Wednesday, August 27, 2008

విశ్వానికే అమ్మ - మదర్ తెరిస్సా


విశ్వానికే అమ్మ - మదర్ తెరెస్సా
( 1910 - 1997 )
మానవసేవయే ఈ అమ్మ లక్ష్యం
నిస్సార్ధ్వ సేవలో జీవితాంతం నిమగ్నం, బీద, అనాధ, అనారోగ్య ప్రజానీకానికి ఒక అనిర్వచనీయమైన హౄదయ స్పందన, భారతావని మనస్సులను గెలుచుకోవడం, అంతేకాదు విశ్వంభర పర్యంతం ఆ మహావ్యక్తిని స్మరించని గళం లేదు అనే చెప్పాలి. ఆమె తొలిసారిగా 1929లో భారతదేశంలో అడుగిడారు. మనసు ద్రవించింది, హౄదయం స్పందించింది. వివిధ భారతీయ ప్రాంతాల్లో రహదారుల్లో తరచు కనిపించే ప్రజలను చూసి ధౄఢనిశ్చయం కలిగింది. జన్మభూమికి తిరుగు ప్రయాణం సంగతి మరచిపోవడం జరిగింది. భారతదేశం అదరణకు నోచుకున్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆమె మదర్ థెరెస్సా. మానవతకు సమాంతరం. సేవకు పరమార్ధం. ఆమె స్థాపించి, అర్ధవంతంగా నిర్వహింపబడుతున్న అనేక సేవాసంస్థల్లో వేలాది కార్యకర్తలు తమ సేవలను అందించడానికి అవకాశం అందించిన అపూర్వ వనిత - మదర్ థెరెస్సా.
పదేళ్ళకే సేవారంగంలో ప్రవేశంమదర్ థెరెస్సా 27 ఆగష్టు 1910 లో యుగోస్లావియ, స్పోజ్ లో జన్మించిన ఈమె తల్లిదండ్రులు పెట్టిన పేరు - ఏగ్నెస్ గోంగ్జ బోజక్సియు. అల్బేనియా కు చెందిన ఈ కుటుంబం మతపరమైమ సేవలకు ప్రసిద్ధి. కేవలం పన్నెండేళ్ళకే, దైవపరంగా మానవజాతికి సేవలను అందించాలనే ఆలోచన, కోరిక, ఒక్కసారి అంకురించాయి. ఆచరణలో పెట్టింది. వ్యక్తిగా యిది పూర్తిగా సాధ్యం కాకపోతోంది అన్న తలంపుతో, తన పద్ధెనిమిదవ ఏట, తల్లిదండ్రుల్ని వదలి, ఐరిష్ సేవాసంస్థలో చేరి, భారతదేశానికి ప్రయాణం చేసింది. రోమన్ కాథలిక్ చర్చి నియమాల ప్రకారం 'నణ్ బాధ్యతలను స్వీకరించింది. ఫలితంగా, ఆమె క్రైస్తవ సన్యాసిని, మతవాసిని, భిక్షుకి గా, మదర్ థెరెస్సా గా అవతరించింది. 1921 లో యుగోస్లావియా నుంచి మతపర సేవాబౄందం భారతదేశం మానవసేవ నిమిత్తం పర్యటనకు రావడం జరిగింది. ఎందరో విదేశీ సేవాసంస్థల ప్రతినిధుల బౄందాలు రావడం, సేవలను అందించడం, తిరిగి స్వదేశానికి వెళ్ళడం తరచుగా జరిగే పని. అయితే, ఈ సేవాసంస్థల ప్రతినిధుల బౄందం మాత్రం, భారతదేశంలో అసంఖ్యాక బీదరికంలో మగ్గిపోతున్న ప్రజానీకానికి సేవచేసేనిమిత్తం తమ సంకల్పాన్ని తెలియజేస్తూ, వారి స్వదేశం నుంచి కావలసిన ఆర్ధికసహాయాన్ని కోరడం కూడ జరిగింది. ఆ అభ్యర్ధన పత్రం చదివి, మదర్ థెరెస్సా అనే ఆగ్నెస్, తనవంతుగా భారతదేశపు ప్రజలకు సేవలను స్థిరస్థాయిగా అందించే దిశలో, 6 జనవరి 1929 లో, కేవలం యిరవై కూడ నిండకుండ అరవై వయసులో కూడ సామాన్యంగా ఆలోచనకి రాని సేవలను ఆచరణకు పూనుకుంది. అలా భారతదేశపు గడ్డపై అడుగు పెట్టిన థెరెస్సా తిరిగి తన స్వదేశం వెళ్ళడం గురించి ఆలోచనే చేయలందంటే, అమె సంకల్పదీక్షాకంకణ బద్దత ను మనసారా అనుభవించాల్సిందే తప్ప, మాటలకు అందదు. మదర్ థెరెస్సా జీవితాంతం పేదమానవుల సేవకే అంకితం చెయ్యడం, ఆ అమూల్యమైన సేవలను ప్రపంచం అన్ని రంగాలనుంచి కొనియాడడం జరిగింది.
సేవాకేంద్రంగా కలకత్తాప్రాధమిక శిక్షణ తర్వాత, థెరెస్సా, 24 మే 1931 న మతవాసిని, సేవకురాలుగా ప్రమాణస్వీకారం చేసింది. 1931 నుంచి 1948 వరకు, కలకత్తాలోని సైంట్ మేరీ హైస్కూలో విద్యను అభ్యసించేది. ఆమె ఉపాధ్యాయురాలుగా గడపుతున్నపుడు, కాన్వెంటు పాఠశాల ప్రహారీగోడకు బయటున్న బీదప్రజానీకపు జీవితాన్ని చూసి ఆమె హౄదయం కరిగిపోయింది. ఫలితంగా, 1948 లో పిల్లలకు చదువుచెప్పే ఉద్యోగం వదిలి, సేవలకు పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యేందుకు పై అధికారులనుంచి అనుమతి తెచ్చుకుంది. కలకత్తా బురద ప్రాంతాల్లోని గుడిసె నివాసుల పూర్వజన్మ సుకౄతం కాబోలు, మదర్ థెరెస్సాగా ప్రత్యక్షమయింది. చేతిలో చిల్లిగవ్వ కూడ లేని పరిస్థితిలో, దేవునిపై భారంవేసి కలకత్తాలో బహిరంగ పాఠశాలను స్థాపించింది. వెంటనే, ఆమెతో అనేక సేవాతత్పరులు, సంస్థలు చేయూతనివ్వడం, ముందుకు సేవా కార్యక్రమాలు జరిగాయి.
యింతలు, మరింతలుగా సేవాకార్యక్రమాలుఆరోజు 7 అక్టోబరు 1950. పరిణతి చెందిన మరోసంకల్పం. స్వంతంగా సేవాసంస్థను స్థాపించాలని మదర్ థెరెస్సా సంకల్పించింది. మిషనరీస్ ఆఫ్ ఛారిటీ, ఘోర అనాదరణకు గురయిన బీద ప్రజానీకానికి ప్రేమను అందిస్తూ, చేరదేయడమే లక్ష్యంగా పెట్టుకుని సేవలను అందించడం ప్రారంభించింది. ఈ సంస్థ అందించిన సేవలను గుర్తింపుగా, ఆరవ పోప్ పాల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మతసేవాకేంద్రంగా అవతరించింది. ఈ సంస్థ తమ సేవలను శోఖోపశాఖలుగా విస్తరించింది. సేవలను అందించే సోదరులు, సోదరీమణులు, మతగురువుల శాఖలను విస్తరించారు. అనేక దేశాలకే కాక, సోవియట్, యూరోపు దేశాలకు వ్యాప్తి అయింది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లోనే కాక, ప్రకౄతి విలయతాండవం సందర్భంగా సంభవించే అవాంతరాలకు సేవలను అందించడం, పునరావాస సేవల్లో కేంద్రీకరించడం ప్రధాన సేవలుగా జరిగింది. ఉత్తర అమెరికా, యూరోపు, ఆష్ట్రేలియా దేశాల్లో మద్యపానసేవితులు, నిరాశ్రయులు, ఎయిడ్స్ రోగగ్రస్థులు యిత్యాది బాధిత ప్రజానీకానికి, వైద్యం, సహాయ సహకారాలను అందించడంలో విశేష కౄషిని సాధించింది. 29 మార్చి 1969 నాటికి ఒక ప్రముఖ అంతర్జాతీయ సంస్థగా, వనరులతో, విరాజిల్లింది. 1990 దశకానికి, 40కి పైగా దేశాల్లో పది లక్షల సేవకబౄందాలు తయారయ్యాయి. ఈ సేవాకుటుంబాలు మొత్తం మదర్ థెరెస్సా ఆశయాలు,లక్ష్యాలు సాధించేందుకు అహర్నిశలు నిరంతర కౄషి చేస్తూ సత్ఫలితాలు సాధించడం అన్నది జగద్విదితం.
సేవలకు తార్కాణాలు, సాక్షాత్కారాలుభారతదేశంలో సేవల్లో అంతర్లీనమై, మదర్ తన సేవలకు కలకత్తాను కేంద్రంగా చేసుకుంది. సమాజంగా అనేక విధాలుగా బాధపడుతున్న అనేకమందికి సేవకై, పలు సంస్థలను స్థాపించింది. మిషనరీస్ ఆఫ్ ఛారిటీ (సిస్టర్స్), నిర్మల్ హౄదయ్ నివాసాలు, శిశుభవనాలు, పేదలకు, వికలాంగులకు, మానసికంగా ఎదగలేని అభాగ్యులకు ఒక సదవకాశంగా స్థాపించబడ్డాయి. అందించిన నిస్స్వార్ధ సేవలకు అనేక గుర్తింపులు, సత్కారాలు, అనేకం, బహుముఖం. అందిన ప్రశంసనీయమైనవి - రామన్ మెగస్స్యే (1962), 23వ పోప్ జాన్ శాంతి పురస్కారం (1971), అంతర్జాతీయ శాంతి, సహౄధ్భావనకు నెహ్రూ పురస్కారం(1972), నోబెల్ శాంతి, బల్జన్ పురస్కారం (1979), భారతరత్న (1980), టెంప్లిటన్, ప్రతిభా పురస్కారాలు, మదర్ థెరెస్సా ప్రతిభాసేవలకు తార్కాణాలు.
సేవలతో ఆగని మనసు, అలసిపోయిన గుండెమానవసేవే మాధవసేవ అనే భావపరంపరతో ముందుకు సాగిపోయిన మదర్ థెరెస్సా మనసు లోలోతులకు సంతౄప్తితో పోయినా, గుండె మాత్రం అలసిపోయింది. వేలాది వెన్నెలరాత్రులు సేవల్లో గడపిన మదర్ థెరెస్సా, కోట్లమంది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలచిపోయింది. ఈ సంతౄప్తితోనే ఆనందంతో స్పందించిన ఆమె గుండె కూడ స్పందించడం మానివేసింది. గుండెలోకి రోగం ప్రవేశించింది. ఫలితంగా, 9 సెప్టెంబర్ 1997, ఉదయం 9.30 ని. లకు చివరిశ్వాసను వదలింది. మదర్ థెరెస్సా భౌతికంగా ఈ లోకం వీడింది. కాని, భారతదేశపు ఎల్లలు, ప్రతీప్రాంతపు ప్రజ మాత్రం వదిలే ప్రతీ ఉచ్ఛ్వాశ, నిశ్వాసల్లో, అగ్నే అన్న మదర్ థెరెస్సా, మనందరికీ అమ్మగా కొనియాడబడే ఆ మహావ్యక్తిని మాత్రం ప్రతీమనసు తలచుకుంటూనేవుంది.
ఆ సేవామతల్లికి హౄదయార్పిత ప్రణామాలు. తనదైన శైలిలో సేవలద్వారా అపారమైన తల్లిప్రేమ మాధుర్యాన్ని, ఆప్యాయతని సకల మానవాళికి అందించిన మదర్ థెరిస్సా జయంతి సందర్భంగా తెలుగురథం శత సహస్ర నివాళ్ళను సమర్పించుకుంటోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.

No comments: