Wednesday, March 12, 2008

ధూమపానం - సరాసరి మౄత్యువు కౌగిలి లోకి!

ధూమపానం - సరాసరి మౄత్యువు కౌగిలి లోకి!
పోర్చుగీసు రగిలించిన కొలిమి
నాలుగు శతాబ్దాలక్రితం భారతదేశంలోకి ప్రవేశపెట్టిన ఘనత పోర్చుగీస్ కి తగ్గుతుంది. అప్పటినుంచి అనేకరకాలుగా వాడబడుతున్న పొగాకు 20% మందికి ఎన్నో మహమ్మారిరోగాలు , నోటికాన్సర్ సోకే ప్రమాదముంది. మన దేశ జనాభాలో 65% మగమహారాజులు, 33% మహిళలు పొగాకుని ఏదోరకంగా వాడతారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మగాళ్ళమాట ఎలావున్నా, మహిళలు మాత్రం యిక్కడ పార్లమేంటు నియమాలను పాటించినట్లు అయింది. ప్రముఖ పరిశోధానాంశముల ప్రకారం, 2020 నాటికి 13 % మరణాలు పొగాకు వల్ల సంభవిస్తాయని అంచనాలు వేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ, అభివౄద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో 'పొగాకు అపెడమిక్' ను, భారతదేశంలోని చట్టం (1975), బహిరంగ ప్రదేశాల్లో పొగాకు కాల్చడం నేరం అన్న ప్రమాద సూచనలు ప్రకటీంచబడ్డాయి. దంతవైద్యులు, యితరవైద్యులు నికొటెన్ గురించి చాలా ఆందోళన చెందుతున్నారు. 2001 చట్టం, అనేక రకాలవాడకంపైనా, వాడుతున్న నికొటెన్ పై ఆందోళన చెందుతున్నారు. 'తెకబుళ్ దంతవైద్యం ద్వారా రోగి వైద్యానికి రోగి స్పందిస్తాడని చెపుతున్నారు. పకడ్బందీగా ప్రణాళికాదారులు, రోగ వైద్యకారులు, ఉమ్మడిగా అవగాహనతో కౄషి చేస్తేనే, పొగరహితసమాజాన్ని ముందుకు తరంవారికి అందించలేకపోవచ్చునేమో అన్న భయభ్రాంతాందోళనలను అనుభవిస్తున్నారు.
పొగాకు కాదు - పగాకు
ఆకులో అకునై అని ఒక భావకవి అన్న సందర్భం వేరు. ఈ ఆకు అన్నిటిలాంటిది కాదు. ఇది నిషానిస్తుంది. తమాషా చేస్తుంది. చేయిస్తుంది. అన్నిచోట్ల దట్టంగా వ్యాపిస్తుంది. మనుషుల పరిసరాల్లోనే కాకుండా మనందరి దేహాల్లోకూడ ప్రవేశిస్తుంది. లోపల ప్రవేశించి, మనకు తెలియకుండానే మనమీద పగ పెంచుకుంటుంది. క్రమేపీ మన ఆరోగ్యంతో పరాచకాలాడుతుంది. దీనికి పొగరుతోపాటు మదం కూడ అధికమే. పొగరుతో నిశ్శబ్దంగా పోట్టాడుతుంది. మదంతో మూగిదానిలా మాట్లాడుతూంటుంది. దీన్నే పగాకు అని పిలుస్తారు. అయితే అసలు పేరు పొగాకు.
ఎన్ని భావనలో
పొగాకును ఎంతమందో వర్ణించారు. వారివారి ఆలోచనాశక్తిని వినియేగించారు. పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్ అన్నాడు ఒక చాటువుకవి. భారతంలోని పాత్రలతో కూడ దీన్ని జోడించాడు మరియొక కవి. ఆయన మాటల్లో, 'పొగత్రాగనేర్చి పగరన్ పొగరడచెన్ ఆజి బాహాశక్తిన్ పొగత్రావని దుర్యోధనుడిగిలించెను రణములోన యిహిహీయంచున్ అని పొగాకుని ఆదరించినవానికి విజయం ఆవహిస్తే, ముట్టనివాడు అయోమయంగా వున్నాడని చమత్కారంగా వర్ణించడం జరిగింది. పొగాకుని అందమైన అమ్మాయిలా, సున్నితమైన లతలా, సుందరంగా వర్ణించడం కూడ జరిగింది. సన్నంబై, కురుమట్టయై, గరగరై, జాపత్రితో సాటియై, గన్నేరాకు వలెన్ పసందుగలదై, ఘాటున్నదై, లాహిరై, కన్నుందోయికి చాలవేడ్కగొలుపంగా తగ్గదై, నిగ్గుదై, వన్నెల్ కుల్కు పొగాకు ముచ్చట వినేవా, శేషాద్రిశైలాధిపా అని ఓ పొగాకుమీద పరిశోధనచేసి పేరయ్య పేరడీ రాశాడు. మన గిరీశంతో, ఈ పొగాకుమీదే, తనప్రియశిష్యుడైన వెంకటేశాన్ని భట్టీయం చేయమంటే, పొగక్రోవికి సతిమోవికి అంటూ మరొక చాటువుని ముందువెనుక ఆలోచించకుండా చదెవేశాడు.
పొగాకు వాడకం లో ఎవరి రుచులు వారివి
ఆకలి రుచి ఎరగదు అన్నట్లు, అలవాటునిబట్టి పొగాకుని వాడుతుంటారు. కొందరు చీల్చి చెండాడి, ముక్కలుగాచేసి, రెండుచేతుల్తో నలిపేసి, పొడిచేసి, నోట్లోనమిలి పుక్కిలిస్తారు. కొందరు చుట్టలు రూపాన నిప్పంటించుకుని పొగని లోపలకి పీలుస్తారు. శ్రీకాకుళంప్రాంతం ప్రజలు కొందరు, నిప్పున్నవైపుని నోట్లో పెట్టుకుని, పొగను ఎగపీలుస్తారు. ఈ పొగాకుకి లింగవివక్షత లేదండోయ్. మగవాళ్ళు అధికమైనా, రహస్యంగా కొంతమందిని, ఫాషన్ గా కొందరిని, పల్లెప్రాంతం లోని కొంతమంది మహిళలు కూడ పొగాకు పట్టీగా, చుట్టగా దరికి చేరుతూంటుంది. విశ్వవ్యాప్తంగా, సిగరెట్టు, సిగార్ (చుట్ట) రూపాల్లో విహరిస్తూ ప్రజలను ఆవహిస్తుంది.
సిగరెట్టు పై సిద్ధాంత రాద్ధాంతాలు
కాదేది కవితకు అనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఏ విషయం, యితివౄత్తం, వస్తువుమీదైనా మనవాళ్ళు వెంటనే పుస్తకం, కలం తీసుకుని బరబర బరికేస్తూంటారు. చివరికి, సిగరెట్టునీ వదల్లేదు. మనవాళ్ళు సిగరెట్టు కాల్చడం ప్రారంభిస్తే, అగరత్తు, ధూపదీపం మొదలట్టాడురా మనవాడు అనడం సహజం. తాను పొగ రైలుబండిలా సవ్వడిలేకుండా, పొగని వదలడమే కాకుండా, పక్కవానికి సగంపొగ లోపలికి వెళ్ళిపోయేలా సహాయం కూడా చేస్తారు. ప్రముఖ హాస్యకవి ముళ్ళపూడివారు, తన చిచ్చరపిడుగు బుడుగు లో, సిగరెట్టిని, అగరొత్తుని, సమతులనం చేశారు. సిగరెట్టులు తెల్లగా వుంటాయి. అగరొత్తులు నల్లగా వుంటాయి. అగరొత్తులు గోడమీద గుచ్చి కాలుస్తారు. ఇవేమో నోట్లో గుచ్చి కాలుస్తారు అని తెలివిబుడత నిర్వచనం చెప్పారు. సిగరెట్టు తాగితే ఆ వాసన ఆవౄత్తంలా ఆవరిస్తుంది. పొగత్రాగరాదు అని చెబుతూ, పురాణం వారు, రచయితకోణంలో, ఒక నవలగాని, ఒక కధకాని చదివితే అది సిగరెట్టు తాగేవాడు రాసిందో, తాగనివాళ్ళూ రాసిందో ముట్టుకుంటే తెలిసిపోతుంది అని సువాసనా సిద్ధాంతాన్ని చెబుతూ, జీవితంలో ముంచి టెన్షన్ వచ్చినప్పుడు ఒక సిగరెట్టు పీలిస్తే కాస్త హాయిగా ఉంటుంది అని మనలను ఊహాప్రపంచంలోకి రింగులు తిప్పుకుంటూ తరుముకెళ్ళారు. మనకవులు దేన్నైనా, ఆడదానితో పోల్చడం ఒక కుకవి సంప్రదాయంగా పెట్టుకున్నారు. సిగరెట్ ఆడదాన్లాంటిది, అనుభవించేక కలిగేది అసంతౄప్తే అని ప్రముఖ రచయిత బీనాదేవి - ది స్మోకింగ్ డాగ్ అన్న కధలో కామోద్దీపిత భావాన్ని, ఈ భావం కేవలం పెద్దలకుమాత్రమే అన్నట్లు విడుదలచేశారు. సరదాగా, సిగరెట్టుని మన చిత్రకవులు మరింత సచిత్రంగా వర్ణించారు. సరదా సరదా సిగరెట్టు, యిది దొరలు కాల్చు సిగరెట్టు అంటూ, కంపుకొట్టు ఈ సిగరెట్టు, దీన్ని కాల్చకోయి మరి నాపై వట్టు, అని ఒక హాస్యజంట పరిహాసయుగళగానంలో ములిగిపోతూ విహరించారు.
ఆరోగ్యం, అనారోగ్యం మధ్య ధూమపానం
ఆరోగ్యానికి కారణాలు లేకపోవచ్చు. అనారోగ్యానికి కారణాలు ఎన్నో వుండవచ్చు. కొన్ని చెప్పగలం. కొన్ని చెప్పలేము. చెప్పగల కారణాల్లో, ధూమపానం ఒకటి అన్నది ఖచ్చితంగా చెప్పవలసి వస్తుంది. అనారోగ్యాన్ని కలిగించే దురలవాట్లలో పొగతాగటం ప్రధానమైంది. పొగాకులో హాని కలిగించే 'నికొటిణ్ అనే పదార్ధం ఉంది. ఒక సిగరెట్ పొగలో 85 శాతం వరకు ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డై ఆక్సైడ్ వుంటే, మిగిలిన 15 శాతం యితర వాయువులు, సూక్ష్మకణాలు వున్నాయని అనారోగ్యనివారణావేత్తలు చెప్పుతూంటారు. గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో మరణించేవారిలో 80 శాతం సిగరెట్ తాగటం వలనే మౄతి చెందుతున్నట్లు నిర్ధారించారు. సిగరెట్లు కాల్చడం వలన ఉత్పత్తి అయ్యే వేడి వల్ల కూడా ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ప్రారంభంలో 30 డెగ్రీల సెంటిగ్రేడు ఉన్నవేడి చివరకు 90 డిగ్రీల సెంటిగ్రేడుకు చేరుతుంది. ధూమపానం వల్ల గుండెకు కావాల్సిన ఆక్సిజన్ అందదు. ఊపిరితిత్తులలో 'వ్యూకశ్ పేరుకుని పనిచేసే సామర్ధ్యం తగ్గుతుంది. రక్తనాళాలు పూడుకుపోవటం లేదా దళసరిగా తయారవడం వల్ల రక్తప్రసరణ సరిగా జరగదు. నికోటిన్ కారణంగా శరీరంలో అనేక గ్రంధుల పనితీరులో మార్పు వస్తుంది. ధూమపానం వల్ల ప్రతి సంవత్సరం లక్షలాదిమంది క్యాన్సర్ కు బలవుతున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్, మూత్రనాళాల క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదముంది. ధూమపానం చేస్తున్నందున త్వరగా వౄద్ధులు కాగలరని తేలింది. అంతేగాక లైంగిక సామర్ధ్యం సన్నగిల్లేందుకు హేతువు అవుతుంది. పొగతాగేవారే కాకుండా పొగతాగని వరు సైతం ధూమప్రియుల వల్ల అనారోగ్యానికి గురౌతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దౄష్టిలో ఉంచుకుని చాలా దేశాలు బహిరంగ ప్రదేశాలలో పొగతాగరాదని నిషేధం విధించాయి. తాగే ప్రతి సిగరెట్టు ఆయువులో 14 నిమిషాలు పీల్చి వేస్తుంది. అంటే జీవితకాలాన్ని ఈదు సంవత్సరాలకు పైగా తగ్గించి వేస్తుంది.
పొగాకు వద్దే వద్దు అన్నదే ఘోష
ఒక బిలియన్ జనాభా వున్న భారతదేశంలో, 250 మిలియన్ల జనాభా పొగాకుని కౌగలించుకుంటున్నారు. ఈ దుస్థితికి ప్రయోజనకారి, ఎవరో కాదు, 5000 కోట్ల రూపాయల ఆదాయాన్ని దోచుకుంటున్న ప్రభుత్వమే. కాని, పొగాకు సంబంధిత రోగాలపై 13000 కోట్ల రూపాయలను ఖర్చుకూడ చేయిస్తున్న ఘనత కూడ ఈ ప్రభుత్వానిదే. ఈ అలవాటుని మానేస్తే కలిగే యిబ్బంది, కేవలం ఒక వారం మించి వుండదు. మానెవేయాలన్న తలపు వస్తే, లాభాలు మాత్రం అగణితం, వర్ణనాతీతం. మానేసిన కేవలం 20 నిమిషాల తర్వాత, రక్తపుపోటు, నాడి సాధారణస్థితికి వస్తుందట. ఎనిమిది గంటలయ్యాక, రక్తంలోని ఆక్సిజన్ స్థాయి సామాన్యస్థాయిగా వస్తుందట. గుండెపోటు అవకాశాలు తగ్గుముఖం పడ్తాయట. ప్రతీ సిగరెట్టు తాగుడుకి, శరీరం తీసుకునే నికొటిన్ కొంచెం అయినా, నెకొటైన్, బ్రైయిన్ లోని న్యురోట్రాన్సిమిట్టర్ అయిన డోపమైన్ స్థాయి, సిగరెట్టు మానడం వల్ల పెరిగి సుఖంగా వుంటుంది. వెంటనే, నీశరీరం నికొటైన్ కొరకు చేసే వెదకులాటలోనే హాయి అనిపిస్తుంది. యిప్పుడు రోజంతా సిగరెట్టు కాల్చడం, సిగరెట్టు మానేయడం, గురించి తేడా తెలిసినట్లే కదా.
ప్రపంచ వ్యాప్తంగా, 31 మే రోజున ప్రపంచ పొగాకు వ్యతిరేకదినాన్ని పాటిస్తారు. మార్చి 12 న ధూమపాన వ్యతిరేక దినం ను కూడ పాటిస్తారు.
మనం ఏమీ చేయనప్పుడు ఏదో చేస్తామనే నమ్మకం పొగాకు ఇచ్చే మొదటి భ్రమ అని ఎమర్సన్ అంటాడు. పొగాకును మించింది లేదు, గౌరవనీయులైన పురుషులందరికీ అది ప్రేమాస్పదం అని తరచు భావిస్తారు. అప్పుడప్పుడు ధారాళంగా పొగని వదలడం మన నెరజాణలనుంచి కూడ చూస్తూంటాం.
పొగాకు - ధూమపానం అవినాభావసంబంధం
అనారోగ్యాన్ని కలిగించే దురలవాట్లలో పొగతాగటం ప్రధానమైంది. 'సిగరెట్టూ చేయించే వింత వినోదంతో ప్రారంభమై, చివారకు విషాద సాధనంగా మనముందు వికటరూపం, విషపునవ్వు ప్రదర్శిస్తుంది. పొగాకుతో చేయబడే సిగరెట్ లో హాని కలిగించే 'నికొటిణ్ అనే పదార్ధం ఉంది అనేది వేరే చెప్పనవసరం లేదు. ఒక సిగరెట్టు పొగలో 85 శాతం వరకు ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డై ఆక్సైడ్ వుంటే మిగిలిన 15 శాతం ఇతర వాయువులు, సూక్ష్మ కణాలు ఉన్నాయిట. గుండె, ఊపిరితిత్తులు వ్యాధులతో మరణించేవారిలో 80% సిగరెట్ తాగటం వల్లనే మృతి చెందుతున్నట్లు నిర్ధారించారు. సిగరెట్లు కాచడం వలన ఉత్పత్తి అయ్యే వేడి వల్ల కూడ ఆరోగ్యానికి హాని కలుగుతుందిట. ప్రారంభంలో 30 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్న వేడి చివరకు 90 డిగ్రీల సెంటిగ్రేడుకు చేరుకుంటుందట. ధూమపానం వల్ల గుండెకు కావాల్సిన ఆక్సిజన్ అందకపోవడమే కాక, ఊపిరితిత్తులలో 'వ్యూకశ్ ఫెరుకుని పనిచేసే సామర్ధ్యం తగ్గుతుందని దండోరా వేస్తున్నారు. రక్తనాళాలు పూడుకుపోవడం లేదా దళసరిగా తయారవడం వల్ల రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడం జరుగుతుంది. నికోటిన్ కారణంగా శరీరంలో అనేక గ్రంధుల పనితీరులో మార్పు వస్తుంది. ధూమపానం వల్ల ప్రతి సంవత్సరం లక్షలాదిమంది క్యాన్సర్ కు బలవుతున్నారు అన్నది నగ్నసత్యం. ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్, మూత్రనాళాల క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదముందట. ధూమపానం చేస్తున్నందువల్ల త్వరగా వౄద్ధులు కాగలరని తేలిందట. అంతేగాక, లైంగిక సామర్ధ్యం సన్నగిల్లేందుకు హేతువు అవుతుంది. పొగతాగేవారే కాకుండా పొగతాగనివారు సైతం ధూమపానప్రియుల వల్ల తీవ్రంగా, దారుణంగా గురవుతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దౄష్టిలో ఉంచుకొని చాలా దేశాలు బహిరంగ ప్రదేశాలలో పొగతాగరాదని నిషేధం విధించాయి. తాగే ప్రతీ సిగరెట్టు ఆయువులో 14 నిమిషాలు పీల్చేస్తుంది. అంటే, జీవితకాలాన్ని ఐదు సంవత్సరాలకు పైగా తగ్గించి వేస్తుంది. హతోస్మి! ఔరా! యింత సంగతా, ఈ సరదా సరదా సిగరెట్టు వెనుక తతంగం, తరంగం.
ఓ రాక్షసీ! నీ పేరు సిగరెట్టా, నువ్వు చేయించేది ధూమపానమా! నీ అంతుచూస్తాం! నీ తంతుని హతమారుస్తాం! ఆ ఘాతుకానికి ముందే నువ్వు పారిపో! లేదా నువ్వు మారిపో!.
' నా జీవితంలో ఒక్కసారి కూడా పొగతాగలేదు; భవిష్యత్తులో ఒకరోజు ప్రపంచం వెనక్కి తిరిగిచూసి ఇంత దారుణమైన అలవాటు వుండేదా అని ఆశ్చర్యపడే కాలం గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదూ - అని ప్రముఖ నాటకకర్త బెర్నార్డ్ షా చెప్పడం చాలా తక్కువగా గోచరిస్తుంది.
కలగూరగంప ని గమనించండి బాబూ!
- ఏటా పది లక్షలమంది క్యాన్సర్ తో సతమతపడి, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.- పొగాకు విదేశీమారకం రూపంలో ఉత్పత్తులపై, పన్నుల ద్వారా సమకూరే అదాయం, తొమ్మిది వేల కోట్లు.- వ్యాధులతో ప్రజలు ఖర్చు చేస్తున్న మొత్తం - పదమూడు వేల ఐదు వందల కోట్లు.- ఏటా 1700 మిలియన్ల డాలర్ల కేంద్ర ప్రభుత్వానికి విదేశీ మారక అర్జన.- పొగాకు లోని, నికోటిన్ సల్ఫేట్ పంటలకు వాడకానికి వీలుగావుండడం.- పొగాకులో జౌషధ గుణాలున్నాయని కేంద్ర ఔషధ పరిశోధన సంస్థ వెల్లడి.- పొగాకు విత్తనాల్లో వుండే 35% శాతం నూనె, రంగుల తయారీతో పాటు వంటనూనెగా వినియోగించవచ్చని, గుండె జబ్బులకు నయం చేస్తుందని శాస్త్రజ़్జుల అభిప్రాయం.- నాలుగు లక్షలమందికి పైగా ఉపాధి.- దేశంలో, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా లో ముఖ్యంగా, రెండున్నర లక్షల హెక్టార్ల పంట సాగు. అయితే, మూడువంతుల ఉత్పత్తి మన రాష్ట్రంలోనే అన్నది గమనార్హం.- రైతులు లక్షమంది ప్రత్యక్షంగా, రెండు లక్షలమంది పరోక్షంగా ఉపాధి పొందుతూండడం.- ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన మేరకు ఉత్పత్తుల నిషేధానికి ప్రపంచ దేశాల చర్యలు.- 2003 లో ప్రత్యేక చట్టం, 2005 లో అమలులోకి తేవడం.- సిగరెట్టు, బీడీ తదితర ఉత్పత్తుల నిషేధానికి ప్రచారం, పాఠశాల, ప్రార్ధనాస్థలాలకు వంద మీటర్ల దూరం లోపున విక్రయాలకు నిషిద్ధం. మైనర్లకు అసలే విక్రయించరాదని నిబంధనలు.- గుట్కాల విక్రయాల్లో కూడ 2002 లో నిషేధాలు, ఆదాయం దౄష్ట్యా తిరిగి 2005 నిషేధాన్ని ఎత్తివేయడం జరిగింది.- సిగరెట్టి, గుట్కా విక్రాయలపై పన్ను విధింపులు వేసినా, నిషేధాల సంగతి హూష్ కాకి! అయిపోయింది.- కేన్సర్ పరిశోధన సంస్థ, పొగాకు ఉత్పత్తుల వాడకం పై ప్రచారం ఒక మలుపు.- ఉత్పత్తులపై నిషేధం గుర్తులు వేసి వాడకం తగ్గించాలనే ఆలోచనలు.- బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం పై నిషేధాలను తేవడం. దేశ రాజధానిలో జరిమానాల జోరు.- బీడీలపై పుర్రెగుర్తుల విషయంలో చెలరేగిన వివాదం దరిమిలా, వాయిదా పడడం.- కేంద్రప్రభుత్వం, సాగుదల నియంత్రణ గురించి పైకి ప్రకటనలను చేస్తున్నా, సిగరెట్ కంపెనీల ప్రలోభానికి లోనవడం, ఉత్పత్తిని పెంచాలని కంపెనీల ఆశయాలు, రెండూ జరుగుతూనే వున్నాయి.- విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడానికి అంగీకరించడం, కేంద్రం కుహనా విధానాలు.- 150 మిలియన్ల పైగా ఉత్పత్తిని సాధించాలని కంపెనీల రహస్య ప్రణాళికలు.- వాడకాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయ విధానాలపై ఆలోచనలను పెట్టడంలో జరుగుతున్న లోపాలు.- పొగాకు సాగు నియంత్రణాచట్టాని అమలు చెయ్యాలి.- కేంద్ర ఔషధ, పొగాకు పరిశోధన సంస్థలు చేపడుతున్న ప్రయోగాలు, ఫలితాలను రైతులకు చేరదీయడం.- ఔషధ కంపెనీలను పొగాకు ఉత్పత్తి కొనుగోళ్ళకు ప్రోత్సాహిస్తూ పెట్టుబడులు పెట్టేందుకు చర్యలు తీసుకోవాలి.- ఔషధ, తైల కంపెనీలను కూడ రంగంలోకి దింప ప్రయత్నించాలి.- విదేశీమారక ద్రవ్యం, రైతులకు ప్రోత్సాహాలు వచ్చేలా ఆచరణ చెయ్యాలి.- పొగాకు బోర్డ్ వసూలు చేసే రుసుముతో, రైతులను ప్రత్యాన్మామ పంటలపై దౄష్టి సారించేలా కార్యక్రమాలు రూపొందిచాలి.- ప్రజల బలహీనతల్ని, వ్యసనాల్ని, ఆదాయ రాబడి లాభాల ధోరణిలోకి మళ్ళించే ప్రయత్నాలకు భరతవాక్యం పాడాలి - మన ప్రభుత్వ నిర్ణేతలు.- ఆశయాల్ని, సరియైన ఆచరణలతో, అందరికీ ఉపయోగించేలా ప్రణాలికలను రూపొందించి, అమలు చెయ్యాలి.
ధూమపాన వ్యతిరేక దినం సందర్భంగా - సంకల్ప దీక్షా కంకణాల్ని తొడగాలి. పొగాకుని పగాకుగా భావించాలి. ఆరోగ్యాల్ని పెంచుకోవాలి. అనారోగ్యాల్ని తగ్గించుకోవాలి. జీవితాల్ని, సుసంపన్నంగా, ఆనందకరంగా, ఆరోగ్యకరంగా, ఆహ్లాదకరంగా గడపాలని, ఆ పరాత్పరుణ్ణి ప్రార్ధిస్తూ - తెలుగురధం వినమ్రంగా సమర్పించుకుంటున్న సదాలోచనాతరంగం.
ఆరోగ్యమే మహాభాగ్యం. ఆయువుని పెంచేమార్గం.

No comments: