Saturday, August 23, 2008

శ్రీకృష్ణం వందే జగద్గురుం - అష్టమి జయంతి

శ్రీకౄష్ణం వందే జగద్గురుం - నేడే శ్రీకౄష్ణాష్టమి, శ్రీకౄష్ణజయంతి
మనసంస్కౄతీసంపదలకు నాయకమణులు
అనాదిసిద్ధమై, అఖిలదేశాలకు ఆదర్శవంతమై, అయుత్తమ సంస్కౄతికి ఆధారభూతములై, మానవులను మాధవులుగా మార్చగలిగే మహత్తర సక్తి సంపన్నములై మహోత్తమ, మహాగంభీర, మహాభక్తి భరితములైన కావ్యాలు మన రామాయణ, భారత, భాగవత గ్రంధరాజాలు. ప్రపంచ సభ్య దేశాలలో జన్మించిన సహౄదయులు, పక్షపాతరహితులు, లోతుగా విమర్శించి యింతటి మహోత్తమ సంస్కౄతీవైభవం జగత్తులో కానరాదని పలువిధాల ప్రశంసించారు. ఈ పరంపరకు నాయకమణులై తమ వ్యక్తిత్వంలో దైవత్వాన్ని ప్రదర్శించి ధర్మాచరణమూర్తిగా ఒకరు, ధర్మప్రచారక చక్రవర్తిగా ఒకరు, ప్రసిద్ధిపొందిన భగవదవతారములు శ్రీరామ - శ్రీకౄష్ణులు.
ఏకశాస్త్రం దేవకీ పుత్రగీతం, ఏకోదేవ: దేవకీపుత్రఏవ ఏకోమంత్ర: తస్యనానామాని యాని, కర్మాష్యేకం తస్య దేవస్య సేవా
తానిచ్చిన వాగ్దానం ప్రకారం దేవకీ పుత్రుడుగా అవతరించిన "శ్రీకౄష్ణపరమాత్మా ఒక్కడే సౄష్టికి మూలకారకుడైన దేవుడు అతని నోటి నుండి దివ్యవాణిగా వెలువడిన గీతాశాస్త్రమొక్కటే పరిశుద్ధగ్రంధం. అతని అనంత నామాలే జపించ వలసిన దివ్యమంత్రం. ఆదేవుని సేవించుటే కర్తవ్యకర్మ. చెయ్యండి! కౄష్ణ భజన చెయ్యండి. కౄష్ణం వందే జగద్గురుం అని చాటండి.
సంపూర్ణావతారమూర్తి - శ్రీకౄష్ణుడురామకౄష్ణావతరములు మహావిష్ణువు సంపూర్ణావతారములుగా భావింపబడుచున్నవి. శ్రీకౄష్ణావతారం దశావతారాల్లో ఎనిమిదవది. కౄష్ణచరితం హరివంశ భాగవత విష్ణుపురాణాల్లో విపులంగా ప్రస్తావించబడ్డాయి. ఆబాలగోపాలానికి తెలిసిన విషయమే కదా. ఈ శ్రీకౄష్ణమూర్తిని లోకోత్తరసుందరమూర్తిగఆ, మహాబలపరాక్రమశాలిగా, రాజనీతినిపుణునిగా, తత్త్వవేత్తగానూ అధికంగా వర్ణించబడ్డాడు.
'శ్రీకౄష్ణా నామధేయ ప్రాశస్త్యంశ్రీమద్భాగవతంలో శ్రీకౄష్ణుడిని - 'వాసుదేవ, కౄష్ణ, వరద, స్వతంత్ర, విజ్ణానమయ, మహాత్మ, సర్వపుణ్యపురుష, నిఖిల బీజభూతాత్మక బ్రహ్మ, నీకు వదనంబు నిష్కళంకా అంటాడు. శ్రీకౄష్ణుడిని ఎక్కువగా, వాసు(వసుదేవుడు), గోపాలుడు గా సుప్రసిద్ధం.
1. వాసుదేవుడు :- వసతీతి వసు: అని, వసురేవ వాసు: అని, దీవ్యతీతి దేవ: అని, వాసుశ్చ అసౌ దేవశ్చ వాసుదేవ - ఈ దేవుడు వాసు అనగా ప్రపంచమంతటా నిండియుండువాడు మరియు దేవ - అంటే ప్రకాశించువాడు - కావున 'వాసుదేవుడయ్యాడు. అందుకే వాసనాద్ వాసుదేవస్య వాసితంతే జగత్రయం - సర్వభూత నివాసోసి శ్రీవాసుదేవ నమోస్తుతే, అని సర్వలోకాలలోను, సర్వప్రాణులలోను, నివసించు ఆత్మ భగవంతుడు.
2. గోపాలుడు :- గోపాలుడు ప్రదర్శించిన అద్భుత కౄత్యాల్లో అఘాసురుని చంపడం ఒకటి. ఆ విషయానికి బ్రహ్మదేవుడు పరమాశ్చర్యభరితుడయ్యాడుట. చూడగా ఈతడు బాలుడే! దారుణ కర్ముడైన ఆఘాసురుని చంపి గోవుల్ని, గోపకుల్ని రక్షించాడే! ఆహా! ఇది ఎంత ఆశ్చర్యం! అని ఆలోచింది ఆ బ్రహ్మదేవుడు భూలోకానికి వచ్చాడు. ఆ మాయాబాలుని గొప్పదైన బలాన్ని పరీక్షించాలనుకొని గోపకుల్ని - గోవుల్ని తీసికొనిపోయి రహస్యంగా దాచివాశాడు. ఈ బాలుడు సామాన్య బాలుడు కాడు. మాయాబాలుడు. అనగా, మాయతో బాలునివలె ఉన్నాడేకాని, మానవబాలుడు కాడు - సంభవామి ఆత్మమాయయా - అని గీత లో నామాయ ఆధారంగా చేసికొని అవతరిస్తూ ఉంటానని భగవానుడు చెప్పనే చెప్పాడుకదా. యిక మనందరి - కౄష్ణుడు - అంటే
కౄష్ణ - కర్షతీతి కౄష్ణ: భక్తులను తనవైపుకు ఆకర్షించుకొనువాడు - కావున కౄష్ణుడన్నారు. సర్వం కరోతీతి కౄష్ణ: - సర్వాన్ని చేయువాడు కనుక కౄష్ణుడయ్యాడు. దైత్యాన్ కఋర్షయతీతి కౄష్ణ: - రాక్షసుల్ని నశింపచేయువాడు కనుక కౄష్ణుడన్నారు. కర్షతి చిత్తమితి కౄష్ణ: - భక్తుల మనస్సును ఆకర్షించువాడు కనుక కౄష్ణుడయ్యాడు. కర్షతి యోగినాం మానాంసీతి కౄష్ణ: - యోగీశ్వరుల మనస్సులను ఆకర్షించువాడు కనుక కౄష్ణుడు. మనం భగవంతుడైన శ్రీకౄష్ణభగవానుడుని సర్వసాధారణంగా పిలుచుకునే కౄష్ణుడు, కన్నడు, కన్నయ్య అని ఆప్యాయంగా పిలుచుకునే పేర్ల వెనుక ఉన్న కధ, కమామీషు యింత వుంది.
'కౄష్ణా పద వివరణకౄష్ణ అనే పదంలో క-ౠ-ష-ణ అని నాలుగు అక్షరాలున్నాయి. ఒక్కొక్క అక్షరంలోని రహస్యార్ధాలు - 'అక్షరమాలికా ఉపనిషత్తూ లో వివరించిన తీరు యిలా వుంది.
క - ఓం కంకార సర్వవిషహర కళ్యాణద సప్తదశే అక్షే ప్రతితిష్ఠ - క అనే అక్షరం సర్వవిషాలను; అనగా దోషాలను హరిస్తుంది, శుభాలు కలిగిస్తుంది.ౠ - ఓం ౠకార సంక్షోభకర చంచల సప్తమే అక్షే ప్రతి తిష్ఠ - ౠ కారం అంతశ్శతృరువులను క్షోభింప చేస్తుంది. అంతశ్శత్రువులంటే - కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు - చంచలమైనవి.ష - ఓం షంకార ధర్మార్ధ కామచ ధవళ సప్త చత్వా రింశే అక్షే ప్రతి తిష్ఠ - ష కారం - ధర్మ, అర్ధ, కామ, మోక్షాలు - అనే నాలుగు పురుషార్ధాలను (ఫలితాలను) కలిగిస్తుంది. తెలుగురంగును; అనగా సత్వగుణాన్ని పెంపొందిస్తుంది.ణ - ఓం ణంకార సర్వసిద్ధిప్రద మోహకర ఏకత్రింశే అక్షే ప్రతి తిష్ఠ - ణ కారం సర్వసిద్ధులను కలిగిస్తుంది - మోహనకరమై వుంటుంది.
ఇదీ కౄష్ణనామం యొక్క ప్రభావం.
జగద్ధితాయ కౄష్ణాయ గోవిందాయ నమోనమ: అంటే లోకానికంతకు హితవును కూర్చే శ్రీకౄష్ణునకు పదేపదే నమస్కారం చెప్పవలసిన పుణ్యతిధి.
శ్రీకౄష్ణ జన్మ రహస్యంమన హైందవేతిహాస సాహిత్యం శ్రీకౄష్ణ జన్మ సార్ధక, రహస్య, ప్రభావాల్ని ఎన్నోవిధాలుగా వివరించారు. దశావతారాల్లో ప్రముఖావతారంగా శ్రీకౄష్ణావతారాన్ని విశ్లేషీకరించారు. కొన్ని ప్రముఖోదంతాలు యివి:
కౄష్ణచరితం కలి కల్మషఘ్నం - కౄష్ణుని చరిత్ర విన్నవారికి కలిలోని సమస్త పాపాలు పోతాయని, దేహం మానుష మాశ్రిత్య - పరమాత్మ మనుష్య దేహం ధరించాడని భాగవతంలో వివరించబడింది. వసుదేవ గౄహే సాక్షాత్ భగవాన్ పురుష: పర: జనిష్యతే - భగవంతుడైన పరమపురుషుడు వసుదేవుని యింట పుడతాడు అని, తన్ను చంపుటకై దేవకీ గర్భంలో విష్ణువే జన్మించాడని కంసుడు విన్నాడుట. సమస్త జగత్తులకు ఆశ్రయభూతుడైన ఆ భగవంతునకు దేవకి ఆశ్రయమయ్యింది. కౄష్ణుడు అవతరించుటము ముందు - బ్రహ్మ, నారదాది ౠషులు, ఇంద్రాది దేవతలు, సదాశివుని వెంట బెట్టుకొని దేవకీదేవి ఉన్న కారాగారంలో ప్రవేశించి శ్రీహరిని - నీవి సత్య సంకల్పుడవు; సత్యమే నీ ప్రాప్తికి ప్రధానసాధనం; నీవు త్రికాలలోను సత్యంగా ఉండువాడవు; సత్యానికే నీవు సత్యం; ౠత-సత్యాలు నీకు నేత్రాలు; ఓ సత్యస్వరూపా! మేము నిన్ను శరణు వేడుకొంటున్నాము అని ప్రార్ధించారట.
శ్రీకౄష్ణుని జన్మసమయంలో విశేషాలుయింక జన్మించునప్పుడు - ఆకాశంలో దేవదుందుభులు మ్రోగాయి; కిన్నరులు, గంధర్వులు, గానం చేశారు. సిద్ధులు - చారణులు స్తోత్రం చేశారు. అప్సరసలు - విద్యాధరులు నౄత్యం చేశారు. ౠషులు - దేవతలు పుష్పవౄష్టి కురిపించారు. అట్టి స్థితిలో - తూర్పు దిక్కున పూర్ణచంద్రుడుదయించినట్లు - జనన రహితుడైన భగవంతుడు అనుటచేత చంద్రునకు ఆకాశమునకు సంబంధములేనట్లు కౄష్ణునకు దేవకికి సంబంధము లేకయే , దేవతా స్వరూపిణియైన దేవకీగర్భం నుండి సర్వాంతర్యామియైన శ్రీహరి ఉదయించాడుట. అంటే యోని నుండి నిర్గతుడు కాలేదు - 'అవిరాసీట్ అనగా ఎదురుగా ఆవిర్భవించాడన్నమాట. అంతవరకు దేవకీగర్భంలో వున్నది తేజోరూపమైన శిశువే! - అచ్చంగా శ్రీరాముడావిర్భవించినట్లే యోని సంభూతుడైన శిశువు కానేకాదుట. దానికి కారణాలు యిలా చెప్పారు.
తమద్భుతం బాలక మంబు జేక్షణం, చతుర్భుజం శంఖగదాది ఉదాయుధం, శ్రీవత్సలక్ష్మం పరిశోభికౌస్తుభం, పీతాంబరం సాంద్రపయోద సౌభగం - అని, కమలాలవంటి నేత్రాలు, శంఖ చక్ర గదా పద్మాలతో ప్రకాశించు నాలుగు భుజాలు - శ్రీవత్సమనెడి పుట్టుమచ్చలు గల విశాలవక్షం - కౌస్తుభ మాణిక్యం గల కంఠం - తొలకరి మేఘకాంతితో సమానమైన దేహకాంతి - పీతాంబరం ధరించిన శ్యామసుందరమూర్తియైన అధ్బుతమైన బాలుని చూచాడు వసుదేవుడు. చక్కని ముంగురులు - అమూల్య రత్న కిరీటం - రత్న ఖచిత మీఖల - మకర కుండలాలు - అంగద నూపుర కేయూరాది భూషణ భూషితుడైన శ్రీహరి ఆ సమయంలో పురుష రూపంలో అవతరించడం వాసుదేవునికి కన్నులపండుగ అయింది. ఆ ఆనందంలో - వాసుదేవుడు, శ్రీహరీ! పరమపురుషా! నీవు ప్రకౄతి కంటే పరుడవు - అనె నేను గ్రహించాను. నీవు విశుద్ధజ్ణానానంద స్వరూపుడవు,సమస్త బుద్ధులకు సాక్షివి అని స్తోత్రం చేశాడుట. అంతేకాక, స్వరోచిషా భారత సూతికాగౄహం అని తనతేజంతో పురిటిల్లంతా జాజ్వల్యమానంగా వెలిగించేస్తున్నాడు ఆ మూర్తి అనుకుంటూ దేవకి చూసి, ఓ విశ్వాత్ముడా! చతుర్భుజాలయందు శంఖచక్రగదాపద్మాలను ధరించి శోభించు నీ అలౌకిక రూపాన్ని తగ్గించు; మరుగు పరచు; అనగా సామాన్య బాలునివలె దర్శనమియ్యి - అని దేవకీదేవి స్తోత్రం చేసి పలికిన మాటలకు పరమాత్మ ప్రసన్నుడై - పూర్వజన్మ విషయాలెన్నో అద్భుతంగా చెప్పినాడుట. ఆ తర్వాత, భగవానాత్మ మాయయా - ఆ భగవంతుడు తన మాయా (మహిమా) ప్రభావంతో - సద్యో బ భూవ ప్రాతౄతశ్శిశు: అని తక్షణమే సామాన్య బాలుడై పోయాడట.
శ్రీకౄష్ణజయంతి - శ్రీకౄష్ణాష్టమిశ్రీకౄష్ణుడు శ్రావణ బహుళ అష్టమినాడు జన్మదినోత్సవం జరుపుకోవడం సంప్రదాయం. అష్టమినాడు, రోహిణి నక్షత్రమున రాత్రి ఉద్భవించాడు. కల్యబ్దములు యిరువది ఎనిమిదవ సంవత్సరాన భాద్రపద బహుళ అష్టమిన కౄష్ణుడు జన్మించాడని కూడ కధనాలు వున్నాయి. భాద్రపదమాసమనగా, ఇప్పటి శ్రావణ బహుళ పక్షాన వచ్చే అష్టమి, రోహిణీనక్షత్రపు రోజున జయంతి యని వాడుక వచ్చినట్లు చెపుతారు. జయంతి - ప్రతి మహాపురుషుని జన్మదినానికి వ్యవహారంగా వచ్చింది. జయంతి రాత్రివాచకంకాగా, కొందరు తిధికి,మరికొందరు నక్షత్రానికి ప్రాధాన్యమిచ్చుటవలన, కొంత ముందు వెనుకలున్నాయని, ప్రముఖ సాహితీవేత్త తిరుమల రామచంద్రగారి అభిప్రాయం. రోహిణీయుత అష్టమి శ్రావణ భాద్రపద మాసాల్లో వస్తుందని, భాద్రపదమాసంలో తప్పక వస్తుందని కూడ అభిప్రాయాలున్నాయి. మొట్టమొదటగా కౄష్ణాష్టమి కేవలం జ్యోతిశ్శాస్త్రజ్ణులు నిర్ణయించగా, సకలాభీష్టమైన జయంతి రాత్రిగానే పరిగణించడం జరిగింది, తర్వాత క్రమేపీ, కౄష్ణజన్మకధనానికి ప్రాధాన్యత సంతరించుకున్నదని చెప్పడం జరిగింది.
కౄష్ణ జయంతి-అష్టమి పండుగ విశేషాలుపవిత్రోత్సవంగా, పండుగగా, సంబరాలను జరుపుకోవడం మాత్రం సదాచారంగా వస్తుంది. సాయంకాలాన కౄష్ణుణ్ణి ఊరేగించడం, ఊయలకట్టి ఆడించుట, దేవకి మంచముపై వొరిగి కౄష్ణునికి పాలిచ్చుచున్నట్లు విగ్రహాల్ని అలంకరించి పూజించడం, శ్రీకౄష్ణబాల్యాల వ్రేపల్లెలో పెరగడం, దుందుడుకు చేష్టలను ప్రతిబింబిస్తూ, వీధుల్లో ఉట్లు పెట్టడం, మరునాడు వాటిని కొట్టడంలాంటి వినోదాలు అనేకాలు. ఈ రోజున ఉపవాసం చేసిన సకలపాపాలు తొలగుతాయని, ధర్మార్ధకామమోక్ష ప్రాప్తి, మహాజయం కలుగుతాయని, స్కాందపురాణంలో చెప్పినట్లు తెలుస్తూంది. ఈ రోజున పూజలను సలుపనివారు మహాపాపాన్ని పొందడం, యమపాశాల్లో చిక్కుకుంటారని, మరుజన్మలో పాములై పుడతారని, కౄరరాక్షసులుగాకూడ అవతరిస్తారని ఘోషిస్తోందని పండితులు అభిప్రాయపడ్డారు. ఈ అష్టమినాడు, చంద్రునికి అర్ఘమివ్వాలని, బంగారం లేక వెండితో పన్నెండంగుళాల చంద్రబింబాన్ని తయారుచేసుకుని, వెండి, బంగారు పాత్రలలో వుంచి, పూజించి, అర్ఘ్యమివ్వాలని, తత్ఫలితంగా సర్వకామాల్ని పొందడం జరుగుతుందని కూడ పురాణప్రసక్తులున్నాయి. ముందుగా అర్ఘమివ్వాలని, ఆ తర్వాతే కౄష్ణునికి పూజచేయాలన్నది కూడ ఒక సంప్రదాయం. ఈ చంద్రునికిచ్చే అర్ఘ్య సంప్రదాయాన్ని బట్టి, మొదటగా జయంతిగానే పరిగణించారని అనిపిస్తోందని పెద్దల అభిప్రాయం.
శ్రీకౄష్ణ జీవనప్రస్థానంశ్రీకౄష్ణుడు యుద్ధ తంత్రజ్ణతకు, రాజనీతిజ్ణతకు, స్పష్టవాక్కుకు ఉదాహరణ. కౄష్ణుడు పూర్ణాయుస్సుతో, అంటే 116 - 125 ఏండ్లు జీవించాడని హరివంశ, విష్ణుపురాణ, భాగవతాదులు తెలిపాయని కూడ చెపుతారు. మౄత్యువు ఎదిరించి పెక్కేండ్లు జీవించుటకు పురుషయజ్ణం చేయాలని, అట్లు చేసినవ్యక్తి మరొక జిజ్ణాసకు పోడని, మౄత్యువును అదలించగలడని, పురుషయజ్ణంగా - నే ననునది అనశ్వరము, అమరము అని గ్రహించుటయే అని వివరించడం జరిగింది. ఈ యజ్ణానికి తపస్సు, దానం, ఆర్జవం, అహింస, సత్యం, దక్షిణలుగాను, ఈ గుణాలన్నీ యున్నవాడే దీర్ఘజీవి అవుతాడని కూడ ఒక అభిప్రాయంగా చెపుతారు. అంగీరస వంశస్థుడు ౠషి ఘోరుడు కౄష్ణునికి ఉపదేశించినట్లుగా చెప్పబడుతోంది. కౄష్ణచరిత్ర పరమపవిత్రమని, వేదాల్లో కౄష్ణ, అర్జున, రాధ, లాంటి మాటలకు అర్ధాలను వేరుగా చెప్పడం జరిగిందని, కేవలం శబ్దసామ్యంతో వాటిని పౌరాణికులు తర్వాత అన్యవిషయాలతో జోడించి కధారూపాన రచించడం జరిగిందని, తత్ఫలితంగా వాదోపవాదాలు, చిక్కులు, యిబ్బందులు కలిగించారని చాలామంది పండితులు వివరిచడం కూడ జరిగింది.
శ్రీకౄష్ణచరితంలో ముఖ్యాంశాలుశ్రీకౄష్ణజననంతో పాటు, పూతనాసంహారం, శకటభంజనం, తౄణావర్తవధ, శ్రీకౄష్ణలీలలు, మౄద్భక్షణ - విశ్వరూపం, ఉలూఖల బంధనం, గోపాల-గో-వత్సములు తానే యగుట, కాళీయమర్దనం, దావదహనం, గోవర్ధనపర్వతమెత్తుట, నందుని వరుణ నగరం నుండి తేవడం, రాస, జల క్రీడలు, సుదర్శన శాపవిమోచనం, అకౄరునికి శ్రీకౄష్ణ దివ్యదర్శనం, కుబ్జ కూరూపం తొలగించడం, కంసవధ, గురుపుత్రుని బ్రతికించుట, ఉద్ధవుని వౄత్తాంతం, ముచికుందుని కధనం, భూదేవి స్తుతి, సంసారకధనాలు, ఈశ్వరవాక్యాలు, నౄగమహారాజు వౄత్తాంతం, శిశుపాలవధ కధనం, కుచేలోపాఖ్యానం, మౄతులైన సహోదరులను తేవడం, మౄతులైన విప్రసుతులను తేవడం, శ్రీకౄష్ణమహిమలు, శ్రీకౄష్ణనిర్యాణం, శ్రీకౄష్ణావతారాన్ని చాలించడం, ముఖ్య సంఘటనలుగా సంక్షిప్తీకరీకరణం చేయవచ్చును.
శ్రీకౄష్ణుని గీతోపదేశందైవీసంపదగా గీతాసారాన్ని ఉదాహరించడం పరిపాటి. మనుష్యునికి దివ్యశక్తిని ప్రసాదించేవి దైవ సంపదలే. ఇవి మన ఆత్మయొక్క విశిష్టగుణాలు. మనకు స్థిరమైన శక్తిని,మంచిమనస్సును ప్రసాదిస్తాయి. దు:ఖాలనుంచి విముక్తుల్ని చేసి శాశ్వతమైన సుఖాలనందిస్తాయి. దైవీసంపదలు పూర్ణవికాసాన్ని పొందినప్పుడే భగవంతుడు కల్పన చేసిన మనుష్య స్వరూపం లభిస్తుంది. ఈ గుణాలు వికసించిన రూపమే మానవత్వం అనిపించుకుంటుంది. మానవ చరిత్రలో ఈ గుణాలు పూర్తి వికాసం పొందిననాడే యదార్ధ మానవధర్మం వెలుగొందుతుంది. శ్రీకౄష్ణుడు, భగవద్గీతలో, 16వ అధ్యాయంలో మనుష్యుల్లో వికసించి, వెలుగొందే దైవీ సంపదలను, దైవసంబంధ గుణాలను ప్రకటించడం జరిగింది. దైవీసంపద కలవారియొక్క లక్షణాలను స్పష్టంగా వివరించడంకూడ జరిగింది. అర్జునినితో దైవీసంపద ప్రాప్తించిన పురుషులకు కళ్యాణం జరుగుతుందని, వాటితోనే మానవత్వం ధన్యమవుతుందని అని వివరించాడు. వాటి సారాంశం యిలావుంది.
దైవీ సంపదకల వ్యక్తిలో - తేజస్సు, ఓర్పు, ధైర్యం, బాహ్య-అంతశ్శౌచం,ఎవరియందు శత్రుభావం లేకుండడం, తనయందు పూజ్యతాభిమానం లేకపోవడం, అర్జునినికి కౄష్ణుడు వివరించాడు.
ఎట్టి స్థితిలోను భయము లేకుండుట, అంత:కరణ స్వఛ్చత - మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష, జ్ణానయోగమైన వ్యవస్థితి, సాత్విక దానశక్తిని ధరించడం, ఇంద్రియదమనం - జ్ణాన, కర్మేంద్రియాలు, పూజ - అగ్నిహోత్రాది ఉత్తమ కర్మాచరణం, కీర్తన - స్వాధ్యాయం, స్వధర్మపాలనలో కష్టసహిష్ణుత్వం, అంత:కరణ సరళత - ఆర్జవం, అహింస, సత్యము, హిత - మధుర భాషణం, అక్రోధం, కర్మలలో కర్తౄత్వ - అమాన త్యాగం, శాంతి - అంత:కరణం యొక్క ఉపరామత, నిందాత్యాగం, నిర్హేతుక దయ, లోలుపత లేక ఆసక్తి ఉండకపోవడం, స్వభాషలో కోమలత్వం, లోక-శాస్త్ర విరుద్ధమైన ఆచరణకు సిగ్గుపడడం, వ్యర్ధకార్యములొనర్పకుండుట, ఆత్మ తేజ:ప్రాప్తి, క్షమ, ధౄతి అంటే ధైర్యం, శౌచము లేక పవిత్రత, ఏ ప్రాణియందు ద్రోహం కాని,వైరంకాని లేకుండుట, జాతి-వర్ణ-కుల-విద్యా-ధనాదులందు గర్వం విడిచిపెట్టడం, అనే 26 దైవగుణాలను వివరించడం జరిగింది. మానవుడు ప్రతినిత్యం శ్రేష్ఠత్వంవైపుకు సాగుతాడు. శ్రేష్టమైన వస్తువులను చూస్తాడు. శ్రేష్ఠములైన విషయాలనే చింతిస్తాడు. ఆలోచిస్తాడు. శ్రేష్ఠకార్యములనే ఆచరిస్తాడు. ఈ విధంగా ఈ దైవసంపద వికసిస్తే మానవుడు మహోన్నత దేవత్వాన్ని పొంది, తానే భగవంతుడై తీరుతాడు. ముమ్మాటికీ సత్యం. భారతజాతికి పథ్యం.
శ్రీకౄష్ణభగవానుడు వివరించిన దైవీసంపదసారాన్ని, మానవుడు ధరించి వికాసమందించాలని, అలాచేసినవాడు యధార్ధమైన మనుష్యుడౌతాడని, అంతేకాదు, దేవుడే తానవుతాడని ఉపదేశించాడు. అందుకే మానవసేవే మాధవసేవ అన్న ఆర్యోక్తి వచ్చింది. ప్రాత:కాల ప్రకాశాన్ని స్వీకరించినందుకు పువ్వులు రేకులు విప్పినట్లు దైవగుణసంపదను ప్రతీమానవుని చరిత్రలో మలుచుకోవాలి. పరమేశ్వరుని దేవీప్యమానమైన ప్రకాశాన్ని లోన ప్రవేశింప చేసికొనేందుకు ప్రతీ మానవుని మనస్సుని తెరిచిచూడాలి. దేవత్వాన్ని పొందినప్పుడే మానవత్వం పూర్తిగా పండినట్లు భావించవచ్చు.
వందే బౄందావనచరం, వల్లవీజనవల్లభం, జయంతీసంభవం ధామ వైజయంతీవిభూషణం అని కౄష్ణుడు ఒక మహాపురుషుడు అని శ్రీకౄష్ణావతారతత్త్వం విశదపరుస్తూంది.
శ్రీకౄష్ణస్తవంచతుర్వేదసారం భవాంభోధి పారం, నిరస్తాంధకారం వహద్ భూమిభారం, అఘౌఘాతిదూరం పరం నిర్వికారం, సదా భక్తపాలం భజే నంద బాలం.
ౠక్, యజుర్, సామ, అధర్వణవేదాలు అను నాలుగు వేదాలసారం తానైనట్టియు, సంసారమనెడి, లేదా జనన మనరంఉ లనెడి సముద్రనుదాటించునట్టియు, భూభారమునంతను మోయునట్టియు, పాపరాశికి మిక్కిలి దూరుడైనట్టియు, అన్నిటికన్న మిన్నయైనట్టియు, ఏవికారము (మార్పు) లేనట్టియు, సర్వదా నమ్మిన భక్తులను సంరక్షించునట్టియు, నందుని ఇంట బాలకుడై సంచరించిన శ్రీకౄష్ణపరమాత్మను నేనెల్లపుడు భజింతును.
పరమేశ్వర! కౄష్ణ! జీవితాబహవో యే చ మౄతా: పునస్త్వయా భువి కేచన మూఢ మానవా: య మజం ప్రాహు రనీశ శంకయా.
ఓ పరమేశ్వరుడా! శ్రీకౄష్ణదేవా! మున్నెందరో మౄతులు, నీచేత పునర్జీవుతులయ్యారు. అట్టి దివ్య మహాత్మ్యమును గమనించక పుట్టువే యెరుంగక నిన్ను - కలియుగములోని కొందరు మూఢులు భగవంతుడు కాడని శంకతో పల్కుచున్నారు? ప్రభూ! నీవు ముమ్మాటికీ భగవంతుడవే. నిత్యజీవము కోరువారు నిన్నే ఆశ్రయించి, నీ పాదాలే పట్టుకోవలెను ప్రభూ.
శ్రీకౄష్ణ మంగళవాక్యం
కౄష్ణేతి మంగళంనామ యన్యవాచి ప్రవర్తతే!భస్మీ భవంతి రాజేంద్ర మహాపాత: కోటయ:
కౄష్ణా! అను నామం సర్వ మంగళకరమైంది. ఆ నామం ఎవరి నాలుకమీద నాట్యం చేయునో, వాని పాపాలు కోట్లాది జన్మలపై అనుసరియై భస్మమైపోవును. కనుక, నిరంతరం శ్రీకౄష్ణ నామమునే జపించి,శ్రీకౄష్ణస్తోత్రములనే పఠించి, 'ఏకోదేవ: దేవకీ పుత్రఏవా - దేవకీదేవి కుమారుడుగా అవతరించిన శ్రీకౄష్ణపరమాత్మ, ఒక్కడే దేవుడని, దేవదేవుడని, దేశమునలుమూలలు మారు మ్రోగించుటకై ప్రయత్నించాలి.
అని విష్ణుధర్మోత్తరం లో ప్రస్తావించబడింది.
శ్రీకౄష్ణ పరమాత్మ అనుగ్రహానికి పాత్రులవ్వాలి. సర్వం శ్రీకౄష్ణార్పణమస్తు. సర్వేజనా: సుఖినోభవంతు!
ఓం శాంతి:
శ్రీ కౄష్ణజయంతి, శ్రీ కౄష్ణాష్టమి సందర్భంగా తెలుగురథం ఆ లీలామానుష వేషధారికి భక్తి ప్రపత్తులతో ఆరాధన కావించుకుంటూ -
కొంపెల్ల శర్మ - తెలుగురథం.

No comments: