ప్రపంచ ఆరోగ్య దినం - 7 ఏప్రిల్
ఆరోగ్యమే మహాభాగ్యం
'ఆరోగ్యమే మహాభాగ్యం' అన్నది ప్రాచీనమైన నానుడికి వివరణ అన్యధా అనవసరం. ధౄఢమైన, ఆరోగ్యవంతమైన శరీరం ఒక మహాసామ్రాజ్యం - అన్నాడు గోల్డ్ స్మిత్. శారీరక మౌఢ్యమే సోమరితనం; మానసికమైన సోమరితనమే మౌఢ్యం అని కూడ ఒక అనుభవజ़్జుడు పలవరించాడు. మనలోని సహజశక్తులే మన అనారోగ్యానికి నిజమైన ఔషధాలు అన్న సహజమైన సత్యాన్ని మనందరం మరచిపోయామన్నది అక్షరాల నిజం. అందుకే, అనారోగ్యంలో మనం ఏమిటో నిజంగా తెలుస్తుంది, అని ఇటాలియన్ సామెత ఒకటి వుంది. అది నిజమే కదా. వ్యక్తికి అనారోగ్యం ఆవహిస్తే, దానికి వ్యతిరేకంగా వైద్యుడేకాదు, రోగికూడా పోరాటం చేయాలి. అందుకనే, అనారోగ్యం దరికి రాకుండా, నివారణ, జాగ్రత్త చర్యలు చేపట్టవలసిన అవసరాన్ని వారి వారి ఆరోగ్యం దౄష్ట్యా గుర్తించాలి.
ఆరోగ్యం - అనారోగ్యం మధ్య
దేహం ఒకటి వుందని గుర్తుకు రానీయక పోవడమే ఆరోగ్యం అని అంటాడు ప్రముఖ చలం, మ్యూజింగ్స్లో. నిరంతరం గుర్తుకు వచ్చేలా చేసుకోవడమే బహుశ అనారోగ్యానికి తార్కాణం అనే చెప్పాలి కదా. చికిత్స అనారోగ్యంకన్నా హీనమైంది అని గుర్తించాలి. ఆరోగ్యం మాట ఎలా వున్నా, అనారోగ్యపు ఛాయల గురించి ఆలోచించకూడదు. అస్సలు బాగా తిని తాగడమే ఆరోగ్గేనికి సూత్రం అని రావిశాస్త్రి, బంగారిగాడికత లో ప్రస్తావించాడు. ఈ భావాన్నే, ఎప్పుడో - యధాకాల భోజనం ఆరోగ్యపదం - అని చరకుడు అభిప్రాయపడ్డాడు. మందులతో బతకటం మాత్రం ఘోరసమానం. పంటినొప్పికి ఓర్పుతో చికిత్స చేసే తత్వవేత్త ఇంకా పుట్టలేదు అని అంటాడు షేక్స్ పియర్. ఎవడి పన్ను నెప్పి వాడికే తెలుస్తుంది. హుటాహుటిన పీకేసే దంతవైద్యుడికి ఏమి తెలుస్తుంది. పీకేసిన దంతాలకు ఖరీదుకట్టిన మొత్తం ఎలా వసూలు చెయాలా అని సతమతమవుతూండారు, మన దంతమంతులు.
ప్రపంచ ఆరోగ్య దినం ( ఏప్రిల్ 7 ) సందర్భంగా అందరం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాక, అనారోగ్యంతో బాధపడుతున్న బీదప్రజానీకానికి ఎవరికి తోచినంత సహాయ సహకారాల్ని అందించాల్సిన అవసరాన్ని గుర్తించి కార్యోన్ముఖులుగా మారి, ముందుకు నడవండి, నడిపించండి.
ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా, అందరికీ ఆరోగ్యవంతమైన, సుసంపన్నమైన జీవితాన్ని ప్రసాదించాలని సకల దేవతామూర్తుల్ని ప్రార్ధిస్తున్నాం.
కొంపెల్ల శర్మ - తెలుగురధం.
No comments:
Post a Comment