మా తెలుగు తల్లి గీతాచార్య - 'శంకరంబాడి సుందరాచార్యా వర్ధంతి (1977 మార్చి 8)
మా తెలుగు తల్లికీ మల్లెపూదండమా కన్నతల్లికీ మంగళారతులుకడుపులో బంగారు, కనుచూపులో కరుణచిరునవ్వులోసిరులు దొలరించు మా తల్లి.
గలగలా గోదారి కదలిపోతుంటేనుబిరాబిరా కౄష్ణమ్మ పరుగులిడుతుంటేనుబంగారు పంటలే పండుతాయిమురిపాల ముత్యాలు దొరలుతాయి.
అమరావతీ నగరి అపురూప శిల్పాలుత్యాగయ్య గొంతులో తారాడు నాదాలుతిక్కయ్య కలములో తియ్యందనాలునిత్యమై, నిఖిలమై నిలిచియుండేదాక.
రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తితిమ్మరుసు ధేయుక్తి,కౄష్ణరాయల కీర్తిమా చెవుల రింగుమని మారుమ్రోగేదాకనీ పాటలే పాడుతాం నీ ఆటలే ఆడుద్దంనీ పాటలే పాడుతాం నీ ఆటలే ఆడుతాంజై తెలుగుతల్లీ, జై తెలుగుతల్లీ.
- శంకరంబాడి సుందరాచార్య.
కాకతీయుల తర్వాత చెల్లాచెదురైన తెలుగు జాతి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో మళ్ళీ ఒకేచోటకు, ఒకే నీడకు చేరుకుని అఖండ జాతిగా అవతరించినది. శుభకరంగా, సుందరంగా, సుఖప్రదంగా నిర్మించుకుంటూ, భవిష్యత్తును అఖండంగా ఊహించుకుంటూ పురోగమిస్తున్నది. అటువంటి ఆంధ్రవైభవాన్ని, పలువురు కవులు, కవయిత్రులు కొనియాడుతూ తమ భావాల్ని వివిధ సాహితీప్రక్రియల ద్వారా అంధ్రప్రదేశ్ లోనే కాదు, విశ్వవ్యాప్తంగా మారుమ్రోగేటట్లు దశదిశలా వ్యాప్తి చేయడం జరుగుతూంది.
తెలుగుతల్లిని - సాధుజన కల్పవల్లి గాను, లలిత సుగుణజాల, తెలుగు బాలగాను వర్ణించారు. అలాగే తెనుగుదనం వంటి తీయదనము లేదు, తెనుగు కవులవంటి ఘనులు లేరు అని కూడ అన్నారు.
'సుందరామయం ఈ తెలుగుతల్లి, ఆయన బిడ్డ
తెలుగుతల్లిని వర్ణించడం కేవలం మాటల వల్ల సంభవం కాదు. అలోచనలు, భావాలు, అనుభూతులద్వారానే తెలుగుతల్లి సమగ్ర సంపూర్ణ రూపాన్ని ప్రతిష్టించడం సాధ్యం అవుతుంది. అటువంటి తెలుగుతల్లి స్వరూపాన్ని, తనదైన భావాల్ని పొందుపరచి, సరళ సుందరశైలీస్థాయిలో వర్ణించి, తన కవితను చిరస్థాయిగా సుస్మరణీయం చేసుకున్న అర్హత, సాధికారత ఎవరికో కాదు, కేవలం, ఒకే ఒక వ్యక్తికి చెల్లుతుంది. ఆయన సామాన్యుడు, మధ్యతరగతి జీవి మధ్యగతిలో చిందిస్తున్న మందహాసం పుష్కళంగా ప్రకటించిన వ్యక్తి, జీవనోపాధికోసం గావించిన ఉపాధ్యాయవౄత్తి తోపాటు, ప్రవౄత్తిగా దేశభక్తి, సాహిత్యంపై మక్కువ, తెలుగు భాషాసంస్కౄతులపై మహామక్కువ, ప్రేమ, గౌరవాభిమానాలు. ఈ వన్ని కలసి, రూపొందిన వ్యక్తి. ఆయనే - శంకరంబాడి సుందరాచార్య.
తెలుగుతల్లి విశిష్టత
శంకరంబాడి వారు అలవోకగా రచించిన భావోద్వేగపూరిత రచన 'మా తెలుగుతల్లికి మల్లెపూదండా అన్న భావకవితకు ఆంధ్రదేశం నీరాజనం పట్టుతుంది అనిగాని, ఈ కవితను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆస్థానకవితగా ఎన్నుకుంటుందని గాని, సుందరాచార్యులకు ఎన్నడు కలనైన భావం వచ్చి వుండదు. ఈ దత్తత సమాన స్వీకారం, తెలుగుతల్లికి, తెలుగుతల్లి ముద్దుబిడ్డలకు కూడ సంతోషజనకమైంది. తెలుగు మనసు, తెలుగు హౄదయస్పందన వున్నంతకాలం ఆచార్యులవారి కవిత దర్శనీయమవుతూనేవుంటుంది.
తెలుగుతల్లిని తీర్చిదిద్దిన తీరుతెన్నులు
కరుణ, చిరునవ్వులు, సిరులు దొరలించు బంగారు కడుపు పేగు కలిగిన మా తెలుగు తల్లి కి మల్లెపూదండతోపాటు, మంగళారతుల్ని ప్రసాదించారు. శంకరంబాడి వారు, తన భావకవితలో, గోదారిని గలగలా కదలించారు. బిరబిరా పరుగులెట్టించారు, కౄష్ణవేణమ్మను. మరి సస్యశ్యామలం, సుసంపన్నత, నిత్యకళ్యాణం, పచ్చతోరణం రావలసినదే. బంగారుపంటలు పండినప్పుడు, కర్షక సుక్షేత్రాల్లో ముత్యాలు దొరలవలసినదే. అజరామరమైన లలితకళలైన - శిల్పం, సంగీతం, కవిత్వం వెరసి సోదాహరణంగా - అమరావతినగరాన్ని, త్యాగయ్యగొంతుని, తిక్కన్న కలాన్ని ముప్పేటలల్లారు, బహు అపురూపంగా, నాదభరితంగా, మధురరసాస్వాదనంతో అలరించారు. సంస్కౄతీకళాపర్వాలతో పాటు, ఆచార్యులవారు - భక్తి, శక్తి, యుక్తి, కీర్తిని చతురంగ బలాల్ని అతి చతురతతో రంగరించారు. మరువలేని మాణిక్యాలను - రుద్రమ్మ, మల్లమ్మ, తిమ్మరుసు, రాయలను తనదైన చతులశైలితో రచనను అల్లారు. ఇన్ని సొబగులు పొందిన శంకరంబాడి వారి తెలుగుతల్లి వైభవం రింగురింగుమని మారుమ్రోగుతూనే వుంటుంది. తెలుగుతల్లి ఆటపాటల్ని జరుపుకుంటూనే వుంటారు మన ముద్దు బిడ్డలు. తెలుగుతల్లికీ, తెలుగుతల్లికవితానిర్మాత - శంకరంబాడి సుందరాచార్యులకు, శతసహస్ర వందనాభివందనాల్ని అర్పించుకొంటూనే వుంటాం. వుండాలి. శంకరంబాడి సుందరాచార్యులవారు తెలుగుతల్లిని, తెలుగుప్రజలకు 1977, ఏప్రిల్ 8, న భౌతికంగా దూరమయినా, ఆచార్యవ్యక్తిత్వం ఆచంద్రతారార్కమై నిలుస్తుంది. తెలుగువైభవం, తెలుగుదనం, 'మాతెలుగు తల్లీని గానం చేసినప్పుడల్లా, స్మరించినప్పుడల్లా, మనందరి ముందు ఆచార్యులు వారు, తెలుగుతల్లితో పాటు ప్రత్యక్షం అవుతారు. యిది తధ్యం. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఈ రోజు నివాళి అందించాల్సిన సమయం.
జై తెలుగుతల్లీ!
కొంపెల్ల శర్మ - తెలుగురధం.
No comments:
Post a Comment