Thursday, July 3, 2008

కవితా తిలకం - బాల గంగాధరం.

యువ కవి లోక నిత్య ప్రాతినిధ్యం - బాల గంగాధర తిలకం
ఉత్తమ విద్య కవిత్వం
విద్యల లోపల ఉత్తమ విద్య కవిత్వం అంటాడు అనంతుడు. ఎలా చెప్పినా హృద్యంగా కవితను చెప్పగలగాలి అన్నది మాత్రం అవశ్యం. కవులలో అనేక రకాలు, వర్గాలు. కాని కొద్దిమంది మాత్రమే సమస్త వర్గాలకు సరిసమంగా ప్రాతినిధ్యం వహించగల సత్తా, సాధికారత లభిస్తాయి. ఆ కొద్దిమంది కవుల్లో ప్రధములు - దేవరకొండ బాల గంగాధర తిలక్ అని మాత్రం చెప్పక తప్పదు.
శ్రీ శ్రీ నుంచి అభినందనలు
"యువకవి లోక ప్రతి నిధి, నవభావామృత రసధుని కవితాసతి నొసట నిత్య రసగంగాధర తిలకం, సమకాలిక సమస్యలకు స్వచ్ఛస్ఫాటికా ఫలకం" అంటూ జవాబు రాని ప్రశ్న ని తిలక్ ప్రతిభను అన్యాపదేశంగా శ్రీ శ్రీ చెప్పడం మాత్రం విశేషం అనే చెప్పాలి.
అర్ధం + పరమార్ధం = తిలక్
నిర్ధారించుకున్న అర్ధ, పరమార్ధాల్ని భాషా శైలిలో రచించిన కవి తిలకం బాల గంగాధరం. కవులు అందించిన భావ, అభ్యుదయ భావాల్ని అంతర్లీనం కావించుకో గలిగిన - ప్రతిభా కవి దేవరకొండ. అందుకే, దయాపారావతాలు, ఐరావతాల తో పాటు, వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లల్ని తన అక్షరాలు అని సరసంగా చెప్పుకో గలిగాడు.
కవన ఘోష
తిలక్ తన కలం తో, కవిత, కధానిక, నాటక, నాటిక, లేఖా ప్రక్రియల ద్వారా తన కలం ద్వారా కవనామ్రుతాన్ని చిందించారు. సుందరి-సుబ్బారావు ల మధ్య సుచిత్ర ప్రణయాన్ని సృష్టించారు. లేఖలు రాయించారు. ప్రభాత సంధ్యా కాలంలో మధురరసాన్ని రసాలూరించారు. సుశీల పెళ్ళికి పెద్దరికం నిర్వహించారు. ఊరి చివర ఇల్లు నిర్మించి, సుప్త శిల తో పాటు సాలె పురుగుని కూడా ప్రతిష్టిన్చారు. గోరు వంకలకు చూపిస్తూ, కతినోపనిషత్తు ని ప్రవచించారు.
ఉత్తమ కవితా సంపుటి గా పురస్కారం
తిలక్ రచించిన 'అమృతం కురిసిన రాత్రి' కవితాసంపుటి, తిలక్ మరణం తర్వాత ప్రచురించినా, కుందుర్తి సంపాదకీయంలో సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ౧౯౭౧ లో లభించడం తిలక్ భావ ప్రతిభా పరంపరకు తార్కాణం.
దేవులపల్లి ప్రభావం, శ్రీ శ్రీ ప్రేరణ ల మిశ్రమంతో ఉన్నత శిఖరాలను అధిరోహించ గలిగిన అసమాన ప్రతిభా కవి మూర్తి - దేవరకొండ బాలా గంగాధర తిలక్.
పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు దగ్గర మండపాక లో ౧౯౨౧ ఆగష్టు ౧ న జన్మిచిన తిలక్, ౧౯౬౬ జూలై ౧ న కవితాలోకం నుంచి నడిప్రాయం లోనే మనల్ని వాడాలి వెళ్ళిపోయిన, ఆయన కవితలు మాత్రం సాహితీ ప్రేమికుల మనసుల్లోను, హృదయాలోను నిత్యం సంచరిస్తూనే ఉంటాయి.
మహాకవి దేవారకొండ బాలునికి సాహితీ రస గంగాధర తిలకానికి నమస్సుమాన్జలుల్ని తెలుగురధం సమర్పిస్తోంది.
కొంపెల్ల శర్మ. - తెలుగురధం.

No comments: