Friday, August 1, 2008

ఆధునికాంధ్ర నాటకరంగానికి ఊపిరి 'బళ్ళారి రాఘవ' జయంతి









ఆధునికాంధ్ర నాటకరంగానికి ఊపిరి 'బళ్ళారీ రాఘవ (1880 - 1946) - జయంతి 2 ఆగష్టు




జగమే ఒక నాటకరంగం


"కావ్యేషు నాటకం రమ్యం" అని, "నాటకాంతం హి సాహిత్యం" అని, "నాటకాంతం కవిత్వం" అన్నవి అనాదిగా సోదాహరణంగా చెప్పబడుతున్న సూక్తులు. వీటితోపాటు దశవిధ రూపాకాల్ని, నవరసాల్ని, చతురాభినయ విభాగాల్ని, నాయకానాయికలలక్షణాల్నిఉదాహరించడం కూడ మనకు ప్రాచీనతతత్వం నేర్పిన సత్సంప్రదాయం. జగమే ఒక నాటకరంగమని ప్రతీతి. నిజానికి కల్పనాశక్తితో, నటనాకౌశలముతో రంగస్థలంమీద జగత్తుగా భ్రాంతి కలిగించడం నాటకం. ఈ సౄజనాఅత్మక కళ సామూహికమైంది. రెండు దశల్లో వికాసం చెందుతున్న ఈ కళ, రచనాపర్వం మరియు ప్రదర్శనాపర్వం. తెలుగులో స్వతంత్ర నాటకరచన 1850 లో అంకురించిందని అనుకుంటే, దాదాపు రెండు దశాబ్దాల తదుపరి, ధార్వాడ నాటకసమాజాల ప్రేరణతో ముందడుగు వేసింది. కొత్తగా నాటకాలాడిన ప్రముఖుల్లో కందుకూరి వీరేశలింగం పంతులుగారు ఒకరు. 1883 లో వడ్డాది సుబ్బారాయుడు 'వేణీసంహారం' నాటకంలో పద్యపఠన్నాన్ని ప్రవేశపెట్టి కొత్త మలుపు తిప్పారు. దాదాపు ఈ రోజుల్లోనే ఆధునిక సాహితీయగకర్త గురజాడ వారు 'కన్యాశుల్కం' రచించడం, ధర్మవరం కౄష్ణమాచార్యులుగారు 'చిత్రనళీయం' లాంటి పాటపద్యాలతో కూడిన రసవత్తర నాటకాలు వ్రాసి అనేకమంది నాటక రచయితలు ప్రదర్శనకు దోహదం చేశారు.
ఆంధ్రనాటకరంగానికి మహాప్రసాదం - బళ్ళారి రాఘవ జననం
ఈ మధ్యకాలంలోనే ఆంధ్రులకు గర్వకారణమైన మహానటుడు జన్మిస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. అనుకున్నవి, అనుకున్నట్లు జరిగితే గొప్పేముంది. ఘటనలు, సంఘటనలు జరగవు. 1880 ఆగష్టు 2న సంఘటన జరిగింది. అదే బళ్ళారి రాఘవ జననం. తాడిపత్రి లో జన్మించిన రాఘవ తండ్రి నరసింహాచార్యులు, బళ్ళారి మున్సిపల్ హైస్కూలు లో తెలుగుపండితులు. అంతేకాదు, ఆనాటి ప్రముఖ ఆంధ్ర నాటక పితామహ ధర్మవరం రామకౄష్ణమాచార్యులు గారు, బళ్ళారి లో న్యాయవాది మరియు రాఘవకు స్వయంగా మేనమామ. బాల్యంలోనే నాటకాలంటే అమితాసక్తి గల రాఘవ బళ్ళారి లో మెట్రిక్యులేషన్ చదివి, మద్రాసులో పట్టభద్రులయ్యారు. మద్రాసులో చదువుతోబాటు,అనేక ఆంగ్ల నాటకాల్లో పాల్గొనడం, ప్రముఖ ఆంగ్రనటుల మెప్పులందుకోవడం, మద్రాసులో బి.యల్. లో వుత్తీర్ణులవడం అలవోకగా జరిగిపోయాయి. బళ్ళారిలో మేనమామ వద్ద వౄత్తిలో సహాయం, నటనలో సహచర్యం కూడ బళ్ళారిలో కళాకారుణ్ణి వెలికితీసింది. రాఘవ వౄత్తిరీత్యా న్యాయవాది. తాను నమ్మిన సిద్ధాంతాల మేరకు న్యాయంగా వున్న కేసులను మాత్రమే చేపట్టేవాడు. క్రిమినల్ లాయర్ గా బాగా పేరుతోపాటు ఆర్జనకూడ బాగా జరిగింది. ధనాన్ని తన ఆశయసిద్ధికై నాటకరంగ కళాభివౄద్ధికై వినియోగించాడు.
రాణించని రాజకీయప్రవేశం
న్యాయవాది, కళాకారుడు అయిన బళ్ళారి రాఘవ, మిత్రుల ఒత్తిడి, ప్రోత్సాహం యిచ్చి, 1933 లో మున్సిపల్ కౌన్సిల్ కు పోటీ చేయించారు. మిత్రుడు, ప్రముఖ వ్యాపారి, ముల్లంగి కరిబసప్ప అభ్యర్ధన చేయడం, స్థానిక ప్రజలు సహకారలోపం వల్ల, బళ్ళారి రాఘవ మనస్తాపం చెంది, వెంటనే ప్రచార దశలోనే, పోటీని ఉపసంహరించుకోవడం, ప్రత్యక్ష రాజకీయాలకు కడుదూరం అయ్యారు.
సంఘసంస్కరణాభిలాషి, విప్లవనటుడు, ఆంధ్రుల గర్వకారణం - బళ్ళారి రాఘవ
జాతి ప్రగతికి, మూఢాచారాల నిర్మూలనకు నాటకరంగం అత్యంత ప్రధనమైనదని ప్రకటించి, ప్రతి పట్టణంలోను అన్ని హంగులు కల నాటక రంగం స్థాపించాలని ముక్తకంఠంతో ఎలుగెత్తి చాటిన ప్రజానటుడు రాఘవ. పాత్రల మనస్తత్వాలను బాగా అర్ధం చేసుకుని, భావసంఘర్షణను ప్రదర్షిస్తూ నటనకు వెలుగు బాటలు వేసి, ఆబాటలోనే తాను కూడ పయనించిన తెలుగు తేజం బళ్ళారి రాఘవ. రాఘవ కవిపండితులకు అత్యంతాప్తుడు. ఆయన ఇంట్లో సాయంకాలం బళ్ళారిలోని కవిపండితులు సమావేశమై, 'కళ, నాటకం, తదితర సంబంధిత అంశాలపై ఆధ్యయనం చేయడం, అందరిని ప్రేమాభిమానాలతో పలుకరించడం ఆయన దినచర్య అనే చెప్పాలి. కులమతాల సంకుచితత్వాలకు అతీతుడాయన. హరిజన బాలురకోసం సొంతఖర్చులతో బడిని పెట్టించాడు. పండుగ రోజుల్లో హరిజన విద్యార్ధులందరికీ తన ఇంట్లో విందు చేశేవారు. పాత్రల మనస్తత్వాలను బాగా ఆకళింపు చేసుకుని, భావసంఘర్షణను ప్రదర్సిస్తూ నటనకు వెలుగు బాటలు వేసిన బళ్ళారి రాఘవ ఆంధ్రులకు చిరస్మరణీయుడు. స్త్రీపాత్రలు స్త్రీలే ధరించాలని చాటిచెప్పి, విద్యాధికులైన స్త్రీలను రంగస్థలమెక్కించి వాస్తవికతకు పట్టంకట్టిన విప్లవవేౠడు. సుదీర్ఘరాగాలాపనలు, అనవసర మోతలు లేని భావ ప్రధానమైన అభినయంతో ప్రేక్ష్జకులను రంజింపచేసిన వాడు నటుడు బళ్ళారి. కళలకోసం ఉదారత చూపిన రాఘవ, పెళ్ళిళ్ళో జరిపే దుబారా, ఆడంబర ఖర్చులకు దూరంగా వుండడమే కాక, శుభలేఖలు చేతివ్రాతతో ప్రారంభించడం, ఒక్క పెళ్ళికి 250 రూపాయలకన్న ఖర్చు చేయరాదని ఖచ్చితంగా చెప్పేవారు.
బళ్ళారి రాఘవ నటనాసోపానాలు
ఆధునిక నాటకరంగం బుడిబుడి నడకలు అందంగా వేస్తున్న తరుణంలోనే రాఘవ కూడ పాదం మోపాడు. మహారాష్త్ర, కర్ణాటక ప్రాంతాల నాటక సమాజాలు అంధ్రదేశంలో కూడా నాటక సమాజాలు వెలిసాయి. ధర్మవరం రామకౄష్ణమాచార్యుల వరి 'సరసవినోదినీసభా, కోలాచలంవారి 'సుమనోరమసభాల్లో మంచి అవకాశాలు రాఘవకు లభించడమే కాక, మద్రాసు, హైదరాబాదు, విజయవాడ, బెంగుళూరు ల్లో ప్రదర్శనలు ముమ్మరంగా యిచ్చేవారు. రాఘవకు పౌరాణిక నాటకాలకంటే, చారిత్రక, సాంఘిక యితివౄత్తాలపై మక్కువ, అభిరుచి వుండేవి. రాఘవ నటనాజీవితంలోని ముఖ్య సోపాన పర్వాలు యిలా నడిచాయి.
* విశ్వకవి రవీంద్రుని మెప్పించిన (1919) 'పఠాన్ రుస్తుం' పాత్ర ద్వారా 'విజయనగర పతనం' లోని నటనాభినయం అత్యధ్బుతమే కాక, హిందూ-ముస్లిం సఖ్యతకు భంగం కలుగుతుందన్న ప్రభావం, అనుమానం తో మద్రాసు రాష్ట్రప్రభుత్వం ప్రదర్శనను నిషేధించింది.
* నవరసాలు, ఒక్కొక్కటి వరుసగా తరుముకొని వస్తున్నాయని తలపించే 'చాణక్యా పాత్ర నటన రాఘవ మహానటుడని ప్రశంసింపబడ్డాడు.
* 'రామదాసూ పాత్ర ద్వారా భక్తిభావాన్ని గొప్పగా చూపిస్తూ, కొన్ని సన్నివేశాలను కల్పించడం, సమయానుకూలంగా రచనలో కూడా సందర్భోచితంగా మార్చడం ఆయన నవనవోన్మేషశైలికి సోదాహరణం. 'ఎవరి రాముడు వారిలో వుంటాడు - దేవుడొక్కడే, భక్తుల విశ్వాసాలకు తగినట్లు రూపం ధరిస్తాడూ అని చెబుతూ, రాం-రహీం, క్రీస్తు, బుద్దుడు - ఇవన్నీ ఆయన రూపాలు అంటూ మతసామరస్యాన్ని ప్రకటించడం మరవలేని సత్యం. జాతీయోద్యమకాలంలో, రామదాసు జైలులో వుండడం - 'ఆత్మసిద్ధి పొందడానికి కారాగౄహవాసమే ప్రధమ సోపానం' అనీ, తానీషా భటులు జైలుకు తీసుకువెళ్ళుతున్నప్పుడు భార్య కమలాంబ రామదాసు నుదుట కుంకుమ పెట్టి, ఖద్దరు శాలువా కప్పి, తెల్లని టోపీ తలపై పెట్టి, హారతి యివ్వడం, చాలా ఉత్తేజంగా మారాయి.
* రాఘవ ఆధ్యాత్మిక గురువు, పండిత్ తారానాధ్ రచన "దీనబంధ్ కబీఋ హిందీ నాటకాన్ని, బెంగుళూర్ లో (1927) ప్రదర్శిస్తున్నప్పుడు, గాంధిజీ నందిహిల్స్ లో విశ్రాంతి తీసుకొంటున్న సమయంలో ఆహ్వానం మీద, కొద్ది నిముషాలమేరకు వచ్చిన ఆయన గంటదాటినా కదలక, అప్పటి గాంధి కార్యదర్శి రాజాజీ 'ప్రార్ధనాసమయం' గురించి గుర్తుచేయగా, 'మనం ప్రార్ధనలోనే వున్నాం కదా!' అని చెప్పి, రాఘవ నటనకు అద్భుతశ్రేణి కేటాయించడం, 'రాఘవ మహరాజ్ కి జై' అనడం కూడ మరువలేని సంగతేకదా.
* పెక్కు నాటకాలను చూచి, ఆంగ్లనటుల పరిచయం సంపాదించుకోవాలనే ఉద్దేశ్యంతో చేసిన ఇంగ్లండు ప్రయాణం (1928), విఖ్యాత నాటకకర్వ, కళావిమర్శకుడు "జార్జి బెర్నాడ్ షా' తో రాఘవ కళల గురించి విశ్లేషణ జరపడం, 'కళల గురించి తెలుసుకోవడానికి యిక్కడికి ఎందుకొచ్చారు? మేమే ప్రాచ్యదేశాలకు రావాలి" అనడమే కాదు; 'మేరు దురదౄష్టం కొద్ది భారతదేశం లో పుట్టారు - ఇంగ్లండులో పుట్టివుంటే 'షేక్స్పియఋ అంత గొప్పవారై వుండేవారూ అని అనడం, బళ్ళారి రాఘవ నటనా ప్రతిభాపాటవాలు, చలం చెప్పినట్లు, తూచేందుకు తూనికరాళ్ళు దొరకవు. అనుభవించి, పలవరించవలసినదే, ఏ నాటకకళాభిమానియైనా.
* విజయవాడ, దుర్గాకళామందిరంలో, 'చంద్రగుప్తా లో చాణక్య పాత్రలో ప్రదర్శించిన 'సమయస్ఫూర్తీ అగణితం. ప్రళయకాలరుద్రినిలా నవనందులపై ప్రతీకారం కోసం తపిస్తున్న 'శ్మశానవాటీకా సన్నివేశం లో, అమాంతంగా, వేదికపైకి కుక్క రావడం, దానితో చలించక, 'శునకరాజమా,నీకు కూడా నేను లోకువయ్యానా?" అన్న సంభాషణలధాటికి, కుక్క తత్షణం వెడలినా, ప్రేక్షకుల సంభ్రమాశ్చర్యాదులను కరతాళధ్వనులతో దద్దరిల్లిన నాటకరంగమందిరం, మామూలు పరిస్థితికి వచ్చేందుకు చాలా సమయం పట్టిందట.
చిత్రసీమలో యిమడలేని స్వతంత్రనటనావైదుష్యం
మిత్రుల వత్తిడి పై చిత్రరంగంలో ప్రవేశించిన (1936) రాఘవ, హెచ్.యం.రెడ్డిగారి 'ద్రౌపదీ మానసంరక్షణం' లో దుర్యోధనుడుగా, గూడవల్లి రామబ్రహంగారి 'రైతుబిడ్డా లో/గాను, రాజరాజేశ్వరీవారి 'చండికా లోనూ, నటనలో అద్భుతంగా రాణింపు అయినా, సర్వస్వతంత్రధోరణి సహజంగా అబ్బిన రాఘవ మనస్సు పోలేదు. నాటకకళకే పున:ప్రవేశం చేశాడు. తిరుగులేని నటనను అందించాడు. నాటక కళాభివౄద్ధికి రాఘవ అనేక సూచనలను అందించాడు.
రాఘవ నటనాప్రతిభకు కితాబులు
@ రాఘవ స్మౄతి చిహ్నంగా బళ్ళారిలో కళామందిరం నిర్మాణం, భారతప్రభుత్వం, రాఘవ శతజయంతి సందర్భంగా 'తపాలా బిళ్ళా విడుదల, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ట్యాంకుబండ్ పై రాఘవ విగ్రహాన్ని స్థాపించడం, ఆయన నటనాకళాప్రతిభకు నిజ సంకేతాలు కావు. అల్పసంతోషుల్ని చేయడమే అనుకోవాలి.
కాలానుగుణంగా మార్పులు
ఆధునిక నాటకం, నాటిక, ఏకాంకికలుగా సన్నగిల్లడం, వామనరూపాన్ని పొందడం, నాటకరంగం కూడ అంతంతగా మార్పుపొందడం, కాలానుగుణంగా వచ్చిన, వస్తున్న ఊహలకందని మార్పుచేర్పులు, నాటకరంగం, నటరత్నాలు కొనసాగుతున్నా, బళ్ళారి రాఘవ లాంటి సంకల్ప దీక్షా కంకణ సమరబద్ధత్వ ధోరణి నాటకకళారంగం లో క్రమేపీ లోపిస్తున్నది అంటే కొందరికి ఆశ్చర్యం, కోపం కలగచ్చు కాని, సత్యానికి దూరం మాత్రం కాదు.
నాటకరంగానికి ఆకాశ పాతాళాల దిక్కులు
ఈ సందర్భంగా, మహాకవి శ్రీశ్రీ ఒక నాటకం చూస్తూండగా, ఒక నటుడు 'ఆకాశాన్ని చేత్తో చూపిస్తూ, పొరబాటున నేలమీదకు చూపించాడట. ఈ సన్నివేశానికి, మహాకవి వెంటనే, ఆ నటుడు చేసినది అలవాటు లో పొరబాటు మాదిరి, నాటకరంగస్థితిని యధాస్థితిగతుల్ని చూపించాడని చెప్పాడట. ఆకాశమే భూమిలోపల వుంటే, పాతాళం సంగతి ఏమిటి అని చమత్కరించాడట, మన మహాకవి.
'నాటకం', 'నాటికా ల చేసే పని, కలిగే ప్రయోజనం
'స్వీట్ బర్డ్ ఆఫ్ యూట్ అన్న నాటకం లో ప్రఖ్యాత నాతక రచయిత 'టెన్నిసీ విలియంశ్ తన ముఖ్య పాత్ర చేత, చివరగా చెప్పించే, భరతవాక్యం, 'నేను మీ దయాదాక్షిణ్యాలను అర్ధించడం లేదు. మీ అవగాహనను కోరుతున్నాను. అది కూడా కాదు, నన్ను, మీలో మిత్రునిగా, శత్రువుగా, కాలంపై, అన్నిటా గుర్తింపుచేసుకోవడం. అంతే" అని నాటకాన్ని ముగించాడు. దీనితో, అతను కధను ముగించలేదు, చివరికి ఎత్తుకున్న సమస్యలన్నీ అలాగే ఆగిపోతాయి. అయితే ఆ ముఖ్యపాత్ర మనల్ని ఎందుకో చివరంటా జిజ్ణాస కలిగిస్తూనే వుంటుంది. చివరికి పైవిధంగా ఆపాత్ర చెప్పాక ఒక్కసారి తుళ్ళిపడతాం, ఏం జరిగిందని ఆలోచించేలోగా నాటకం ముగుస్తుంది. తర్వాత ఆ పాత్రని గురించి, ఆసమాజం గురించి మనం ఆలోచించకుండా వుండలేం. ఆ ఆలోచనే, ప్రయోజనం, ప్రయోగాత్మకత, ప్రభావం, ప్రేరణాత్మకతలను కలిగిస్తాయి. కళ వల్ల మనకు కలిగే లాభం సరిగ్గా యిదే అని చెప్పక తప్పదు. యిటువంటి స్ఫూర్తిదాయక సంఘటనలు, బళ్ళారి రాఘవ నటించిన నాటక పాత్రల ద్వారా అందచేశాడు అన్నది చరిత్ర చెప్పిన సాక్ష్యం.
చివరి మాట కాదు - చివరిగా మరచిపోకూడని మాట
రక్తికట్టించే నాటకాలు, చాలావరకు మన నటుల పసవల్లనే కాని, నాటకాల పసవల్ల కాదేమో. నిజానికి పస తక్కువ నాటకాలే సమర్ధుడైన నటునికి అతని ప్రతిభావికాసానికి, ప్రాగల్భ్యప్రదర్శనకు ఎక్కువ అవకాశాలిస్తాయి. ఇది కొంతమందికి విడ్డూరంగా తోచవచ్చు. నిజనిష్టూరం. కాని, యిదే అభిప్రాయం ప్రపంచవ్యాప్తంగా వుందనే అనుభవశీలురు తరచు చెప్పుతుంటారు.
ప్రపంచ ప్రసిద్ధ నటశేఖరుల్లో ఒకరైన 'శ్టానిస్లొవస్కీ' (మాస్కో ఆర్ట్ థియాటర్ సంస్థాపకు లిద్దరిలో ఒకడు) అన్న మాట : 'మహానటుడే మెలోడ్రామాను జయప్రదం చెయ్యగలడు. సామాన్యనటుడు మెలోడ్రామాలో నెగ్గుకు రాలేడు. దానిలో లేని ఎత్తులను, లోతులను మెలోడ్రామాలో నటుడైనవాడు ఊహాకల్పన చేసి చూపించాలి. దానిలోని పాత్రలకు లేని బిగిని, పసను అతడే ఇవ్వాలి. ఇది సామాన్య నటులకు అసాధ్యం."
పైన వివరించిన మెలోడ్రామా, దానిలోని ఎత్తులు, లోతులు, వాటిల్లోంచి వచ్చే ఊహాకల్పనలు, పాత్రద్వారా అందించే బిగి, పస, యీవన్నీ, మహానటుడైన బళ్ళారి రాఘవ చుట్టూ అనేక ప్రదక్షణాలు చేశాయి.
1946 ఏప్రిల్ 16 న ఆ మహానటవౄక్షం, బళ్ళారి రాఘవా కన్నుమూశాడు. నాటకకళకి కళతప్పింది. నాటకరంగస్థలావేదికభాగం కొంచెం ఒక మెట్టు దిగింది. కాని, నాటక కళా ప్రక్రియ ఏరూపంలో వున్నా, నటనాభినయపర్వం, బళ్ళారి రాఘవను స్మరించని క్షణం లేదు. రాదు. రాకూడదు.
మహానటశేఖరుడు బళ్ళారి రాఘవ జయంతి సందర్భంగా తెలుగురధం ఘననివాళిని సమర్పిస్తోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.

No comments: