పురాణ ప్రవచన సామ్రాట్టు 'ఉష:శ్రీ'
కావ్యాల ద్వారా నీతి నియమాలని ఉపదేశించడం మన భారతావనిలో అనాదిగా వస్తున్న సదాచారం, సంప్రదాయం. మానవులకు అవసరమైన - ఆత్మగౌరవం, అభినివేశం, దౄఢప్రవౄత్తి, కార్యదీక్ష, ధర్మానుష్ఠానం, సాంఘికసేవ, పరోపకారం వంటి సద్గుణాలను - అతిసుందరంగా, భావగంభీరంగా విశదీకరించడం, గ్రహించడం, ఆచరించడం, మానవుని దైనందిక జీవితంలో ఒక భాగంగా ఉత్పన్నమవడం కూడ భారతీయ సదాచార సంస్కౄతీపరంపర లో భాగమే అని చెప్పాలి. సంప్రదాయ సాహిత్యంలో వర్తమానకాలాన్ని ఉజ్జీవింపచేయగల ఉజ్జ్వల సత్యాలను గుర్తించేటట్లు చేయడం కూడ ప్రధానంగా సాగుతోంది.
ఈ నేలలో పుట్టి, ఈ గాలి పీల్చి, ఈ నీరు త్రాగి, ఈ మట్టిలో పంట తినే వాంరందరికీ - శ్రీ మద్రామYఅణం - పారాయణ గ్రంథం, మహాభారతం - జీవ రసాయనం, శ్రీ మద్భాగవతం - ముక్తి సాధనం అన్న భావనకు అన్యత్రా వివరణ అనవసరం. ఎందుకోసం యివి యింతకాలంగా యిన్ని వేలమంది మేధావులకు ఆశ్వాసన యిస్తున్నాయో, ఎన్ని కోట్ల నిరక్షరాస్యులకు మనశ్శాంతి నిస్తున్నాయో ఆలోచించవలసిన విషయమే కదా! అందుకే వీటిని మానవ జీవనజ్యోతులుగాను, మానవ జీవితానికి మార్గదర్శకాలుకాను, అభివర్ణించాలి.
అయితే, గాలి, నీరు కలుషితం అవడం, నిర్మలమైన రక్తకణాలున్న మనదేహంలోని మనసుతో సహా కలుషిత వాతావరణ ప్రభావంతో జీవనం కొనసాగుతున్న వైనం ఈ కలికాలం లో వింతగా తోచదు సరికదా, విడ్డూరంగా కూడ అనిపించదు. యివి కాక, మనిషిలోని పశుత్వానికి, పైశాచిక ప్రవౄత్తికి సాటి మనిషి బలి అవుతున్న తరుణం కూడ నిత్యం దర్శనీయం. ఈ రణరుజరోగ గ్రస్థ వ్యవస్థకి చికిత్సగా మన పురాణేతిహాసాలను అధ్యయనం చేసుకోవాలి, ఆకళింపు చేసుకుంటూ, ఆచరణకు నోచుకోవాలి. చదువుకోలేని పరిస్థితిలో, కనీసం పండితులు, విద్వన్మనీషుల చేత పురాణ పఠన, శ్రవణ ప్రక్రియలద్వారా లాభాన్ని పొందాలి. తత్ఫలితంగా, జీవితం బాగుపడాలి, ప్రజల బుద్ధి పెరగాలి, సమాజం, దేశం యావత్తు ఆరోగ్యంగా, శాంతి సౌఖ్యాలతో 'మనుషులతో' బాగుపడాలి. ఈ దిశలో, దశలో అనేకమంది మేధావులు, పండితులు కంకణం కట్టుకుని, తనవంతు కౄషిని, నేనుసైతం - అంటూ, కేతనాన్ని ఎగురవేశారు. వారి వారి ముద్రలను, ప్రేరణాస్ఫూర్తులను ప్రభావవంతంగా, ప్రతిభావంతంగా సంపదను అందించి, దేశ సంస్కౄతీవైభవాన్ని పునరుజ్జీవింప చేయగలుగుతూ, సార్ధకవంతులుగా గుర్తింపును పొందుతున్నారు. సమాజ వైభవానికి దారులు త్రవ్వుతున్నారు. అటువంటి మహానుభావుల్లో - ఉష:శ్రీ ఒకరు.
ఉష:శ్రీ - పురాణపండ
ప్రతిభాసంకేతరూపమైన - ఉష:శ్రీ, జన్మత: పురాణపండ వంశాంకురం. పురాణపండ రామమూర్తి, కాశీ అన్నపూర్ణలకు జన్మించాడు. తండ్రి ఆయుర్వేద వైద్యుడు, జాతీయోద్యమకాలంలో కాకినాడలో కాంగ్రేసు పార్టీ ప్రతినిధిగా నిర్వహించారు. ఈయనకు 16 మార్చి 1928 న పశ్చిమ గోదావరి జిల్లా, కాకరపర్రు అగ్రహారంలో వంశాకుర జననం కలిగింది. కొడుకు పేరు, పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు. ప్రభవ నామ సంవత్సరం, ఫాల్గుణ బహుళ త్రయోదశి రోజున పుట్టాడు. రామమూర్తి గారు, ఉభాయ గోదావరి జిల్లాల్లో, పలు వేదికలపై, పురాణేతిహాసత్రయం - రామాయణ భారత భాగవతాలను పురాణ ప్రవచనం ఆయన జీవితంలో ముఖ్య పర్వం.
ఉష:శ్రీ ప్రఖ్యాతమైన పండితులు, పురాణ ప్రవచకులు. ఆకాశవాణి వ్యాఖ్యాతగా, సాహితీరచయితగా, ఉష:శ్రీ రామాయణ, భారతాది ప్రవచనాల్ని తెలుగునాట అందరికీ అందించిన సుపరిచితులు. ఆ రోజుల్లో, ఆయన స్వరం, మాట సరళిని గుర్తు పట్టలేని తెలుగు శ్రోత లేదంటే అతిశయోక్తి కాదు. సులభసుందరాలు, భక్తి రసబంధురాలు అయిన వ్యాఖ్యాన పరంపర బహువిధాల ఆకర్షణలుగా గుర్తింపును పొందాయి.
శ్రీ మద్భాగవతం, పోతన్నగారి పద్య కావ్యానికి ఉష:శ్రీ వచనానుసరణం కు ముందుమాటలో యిలా చెప్పారు.
'శ్రీమద్భాగవతం తోనే నాకు అక్షరజ़్జానం చేసింది మా అమ్మ. జ़్జానం కంటె అక్షరదీక్ష అనడం ఉచితంగా ఉంటుంది. కొద్దిగా మాటలు వచ్చే రోజులలోనే - ఇందుగల డందు లేడని, కల డందురు దీనుల యెడ, అన్న పద్యాలను మధురంగా కంఠోపాఠం చేయించింది అమ్మ. పన్నేండేళ్ళు దాటాక నా చేత గజేంద్రమోక్షం పారాయణం చేయించారు నాన్నగారు. యివి మనసులోంచి చెరగలేదు. పండితులనుంచి వ్యాకరణంలో ముంచి సాహిత్యంలో తేల్చివేశారు. అయినా వంటపట్టలేదని, ఛందోబద్ధపద్యాలను రాయవలసి వస్తోందని, కట్టుకధలని రాయడం మొదలెట్టాను. అదీ కాదని తెలిసి రేడియోలో చేరాను. అప్పుడు తెలిసింది, నేను రచయితను కాను, నోరున్న వాడినని. అది నిజ నిరూపణగా, పదహారవ ఏటనే, తండ్రి స్నేహితుడు, శ్రీధర వెంకయ్యగారు నోరుపెట్టుకు బ్రతుకుతానని యిచ్చిన ఆశీస్సులు నిజంగా మారాయి. అలా నోరున్నవాడికి పనివివచ్చే రేడియో ఉద్యోగం 1965 లో చేరాను."
ఉష:శ్రీ సాహితీ ప్రవచన పరంపర
పురాణపండ దీక్షితులు - ఉష;శ్రీగారు రామాయణం, భారతం, భాగవతాలకు సరళ సుమధుర శైలిలో వ్యాఖ్యాలను విరచించి, ప్రవచించారు. తెలుగునేల పై పారేసుకున్న ప్రతీ చెవి తుప్పు వదలకొట్టారు. శ్రవణసుభగతను అందించారు. ఉష:శ్రీ చెప్పదలచుకున్న దానిని స్పష్టంగా ముందు దర్శించి, రుచికరంగా మనకు బొమ్మకట్టి చూపించి, సముజ్జ్వలంగా వ్యాఖ్యానించడం ఆయనకు వెన్నతోపెట్టిన విద్య, కరతలామలకం, అసిధారావ్రతం. ఆయన భావుకతలోని దౄశ్యధర్మాన్నీ, కధనంలోని చిత్రమైన ఒడుపునూ సుఖ శ్రావ్యమైన వారికంఠస్వరాన్నీ గుర్తించలేకపోవడం సాధ్యంకాని పని అయ్యేది. వారిశైలి అంత విలక్షణమైనది. శైలి అంటే - పదగతి, భావగతి మిశ్రమం అన్నది సత్యమే కదా. పాఠక, శ్రోత, ప్రేక్షక గుండెలను సుతారంగా గుప్పిట్లోకి జార్చుకోగల హస్తలాఘవాన్ని పరిరక్షించడం కూడ కర్త్యవ్యం. ఈ పురాణేతిహాసాలను జీవనపథ నిర్దేశాలుగా దర్శించాలనే కోరిక ఉన్నవారికి ఉషశ్రీ వినా అన్యశరణం లేదు. అందుకే వారి ఉపన్యాసాలు - స్నిగ్ధ గవక్షాలు.
ఆకాశవాణిలో నిరంతరాయంగా తెలుగులో వినిపించిన ఉష:శ్రీ గొంతులో ఒక పదునైన జీర వుంది. అందర్నీ అకర్షించే ఒక ఒడుపు, మనుషుల్ని దగ్గరగా లాగే నేర్పు, ఉన్నాయని అందరూ అంగీకరించిన సత్యం. వీటికోసం, వారం వారం శ్రోతలు కాచుకొని కూర్చోవడం పరిపాటి, అసాధారణమైన సామాన్యం. వేల సంఖ్యలో వున్న శ్లోకాలకి బౄహద్గ్రంధాల మూల హౄదయానికి భంగం లేకుండా కుదించి శ్రోతలకు వినిపించి, ఆ పై పాఠకులకు అందించడంలో రచయిత కౌశలం సముఖంగా కనబడుతుంది. కధకోసం రామాయణ, భారత, భాగవతాలు చదవక, ఆకాశ దీపాలగా యుగ యుగాల ప్రజావళికి లోకోత్తర పద నిర్దేశం చేస్తూ వచ్చిన వాటిని, అందుకే చదువుతారు కనుకనే, ఈ రచనలు, వ్యాఖ్యానాలు కన్నుల కద్దుకుని కాంక్షతో ఆదరించారు - అఖిల తెలుగు ప్రజలు.
ఉష:శ్రీ భావనలో -
1. రామాయణం
సీతారాముల కధ వినాలనీ, వాల్మీకి రామాయణం చదువుకోవాలనీ, రామాయణం వినిపించాలనీ వాంఛించేవారు ఈ దేశంలోనే కాదు, దేశదేశాలలో ఉన్నారు. ఆధునిక నాగరక యుగంలో చదువుకోగలిగిన వారికంటే, చదివించుకు వినాలానే వారి సంఖ్య అపరిమితంగా వుంది. అది యీనాడు కాదు. రామాయణం పుట్టిన వాడే అలా వుండేది. సీతారాముల గాధను వాల్మీకి మునిచంద్రుడు కుశలవుల చేత గానం చేయించి లోకానికి అందించాడు. వేల సంవత్సరాల క్రితం మాట అది. లక్షల శరత్తున నాటి గాధ యిది. వాల్మీకి మనసులో నుండి గుండెతో కలిసి ఈ రూపంలో మానవజాతికి అందిందని అనుకోవడానికి అందరూ సంతోషంతో అంగీకరిస్తారు. త్రేతాయుగం నాటి గాధ, కధ జరుగుతూంటే చూసి, కలియుగంలో యింతవరకూ కూడ ప్రత్యక్ష ప్రమాణంగానే భావించడం జరుగుతోంది. నిస్సందేహంగా రామకధ జరిగింది. జరగడంకాదు,నేటికీ రామాయణం జరుగుతూనే వుంది. జరుగుతుంది కనుకనే రామాయణం వింటున్నారు, చదువుతున్నారు. ప్రమోదం కలిగించబడుతోంది. రామాయణం ఈనాటికీ జరుగుతున్నది అంటే, అది కొంచెం అతి తెలివిగా కనిపిస్తున్నది, అనవచ్చు. కొంచెం ఓరిమి వుంటే అ విశేషాలు విశదం అవుతాయి.
అందుకే, సాంసారిక జీవితం సాగించేవారికి సంతానం అవసరం. అదే దాంపత్య బంధాన్ని మరింత బలవత్తరం చేస్తుంది; అందుకే - 'ఆనందగ్రంధి రేకోమం ఆపత్య మితి కధ్యతే' అన్నారు మహనీయులు, అని అంటూ, 'నిరంతరం ఒకరి ఒకరు చూసుకుంటూ కూర్చుంటే జీవితం విసుగెత్తిపోయి, విషాదమయం అవుతుంది, భార్యాభర్తల బ్రతుకు. దాని నుంచి తప్పించుకుందుకే సంతానం దాంపత్య జీవిత లక్ష్యం, అదే పరలోకం కోసం జరిగే ఉత్తర కర్మలకే కాదు, ఇహలోకంలో కూడా సంతోషం కలిగించడానికి, సేవలు చెయ్యడానికే పిల్లలు కావాలి. ఆ విధంగా ఇహపరాలకు అవసరమైన సంతానం కోసం బాధపడే దశరధులు నేటికీ వున్నారు. స్త్రీకి మాతౄత్వ వాంఛ, పురుషునికి వంశాభివౄద్ధి కాంక్ష లేకపోతే, మానవజాతి పశుప్రాయ దశకంటె దిగజారిపోతుంది.
2. భారతం
మానవ జీవిత మహేతిహాసం మహాభారతం అన్నారు ఉష:శ్రీ. అందులో, భారత గంగాస్రవంతిలో మణికర్ణికా ఘట్టం గా ఉద్యోగపర్వం అని చెబుతూ, రామాయణంలో 'సుందరకాండా లాంటిది అన్నారు, భారతంలో ఉద్యోగపర్వం ఆత్మ ఉన్నతి, మనోవికాసం సాధించడానికి నిత్యం చదువుకోవాలి. భారతానికి విపుల వ్యాఖ్యానంతో పాటు, ప్రధాన స్త్రీ పాత్రలైన, శకుంతల, దేవయాని, దమయంతి, సావిత్రి లపై, సవివరణాత్మకమైన ఉపాఖ్యానాలను అందించడం ఉష:శ్రీ పాండితీప్రకర్షకు నిదర్శనం.
ధర్మజ, భీమ, అర్జున, నకుల సోదరుల నలుగురు కంటె చిన్నవాడయిన సహదేవుడు పరమ తీవ్రవాది. ఈ అతివాదానికి కారణం వివరిస్తూ, ఉష:శ్రీ వివరణ చూడండి ఎలా వుందో.
'రక్తం పొంగుతోంది. నరాల బిగువు సడలలేదు. కండరాలు తిరిగివున్నాయి. ఆ వయసులో వున్నవా డెవరికీ శాంతి, సహనం కిట్టవు. కిట్టనందువల్లనే ఈనాటి సహదేవులు సైతం ఏమంటున్నారు. రక్తం పారాలి, తలలు తెగాలి, విప్లవం వర్ధిల్లాలి. ఈ నివాదాలతోనే సమస్యలు పరిష్కారం కావాలని భావిస్తున్నారు. సహదేవుడి వ్లనే చిన్నవాడయిన సాత్యకి కూడా అదే ధోరణిలో వుంటాడు. పొంగుతున్న రక్తంతో వుండేవాడు ఏనాడయినా యిచ్చే విప్లవ నినాదాన్నే భారతంలోని సహదేవుడు కూడ పలికినాడు. అయితే నాడు ధర్మరాజు కంటిచూపుతో, వాసుదేవుడు మందహాసంతో వారిని ఆపగలిగేవారు. ఈనాడు ధర్మరాజులు, వాసుదేవులు లేరు. అందరూ సహదేవులే! ఎవరి వారే నాయకులు. ఎవరి కూటమి వారిదే. అందువల్లానే యింత అల్లకల్లోలమై అస్తవ్యస్త దశలో పడింది దేశం.
ధర్మసూక్ష్మం - గురించి వివరిస్తూ, పాండునందనులలో పెద్దవాడు ధర్మరాజు. పెద్దకొడుకు. బాధ్యత ఏమిటో తరతరాలకు బోధించడానికే వ్యాసుడు సూచన చేశాడు. 'ప్రితౄ సమో జ్యేష్ఠ:' - తండ్రి అనంతరం తల్లి బాధ్యత, తమ్ముళ్ళ, అక్కచెల్లెళ్ళ కష్టసుఖాలు కనిపెట్టి చూడవలసిన వాడు పెద్దకొడుకు. ఈ కుటుంబ జీవన ధర్మప్రబోధమే భారతం నిండా గోచరిస్తుంది. ఇది చాలా సామానయ విషయంగా కనిపించవచ్చు. కాని, సామాన్య విషయాలనే పదే పదే గుర్తు చేసుకోవాలి. లేకపోతే మరచిపోతాం. అందువల్ల ఎన్ని అనర్ధాలు వస్తాయో ఈనాడు సంసారాలలో అనుభవిస్తున్నాం. అందుకే భారతాన్ని నిరంతరం వినిపించాలి. వినాలి. వింటూ మనిషి మనిషిగా బ్రతకడానికి అవసరమైన సూక్ష్మ విషయాలు తెలుసుకుంటూండాలి. వాటినిఆచరించడానికి ప్రయత్నించాలి.'
గురుపీఠం గురించి, ఉష:శ్రీ వ్యాఖ్యానంలో చెప్పిన తీరు యిలా వుంది.
ప్రపంచంలో ప్రతి వ్యక్తికీ గురుస్థానం ఇవ్వకూడదనీ, శాస్త్రజ़్జానానికీ లోకానుభవం జోడించి, తల పండినవాడే పాఠం చెప్పాలి. తల పండేసరికి ఉద్యోగం తేసేసి విశ్రాంతికీ పంపే వ్యవస్థ ఈనాడు తాండవించడం వల్లనే విద్యారంగం యింత అధ్వాన్నంగా తయారయింది. చదివినదాన్ని కక్కడం కాదు, గురువు చేయవలసినది. దానిని జీర్ణించుకుని, వంటబట్టిన దానిని మననం చేసుకుంటూ, దానికి తన అనుభవాన్ని కలిపి, నిస్వార్ధంగా, బోధించగల ఉపాధ్యాయులు ఈ జాతికి స్వతంత్రం సిద్ధించేవరకూ వుండేవారు. అంతకు ముందు గురుకుల వ్యవస్థ అవిఛ్ఛిన్నంగా సాగింది. ఈనాడు చదువు కొనుక్కునే దశ ఏర్పడింది. సంతలో దొరికే చింతపండు, ఉల్లిపాయలూ కాదే విద్య. మనస్సును వికసింఫజేస్తూ బుద్ధిని సక్రమంగా నడుపుతూ, నీతినీ, శీలాన్నీ అలవరిచే విద్యావేత్తలు పాఠశాలల్లో చేరే మంచి రోజులు రావాలంటే, విద్యారంగాన్ని స్వార్ధపరుల హస్తాలనుండి తప్పించుకునే ప్రయత్నం తీవ్రంగా సాగే ఉద్యమం లేవాలి. అదీ భారతం నేర్పిన పాఠం.
భీష్మ ప్రబోధం - తల్లి గర్భం నుండినేలమీద పడి కెవ్వుమని ఏడిచింది మొదలు, కాటిమీద పెట్టి మనచుట్టూ వున్న వారందరూ గోలుగోలున ఏడిచే వరకూ మానవుడైనవాడు అడుగుతీసి అడుగు ఎలా వెయ్యాలో, పెదవి కదిపి ఎలా మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో తెలుస్తుంది. మానవత్వానికి పరిపూర్ణత సిద్ధించి, తల్లితో, తండ్రితో, గురువుతో, స్నేహితులతో, శతౄవులతో, భార్యతో, బిడ్డలతో, ఎవరితో ఎలా ప్రవర్తించాలో అవగాహన అవుతుంది. అందుకోసం భారతం చదవండి. అందుకే భారతం పంచమ వేదం. వ్యాసమునీంద్ర సాంద్ర కరుణాతిశయంబున లభించిన విజ़్జాన సర్వస్వం నిత్యం చదవండి."
3. భాగవతం
శ్రీ మద్భాగవతం తోనే అక్షరజ़్జానం, అక్షరదీక్షను అందించినది తల్లి అని ఉష:శ్రీ చెప్పారు కదా. పలికెడిది భాగవతమట అని శుభారంభం చేసిన పోతన మహాకవి పద్య కావ్యానికి ఉష:శ్రీ చేసిన వచనానుసరణం చిరస్మరణీయం. తెలియవచ్చినంత తేటపరస్తూ వ్యాఖ్యానం చేశారు. ఉష:శ్రీ మాటల్లో చెప్పాలంటే - బాలభానుడు నడిమింటృఇనుండి పశ్చిమానికి దిగిన యాభైరెండో ఏట, ప్రశాంతంగా రామనామస్మరణతో సుందరకాండ పారాయణం చేసే రోజులలో, భాగవతానికి, అసంకల్పిత చర్యలో భాగంగా, వ్యాసపూర్ణిమనాడు దశమస్కంధం వ్రాయడం, మనశ్శాంతి కోసం, వ్రాయడం మొదలు పెట్టాను, అని చెప్పడంలోనే విశేషత వుంది. నిమిత్తమాత్రుణ్ణి అని, పరమేశ్వరుడు ఈ ప్రాణికి ఆ అవకాశం యివ్వడం, యిప్పించేటట్టు చేయడం, అంతా లీల, అని ప్రవచనం ప్రారంభించారు. కవిత్రయం తరువాయి భారతాన్ని, పోతన్నగారి అనంతరం భాగవతాన్ని తెలుగు వారికి అందించబూనడం బాలచేష్ఠ, దుస్సాహసం కావాలి అని తెలిసినా, ఉద్దండ పండితుల ఆశీర్వాదాలు లభించడం కొండంత బలంతో ముందుకు సాగారు అని చెప్పారు. వర్ణాశ్రమ ధర్మాల గురించి ప్రస్తావిస్తూ, ఈ ధర్మాలు ఈ కాలానికి అనవసరం అంటూ చెప్పిన భావం యిలా వుంది.
'కంటెలూ కట్టకాసులపేరులూ యీనాడు నచ్చని వారు బంగారాన్ని పారేస్తున్నారా! ఒంటిపేట గొలుసులూ, చంద్రహారాలూ చేయిస్తున్నారు. నేను చేసిందీ అదే! ఇది బంగారం; ఎన్ని దేశాలకు పోయినా ఎన్ని కాలాలు మారినా పసిడి పసిడియే. అది శరీరానికి అలంకారం; ఇదిఆత్మకు అవసరం.'
భగవంతుని ఆశీస్సులతో, సంస్కారం కలిగించిన జననీజనకులకు అభివాదాలర్పిస్తూ, తిరుమలేశుని పాదాలమ్రోల తలవంచుతూ రచించిన కవిత్వ వచనాలు, ఉష:శ్రీ పాండిత్యానికి, ప్రవచనా ప్రకర్షకీ జోహార్లు అందించక తప్పదు.
త్రిలింగదేశంలో, అనాదిగా భక్తిప్రపత్తులతో, ఆధ్యాత్మిక సంపత్తితో, ఆధ్యయనం, శ్రవణం చేస్తున్న తెలుగుప్రజకు, ఉష:శ్రీగారి ప్రవచనాలు, వ్యాఖ్యానాలు, నిజంగా త్రయంకశుద్ధి, సిద్ధి ని చేకూరుస్తూ, లక్ష్యాన్ని, లక్షణసహితంగా పొందుతున్నారు అనడంలో ఎటువంటి సందేశం రాదు, సందేశలహరి మాత్రమే చూడగలుగుతాం.
పురాణపండ దీక్షితులు - ఉష:శ్రీ తెలుగువారికి నిజమైన, గర్వకారణమైన తెలుగుతేజం, తెలుగువెలుగు.
ఓం శాంతి:
2 comments:
భద్రాద్రి రామయ్య కల్యాణం, ఏటా స్వయంగా వెళ్లి చూడకపోయినా, రేడియో ద్వారా కళ్లకి కట్టినట్టు చూపించిన ఘనత ఉషశ్రీ గారిదే. వారు రాసిన అనేకానేక పుస్తకాలు, ముఖ్యంగా తి తి దే వారు ముద్రించినవి, సరళమైన భాషలో మనసుని హత్తుకుంటాయి. వారు చిరస్మరణీయులు. వారి సోదరుడు పురాణపండ రాధాకృష్ణ మూర్తి గారి సేవలూ ప్రాతః స్మరణీయాలు.
dear sir, thanks for the comments on Ushasri garu. There is a need to write another article on the great personality. Let me try for that and see whether I can. Thanks and regards.
kompella sarma.
Post a Comment