Thursday, August 21, 2008

అంతర్జాతీయ జానపద దినోత్సవం

అంతర్జాతీయ జానపద దినోత్సవం - 22 ఆగష్టు
జనపదం - జానపదం
జనపదం అంటే ఒకప్పుడు కేవలం 'పల్లెటూరూ అనే అర్ధం వుండేది అని చెప్పవచ్చు. నేడు ఆంగ్లంలో 'ఫోక్' అనే పదానికి, జనం-జనపదం-లోకులు అని వివరణ యివ్వడం జరిగింది. ఈ మూసలోనే, జానపదం అన్న పదం తోనే మిగతా సంబంధిత పదాల్ని నిర్మించుకోవడం జరిగింది. ఫలితంగా, జానపద - సాహిత్యం, సంఘాచారం, సభలు, సం(గీతం), సాహిత్యం, నౄత్యం, మనోవిజ్ణానశాస్త్రం, వెలసి జానపద విజ్ణానశాస్త్రం అవతరించాయి. అయితే, 'ఫోక్లోఋ అనేపదాన్ని మొదటిసారిగా, డబ్లియు.జే.థాంస్ అనే మహానుభావుడు రూపొందించాడు. 'ది అథనీయం' అనే పత్రికకు వ్రాసిన ఒక ఉత్తరంలో, ఫోక్లోర్ అనే పదాన్ని సూచిస్తూ, జానపదులకు చెందిన ఆచారాలు, నమ్మకాలు, కధాగేయాలు, సామెతలు, మొదలైన విజ్ణానమే, 'ఫోక్లోఋ అని వివరించాడు. ఏది ఏమైనా, జనపదం, జానపదుల జీవనవిధానంపై ఒక సదాచారం, సంప్రదాయం వెంటాడుతూనేవున్నాయి అని చెప్పాలి. ఈ భావననే - సంప్రదాయం నిలిచే ఉంటుంది హమేషా, మూఢాచారాలు మారుతూ ఉంటాయి నిజం, కాని, సంప్రదాయం తాత ముత్తలనాటి ధనం. జాతికి జీవననాళిక - జానపదగీతి, అని అంటాడు ఆరుద్ర తన సాహిత్యోపనిషత్ రచనలో. జానపద పద సార్ధకతను వివరించిన వారు ఎందరో వున్నారు. మానవుని ముగ్ధ ప్రకౄతి, సౄష్టి వలెనె, అనాది దానికి జానపదులు, నగరవాసులన్న భేదం లేదు, సంస్కారం పేరుతో కౄత్రిమతా వివశులైన నగరవాసులకంటే జానపదులెక్కువగా ముగ్ధత మెరుస్తారు కనుకనే ముగ్ధతా ప్రధానమైన భాషాసంబంధి రచనలకు 'జనపదా దళ విశిష్టత యేర్పడింది అని జానపద సాహిత్య స్వరూపం అన్న గ్రంధంలో ఆర్వీయస్ సుందరం గారు అన్నారు. అలాగే, ఈ రచనలు దోషహాన, గుణోపాదాన, అలంకారయుక్తతా రసావియోగత్వములనే సంస్కార సహితాలు సాహిత్య మనరాక, లేఖన దూరములగుటచేత వాంగ్మయ మనరాక, సారస్వత మనబడటమే లెస్స తలపు అని ఆచార్య సాళ్వ కౄష్ణమూర్తిగారు అన్నారు. హితమైనదే సాహిత్యమని ఒప్పుకునేట్లయితే,జానపద సాహిత్యం కంటే ఉత్తమ సాహిత్యం లేదు. జనజీవనంలో ఈ సాహిత్యం అనివార్యమైన అంగం. జానపదుల జీవితానికీ, ఈ సాహిత్యానికీ విడదీయరాని బంధం అనే చెప్పాలి.
జానపదులు - జ్ౙాననిధులుభారతీయ జానపదులు ఎన్నటికీ వన్నె తరగని అపురూప కళానిధులు. మన దేశ సంస్కౄతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ అనాదిగా ప్రజలలోని అజ్ౙాన తిమిరాన్ని పారద్రోలి విజ్ౙానవంతుల్ని చేస్తున్న అపూర్వ కళాజ్యోతులు. జానపదులకు సంబంధించినదే 'ఫోక్ లోఋ అని చెప్పుకోవచ్చు. 19వ శ. లో 'ఫోక్' గురించి విద్వాంసులు, జానపదులంటే విద్యావిహీనులైన కర్షక జనులు, గ్రామీణులు అని భావించారు. జానపదుల దశల్ని, అరణ్యజీవనం, అనాగరికం, నాగరికం అని, అటు ఆటవికులూ కాక, యిటు నాగరికులూ కాక, పళ్ళెటూళ్ళలో జీవనం చేసేవారన్న భావం కూడ వుండేది. ప్రసిద్ధ జానపద విద్వాంసుడు, అలన్ డండెన్ - జానపదులంటే ఏదైనా ఒక్క విషయంలోనైనా భావసామ్యం కలిగిన జనసముదాయం, భాష, ప్రదేశం, జాతి, మతం, వౄత్తి కి సంబంధించిన వారు అవడమే కాక, తమదే అని చెప్పుకోదగిన కొన్ని సంప్రదాయాలను కలిగి వుండాలీ అని ఆంధ్రుల జానపద విజ్ౙానం అన్న పరిశోధనాగ్రంధంలో ప్రముఖ ఆచార్యులు ఆర్.వి.యస్. సుందరంగారు చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఫలితంగా, యిద్దరికన్న ఎక్కువ, కుటుంబం, దేశం, ప్రపంచం, ఏదైనా చెప్పుకోవచ్చు. ఈ సముదాయంతో పాటు, వర్గ సమూహంలోని పద్ధతులు, నమ్మకాలు విజ్ౙానరూపం దాలిస్తే, సంప్రదాయాలు, ఆచారాలు, నమ్మకాలు, పండుగలు, ఉత్సవాలు, విజ్ణానసంస్కౄతుల సమ్మేళణంగా భావించవచ్చు. వీటిని ఆచరణల ప్రక్రియల్లోంచి ఉధ్బవించేది సంస్కౄతి, సాహిత్యం, కళల రూపాల్ని దాలుస్తాయి. జానపదులను ఆధునిక దౄక్పధంతో నిర్వచిస్తే, సమాన సంప్రదాయాలు కలిగిన ఆటవికులు, గిరిజనులు, గ్రామీణులు, నగరవాసులు, ఎవరైనా జానపదులు అని ఘంటాపధంగా చెప్పవచ్చు. అందుకే, భారతీయతని తరచు మనం చెప్పుకొనే నిర్వచనం, భిన్నత్వంలో ఏకత్వం, అనేకంలో ఏకం గా మమైకం అవడం అన్నది జనపదం, జానపదం, జనం, జనపదులు, జానపదులు అని పర్యాయపదాలుగా చెప్పుకోవడంలో సమంజసం ఎంతైనా వుంది. అందుకే, మనం జనం, జనం మనం - జనం లేంది మనం లేము అంటాడు దాశరధి, దీపావళి అన్న కవితలో. పదమైనా, పధమైనా, జనంతో ఐక్యం అయితే, ప్రభావం, ప్రతిభ వెల్లడవుతాయి.
జానపద విజ్ౙాన స్వరూపంజనజీవనం నాడి, జనసంస్కౄతి, నిజరూపంలో కనిపించేది తమ విజ్ౙాన సాహిత్యరంగాల్లోనే. ఆచార వ్యవహారాలు, నమ్మకాలు, ఆనవాయితీలు, పండుగలు, కట్టుబొట్టు, మాటమంతీ, పెళ్ళిపేరంటాలు, యిత్యాదులు ప్రతిబింబించే సాహిత్యం, కళలు, ప్రజ్ణాన, విజ్ణానవంతపు మహావిద్వాంసుల పాండితీప్రతిభలకు సరితూగవేమో. మన నిత్యజీవనంలో కనిపించే సహజాలంకారాలు, సామెతలు, పలుకుబళ్ళు, నుడులు-నానుడులు, మాండలీకాలు, యాసమాటల ద్వారా ప్రకటించే జానపదుల అమాయకత్వం, ఆకౄతి, సహౄదయత, అర్ధాన్నేకాక, అర్ధవంతంగా గోచరిస్తాయి. పరమార్ధాన్ని ప్రసాదిస్తాయి. స్థాయిని, సహౄదయతతో జోడించిన ఎదుగుదల, అభివౄద్ధి, వికాసం చిరస్థాయిగా మైలురాయిగా, మలుపురాయిగా, జాతి జనజీవనంలో చరిత్రను సౄష్టించక తప్పదు. మన ప్రాచీనతను చాటిచెప్పే, గాధాసప్తశతి కాలంలోనే, పెళ్ళిళ్ళు, పొలంగట్లలో పాడుకునే ఆటపాటలను పరిరక్షించుకుని కనక వుంటే, వందల ఏళ్ళ తెలుగు జనపద జీవన సంస్కౄతి విశ్వవ్యాప్తంగా ఘనతకెక్కేది.
జానపద విజ్ౙాన సర్వస్వం
జానపద విజ్ౙాన పరంపరను - సాహిత్యం, సాంఘికాచారాలు, వస్తుసంస్కౄతి, కళలుగా విభజించడం జరిగింది. అధికంగా, జానపదవిజ్ణానం, మౌఖికంగా విస్తారం చెంది, ప్రసారం అయింది అని చెప్పాలి. ఈ ప్రక్రియ క్రింద, కవిత్వం, గద్యకధనాలు, సామెతలు, పొడుపు కధలు, భాషను ప్రముఖంగా చెప్పుకోవాలి. మరింత ప్రముఖంగా చెప్పాల్సిన, సాంఘికాచారాలు - జననం నుంచి మరణం వరకు - నమ్మకాలు, దేవతల మంత్రతంత్రపూజలు, పండుగలు, నోములు, ఉత్సవాలు, వ్రతాలు, జాతరలు వస్తాయి. జానపదజీవనంలో విస్మరించలేని అంశం - వైద్యవిధానాలు, పెరటిమందులు, నాటు మోటు తరహా వైద్యాలు, జనజీవన అస్థిత్వానికి దోహదమయ్యాయి. అటలూ, పాటలూ, వినోదాలు, విహారాలు, యింతలు, మరింతలుగా జనపదసంస్కౄతిలో అంతర్గతమయ్యాయి. జనపద వస్తుసంస్కౄతి విషయానికొస్తే, ఆహారపానీయాలు, దుస్తులూ, ఆభరణాలు, చిత్రకళ, శిల్పం, చేతిపనులు, గౄహనిర్మాణం, యిళ్ళు, వాకిళ్ళు, లోగిళ్ళు, వస్తుప్రదర్శనావిధానాలు, ప్రముఖపాత్ర వహిస్తాయి. ప్రత్యేకంగా ప్రస్తావించదగ్గవి - జానపద కళలుగా, సంగీతం, నౄత్యం, రూపకాది అంశాల ప్రదర్శనలు, పరిశోధనలు, జానపద విజ్ౙాన సంపదకు మూలవిరాట్టులు. కళల్లో ప్రముఖంగా - వీధిభాగోతం, తోలుబొమ్మలు, యక్షగానం, బహురూపులు, పగటివేషాలు, గారడివిద్యలు, ఎన్నో చెప్పుకోవాలి.
జానపద విజ్ౙాన శాస్త్రీయ పరిశోధనజానపద విజ్ౙాన సర్వస్వాన్ని, సూక్ష్మదౄష్టితో, విభజించి, క్రోడీకరించి, భాగోపభాగాలుగా ఆధ్యయనం, పరిశోధనం గావించిన ప్రముఖులు ఎందరో. ఆ ప్రముఖుల్లో ప్రముఖినిగా ఆర్.ఎస్.బాగ్స్ ని ప్రస్తావించక తప్పదు. ఆయన, జానపదాన్ని, ఒక వాదంగా, వేదంగా భావించాడు. సామాన్య జానపద విజ్ౙానం, గద్యకధనం, కధాగేయం, గేయం, నౄత్యం, ఆట, సంగీతం, గద్యం, నాటకం, ఆచారం, ఉత్సవం, భూగోళం, భాష, కళ, చేతిపనులు, వాస్తువు, ఆహారం, పానీయం, నమ్మకం, వాక్కు, సామెత, పొడుపుకధలను 13 ప్రముఖ వర్గాలుగా విభజించాడు.
ఆంధ్ర జానపద ప్రతిభావంతులుప్రాచీన జానపద సాహిత్య సందర్భాలతోపాటు, ఎందరో రచయితలు, కళాకారులు ఈ జానపద విజ్ౙాన సర్వస్వానికి దోహదపడిన వారు ఎంతోమంది. హరి ఆదిశేషువు, నాయని కౄష్ణకుమారి, భద్రిరాజు కౄష్ణమూర్తి, కౄష్ణశ్రీ, నేదునూరి గంగాధరం, యస్వీ జోగారావు, తూమాటి దోణప్ప, డా.ఆర్వీయస్.సుందరం, జి.యస్. మోహన్, వెన్నెలకంటి రాఘవయ్య, కోరాడ రామకౄష్ణయ్య, బిరుదు రామరాజు, గంగిశెట్టి లక్ష్మీనారాయణ, వెలగా వెంకటప్పయ్య, తంగిరాల వెంకట సుబ్బారావు, కళాకారులు నాజర్, గద్దర్, వందేమాతరం శ్రీనివాస్, యిలా ఎంతోమందిని ఉదాహరించవచ్చు.
జానపదులకు ప్రత్యేక రామాయణాలుజానపదుల జీవితాల్లో అల్లుకొనిపోయిన పురాణేతిహాసాలను ప్రస్తుతించాలంటే, ప్రధమంగా రామాయణగాధలనే చెప్పాలి. ఈ అంశాలని మధుర హావభావాలతో, ప్రత్యేకంగా ఈ రంగంలో తాము జరిపిన విశిష్టమైన పరిశోధనానుభవాన్ని నిరంతరం అందించే మహానుభావుల్లో బిరుదు రామరాజు గారిని ప్రత్యేకంగా చెప్పితీరాలి. ఆయన జానపదుల రామాయణ విశేషాలను, ప్రముఖ సాహితీ సంస్కౄతిక సంస్థ - యువభారతి - ఒకకాలంలో సాహితీయాగం చేసినవారి, రామాయణ సుధాలహరి కార్యక్రమంలో భాగంగా, జానపద రామాయణాలపై వివరణాత్మకంగా ప్రచురించిన జానపదుల వివరాలను చదివి ఆనందించవలసిందే. ఊర్మిళదేవి నిద్ర, లక్ష్మరదేవర నవ్వు, పెండ్లి పాటలు, గుహుని కధనం, స్త్రీల వ్రతాలు, నోములు, చెక్కపాటలు, మచ్చుకు మాత్రమే.
చిత్రసీమను అలరించిన జానపద సంపదజానపద కధల యితివౄత్తాలతో ఎన్నో చిత్రాలు వచ్చాయి. కాటమరాజు కధ, మదనకామరాజుకధ, యిలా ఎన్నో చిత్రాలు జానపద గుభాళింపులను తెచ్చిపెట్టాయి. అలాగే, చిత్రాల్లోని గీతాలను కూడ జానపదశైలి, సరళి సుస్పష్టంగానే గోచరించాయి. భారతీయ జ్ౙానపీఠపురస్కార గ్రహీత, ప్రముఖ డా.సి. నారాయణరెడ్డి గారి ప్రతిభాకలం నుంచి వెలువడిన జానపదమంజరి తెరిస్తే, ఎన్నో పాటలు - మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు (అమ్మమాట), సంతకెల్లి వచ్చేతలికి ఇంతమారిపోతవి మల్లా ఏం పిల్లా కత యేందే పిల్లా (బంగారక్క), బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో (జీవితచక్రం), మామిడితోపుల్లోనా మాపటేల మాటేసి చిక్కుడు పాదూకాడా చీకటేల పట్టేసి చెప్పలేని రుచులెన్నో చిటికెలోన చూపించి, మాయచేసి పోతివిరో నాగులూ, నామాట మరచిపోతివిరో నాగులూ, ఓలమ్మో ఓరినాయనో (జీవితం), గంపానెత్తిన పెట్టి గట్టుమీద పోతుంటే గుండెఝల్లుమన్నాదే రంగమ్మా, హోయ్ గుబులు గుబులుగున్నాదే రంగమ్మా (దత్తపుత్రుడు), ఆకుపచ్చని చేలు అల్లోనేరెళ్ళో, ఆపైన పైరగాలి అల్లోనేరెళ్ళో, అందాలమాపల్లె అల్లోనేరెళ్ళో, ఆనాటి రేపల్లె అల్లోనేరెళ్ళో (యిల్లూ యిల్లాలూ), వచ్చింది వచ్చింది లచ్చిమి, వనలచ్చిమి, మహలచ్చిమి, ధలలచ్చిమి, మాలచ్చిమి, వచ్చాని చిలకల్లే పసినిమ్మ పండల్లే, ముచ్చటైన వయ్యారం మూటగట్టితెచ్చింది (మరపురాని మనిషి), వాడేవడంటే వాడే, వన్నెల చెలికాడే, హాయ్ హాయ్ అన్నిట సరిజోడే (భలేకోడళ్ళు), కంచెకాడ మంచెకాడ కంది చేను గుబురుకాడ, ఏటికాడ గున్నమావితోటకాడ సందెకాడ, మాటువేశాను పొంచిచూశాను దారికాశాను, నీకోసం, నీషోకైన మగసిరికోసం (మానవుడు దానవుడు), అన్నవి కేవలం ఉదాహరణల్లో కొన్ని మాత్రమే.
గుర్తుకొస్తున్నాయి మన జానపద సంపదలు
గేయాలు
జానపద కవిత్వంలో గేయం, కధాగేయంగా ప్రాముఖ్యత వహించాయి. గేయాల్లో, పని, పారమార్ధికం, బాంధవ్యం, పిల్లలు, వేడుక, వలపు, హాస్య, కన్నీటి పాటలని ప్రముఖమైనవి.
పదములు, తుమ్మెద పదములు, ప్రభాత పదములు, అంటూ పాల్కురికి సోమనాధుని దేశీశైలిగీతాలు నేటికీ ప్రాచుర్యంలో వున్నాయి. దంపు దంపని యేరు అది యెంత దంపు, ధాన్యరాశుల మీద చెయ్యేసినట్లు, వంట వంటని యేరు అది యెంత వంట, వదినెతో మరదళ్ళు వాదాడినట్లు, అని రోకటి పాటలు నన్నెచోడుని కాలంనుంచే వున్నాయని చరిత్ర ఘోషిస్తోంది. ఘల్లు ఘల్లున పాడ గజ్జెలందెలు మ్రోయ, కలహంస నడకల కలికి ఎక్కడికే, అన్న ప్రసిద్ధ భక్తిగేయం ద్వారా పార్వతీపరమేశ్వరులను స్మరించడంలో సొగసు వర్ణనాతీతం. కాశికెడదామంటే కదలవే కాళ్ళు, డిల్లీ కెడదామంటే తిరగదే మనసు, నారాచ పుట్టింటి కెడదాము అంటే, నా కాళ్ళు పన్నిన్న రధములై నడచు, నా చేతులుయ్యాల చేరులై యూగు, అని ఆడవారి సహజ ప్రవౄత్తిని తెలిపేవి, జీర్ణం జీర్ణం వాతాపిజీర్ణం అంటూ ఉగ్గుపాటల ద్వారా బాంధవ్యగేయాలు, జానపదులకు, కేవలం మచ్చుకే చెప్పుకున్నవి. అలాగే, దేశభక్తి పరంపరగా - కొల్లాయి గట్టితే నేమీ మాగాంధి కోమటై పుట్టితేనేమి, నమో హిందుమాతా మాతా నమో భరతమాతా, మాకొద్దీతెల్లదనమురా, కల్లు మానండోయ్ బాబూ కళ్ళు తెరవండోయ్ (బసవరాజు అప్పారావు), గుత్తివంకాయ కూరోయి బావా కోరి వండీనానోయి బావా కూరలోపలా నావలపంతా కూర్చి పెట్టినావోయ్ బావా, లాంటి గేయాలు ఎన్నో వేలకు వేలు గుర్తుకు రాక మానవు. ప్రముఖ కవి నండూరి సుబ్బారావు గారి ఎంకి పాటలు - జామురేతిరియేళ జడుపుగిడుపూ మాని చల్లంగ వత్తాది నాయెంకి మెల్లంగ వత్తాది నాయెంకి అని నిత్యస్మరణకు రాకమానదు.
జానపద విజ్ౙానంలో అంతర్జాతీయ కౄషిప్రపంచస్థాయిలో జరుగుతున్న కౄషి చెప్పాలంటే, 19 స. చివరగా ఐరోపా, అమెరికా, జానపద విజ్ౙాన కేంద్రాల స్థాపనలు, ఫీన్లాండ్, ఇంగ్లాండ్, స్కాట్లెండ్ లాంటి దేశాల్లో కధాగేయాలు, సామెతలు, ఐతిహ్యాది ప్రక్రియలకు శోధనాసక్తి, కౄషి వెల్లడయ్యాయి. 20వ శ. లో విదేశీయులు జానపద విజ్ణానాన్ని ఒక శాస్త్రీయాధ్యన విషయంగా తీర్చిదిద్దారు. మేరియా లీడ్ సంపాదకత్వంలో అవతరించిన విపుల పదకోశం అధ్బుతం అనేచెప్పాలి. స్టిత్ ధాంసన్ (కధావిశ్లేషణ) ని కూడ స్మరించాలి. ప్రాప్, గమరి, ఎడ్వర్డ్ లీడ్, డార్సన్, అలన్ డండెన్, మరండా, టైలర్, క్రాప్సు మొదలైన ప్రతిభావంతుల సాధన, కౄషి వెరసి జానపదవిజ్ౙానం మరిన్ని విధాల ప్రతిభను జోడించింది - అని జానపద సాహిత్యం పై ఆచార్య ఆర్వీయస్. సుందరంగారు ప్రత్యేక విశ్లేషణలో చెప్పడం జరిగింది.
ప్రపంచ జానపద దినోత్సవంకేవలం ఒక ప్రాంతం, దేశం, సంస్కౄతికో జానపదం, జానపదులు పరిమితాలు అనుకుంటే, అంతకన్న అమాయకత్వం, మూర్ఖత్వం వేరేవుండదు. ఏదేశం సంస్కారం, సంస్కౄతి, సంప్రదాయాలు వారిది. వీటిని ప్రతిబింబించే విధంగా ప్రప్రంచవ్యాప్తంగా యీ రంగంలో బహుళకౄషి జరుగుతూనే వుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే, అంతర్జాతీయ జానపద దినోత్సవాన్ని, ఆగష్టు 22 న జరుపుకోవడం రివాజు, సంప్రదాయం. 1965 లో ప్రారంభించిన ఈ అంతర్జాతీయ ఉత్సవ వేడుకలు చాలా అందాన్ని, ఆనందాన్ని అందజేస్తూనే వున్నాయి. బౌర్గస్, బల్గేరియా లో ఈ ఏడాది జానపద ఉత్సవాలను జరుపుకుంటున్నారు.
అంతం కాదు యిది ఆరంభంజాతి నిజసంస్కౄతికి ప్రతిబింబం, దర్పణం గా భావించబడే జానపదవిజ్ౙానమే, శిష్టసాహిత్యం కన్న దోహదం చేస్తుంది అన్నదాంట్లో ఆశ్చర్యం, అసత్యం కావు. జనసామాన్యం నోటినుంచి వెలువడే నుడులు నానుడులు, తాత్వికత, మార్మికత, మానవ స్వభావత, ధ్వనిసహిత గుణదోషాదుల ప్రకటనలు, సంప్రదాయ, ఆచార, సదాచారాలు, అలవాట్లు, ఆనవాయితీలు, మన భవిష్యత్తు నిర్మాణానికి బీజాలుగా చేసుకోవాల్సిన తరుణం అని ఈ అతి ఆధునికత, నేటి నాగరికత, వెర్రితలల సంస్కౄతి, నేర్పిన గుణపాఠంగా భావించాలి. ఆంధ్రత్వం, తెలుగుదనం అన్నవి మన జానపదుల్లో, జనపదాల్లో, అడుగడుగునా వెదకినవారికి కష్టం లేకుండానే గోచరమవుతాయి. ప్రయత్నలోపమే కాని, వేరేమీకాదు. యిప్పటివరకూ భద్రపరచిన భాండాగారాన్ని పదిలపరచుకోవడమే కాక, వాటిని నిత్యానుసరణం, ఆచరణం చేసుకుంటూ, జానపద విజ్ౙాన సంపద సేకరణ, విభజన, విశ్లేషణ, పరిశోధనలను మరింతలుగా చేసుకుంటూ, విస్తారంగావించుకుంటూ, మరింత సశాస్త్రీయంగా విరాజిల్లాలని, ఈ విశ్వవ్యాప్తంగా జరిగే పండగల సందర్భంగా కోరడం, ఆశించడం, సమంజసం, న్యాయ, ధర్మం.
చుట్టూరా ఆవరించుకున్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే ప్రయత్నించి ఎంత చిన్నదీపాన్నయినా వెలిగించడం మంచిది - యువభారతి.
అంత కడివెడు పాలపై ఒక్కింత మీగడ పేరినట్లుగా, మనకు మిగులు గతము లోపలి మంచి, అదియే సంప్రదాయం. - సి. నారాయణరెడ్డి.
ఎంత సముద్రము మీద ఎగిరినను, పక్షి రాత్రి గూటికి చేరును. ఇది జాతీయత. ఇది సంప్రదాయం. - విశ్వనాధ సత్యనారాయణ గారు.
జాతీయతకు, సంప్రదాయానికి, వెలుగునిచ్చే దీపానికి, ప్రతీక - మన జానపదులు, జ్ౙానపదులు, జ్ణానవిధులు.
ఎన్నో జనపదాలు, ఎందరో జానపదులు, సమస్త సంపదకు, సంపన్నతకు సవినయప్రణామాలు. సహస్రనామార్చనలు.
ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా - ఈ అజరామమైన కళారాజాన్ని, విశిష్టమైన కళాకారుల్ని తెలుగురథం శతసహస్ర అభినందనలని తెలియజేస్తోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.

No comments: