'ఆల్ ఫూల్స్ డే' - ఏప్రిల్ ఫూల్స్ డే (ఏప్రిల్ 1 సంబరాలు)
అందరూ వెధవాయలే!
పండుగలు - అర్ధంకానివి, అనర్ధకాలు
చరిత్రలో ఒక్కో రోజు ఒక్కొక్క విషయానికి ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ప్రముఖ వ్యక్తి జయంతి, వర్ధంతి, అన్వేషణ, ఘనకార్యం, తలమానికం, ఏదైనా కావచ్చు. చరిత్ర తనలో యిముడ్చుకున్న పద్ధతుల్ని బట్టి దాని ప్రాధాన్యత రకరకాలుగా ప్రభావం చూపుతుంది. ఒక్కొక్క సంఘటన ప్రయోజనాన్ని, మరొకటి ప్రయోగాన్ని అందజేస్తుంది. కొన్ని, వ్యర్ధం, అనర్ధాల్ని అందింస్తుంది. ప్రయోజనం లేని ప్రయోగాల్ని అందిస్తుంది. వాటినే చరిత్ర భద్రపరచుకుని, వార్షీకాన్ని నిర్వహిస్తుంది కూడ. అటువంటి ప్రతిఏటా ప్రత్యక్షమవుతున్న రోజు - 'ఆల్ ఫూల్క్స్ డే' అని ప్రతి ఏప్రిల్ 1వ తేదీన జరుపుకునేది.
'వెధవాయీతనానికి పండుగల్లో కేటాయింపు
ఒక్కొక్క మాటకు చరిత్ర వుండదు. వాటంతట అవే చరిత్రలో చొచ్చుకుపోతాయి. ఏ తెలుగు నిఘంటువు లోనూ కనపడని పదం - 'వెధవా అన్నది. దీనికి అర్ధం మాట ఎలా వున్నా, లింగ నిర్ధారణ కూడ చేయలేము. కొన్ని మాటలు వాడకం లో ప్రజల నాల్కలమీద నిత్యం నాని, నాట్యం చేస్తూనేవుంటాయి. ఈ పదం అటువంటిదే అని అందరూ అంగీకరించవలసిందే. కాదన్న మాదన్నలకు అన్యధా వాదించలేరు కనక. ఏదైనా, పండుగ వచ్చేసింది. జరుపుకోండి. యిటువంటివి కలికాలంలో వస్తాయని, గ్రహించి, ముందుచూపుతో, భగవద్గీత లో శ్రీకౄష్ణభగవానుడు, అర్జునునికి చెప్పవలసిన ఉపదేశాన్ని బోధించి, చివరకు - 'యధేచ్చసి తధాకురు" అని - 'నీకు ఏది యిష్టమో అది చేసుకో!" అన్నాడు గీతాచార్యుడు. యిదే మాటని కన్యాశుల్కంలో మహాకవి గురజాడ తెలివిగా, 'తాంబూలాలిచ్చేశాను, తన్నుకు చావండి!' అనిపించాడు, అగ్నిహోత్రావధానుని నోటినుంచి.
పదే పదే ఆమాటే!
కన్యాశుల్కంలో, గిరీశం పాత్రని మెచ్చుకోనివారు వుండరు. ఆశ్చర్యం ఏమిటంటే, గిరీశం పాత్రద్వారానే, ఈ 'వెధవామాటలు పదే పదే వస్తాయి. మచ్చుకు - 'మనవాళ్ళు వట్టి వెధవాయలోయ్' అన్న గిరీశం మాట నేటికీ రిజర్వ్ బ్యాంకు కొత్తనోటులా జరజర చెలామణి అవుతున్నది. సాధారణంగా, మగవాణ్ణే మనం 'వెధవా' అని తిట్లు తిడుతుంటాము. 'వెధ్వల్ అన్నది లాటిన్ మాటండి, ఆ మాట కర్ధం కచేరీలూ అన్న బుకాయింపులు కూడ తరచు కోతలు కోస్తుంటాము. గురజాడవారు, 'వెధవలకి మఠం కట్టారటాఅని, వితంతువు ప్రస్తావనలో 'వెక్కిరించే వెధవల నోళ్ళలో వుందీ అని చురకలు వేయిస్తాడు. 'మొగాడు వెధవేమిటి? అది కేవలం స్త్రీ లింగం' అని బుచ్చిబాబు అన్నాడు. పానుగంటి వారి 'సాక్షీ సాహితీవ్యాసాల్లో, అనేకచోట్ల 'వెధవాల భాగోతం వుంది. మన చాటువుల్లో కూడ, వెధవలను విధం విధంగా వర్ణించారు. మచ్చుకు - మడ్డి, బడుగు, కొంటె, మేటి, శుద్ధ, వట్టి, పంద, వుత్త, పంజి, ముష్టి, అంటు వెధవలని చెప్పిన మాట చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొచ్చారు, మన వ్యంగ సాహితీకారులు. కేవలం వర్ణనలకు, పాత్రలకు మాటలు అని చెప్పలేదు. పాత్రలకు ఆ సమర్ధతలున్నాయి కనుకవే, వారిని ఈ గుణాలతో గుణించారు.
ఆంగ్ల పదం 'ఫూళ్ అంటే అర్ధం ఏమిటి ?
మూర్ఖుడు, మూఢుడు, తెలివితక్కువమనిషి, అవివేకుడు, అనాలోచితుడు, అని వివరించారు పదకోశనిర్మాతలు.ఈ 'వెధవా మహనీయుల నివాసాన్ని గాలిమేడ, గంధర్వ గౄహం, నగరం అని కూడా చెప్పారు. దీన్ని బట్టి మనవాళ్ళు వట్టి వెధవాయిలు కారు, మహాగట్టి వెధవాయిలే.
వెధవలకు అత్యధిక గుర్తింపు ?
ఒక్కొక్కసారి, మూర్ఖులు, మూఢులు చేసే తప్పు పనికి గుర్తింపు వస్తుంది. తెలివైనవాళ్ళు ప్రదర్శించే జ్ణానం మెప్పు పొందదు. అన్నివేళలా 'నిజం' చెప్పే సత్యహరిశ్చంద్రులు, తరచుగా యిబ్బందులు పడతారు. అందుకే, శాస్త్రకారుడు, 'వారిజాక్షులందు, వైవాహికములందు, చకిత గోకులాగ్ర రక్షణమందు ... ఆడి బొంకవచ్చూ అని ఆపద్ధర్మసూత్రం చెప్పినప్పుడు, మనం తరచుగా మన పిల్లలను, వాడు అస్తమానం అబద్ధాలు వల్లిస్తాడు, వొట్టి వెధవాయ్' అన్న దాంట్లో ఎంత సమంజసం అన్నది వారి విజ్ణతకే వదిలేయాలి. ఎమైనా అబద్ధాల పుండాకోరులు నిజాయితీపరులుగా, సత్యసంధులుగా చలామణిగా రాణిస్తున్న కలికాలం. అన్నీ వుంటాయి. ఏవీ తప్పవు.
'ఆల్ ఫూల్స్ డే' కధ, కమామీషు
ఈ రోజు ప్రారంభమయిన విధానం మీద సరియైన ఆధారాలు లేకపోయినా, విశ్వవ్యాప్తంగా పండుగలమాదిరి సంబరాల్ని జరుపుకోవడం జరుగుతోంది. 1564 లో తొమ్మిదవ చార్లెస్ చక్రవర్తి గ్రెగరియన్ కేలండర్ ప్రకారం కొత్త సంవత్సరంను ఏప్రిల్ ల్ నుంచి జనవరి 1 కు మార్చాడట. ఉత్తర అమెరికావాసులు, ఫూల్స్ డే ను చాలా బాగా జరుపుకుంటారట. ఫ్రాన్స్ లో పిల్లలు సరదాగా జరుపుకుంటారట. అక్కడ ఏప్రిల్ ఫూల్ ను 'పాయిజన్ డి ఏప్రిళ్గా పిల్లలు తమ స్నేహితుల వెనుక చేరి వారికి తెలియకుండ చేప బొమ్మను అతికించేవారట. వాళ్ళు దాన్ని తర్వాత చూసుకోవడం, అరవడం కూడ ఒక వినోదభాగం. పూర్వం నూతన సంవత్సరాన్ని ఏప్రిల్ 1 న ప్రారంభమవడం సదాచారం. పాత రోమన్ కేలండర్ ప్రకారం వసంత ౠతువు అదే రోజున ప్రారంభమయేదిట. క్రీ.పూ. 154 కు ముందు అది కొత్త సంవత్సరం. ఆ రోజును ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకునేవారట. వారి ఆయురారోగ్యాలు మరింతలుగా అవాలని ప్రత్యేక ప్రార్ధనలు, పూజలు జరిపేవారట. దేవతలకు కానుకలు సమర్పించి, బలులను అర్పించడం జరిగేవట. రోమన్ సామ్రాజ్యం క్రైస్తవుల పరమైన తర్వాత, వారు ఈష్టర్ ను ప్రత్యేక పర్వదినంగా జరుపుకోవడం ప్రారంభమైనది. యిదివరలో, నూతన సంవత్సర వేడుకలను మార్చి 25 నుంచి ఏప్రిల్ 2 వరకు జరుపుకొనేవారట. జనవరి 1 న, నూతన సంవత్సరాన్ని జరుపుకోవడం, ఫ్రాన్స్ దేశం అధికారికంగా మొట్టమొదట ప్రకటించి, మార్చిన ఫలితంగా, ఏప్రిల్ 1 న జరుపుకునే పండుగలు, జనవరి 1 నాటికి వాయిదా పడినాయట. ఈ మార్పు తెలియనివారు, మార్పులో అయిష్టులు, తిరస్కరించి బహిష్కరించి, మునుపటిలాగునే, జనవరి 1నే జరుపుకున్నారు. క్రమేపీ దీని ప్రభావం తగ్గిపోయినా, లేని పండుగను జరుపుకోవడం మూర్ఖత్వం, మూఢత్వంగా పరిగణిస్తూ, 'వెధవాయితనం'గా జమకట్టారు. అలా దాన్ని, వెధవాయిలపండుగగా మారివుండవచ్చు. ఈ రోజు అనేక మార్పులు చేసుకుని, కొత్తపుంతలు తొక్కింది. చివరికి ఆటపట్టింపు గా మారింది. ఈ తీరుతెన్నులు చివరికి, వార్తాపత్రికలు, రేడియోలు, టివీచానెళ్ళు, అందరూ వేళాకోళపుధోరణులను మానలేకుండా వున్నారు. అది పరిహాసం, అపహాస్యం, వెకిలిహాస్యంగా మారి,వెధవాయిల ప్రదర్శనలదినం గా మారిపోయింది. పత్రికలవారి పైత్యం కూడ బహువిధాలుగా తయారయింది. తప్పుడు, ఉద్రేకపూరిత వార్తలను ప్రచురించడం, ఎక్కడో చివరన, ఈరోజు ఏప్రిల్ 1 సందర్భంగా వినోదాన్ని అందించే ఉద్దేశ్యంతోనే ప్రచురించడం జరిగిందని ఒక వెధవాయతనపు ధోరణిలో వివరణలు యిచ్చుకోవడం పెద్ద తెలివితేటలుగా భావించుకోవడం, రివాజుగా జరిగిపోతున్నాయి. ఎవరికివారే స్వయంగా, స్వత:సిద్ధంగా వెధవలుగా గుర్తించుకుంటున్నారు.
నమ్మడం, నమ్మకపోవడం జరుగుతాయి మరి!
ఈరోజు జరిగినవి, జరుగుతున్నవి, జరిగాయని చెప్పినవి, అన్నింటినీ నమ్మడం, మోసపోవడం, నమ్మకపోవడం, తర్వాత నిజం తెలుసుకుని, నిరాశపోవడం, ఊపిరిపీల్చుకోవడం, అశాంతిచెందడం, శతౄత్వాల్ని పెంపొందించుకోవడం అలా అలా యధాలాపంగా జరిగిపోతాయి. అనుకోని దుర్ఘటనలు జరిగినా పట్టించుకోకపోవడం కూడా జరుగుతుంది. నాన్నా పులి, అని ఆటలాడి, చివరికి పులి నిజంగా రావడంపట్ల నాన్న నమ్మకపోవడం, పులి పిల్లవాడ్ని బక్షించడం జరిగిపోతుంది.
మూర్ఖ, మూఢ తత్వాల్ని విడనాడండి !
ఈ రోజు ఏ పరిస్థితుల్లో ప్రారంభమయిందో ఆనాటి పరిస్థితుల్ని గౌరవిస్తూ, ఆ సదాచారాలకి వక్రభాష్యం చేస్తూ, ఆరోగ్యకరమైన హాస్యధోరణిని వదలి, అపహాస్య, అవాంతరధోరణుల్ని వదలి, యిటువంటి రోజుల్ని, సమాజానికి మరింత ప్రయోజనం చేకూర్చేవిధంగా, ఉపకార, ప్రత్యుపకారపద్ధతుల్ని చేపట్టి, మూర్ఖ, మూఢపద్ధతుల్నించి తరలి, వెధవాయితనాన్నుంచి విజ్ణతకూడిన వివేకవంతులుగా మారి సంఘసేవలో పాల్గొనవలసిన సమయం ఆసన్నమైంది అని గ్రహించి, ప్రతిజ్ణాపూర్వక సత్సంకల్పకంకణాన్ని ధరించి ముందుకు సాగిపోవాలి. మారండి. మారిపొండి. లేదా, మిమ్మల్ని వెంటాడే ధోరణి, ప్రముఖ రచయిత, 'బీనాదేవి - హరిశ్చంద్రమతీ లో అన్నట్లు - "ఒకవేళ మనం ఏదైనా వెధవపని చేసినా, మరొకరు వచ్చి నువ్వుట్టి వెధవ్వి అంటే బాధపడకూడదు. ఎంచేతనంటే నువ్వెలాగా వెధవ్వే కాబట్టీ.
శ్రీశ్రీ అన్నట్లు, మార్పు సహజం. తధ్యం. కాని, ఏవిధంగా మార్పుని ఆహ్వానిస్తున్నాం, ఏదిశగా మారుతున్నాము అన్నదాన్ని బట్టి, మన పురోగమనం, తిరోగమనం, ఆధారపడివుంటాయి. అలనాటి 'షావుకారుల్ చిత్రంలో పాట గుర్తుచేసుకోండి. 'మారునురా కాలము మారునురా, మారిపోవుట దానికి సహజమురా' అని అనుకూల, ప్రతికూల ధోరణుల్ని ధ్వనిస్తూ చెప్పడం జరిగింది. ఏమైనా, ఆశని, ఆశయాన్ని విడనాడలేం. ఫలితం ఎలా పరిణమించినా.
ఎప్పుడో అర్ధవంతంగా ప్రారంభమైన ప్రత్యేక సంఘటనలను అర్ధం చేసుకుని, సదవగాహనతో మసలుకోవాలసిన తరుణం ఏప్రిల్ ల్ అని ఖచ్చింతంగా చెప్పవచ్చు అన్న దాంట్లో సందేహం లేదు, రాకూడదు.
ఏప్రిల్ 1 న ఎవరిచేతా వెధవలుగా అవకండి. మీకు మీరే చేసుకోవచ్చు, అంతగా కావలసివస్తే.
వెధవాయల రోజు సందర్భంగా అందరికీ శుభాభినందనలు.
కొంపెల్ల శర్మ - తెలుగురధం.
కాలాన్ని తెలుగురథం పై విహార, విజ్ఞాన, వికాస యాత్ర చేయిస్తాం. మన మాతృభాష తెలుగులో విశ్లేషిస్తాం. 'కాలరథమ్ము మీదనె జగత్పతి నిత్యము స్వారి చేయునో? కాలరథమ్ము చక్రముల ఘట్టన పుట్టుచు రాలుచుండు కెం థూళి కణమ్ములే అగునొ తోచెడి ఈ సకల ప్రజాళియున్?' కాల రహస్యమున్ తెలియగల్గుటె పుట్టుకకున్ ఫలమ్మొకో? (బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు)
Monday, March 31, 2008
ఏప్రిల్ ఒక్కటే వెధవాయల పండుగలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment