్రకటనలో 'నిర్ణయం ఆవేశం, కోపం రప్పించాయి; కాని సమావేశం అందించిన పదవి నిస్పౄహ కలిగించకపోయినా, ఈ బరువుబాధ్యతలకు తన ప్రవేశం ముఖ్యద్వారం ద్వారా జరగలేదని, కనీసం ప్రక్కద్వారం కూడ ప్రవేశం జరగలేదని, ఒక్కసారి హుటాహుటిని రంగంలోకి దూకి బోనులో ప్రవేశించి భయభ్రాంతులమూలాన ప్రజలను అంగీకరించేలా చేసినట్లు భావిస్తున్నానూ అని తత్కాలప్రకటన చేశారు నెహ్రూ. ప్రకటన ఏదైనా, గాంధీ ప్రోద్బలంతో, నెహ్రూ కాంగ్రెసు అధ్యక్షపీఠంలో ఆసీనులయ్యారు. కాని ఈ చతురతతోకూడిన చారిత్రాత్మక ఘటన ద్వారా బయటపడిన విషయం, నెహ్రూ, పటేల్ రెండు విభిన్న ధోరణులు, శక్తులు, ఉత్తర, దక్షిణ ధృరువాలని, ధౄవాలు ఎన్నడూ కలవవు అనికూడ నిరూపణ అయ్యింది. నాటినుంచి నేటికీ కొనసాగుతున్న విమర్శధోరణి వల్లభాయి పటేల్ కాంగ్రేసునాయకత్వానికి నెహ్రూ ససేమిరా వలదన్న నెహ్రూధోరణిని ఎంతోమంది విమర్శించారు. చరిత్రలో నిష్ణాతుల కధనం ప్రకారం, సలహాలను కాదని, ద్వితీయనాయకునిగా రాజీపడని నెహ్రూ, కాంగ్రేసు విభజన పై తనవంతు అపాయాన్ని ప్రకటించాడని పెద్దల ఉవాచ. ఉత్తరప్రదేశ్ రాష్ట్రకాంగ్రెసుసమితి వాదన ప్రకారం నెహ్రూ కన్న పటేలో ప్రతిభాశక్తులు మెండన్న భావాన్ని కేంద్రకాంగ్రేస్ సమితి అంగీకరించకపోవడం కూడ ఆశ్చర్యం. అంతేకాక, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, జె.ఆర్.డి.టాటా, మరియు ఆయన సమకాలీనప్రముఖులు, భారతదేశానికున్న సమస్యలను పరిష్కరించడంలో, నెహ్రూ కన్న పటేల్ సఫలీకౄతుడు, విజయుడు అయ్యేవాడని అభిప్రాయపడి, సలహామేరకు కూడ ఖాతరుచేయని పరిస్థితి ఆనాటిది. నెహ్రూ సోషలిజవాదం, అసమర్ధపరిపాలన, స్వచ్చందపారిశ్రామిక, ఉత్పత్తివిధానాల్లో లోపభూయిష్టవ్యవస్థ, బీదరికపుస్థితిగతుల్నించి పైకి తీసుకురాలేని దుర్గతి, అన్నింటికి సరిపడనికొద్దితనాలు, కనీసావసరాలతో జీవనానికి కూడ నోచుకోని గడ్డు పరిస్థితి నుంచి, పటేల్ బయటపడే ప్రణాళికలు, ఆచరణలు, కనీసజీవనానికి కావలసిన అవసరసదుపాయాలు, శక్తియుక్తులతో విజయం సాధించేవాడని నేటికీ అనేకమంది అంగీకరిస్తున్న వాదవేదంగా భావించబడుతోంది. చరిత్రకారులు, జాతీయహిందూవాదకులు, భారతీయముస్లిములను, లౌకికవిధానాలను తనదైన శైలిలోనే నిర్ధారించుకుని, సమర్ధించడం జరిగిందని వాదించారు. గోడమీదపిల్లివాటంలా విదేశీవిధానం, సోవియట్, యితర సోషలిజపురాజ్యాల పట్ల ఆపేక్ష వున్నందువల్లనే, కపటమిధ్యతో కూడిందని, భారతదేశభద్రతారక్షణలకొరకు కావలసిన కనీస సైన్యావసరాల్ని అంచనాకూడా వేయలేకపోవడం, యిరుగుపొరుగుశతౄదేశాలైన చైనా, పాకిస్తానులవల్ల పొంచివున్న ప్రమాదపు సూచనలనుగూడ పసిగట్టలేకపోవడం, నెహ్రూనాయకత్వం, అతని పరిపాలనావిధానం వల్ల సంతరించిన కష్టనిష్టూరాలని పలువురి ఖచ్చితాభిప్రాయం. అంతేకాకుండ, నెహ్రూ తన సుస్ఫష్టప్రతిభను కనబరిచిన విదేశాంగశాఖను నడిపిస్తూ, పటేల్ ను ప్రధానమంత్రిగా అంగీకరించిన పక్షంలో, భారతదేశంలో ఎదురవుతున్న 21వ శతాబ్దపు కష్టాలకడలితరంగాలు తాకిడి చేసేవుకావని, మరి పలువురి భావన అన్నది కూడ చరిత్ర ఘోషించింది. తనతోబాటు ఎర్రగులాబి - భార్య కమల సంకేతం జైలునుంచి విడుదలై, అనారోగ్యంతో మంచం పట్టిన భార్య కమలను చూడడానికి 1935 లో తిరిగి యూరోప్ పయనం, స్వాతంత్ర్యసమరదీక్షాకంకణం, భార్యకువైద్యసహాయం, అదేపనిగా ప్రయాణాలు చేయవలసిరావడం, చివరికి 1938 లో భార్యావియోగం అనివార్యమయింది. ఎడబాటుతనం క్షణంక్షణం వెంటాడుతున్నా, సహధర్మచారిణి అనుస్మరణసంకేతంగా, ఎర్రగులాబీపువ్వుని ప్రతినిత్యం తన చాతికి చేర్చుకోవడం ఆయన ఏరోజూ మరచిపోలేదు. అవినాభావ, జన్మజన్మలసంబంధమంటే అదే కాబోలు. జాతీయనాయకురాలుగా, కమల, నెహ్రూతోపాటు నేటివరకూ అవిభాజ్యంగానే గుర్తింపబడుతున్నారు. క్విట్ యిండియా రెండవ ప్రపంచయుద్ధం మూలాన పరిణామాలు, గాంధి, నెహ్రూ, పటేల్, బోస్, మౌలానా ఆజాద్, రాజగోపాలాచారి, మధ్య స్వాతంత్ర్యసాధనాప్రణాళికలు గుజ్జనగూళ్ళు ఆటలు ఆడాయి. పైకి ఐక్యతాచాయలు కనిపుస్తున్నాయి. చిట్టచివరికి, కాంగ్రెసునేతలందరు కలసి ముక్తకంఠంతో, తెల్లదొరలను భారతదేశనుంచి తరలిపోవాలని, 'క్విట్ యిండియా' నినాదాన్ని ప్రకటింఛారు. నెహ్రూ తన పర్యటనలో, తనతోపాటు, కాంగ్రెసుకమిటీని ఆగష్టు 9, 1942 న బంధించి, సర్వభద్రతలు కలిగిన, అహమ్మదునగర్ కోటలోని జైలులో పెట్టారు. నెహ్రూని తన సభ్యులతో, జూన్ 1945 వరకు కలవకుండ చేయడం ప్రత్యేకత. నెహ్రూ కుమార్తె యిందిరాగాంధి, ఆమె భర్త ఫిరోజ్ గాంధిని కొన్ని నెలలు జైలులో వుంచారు. ఈ సమయం లో, 1944 లో నెహ్రూకి మనవడు, రాజీవ్ గాంధి జన్మించాడు. మొదటిసారి నెహ్రూ తాతకి ఎదిగాడు. నెహ్రూ - పటేల్ మధ్య పోటీ-భేటీలతో ప్రప్రధమ ప్రధానమంత్రిత్వం - పంతం నెగ్గించుకున్న నెహ్రూ మొదటిసారి, తెల్లదొరల పరిపాలనాప్రభుత్వం, భారతదేశానికి అధికారం యివ్వాలని ఆలోచన చేయడంతో, బ్రిటిష్ కేబినెట్, నెహ్రూసైన్యాన్ని విడుదలచేయడం జరిగింది. కాంగ్రెసు అధ్యక్షపదవికై ఎన్నికలు, అధికారం ఎన్నిక కాబడిన వ్యక్తిని వరిస్తుందన్న నేపథ్యంలో రాజకీయపావులు కదలడం, 11 కాంగ్రెసు రాజ్యాల్లో పటేల్ కు పట్టం కట్టాగా, కేవలం కాంగ్రెసు పరిపాలనాసంఘం మాత్రం నెహ్రూని ఎన్నుకుంది. అప్పటికే పసికట్టిన నెహ్రూ రెండవసంఖ్యకు ససేమిరా అనడం, ప్రతిభతోసంబంధంలేకుండ, విస్తౄతస్థాయిప్రచారకుడుగా నెహ్రూకున్న స్థానాన్ని దౄష్టిలోపెట్టుకుని, గాంధి, పటేల్ ను పోటీనుంచి విరమించమని అభ్యర్ధించడం, దానికి పటేల్ వెంటనే అంగీకారం చెప్పడం, చరిత్రలో చతురకతలు, వ్యాకరణభాషలో కచటతపలు గా నిలచిపోయాయి. గాంధి నెహ్రూని సమర్ధించడం, పటేల్ ని వేరు చేయడం, గాంధి మహాత్ముడే కావచ్చు, రాజకీయానికి అతీతుడు మాత్రం కాదు అని కూడ పలువులు భావించిన ఘటన. నెహ్రూ ఎన్నికమాత్రం, కాంగ్రెసుపక్షంలోనే, అనేకమందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. నేటికాలంవరకు, యిది వివాద, వితండవాదంగా కొనసాగుతూనే వుంటుంది బహుశ. ముందుముందు కాలంలో కూడ, నెహ్రూకుటుంబం చురుకురాజకీయవౄత్తిలో వున్నంతకాలం, ఈ విషయవిశ్లేషణలు నడుస్తూనే వుంటాయి. తక్షణప్రభుత్వానికి నెహ్రూ నాయకత్వం వహించడం, మతాలమధ్య అల్లకల్లోలాలు, రాజకీయసంక్షోభం ముహమ్మద్ అలి జిన్నా నాయకత్వంలోని ముస్లిం లీగ్ వ్యతిరేకత, ముస్లిములకు ప్రత్యేకదేశం పై మంకుపట్టు, అనివార్యస్థితిలో, పాకిస్తాను ఏర్పాటవడం జరిగిపోయాయి. చివరికి తెల్లదొరలు తమ కుతంత్రాన్ని ప్రదర్శించారు. వారి ప్రతిపాదనని, అయిష్టంగా అంగీకరించవలసివచ్చింది. జూన్ 3, 1947 న వెలువ్వడ ప్రకటన ప్రకారం, ఆగష్టు 15, 1947 న నెహ్రూ భారతప్రధానిగా పదవీస్వీకారం, తన ప్రారంభోపన్యాసాన్నివ్వడం జరిగిపోయాయి. "విశ్వం యావత్తు తన నిద్రావస్థలో మునిగిపోవగా, భారతదేశం మేలుకొలుపుకి పూనుకుంది. జాగౄతీపధంలో, జీవితాన్ని, స్వాతంత్ర్యాన్ని అనుభవించడానికి ముందుకి ప్రస్థానం సాగిన తరుణం. అది ఒకే ఒక ఆడుగు. కాని చరిత్రలో ఎప్పుడో వేయవలసిన అడుగు. ప్రాచీనత నుంచి నవీనత వైపు అడుగు. ఒక దేశం, ప్రజలు, పరాయితనుంచి అనుభవించిన బనిసత్వపు సంకెళ్ళనుంచి విముక్తిపొంది, ఊపిరి తీస్తూ అడుగు, భావాన్ని ప్రకటించలేని భావన, భావుకత. చందోబంధం నుంచి విముక్తిచెంది, సర్వస్వతంత్ర వచన కవితలా విహారం చేసిన మనసు ప్రతీ పౌరుడిది. భారతదేశానికి సేవలనందించే, మానవసేవయే మాధవసేవయే అన్న భావనతో, ప్రతిజ్ణాపూర్వకంగా, ఆత్మసాక్షీభూతంగా, ప్రమాణసహితంగా, ముందుకు వేసే అడుగు, 'పదండి ముందుకు, పదండి ముందుకు ... హరోం హరోం హర హరా అన్న మహాకవి శ్రీశ్రీ భావంతో, ముందుకు వేసే అడుగు అని నిర్ధారణతో ముందుకు వేసిన అడుగు." నెహ్రూ - పటేల్ మధ్య ఆరని అగ్నిగుండం స్వాతంత్ర్యం తెచ్చిన సంతసంతో బాటు సంక్షోభం కూడ ఎదురైంది. మతకలహాలద్వారా మడతపేచీలు పంజాబు, డిల్లీ, బెంగాల్ లో ముఖ్యంగా ఎక్కువయ్యాయి. భారత-పాకీస్తాను ప్రతినిధుల ఉమ్మడియాత్రలు, మౌలానా ఆజాద్ తోపాటు, ముస్లిం సోదరులు భారతదేశంలోనే నివాసం కొనసాగించడానికి నెహ్రూ చర్యలు చేపట్టాడు. వాతావరణం నెహ్రూని చాలా యిబ్బందిపెట్టడం, రెండు దేశాలమధ్య యుద్ధం విరమింపచేయాలని ఐక్యరాజ్యసమితిని అర్ధించడం, భయాందోళనలు మరింత అధికమవుతాయని, హైదరాబాదు రాష్ట్రం కలుపుకునేందుకు సంసిద్ధతను ప్రకటించకపోవడం, కాష్మీరు సమస్య, పాకీస్తానుతో సంబంధాలపై పటేల్ తో వివాదం, కాష్మీరు విధానంపై తనపరిధిలోనే నిర్ణయం తీసుకున్న నెహ్రూ తనశాఖపై, శాఖాధికారులని సంప్రదించకుండ నిర్లక్ష్యధోరణిపట్ల వ్యవహరించిన తీరుపై పటేల్ బాహాటంగా ప్రకటన, మరింత వివాదానికి దారి తీసింది. రాష్ట్రాల సమైక్యతపై తననుకాని, కాంగ్రెసుతోకాని సంప్రదింపులు లేకుండ తీసుకున్న పటేల్ నిర్ణయాలపై, నెహ్రూకి అహం, అధికారం ఆవహించి, పటేల్ పై తీవ్రకోపం వచ్చిందని పలువురి భావన. తాను నిర్వహిస్తున్న విధులనుంచి విముక్తి చేయమని, పటేల్ గాంధిని అర్ధించిన సన్నివేశంలో, నెహ్రూకున్న చురుకుతనం, ప్రచారం తనకు లేవని, అభిప్రాయభేదాలు, వాటిప్రకటనలు, భారతదేశాన్ని గాయపరుస్తాయని, పటేల్ సాహసోపేతంగా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. గాంధి ఎంతో చాకచక్యంగా, వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని, ఎట్టకేలకు, పటేల్ కు అయిష్టం అని తెలిసినా కూడా, జనవరి 30, 1948 న ప్రభుత్వాన్ని వదలవద్దని పటేల్ ని అర్ధించడమే కాకుండా, నెహ్రూ ప్రభుత్వంలో కొనసాగమని, ఉమ్మడి నాయకత్వంలో సాగమని చెప్పడం జరిగింది. సర్వస్వతంత్ర భారతదేశానికి పటేల్, నెహ్రూ ల ఉమ్మడి నాయకత్వం, దురదౄష్టకరమైన అవసరమన్నది తన అభిప్రాయమని గాంధి ప్రకటించారు. యాదౄచ్చికంగా, గాంధి ఈ రోజునే, హత్యచేయబడ్డారు. గాంధి పిలుపు మేరకు, ఈ దుర్ఘటనను దౄష్టిలో పెట్టుకుని, నెహ్రూ-పటేలు లు గాఢాలింగనం చేసుకుని, జాతినుద్దేశించి ప్రసంగించారు. గాంధి హత్యకు, పటేల్ గౄహమంత్రిత్వశాఖ పనితీరులో లోపం అని గుసగుసలు రావడం, పటేల్ రాజీనామాకు పట్టుపట్టడం, నెహ్రూ నిరాకరణ, ఈ సందర్భంలో, మూడుదశాబ్దాలుగా స్వాతంత్ర్యసమరానికై కొనసాగుతున్న భాగస్వామ్యాన్ని నెహ్రూ గుర్తుచేయడం, ప్రత్యేకంగా గాంధి మరణాంతరం, మనస్పర్ధలు కూడవని నెహ్రూ చెప్పడం, దానికి పటేల్ చలించి, వ్యక్తిగతంగా, బహిరంగంగా, నెహ్రూ నాయకత్వానికి సమర్ధతను ప్రకటించాడు. భిన్నత్వంలో ఏకత్వం, భారతదేశపు సంస్కౄతీసంప్రదాయ ధోరణులకు పునాదులు నెహ్రూ-పటేల్ ల సన్నిహిత్వంతో పాటు సంగ్రామం కూడా అందుకున్నాయి. టిబెట్, గోవా వివాదాల్లో నెహ్రూ పటేల్ తో ఏకీభవించలేదు. దేశపు తొలి రాష్ట్రపతి ఎన్నికల్లో కూడ, రాజేంద్రప్రసాదు - రాజగోపాలాచారిల అభ్యర్ధుల వివాదం కారణంగా, జీవాత్రం కౄపలానీ కీ తన రాష్ట్రంలో ఒక్క ఓటు కూడ రాని పరిస్థితి వచ్చింది. నెహ్రూ చెప్పిందే వేదం, ఆ వాదమే కాంగ్రెసు మాట అన్న పరిస్థితి కాదని నెహ్రూ గుర్తించక తప్పలేదని పటేల్ భావించాడు. అయినా, నెహ్రూ కి కాంగ్రెసు లో బలం లేదని రాజీనామా చేయదలిస్తే, పటేలు మాత్రమే నెహ్రూని వద్దని వారించాడు. అది అందరు గ్రహించిన పటేల్ గొప్పదనం. నెహ్రూ మనస్సాక్షి అంగీకరించిన సత్యం. "సంస్కౄతికి మనం ఎటువంటి నిర్వచనాలు యిచ్చుకున్నా, అసలు సంస్కౄతిని వ్యక్తుల వరకో, సమూహాల వరకో లేదా దేశం సరిహద్దుల వరకో పరిమితం చేయడం మాత్రం - మనిషి చేస్తున్న ఎంతో పెద్ద పొరపాటూ అన్న నెహ్రూమాటనే యిక్కడ ప్రస్తావించక తప్పదు. కలసిమెలసి జీవించాడానికి బదులుగా చెయ్యగలిగింది - పరస్పర సంపూఋర్ణ నివాశమే అన్నట్లు, వీరిద్దరి మధ్యన ఒక చిన్నవినాశమే అంకురించింది. ఎన్నికలంటే, తరతమ భేదాలు లేకుండా ప్రజలందరికీ రాజకీయ పరిజ్ణానం పంచిపెట్టే విశ్వవిద్యాలయాలు అన్న నెహ్రూ సూక్తి ప్రజలకే సలహా కాని, ఆచరణకు కాదన్నది కూడ సత్యం. భారతదేశానికి నాయకుడు, నావికుడు, నెహ్రూ నే స్వాతంత్ర్యం, సంతోషాన్ని, సమరాన్ని తెచ్చినా, తరువాతి కాలంలో, నెహ్రూ తన ప్రియపుత్రిక యిందిర పై ఆధారపడడం, వ్యక్తిగతవిషయాలు ఆవిడ స్వయంగా చూసుకోవడం, నెహ్రూ తన జీవితంలో నిత్యవిషయాలువా మారాయి. 1950లో పటేల్ మరణం తర్వాత, నెహ్రూ మకుటంలేని మహారాజుగా గుర్తింపు తెచ్చుకున్నాడన్నది వాస్తవం. 1952 ఎన్నికల్లో, నెహ్రూకి అత్యధిక బలం, అల్లుడు ఫిరోజ్ గాంధి కూడ ఎన్నికవడం, నెహ్రూ అధికారనివాసంలోకి యిందిర మారడం, నెహ్రూఅధికారాన్ని, అల్లుడు విమర్శించడం, యిందిర అతణ్ణి కాదని తండ్రిని చేరడం, అన్ని జరిగిపోయాయి. నెహ్రూతోపాటు, అధికారికంగా చేదోడుగా సహాయం చేసినది మాత్రం యిందిర అన్నదాంట్లో సందేహం లేదు. ఈ సపర్యలే, యిందిరను ఎదురులేని నాయకురాలుగానే కాకుండా, దేశపు ప్రధానమంత్రిగా మార్చాయి. తండ్రితోపాటు, తనయేందిర కూడ, విశ్వయానం చేసి విఖ్యాతగా మారింది. తండ్రి పోలికలున్న పుత్రికను పితౄముఖి ధన్య అన్న నానుడిని సార్ధకం చేసుకుండి. నెహ్రూ ఆర్ధిక విధానాలు - పంచవర్షప్రణాళికలు నెహ్రూ తనదైన 'సోషలిజపు విజణ్ సమాజవాదాన్ని, భారతదేశానికి అనువుగా భావించి మలుచుకొని, భారతీయ ప్రణాళికావ్యవస్థని స్థాపించడం, మొదటి ప్రణాళికలో భాగంగా, 1951లో వ్యవసాయ, పరిశ్రమలరంగాల్లో ప్రభుత్వపెట్టుబడులతో, మనదైన ప్రణాళికకు అంకురార్పణ చేశాడు. భారీపరిశ్రమలు, వ్యవసాయగ్రామీణాభివౄద్ధి, సమాజాభివౄద్ధిపధకం, గ్రామీణ, కుటీర పరిశ్రమలు, బహుళార్ధసాధకప్రణాళికలు, యింధనోత్పత్తి, అణూత్పత్తి, నెహ్రూ విధానాల్లో తలమానికాలు అని చెప్పకతప్పదు. కాని, నెహ్రూ ప్రధానిమంత్రిగా వున్నంతకాలం, అభివౄద్ధితోపాటు ఆహారధాన్యాలకొరత, పారిశ్రామికవిధానం, రాష్ట్రప్రణాళికలు, ఉత్పత్తిని, నాణ్యతను, లాభాసాటితనాన్ని, కొంత కుంటుపడేలా చేసినా, ఆర్ధికవ్యవస్థలో మెరుగు కనిపించినా, జనాభాసమస్య, బీదరికపుసమస్యలను వెన్నంటినా, నెహ్రూ నాయకత్వానికి వచ్చిన ప్రతిభ, ప్రచారం ఏమాత్రం తగ్గలేదు అనే చెప్పాలి. నీరు, యింధనం, ఆరోగ్యం, రహదారులు, మౌలికసదుపాయాలు, గ్రామీణప్రజలకు, వారి అవసరాలకు అక్కరకు వచ్చాయి. రాజకీయంలో నీతి వేరు, రాజనీతి వేరు. అదే జరిగింది నెహ్రూ నాయకత్వంలో. ఫలితంగా, కొంతమంది మంత్రులపై అవినీతి ఆరోపణలు - కె.డి. మాలవ్య, ట్.టి. కౄష్ణమాచారిల రాజీనామాకు దారితీసింది. రాజకీయ, సాంఘిక విప్లవపంధా ప్రాధమికవిద్య భావిభారతదేశాభివౄద్ధికి అవశ్యమని భావించాడు. నేడు దేశమంతా నమూనాలు వెలసినవాటిల్లో - అఖిలభారతీయస్థాయిలో, వైద్యసంస్థ, సాంకేతికసంస్థ, పరిపాలానసంస్థల స్థాపనకు ఆద్యుడు, కారణభూతుడు. దేశస్థాయిలో అందరి పిల్లలకు ప్రాధమిక విద్యను ఖచ్చితంగాను, ఉచితంగాను, అందించేలా, ప్రణాళికల్లో ప్రస్తావన, పాఠశాలభవనాలనిర్మాణం, ఆహారసదుపాయాలు, వయోజనవిద్యాకేంద్రాలు, గ్రామీణప్రాంతాల్లో సదుపాయాలను కల్పించాడు. ముగింపుదశ 1957 ఎన్నికల్లో విజయం సాధించినా, నెహ్రూ ప్రభుత్వంపై సమస్యలు, విమర్శలు, అంత:కలహాలు, వెన్నుపోటులు, ముఠాకోరుతగాదాలు, విసిగివేసారి పోయాడు. ఆయన పుత్రికను కాంగ్రెసు అధ్యక్షురాలుగా 1959లో ఎన్నికవడం కూడ విమర్శరావడం, పేరురావడంతోపాటు, ప్రతిష్టకూడ దెబ్బతిన్నది. 1962 ఎన్నికల్లో నెహ్రూ విజయాన్ని, నిరాశను కూడ అనుభవించాడు. భారతీయ జనసంఘ్, స్వతంత్ర, కమ్యూనిష్టు పక్షాలకు గుర్తింపులు వచ్చాయి. విదేశాలు మనదేశభాగాల్ని ఆక్రమించడం, సైన్యపుసమస్యలవల్ల, రక్షణమంత్రిని తప్పించడం, అమెరికా సహాయాన్ని అర్ధించడం కూడ జరిగింది. యిన్ని చికాకుల మధ్య ఆరోగ్యం దెబ్బతినడం, 1963లో కాశ్మీరులో విశ్రాంతి తీసుకోవడం, 1964లో వెనక్కి రావడంతో, మే 27, 1964 ఉదయపు ఘడియల్లో, తీవ్ర అనారోగ్యంతోపాటు గుండెపోటురావడం, అంతిమశ్వాసను వదలడం జరిగింది. హిందూశాస్త్రవిధానాలతో, నెహ్రూ అంత్యక్రియలు, యమునాతీరపు శాంతివనంలో, వేలాది ప్రజల సమక్షంలో డిల్లీనగరం వీధులునిండగా, శ్మశానవాటిక నిండిపోవడం, నెహ్రూ వ్యక్తిత్వప్రతిభాపాటవానికి సంకేతం, తార్కాణం. నెహ్రూ పేరుతో ఎన్నో, మరెన్నో నెహ్రూ పేరు చెబితే, వెంటనే స్మరణకు వచ్చేవి, ఎర్రగులాబి, బాలలదినోత్సవం (నవంబరు 14 - నెహ్రూ పుట్టినరోజున), చాచా నెహ్రూ అన్న పిల్లలు పిలిచే ముద్దుపేరు, గాంధిటోపీ, జోధుపూరు కోటు, ఆయన వస్త్రధారణ, నడక, నడత, మాట తీరుతెన్నులు, ఆయన శైలి, ప్రత్యేకతలు, ఆయనవే. రిచర్డ్ అటెంబరో నిర్మించిన గాంధి చిత్రంలో నెహ్రూ పాత్ర (రోషన్ సేథ్)(1982), కేతన్ మెహతా - సర్దార్ లో నెహ్రూ (బెంజమిన్ జిలానీ), జమిల్ డెహ్లావి చిత్రం జిన్నా - నెహ్రూ పాత్ర (రాబఋర్ట్ అష్బీ), మరువలేని చిత్రవిచిత్రాలు. జవహర్ లాల్ పేరున, విశ్వవిద్యాలయం, ఓడరేవు, డిల్లీలోని నివాసం, స్మారకమందిరం, ప్రదర్శనశాల, కుటుంబనివాసాలైన ఆనందభవనం, స్వరాజ్యభవనం, నెహ్రూ మరియు ఆయన కుటుంబ సంస్మరణార్ధం కేటాయించడం, 1951లో నోబెల్ శాంతి పురస్కారం, అమెరికామిత్రసేవాసంఘం పురస్కారం, ది లాస్ట్ వైస్రాయి అన్న దూరదర్శన్ నాటకంలో, యియాన్ రిచర్డ్ సన్ ప్రతిభానటన, నెహ్రూ వ్యక్తిత్వ ప్రత్యేకతలకు నిదర్శనం. భారతీయరాజకీయప్రస్థానచరిత్ర నడుస్తున్నంతకాలం, నెహ్రూకుటుంబం దేశానికి చేసిన సేవాపరంపరలను మరచిపోవడం జరగనిపని. భారతదేశపరిపాలనావ్యవస్థలో చెరగని ముద్ర వేసిన ప్రధముల్లో, జవహరుడు ప్రప్రధముడు. జవహరుడు నిజంగా ఆణిముత్యం, వజ్రం, వైఢూర్యం. కలగలిపి జవహరుడు. జవహరునికి లాల్ సలాం. ఆయన జయంతి సందర్భంగా జవహరుడి ప్రతిభా పర్వాన్ని కించిత్తైనా సింహావలోకనం చేసుకోవడం భారతదేష పౌరునిగా ప్రతీ వ్యక్తి కనీస విధి, కర్తవ్యం. జవహరుని జయంతి సందర్భంగా తెలుగురథం ప్రణామాల్ని అర్పిస్తోంది. కొంపెల్ల - తెలుగురథం.