Monday, October 20, 2008

మేటి మాణిక్య వీణ - విద్వాన్ విశ్వం

’విద్వాన్ విశ్వం’ మేటి మాణిక్యవీణ

’రాయలసీమ మించుల సితారు, పచ్చల బజారు’. విద్వాన్ విశ్వం
’ప్రతీ కవికి స్వదేశాభిమానం ఉంటుంది; ఉండి తీరాలి. ’నా తెలంగాణా కోటి రత్నాల వీణ’ను స్మరించే తెలుగు వీణకు సర్కారు జిల్లాల సాహితి దండమైతే, రాయలసీమ-తెలంగాణా సాహితులను ఇటూ అటూ నాదాన్ని శ్రావ్యం చేసే కిన్నెరకాయలను చేసిన ఘనత దాశరధితోపాటు విశ్వం కే చెందుతుంది - ఆరుద్ర.
’విద్వాన్ విశ్వం వ్రాసిన కందపద్యం పాము మెలికలు తిరిగినట్లు సొగసుగా తిరుగును. అది సన్నని పామైనచో మిక్కిలి సుందరంగా ఉండును కదా!" - విశ్వనాధ సత్యనారాయణ.
నా హృదయం -
ఘనాఘనం - పిగులుతున్న మహానగంరగులుతున్న బడబాశిఖ - బుగులుగొన్న నాగుపడగప్రళయకాల ప్రభంజనం - మలయానిల ప్రకంపనం
ఆహా! ఏమి పదాల పొందిక, ప్రాస, అంత్యప్రాసలతో హోరు, జోరుగా సాగిన కవిత. ఈ కవిత సౌందర్యాన్ని కొలవడానికి, తూచడానికి కావలసినవి తూనికరాళ్ళు కావు; అనుభవించి, పలవరించగలిగే కవిహృదయం, రసానుభూతి.
’మాణిక్యవీణ’ అంటే ఏ సాహిత్యాభిమానికైనా వెంటనే కాళిదాసు స్మరణకు రాక తప్పదు. కాని, ఈ ’మాణిక్యవీణ’ మాత్రం ఒక ప్రముఖ తెలుగు వారపత్రికకు వారంవారం సంపాదకుని కలం నుంచి ధారావాహికంగా వెలువడిన మేధోపరమైన మధురోహఖండిక. ప్రతీవారం మాణిక్యవీణ, ఒక విజ్ణానసర్వస్వం, అనుభూతిపరంపర, పలవరింతలకవనఝరి. ఆ తెలుగు వారపత్రిక ’ఆంధ్రప్రభ’. ఆ సంపాదకునిపేరు ’విద్వాన్ విశ్వం’ గారు. ఆయన హృదయాన్ని దర్శనం చేసిన తీరు వర్ణనాతీతమనే చెప్పాలి. ఈ ఉపోద్ఘాతం చాలదా, విశ్వంగారు విద్వాంసులకు విద్వాన్ అని భావించేందుకు!
మీసరగండ వారి విద్వత్విశ్వం
౧౯౧౫, అక్టోబర్ ౨౧ న అనంతపురం జిల్లాలో తరిమెల గ్రామంలో జన్మించారు. తండ్రి మీసరగండ మునిరామాచార్యులు. ప్రజాహిత కార్యాలను నిర్వహిస్తూ సారస్వత సేవకులుగా ప్రసిద్ధిపొందినవారు. తండ్రి ప్రోత్సాహంతో చిన్ననాటనుంచే ప్రాచీనభాషను ఆధ్యయనం చేశారు. సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లభాషలు నేర్చారు. సంస్కృతాంధ్ర కావ్యాలు, వ్యాకరణం, తర్కం లో పట్టుసాధించారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి సంస్కృతాంధ్రాలలో విద్వాన్ చదువును పూర్తిచేశారు. కాశీ విశ్వవిద్యాలయంలో ఖండకావ్యాలపై పరిశోధన చేసేందుకు వలస వెళ్ళడం ఉద్దేశ్యం అయితే, ఆనాటి ప్రఖ్యాత నాయకులు - తరిమెల నాగిరెడ్డి, నీలం రాజశేఖరరెడ్డి సహాధ్యాయులు అవడం జరిగింది. పరిశోధన వెనకబడినా, మార్క్సిష్టు సాహిత్యరాజకీయాల్లో పరిచయసంబంధాలు కలగడమేకాక, యింటిముఖం పట్టేలా చేశాయి. అభ్యుదయ సాహిత్య ఉద్యమ చరిత్ర కాలంలో, బెనారస్ విశ్వవిద్యాలయంలో తెలుగు విద్యార్ధులు సామ్యవాదం పట్ల ఆకర్షితులయిన వారిలో విద్వాన్ విశ్వం ప్రముఖులు.
విశ్వం సద్యోగపర్వాలు
విశ్వం రచనలను ప్రారంభించడం, ఎన్నికల్లో తలమునకలై పనిచేయడం, జిల్లా కాంగ్రేసు కమిటీ, రైతుసంఘ కార్యదర్శకత్వంతోపాటు, రచనని, రాజకీయాన్ని జోడెద్దులస్వారీ చేశారు. ’నవ్యసాహిత్యమాల’ స్థాపన, ఫాసిజం-లెనిన్-స్టాలిన్ ల రాజకీయగ్రంధాలపై రచనలు, ’పాపం, సమీక్ష, రాతలు-గీతలు’ సాహిత్యరచనలు విశ్వం ప్రతిభకు దర్పణాలు. స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా జైలు, జైల్లో వ్రాయడం, చదవడం ద్వారా సమయాన్ని సద్వినియోగం చేశారు. ౧౯౩౩-౪౪ మధ్య పుష్కరకాలం విశ్వానికి రాజకీయసాహితీప్రపంచం చిరపరిచుతులయ్యారు.
విశ్వపత్రికాకారుడు
’మీజాన్’ పత్రికలో రచనావ్యాసాంగం, ’ప్రజాశక్తి’లో సంపాదకత్వం పాండితీభాషలోనే సులభశైలిని సాధించగలిగినా, పరిపాలనాయంత్రాంగపు నిర్బంధాలకు గురయారు. ౧౯౫౨ లో ఆనాటి ప్రముఖ తెలుగు వారపత్రిక ’ఆంధ్రప్రభ’ సంపాదకీయునిగా ’మాణిక్యవీణ’ను వారంవారం రసరమ్యధ్వనుల్ని మీటారు. ఆ తర్వాత, తిరుమల-తిరుపతి దేవస్థానం ప్రచురణ విభాగానికి ప్రధానసంపాదకునిగా కార్యభారాన్ని అత్యంత ప్రతిభావంతంగా నిర్వహించారు. కధాసరిత్సాగరం కధాలహరిని ౧౨ సంపుటాల్లో ఆంధ్రీకరణం చేశారు. విశ్వం తనకలంతో ప్రజాబలాన్ని అందుకున్నారు. విశ్వానికి ఒక సిద్ధాంతముందని, రచనలు కూడ సరసములు అని విశ్వనాధవారు విశ్లేషణ చేయగలిగారంటే, విశ్వం ప్రతిభ అమూల్యం అనే చెప్పాలి. ఈయన జీవితంలో సంఘసేవ, సాహిత్యారాధన మమైకమై పెనవేసుకున్నాయి.
విశ్వం కవితాప్రాభవం
విశ్వం తన కవిత్వాన్ని ’ఆత్మసాక్షి’గా ప్రాణం పోసి, కంచుకాగడావేసి దీపాలను చూపించారు. అంతేకాక, దీపాన్ని వెలిగించడానికి దీపం కావాలి; దీపాన్ని చూపించడానికి దీపం కావాలి అన్న సరసాత్మక వ్యగ్యం ఆయనది. ’వేయిరూకల మాణిక్యవీణ యేల, వెదురు చాలదె? పలికించు పదిలమున్న?’ అని వెదుళ్ళని, మాణిక్యవీణల్ని సరిసమంగా మీటగల ప్రతిభాసంపన్నులు. ’ప్రేమించాను’(నవల), ’పెన్నేటిపాట’, ’నాహృదయం’(కావ్యాలు) రచించారు. పెన్నేటిపాట లో రంగడు-గంగమ్మ నాయక నాయికలు మనను వెంటాడుతూనే వుంటారు. జనపదనివాసం చేస్తూ, నిప్పచ్చర మనుభవించే పామరుల జీవన నైర్మల్యాన్ని తెలిపే కావ్యం. మేఘదూతం, కాదంబరి, దశకుమార చరిత్రం లను అనువదించారు. వేదం వెంకటరాయశాస్త్రిగారి ’కధాసరిత్సాగరం’ సంపుటాలు మాతృమూలానురోధంగా తెనుగు నుడికారం చెడకుండా అనువదించి ప్రకటించారు. ప్రజాబాహుళ్యానికి ప్రాణం లేచివచ్చేలా చేసి, కధాసరిత్సాగర చరిత్రలో భాగమైంది.
తిరిగిరాని అనువాదం - మేఘసందేశం
విశ్వం కాళిదాసు చతుర ప్రబంధాలైన - కాదంబరి, కిరాతార్జునీయం, దశకుమారచరిత్ర, మేఘసందేశం కావ్యాలను అనువదించడమే కాక, స్నేహితులకు నాలుగు ప్రచురణలను ఒకేసారి చదవమని స్నేహితులకు అందించడం విశ్వం ప్రత్యేకత. మెఘసందేశం చదవడం మొదలెట్టి, యిక విశ్వం గురించి మరచిపోవడం జరిగింది. కాళిదాసు మేఘసందేశాన్ని తెలుగులోకి అనువాదం చేసిన ప్రతిభాకవుల జాబితాలో, ప్రముఖులు వడ్డాది సుబ్బారాయుడు(౧౪౮౮), వేదం వెంకటరాయశాస్త్రి(౧౯౨౭), చర్ల గణపతి శాస్త్రి(౧౯౩౮), చివుకుల అప్పయ్య శాస్త్రి(౧౯౫౦), రాయప్రోలు సుబ్బారావు(౧౯౫౭)లను ప్రస్తావించకుండ వుండలేని పరిస్థితి వున్నా, ఆఖరున అనువాదం చేసి, ఆ తర్వాత ఎవ్వరూ సాహసం చేయలేకపోయిన వైనం, మన విశ్వం అనువాదం ౧౯౬౨ లో జరిగింది. మందాక్రాంత పద్యాన్ని రెండు కంద పద్యాలుగా మార్చి అనువాదాన్ని రచించడం విశ్వంలో ప్రత్యేకత అంటారు ఆరుద్ర. విశ్వం తన అనువాద ప్రయత్నంలో మూలంలోని, శబ్దం, అభిప్రాయం, భావం, రసం, అలంకారంతోపాటు ఔచిత్యం-అనౌచిత్యం మధ్య సమతులనం పాటిస్తూ, తెలుగు జాతీయాలను, నానుడులను, పలుకుబళ్ళను, గుప్పించడం విశేషం.
’గుండెల కుంపటి మోసుకోవడం’, ’ఉంగరమే వడ్డాణమాయెరా’, ’జడివానల ఉరుములతో జడిపింపకు’, ’పుణ్యం కట్టుకోవడం’, విశ్వం అనువాదపాళీనుంచి వచ్చిన మచ్చుతునకలు ఎన్నో, మరెన్నో. పదప్రయోగ సొంపులేకాదు, ఒప్పులు కుప్పలుగా పోశారు. ఏమైనా, కాళిదాసు మేఘసందేశం కావ్యం ప్రసక్తి వచ్చిందంటే, మనకు మల్లినాధసూరి వెంటనే ప్రత్యక్షమయి, ’ఎక్కడి మబ్బుతునక, ఎక్కడి యక్షుడు, ఏమి సందేశం?’ ఆ యింతలో ఎంత మహాకావ్యం రచించావయ్యా, కాళిదాసూ!’ అని విశ్వం అనువాదం చదివాక మరీ అనిపిస్తుంది. ’అల్పుడను స్వామి, నేనింత రసానుభూతిని భరించలేను, నా పిచ్చిక గూళ్ళు నన్ను కట్టుకోనీ’ అని విశ్వం స్వర్ణవాచకాన్ని ప్రవచించారు. విశ్వం కందం, అందం, చందం, ముప్పేటలా, తన కవితాధారతో కలకండల పలుకుల్ని, తెలుగుపలుకుబడుల్ని కలగలిపి బంగారు పిచ్చికగూళ్ళుగా ’విశ్వం’ కవనపువాకిళ్ళుగా నేటికీ కదం తొక్కుతున్నాయి. సాహితీవీధుల్లో రసవిహారం చేస్తూనేవున్నాయి.
పెన్నేటి పాట - రాయలసీమ సహజ జీవనేతివృత్తం
రతనాలసీమగా పేరుపొందిన రాయలసీమ కన్నీటిపాట గా రూపొందిన అద్భుత రచన. ’కోటిగొంతుల కిన్నెర మీటుకొనుచు, కోటి గుండెల క్ంజరి కొట్టుకొనుచు’ విశ్వం తన గీతాన్ని ఆలపించారు. ౫౦ ఏళ్ళు నిండిన ఈ కధనకావ్యం రాయలసీమ స్థితిగతులకు నిత్యదర్పణం అనిపించడం దీని ప్రత్యేకత. అంటే ఎప్పుడూ వర్తమానత్వంలోనే సంచరిస్తూ వుంటుంది. స్వఛ్ఛంద ఛందోకధనంతో నడిచే ఈ రచన పెన్నేటి గట్టున జీవనం చేసే పల్లెల బ్రతుకునీడ కనిపిస్తుండి. పలుకుబడులు, నుడులు, నానుడులు, ఊళ్ళపేర్లు అడుగడుగునా గోచరిస్తాయి. రైతు కుటుంబంనుంచి వచ్చినవాడు రంగడు. ’పెగ్గిలు’ బ్రతుకులో కొడుకుకు మిగిలిన ఆస్తిపాస్తులు యావత్తూ శరీరమే. యిల్లాలు గంగమ్మ నిత్యం అడవికి పోయి కట్టె, గడ్డి పోగుచేసుకుని, అమ్ముక్నే కూలిపని రంగనిది. యిరుగుపొరుగులో దంపులు చేసుకుని నూకలు, తవుడు తెచ్చుకునే పని గంగమ్మది. దుర్భర దారిద్ర్యం నడుమ గంగమ్మదాల్చిన గర్భం. ఫలితంగా భవిష్యతు అగమ్యగోచరం. ఆవేదనతో, ’దైవమా, ఉంటివా? చచ్చినావ నీవు? ధర్మమా, గెంటిరా? నిన్ను ధరణి నుంచి? అని విశ్వంగారి ద్వారా భగవంతుడిని, ధర్మాన్ని ప్రశ్నిస్తారు.
విశ్వం విద్వత్ రచనకు మచ్చుతునక - రంగడు-గంగమ్మ ఖండిక
రంగన్నగంగమ్మ రంగురక్తిమలురంగన్నగంగమ్మ నింగినీలిమలురంగన్న గంగమ్మ సింగారములు జిమ్మురంగారు బంగారు పొంగారు గోపురాల్.
చూపులేగాని మాటల జోలిబోకవలపులేగాని వాంఛలవంక బోకపనిత్వరలెగాని సరసాల పాలుగాకగబగబా ముగియించి రంగన్నె వెడలె.
నా హృదయం
విశ్వం మరో అద్భుతం - నా హృదయం
పగులుతున్న ఘనాఘనం - పిగులుతున్న మహానగంరగులుతున్న బడబాశిఖ - బుగులుగొన్న నాగుపడగప్రళయకాల ప్రభంజనం - మలయానిల ప్రకంపనం
వలపెరుగని వాజమ్మల తలపుల తలపులను జీల్చికలకాలం గొడ్డుబోతు వలకాకల చిక్కి చివికిజలధారా సేచనలో చలువగ్రమ్మి చావక్కున్నతీయని చలి మాయనీక కాయవాటు వయసునిచ్చి
ఇరుప్రక్కల విరులు విరిసి తరువు లతల బరువు మెరిసిజర జర జర వరతెంచే సెలయేటికి జీవమిచ్చికలనాదం పలికించే వలపుల వెదజల్లించేచలువ జలద పంక్తిలోని నిలువ నీటి తెరల చాయ - నా హృదయం.
మొండి చెట్టు ఖండించగ మోసులెత్తి ఒకే ఒక్కముడిపై గుడిగా నిల్చిన మొగ్గలోని కింజల్కం - నా హృదయం.
లోన లోన కుళ్ళి కుళ్ళి బోనానికి పనికి రాకకోనగుమ్మడిని క్రుచ్చిన కోడి కత్తిబోడి కొమ్మ బొమ్మ జెముడు కాడలపై గడుసు వారివాడి యెక్కి వంగియున్న కాడు కూళ్ళ కంకాళం - నా హృదయం.
సూక్షంలో మోక్షం, అల్పం లో అనల్పం అంటే పై కవితను ఉదాహరించవచ్చు. ఛందస్సు ఉంటేమాత్రం వచ్చే యిబ్బంది ఏమిటంట? అందుకే విశ్వనాధ వారు ఛందోబద్ధత లేని కవిత్వం, అంగాలు లేని శరీరం - భావాలు రావడం వేరు, కేవలం ప్రకటనే కాదు, సరియైన మూసలో పోస్తేనే భావానికి సార్ధకత, సార్ధకత లేనిది కవిత్వం కాదు అని అంటారు.
ఆనందోద్యాన వీధిలో అలనల్లన పరతెంచే మలయానిల కలగానం - విద్వాన్ విశ్వం కలంగానం, కవితాగానం.
విద్వాన్ విశ్వం జయంతి సందర్భంగా తెలుగురధం కవితానీరాజనాల్ని వినమ్రంగా సమర్పించుకుంటోంది.

No comments: