Thursday, April 17, 2008

మహావీర జయంతి (క్రీ.పూ. 599 - 527) - 18 ఏప్రిల్

మహావీర జయంతి (క్రీ.పూ. 599 - 527) - 18 ఏప్రిల్
జైనమతప్రాముఖ్యత
భగవాన్ రిషభదేవ్ తో ప్రారంభమై, జైనమత సారాంశాన్ని తన బోధనల ద్వారా ప్రాభావితంచేసిన 24 మంది తీర్థంకరుల వరసలో, భగవాన్ మహావీర్ ఒకరు. వందల సంవత్సరాల క్రితం, భారతదేశం అంతటా, ముఖ్యంగా దక్షిణప్రాంత రాష్ట్రాల్లో, వీరవిహారం చేసిన ప్రముఖ మతవాదాల్లో 'జైనమతం' ఒకటి. శతాబ్దాలక్రితంనాడు కన్న, జైనమత సూత్రాలు, నేటి సమాజానికి అత్యంత అవసరం అన్న భావనను అంగీకరిస్తున్న వారు అధికం అవుతున్నారు.
జైనమతవాదానికిచ్చిన అసలైన సిసలైన రూపం
సకల రాజభోగభాగ్యాలను వదులుకొని, మానవత్వం కోసం పరితపించి పుష్కరకాలంపాటు కఠోర తపస్సును విజయవంతంగా నిమగ్నమై మోక్షాన్ని సాధించిన ప్రజ్ణావంతుల్లో మహావీరుని పరిగణిస్తారు. తన అఖండ జ్ణానసంపదతో, అన్ని రాజ్యప్రాంతాల్ని దర్షించి, జైనమతబోధనల్ని ప్రచారం కావించి వారికి విశ్వాసపాత్రుల్ని చేయడం మరువలేని విషయం. స్వామి రిషభదేవ్ మొదటి తీర్థంకరులయినా, మహావీరులు తనదైన శైలి ద్వారా జైనమతానికి ఒక కొత్త వొరవడిని, ప్రాభవాన్ని ప్రసాదించారు.
అహింసావాదమే మతవేదం
మహావీరులు 'అహింసా పై అత్యధిక ప్రాధాన్యమివ్వడం, సత్యాచరణ, స్వచ్చతకూడిన జీవితం గురించే నిత్యం ప్రభావితంగా ప్రచారం చేసేవారు. సర్వ జీవకోటికి సురక్ష విధానాన్ని ఆచరించడం అన్నిటికన్న సర్వోచ్చ మతవాదం అని విశ్వసించేవారు. దయ, జాలి, సహాయ సహకారాలపై ఆయన నీతి సూత్రాలు ఆధారపడేవి.
బాలుని పేరు 'వర్ధమానామే
'వర్ధనామాపుట్టుక పేరైతే, ప్రస్తుతం బీహారు లోని ముజఫరపూర్ - వైశాలి దగ్గరగా 'కుందుగ్రాం' లో జన్మించిన వర్ధమానుడి తండ్రి క్షత్రియ కుల 'జనత్రికా జాతికి సంబంధించినవాడు కాగా, తల్లి 'త్రిశీలా 'లిచ్చవీ జాతి స్త్రీ. వర్ధమానుడు కేవలం ఐదు వసంతాల ప్రాయంలోనే గురుకుల విద్యను ప్రారంభించాడు. ప్రముఖ సంస్కౄతపండితుడుగా విరాజిల్లాడు. సంపూఋఋర్ణ ఆధ్యాత్మికతవైపు మొగ్గుచూపాడు. 'యశోధరా రాజకుమారిని పరిణయం చేసుకుని, పుత్రికను కూడ పొందాడు.
వర్ధమానుడు, మహావీరుడు గా మారిన వైనం
మూడుపదుల ప్రాయం వరకు, వర్ధమానుడు అందరిలాగే సామాన్యజీవితాన్ని గడపిన తదుపరి, యింటిని, భార్యాపుత్రికలను వదలి, జ్ణాన, మోక్షసిద్ధికై ప్రయాణం కావించాడు. అనిర్వచనీయమైన కఠోర క్రమశిక్షను విధించుకుని, పుష్కరకాలంపాటు, భక్తి ధ్యాన పరంపరను ప్రదర్షించుకుంటు, తపస్సును కావించిన తపోముని. అమాంతంగా, నదీతటాన 'శాలినీ' వౄక్షపు చాయలో 'కైవల్యమోక్షం' కలిగింది. ఆక్షణం నుంచి 'వర్ధమాన" దశ నుంచి 'మహావీరా, 'అధిష్టాతనాయకుడూ గా ఉద్భవించాడు. తనదైన వ్యక్తిత్వాన్ని వదలి, తననుంచి తాను స్వతంత్రుడై, సు:ఖదు:ఖాదులను వదలుకుని అతీతస్థాయీదశకు చేరుకున్నాడు. మూడు దశాబ్దాల తదుపరి మహావీరుని పవిత్రజీవితం 'జైనమతం' ప్రముఖ సూత్రావళిని ప్రబోధిస్తూ, ప్రచారం కావిస్తూ, మనసా వాచా కర్మణా ఆచరిస్తూ ఆధ్యాత్మిక సంచారాన్ని ప్రభావితంగా నిర్వహించాడు. తన సంచారయాత్రలో మగధ ప్రభువు 'బింబసారా ని కలిసి, ప్రబోధం చేయడం కూడ ప్రముఖ ఘట్టంగా నిలచిపోయింది. క్రీస్తు పూర్వం 599 లో జన్మించిన 'వర్ధమాన-మహావీఋరుడూ క్రీ.పూ. 527 న నిర్వాణితులయ్యారు.
పంచసూత్రాలు
సరియైన విశ్వాసం, ప్రజ్ణానం, నడత ను బోధించిన మహావీరుడు జైనమతవాదం లో ప్రముఖంగా పంచసూత్రాల్ని వివరించాడు. ప్రతి గౄహస్తుడు విధిగా ఆచరించవలసినవి - అహింస, సత్యం, అచోరగుణం, నిష్కామధోరణి, గుర్రాలైన కోరికలకు, అపరిమిత కోర్కెలకు సంకెళ్ళను వేయడం, అని నిర్వచించాడు. మహావీరుని జీవితంతోబాటు, నిత్యం ముడివేసుకున్న - అహింస, సత్యవాదం లేక అనేకాంతవాదం, అపరిగ్రహతత్వం, మోక్షసిద్ధికై ఆచరించవలసిన ముఖ్యసూత్రాలని నొక్కి వక్కాణించాడు. మానవుడు తన ప్రస్థానానికి తనే బాధ్యుడు. జాతి, కుల, వర్గ, లింగ విచక్షణ లేని వివక్షతరహిత సమాజాభ్యుదయ సాధనకు మతం అందరకు సమ్మతమయితే అంతకన్న ఆనందానుభూతి మరొకటి లేదు. అందరితోనూ మిత్రత్వమే కాని, ఎవ్వరితో శతౄత్వధోరణి గురించి ఆలోచించరాదని మహావీరుడు బోదించాడు. జీవితంలో ప్రతి అంశానికి, కార్యానికి ఒక సహజత్వం వుంటుందని, అప్పుడప్పుడు విరోధాభాసం సంభవిస్తుందని, ఎల్లప్పుడూ వీటిని వర్ణించడం సాధ్యం కాదని ఆయన భావన. ఆర్ధిక అసమానతలు, సమాజజీవన ధోరణుల్లో అశాంతిని రేపేవని మహావీరుడు విశ్వసించేవాడు. ఈ ధోరణులకు 'అపరిగ్రహితా విధానం ఒక్కటే శరణం అంటారు. సర్వారోగనివారిణి, సంజీవని ఈ శైలే అంటారు. కనీసావసరాలకు కావలసిన ధనాన్ని సమాజం నుంచి స్వీకరించి, ధనశేషాన్ని తిరిగి సమాజానికి అందించాలన్న గొప్ప భావన కలిగినవారు. అప్పుడే సమాజ సంక్షేమం, సమాజాభివౄద్ధి సుసాధ్యమవుతాయంటారు. విశ్వ కళ్యాణానికి, విశ్వశాంతికి, సమసమాజనిర్మాణతకు మహావీరుని జైనమతప్రబోధాలు నిత్యం ఆచరణీయాలే. లక్ష్యసిద్ధి, లక్ష్యశుద్ధి లతో ఈ మహాశయుని ఆశ, ఆశయాలను ఆచరించినచో, మహావీరునిలో ప్రతి మానవమాత్రుడు 'మహామనీషీగా విరాజిల్లుతాడు.
ప్రతియుగంలోనూ, మహావీరునిలాగున ప్రవర్ధమాన ప్రబోధకులు, తపస్సంపన్నులు జనిస్తారని, తనదైన ముద్రలను విడిచిన తక్షణమే, నిత్య, సత్య, సత్వర గతిని మనసా వాచా కర్మణా ఆచరించిన, భారతదేశానికి, సౌభాగ్య, సౌభ్రాత్రతలు నిత్యం తధ్యం.
కొంపెల్ల శర్మ - తెలుగురధం.

1 comment:

Siva said...

మీరు "font size" కొంచెం పెంచితే చదవటానికి సౌకర్యంగా ఉంటుందని నా అభిప్రాయం.

Also please change the settings of comments so that non-google users can also post comments