నాదబ్రహ్మయోగి - 'కాకర్ల త్యాగరాజూ ( 1767 - 1847 ) - నేడే సంప్రదాయ ఆరాధనోత్సవాలు
శ్రీరామచంద్ర చరణార్చక భక్తశ్రేష్ట! బహురమ్య భావరస సంయుత గీతకర్త! వేదాంత తత్త్వ బహుళార్ధ వివేకమూర్తి! శ్రీ త్యాగరాజ గురుదేవ, నమో, నమస్తే!
తెనుగుజగతిలో భక్తి, ధ్యాన, ముక్తి, భవబంధురభావ సామ్రాజ్యాలని పరిపాలించిన ప్రసిద్ధులలో సరిసములు లేని మున్మూర్తుల రాజులు - త్యాగరాజు, పోతరాజు, గోపరాజు - కౄతులు, భాగవధకధామౄతం, కీర్తనల ద్వారా రసానంద, అమౄతోపమాన, భావచైతన్యస్ఫూర్తికరంగా అందించిన మహావరప్రసాదాలు.
త్రివేణీ సంగమం గా సాహిత్యం, సంగీతం, గానం తో వాగ్గేయకారకత్వం
మానవుని కళాత్మక చైతన్యానికి భాషతో పాటు సంగీత నౄత్యాలు అందమైన ప్రతీకలు. సంగీతం లేని భాష లేదు. నౄత్యం లేని నాగరికత లేదు. లయాన్వితంగా వెలువడిన భాషకు శ్రవణతర్పణ గుణం వుంటుంది. చెవులకు ఇంపులేని భావానికి, భాషకూ ఆకర్షణ లేదు. కనుకనే సంగీతాత్మకమైన భావమే కవిత్వమన్న భావనకు ప్రాచుర్యం లభించింది. తెలుగుకవిని రాగమధురిమలతో సుసంపన్నం చేసిన మహనీయుల జీవితం ధన్యతనుపొందింది. కవితలల్లి, వాటిని రాగబద్ధం చేసి పాడగలిగే ప్రతిభామూర్తులే వాగ్గేయకారులు. మన తెలుగుజగతిలో పలువులు వాగ్గేయకారులు అవతరించి - సంగీత, సాహిత్య, భక్తితత్వాలను మూర్తీభవించిన త్రివేణీసంగమాలై ప్రభవిల్లారు. సంగీత, సాహిత్యాల సమ్మేళన రూపాలైన పదకర్తల్నే వాగ్గేయకారులని, వాక్కు (సాహిత్యము_, గేయం (సంగీతము), రెంటినీ చేయగల సమర్ధుడు వాగ్గేయకారుడు. ఈ వాగ్గేయాల్నే మాతువు, ధాతువు అనడం సంగీత పరిభాష. ప్రాచీనకాలంలో, అన్నమయ్య, క్షేత్రయ్య, నారాయణ తీర్ధులు, రామదాసు, సారంగపాణి, పోతులూరి వీరబ్రహ్మం, మునిపల్లె సుబ్రహ్మణ్యకవి, త్యాగరాజు, మంగళంపల్లి బాలమురళీకౄష్ణ వంటివారిని ప్రధమగణనంలో తప్పక ప్రస్తావించాలి. ప్రస్తుతతరపు ప్రతినిధులుగా శ్రీ మంగళంపల్లి బాలమురళికౄష్ణ ను కూడ ప్రస్తావించాలి.
నాదోపాసన పరంపర లో 'మూర్తిత్రయం'
వేదపరమార్ధాల్ని లోకమునకు అనుగ్రహించిన తేజోమూర్తి నారదుడి దివ్యానుగ్రహముతో వ్యాసుని గాంధర్వవేదము (సంగీతం)నకు, 'వ్యాసకటకమూ అను నిబంధన గ్రంధమును స్మరించెనని ప్రమాణము. 'నారద కటకమూనకు స్వరార్ణవమను సంకేతం కలదు. 'హనుమత్కటకమూ ఔత్తరాహ సంగీతమునకు మార్గదర్శకమని సంగీత శాస్త్రమర్యాదను పెద్దలు నిర్ణయించారని చెబుతారు. పండిత వర్గములు, సంప్రదాయ సౄష్టలు తర్వాత, క్రమంగా, సన్నిహితులు సదాశివబ్రహ్మేంద్ర, నారాయణతీర్థ, రామదాసాదులు అర్వాచీనంగా ప్రసిద్దులైన వాగ్గేయకారులు. ఆ తర్వాత దక్షిణభారతమున తంజాపుర మండలము, శ్రీ త్యాగరాజేశ్వర క్షేత్రము తిరువారూర్ అను పుణ్యక్షేత్రమున, రెండు సంవత్సరాలలోపు తారతమ్యంతో అవతరించిన సంగీత త్రిమూర్తులుగా ప్రసిద్ధులు, వాగ్గేయకారులు - శ్రీ శ్యామశాస్త్రి (1763), శ్రీ ముత్తుసామి దీక్షితులు (1775), శ్రీ త్యాగరాజబ్రహ్మము (1767) లకు వేరే సపరిచయం అనవసరం.
మన 'త్యాగరాజూ
త్యాగయ్య నాదోపాసనలో ముక్తిపొంది భక్తుల కందరికి దారి చూపిన మహా వాగ్గేయకారసత్తముడు। అన్నమాచార్యుని ఆధ్యాత్మిక సంపద, పురందరదాసు సంగీత స్ఫూర్తి, రామదాసు భజనరీతి పుంజీభూతం గావించుకొని, సంగీత సామ్రాజ్యానికి అధినేతౄత్వం వహించిన మహానుభావుడు, త్యాగయ్య. త్యాగయ్య శహభూపాలుని ఆస్థాన వాగ్గేయకారుడై ప్రసిద్ధి కెక్కిన గిరిరాజ కవికి స్వయాన పౌత్రుడు. గిరిరాజ పుత్రులలో కనిష్టుదు రామబ్రహ్మం. రామబ్రహ్మం పుత్రుల్లో కనిష్టుడు త్యాగయ్య. 1600 ప్రాంతంలో కాకర్ల ( కంభం మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్) నుంచి తంజావూర్ జిల్లా తమిళనాడు కి వెళ్ళి స్థిరపడ్డ ములికినాటి ఆంధ్ర బ్రాహ్మణ వంశం. సీతమ్మ - రామబ్రహం దంపతులకు 4 మే 1767 న త్యాగయ్య జన్మించాడు. తండ్రి రామబ్రహ్మం తంజావూరు ప్రభువు శరభోజీ ఆదరంలో ఉండేవాడు. తాత గిరిరాజకవి మహావాగ్గేయకారుడు. మాతామహుడు వీణ కాళహస్తయ్య ప్రసిద్ధ సంగీత విద్వాంసుడు. తల్లి పురందరదాసాదుల కీర్తనలను పాడుకొంటూ ఉండేది. సంగీతం త్యాగయ్యకు ఉగ్గుబాలతోనే అబ్బింది. సంస్కౄతాంధ్రాలలో పాండిత్యం గడించాడు. శొంఠి వెంకటరమణయ్య వద్ద ఏడాదిలోపునే సంగీతంలో ప్రావ్విణ్యాన్ని సంపాదించాడు.
శ్రీరామదర్శనభాగ్యం - ఆశువుగా 'అఠాణారాగ కౄతీ గానం
రామకౄష్ణానందస్వామి, సన్యాసి, నారదోపాస్తి మంత్రాన్ని త్యాగయ్య కుపదేశించాడు। నారదుడు యతివేషంలో వచ్చి స్వరార్ణవమనే సంగీత గ్రంధాన్నిచ్చి, సమస్త సందేహాలు తీరిపోతాయని ఆశీర్వదించి వెళ్ళాడు అని విశ్వాసం. తన గురువైన నారదుని అనేక విధాల ఎన్నో కీర్తనల్లోస్తుతించాడు. గురువు ఆదేశానుసారం 96 కోట్లు రామతారకమంత్ర పఠనంతో శ్రీరాముడు సలక్ష్మణసమేతుడై దర్శనమివ్వడం, ఆ అనుభూతిలో, 'ఏల నీ దయరాదు పరాకు చేసేవేలా (ఆఠాణా రాగం) అని ఆశువుగా కీర్తనను రచించి గానం చేశాడుట. రామదర్శనసాక్ష్యంగా, రచించిన అనేక కౄతులు సాక్షీభూతంగా దర్శనమిస్తాయి. 'అలకలల్లాడగగని ఆ రామణ్ముని యెటు పొంగెనో' అన్నది ఉదాహరణం. రాజాశ్రయాన్ని తిరస్కరించి, నిత్య రామసంకీర్తన ఆచరణ, ఉత్తమవాగ్గేయకారుడిగా దేశవ్యాప్తంగా వచ్చిన కీర్తి, సంగీతసభలు, సన్మానాలు విరివిగా చేసేవారట. తంజావూరు ప్రభువు కానుకలను కూడ తిరస్కరించాడు. ఆవేశంలో 'నిధి చాల సుఖమో - రాముని సన్నిధి సేవా సుఖమా' అని గానం చేశారు. తిరువాంకూర్ ప్రభువు స్వాతి తిరునాళ్ళు ఆహ్వానాన్ని తిరస్కరించడం, 'పదవినీ సద్భక్తియుగల్గుటే' అని, త్యగయ్య పూజించే రామ పంచాయతన విగ్రహాన్ని కావేరీలో పడవేసి, 'ఎందు దాగినాడో?' అన్న కౄతిద్వారా తన ఎదలోని రొదను తెలిపాడు. రాముడు స్వప్నంలోకి రావడం, కావేరి నుంచి విగ్రహాన్ని తెచ్చుకొని పూజచేయడం ప్రారంభమైంది. తిరువొత్తియూరు, కోవూరు, నాగలాపురం, తిరుపతి, పుత్తూరు, కంచి, వాలాజపేట, శ్రీరంగం, నాగపట్టణం, ఘటికాచలాది పుణ్యక్షేత్రాల్ని సందర్శించి ఆయా దేవతల ఉపముద్రతోటి అనేక కౄతులను సమకూర్చాడు.
సంకీర్తన నుంచి కౄతి వరకు భక్తి, ధ్యాన కవిత ప్రస్థానం
అన్నమాచార్యుల సంకీర్తనగాను, ఆధ్యాత్మికపరంగాను అవతరించిన కీర్తన, రామదాసు, నారాయణతీర్థులు, సుబ్రహ్మణ్యకవి వంటి వాగ్గేయకారులచే భజన, ఆధ్యాత్మన కీర్తనగాను, ధాతుకల్పనతో నూతనమార్గాన్ని అనుసరించి, మరొక నూతనరూపంలో, త్యాగరాజు నాటికి 'కౄతీ అనే పేరు వహించి పరిపక్వం పొందింది. కౄతులు దశలో రాగాలస్వరూపంలో కూడ చాల మార్పులు సంభవించి, రాగస్వరూపదర్శనానికి త్యాగరాజ కౄతులు దర్పణాలై విరాజిల్లాయి. ఏది ఏమైనా, పదం, కీర్తన, కౄతి రూపాలు త్రివేణీసంగమమై, ముప్పేటన అల్లుకుపోయాయి. ఈఆధునిక సాహిత్య-సంగీతకళా సంస్కౄతిలో విభజించడం జరగని పని. పేరులోనే పెన్నిధి అన్నది వర్తించకపోయినా, ఏప్రక్రియ అయినా, సంగీతనిధి అని చెప్పక తప్పదు. 'సాహిత్యంలో అంతరార్ధాన్ని మరింత ప్రస్ఫుటం చేయడానికి రాగసంచారంలోని ప్రత్యేకప్రయోగాల ద్వారా రాగభావాన్ని సాహిత్య భావంతో రంగరించి విస్తరించడానికి సంగతుల ప్రయోగం విరివిగా జరిగి త్యాగరాజకౄతులకు ప్రత్యేక స్వరూపాన్నిచ్చింది. ఈ సంగతుల విస్తరణనే ధాతుకల్పన దక్షతగా విజ్ణులు భావించారూ అని తెలుగు వాగ్గేయకారులపై విశ్లేషణ చేస్తూ డా. యస్.గంగప్ప గారు వివరించారు.
త్యాగరాజకౄతుల ముత్యాలసమాహారమాలిక - 'త్యాగబ్రహ్మోపనిషత్తూ
'త్యాగరాజ స్వామి వ్యక్తిత్వంలో మూడు గుణాలు ప్రధానంగా - నాదబ్రహ్మోపాసన శక్తి, భక్తిజ్ణాన పరీపాకం, కవితాలాలిత్యం అయితే, వారికి సంగీతం మీద ఉన్న అధికరక్తి, సాహిత్యంమీద గౌణభక్తి పుష్కలమైతే, సాహిత్యాపాసకులు త్యాగరాజ కౄతులలోని సాహిత్య రసికత్వాన్ని, సంగీత సంయోజన సౌలభ్యాన్నీ సమీక్షించి భక్తిరససిద్ధిని సాధించుకుంటారూ అని ప్రముఖ సాహితీవిమర్శనచక్రవర్తి డా.జి.వి.సుబ్రహ్మణ్యంగారు 'త్యాగరాజస్వామి భక్తికవితావైభవం' అన్న సుదీర్ఘవ్యాసానికి ఆముఖం - కృౠతి-సుకౄతీ ద్వారా తెలియపరుస్తూ, 'కౄతులలోని రాగాన్ని ఆలపిస్తే కలిగేది గానరసం; కౄతులలోని సాహిత్యాన్ని సమాలోచిస్తే కలిగేది సాహిత్యరసం' రసద్వయాన్ని మరింత రసభరితంగా ప్రవచించారు. త్యాగరాజు కౄతులకు 'త్యాగబ్రహ్మోపనిషత్తూ అనే ప్రసిద్ధికలగడం, 2400 కీర్తనలను రచించినట్లు సమాచారం. అయితే, నేటికి కేవలం 500 పై చిలుకుగానే లభించడం, సంగీతస్వరాలతో ప్రచారంలో ఉండడం గమనిస్తాం. త్యాగయ్య 72 మేళకర్తరాగాలలోనూ కౄతులు రచించాడు. బహువిధ కౄతులతోపాటు, ప్రహ్లాదభక్తివిజయం, నౌకాచరిత్రము, సీతారామ విజయము అన్న సంగీతరూపకాలైనా, వీటిని, ప్రబంధాలని, నౄత్యనాటికలుగాను ప్రఖ్యాతమైనాయి. త్యాగరాజకౄతుల్ని బహుక్లుప్తంగా క్రోడీకరించాలంటే, పామరభాషలో, చక్కని కౄతిరచనలు, వర్ణనలు, భక్తిరచనలు, నీతివైరాగ్యరచనలు అని చెప్పవచ్చునేమో.
ఘనరాగ పంచరత్న కీర్తనలు - ప్రత్యేక శైలీసంప్రదాయాలు
త్యాగరాజు రచించిన కౄతులు,కీర్తనలలో దేని ప్రత్యేకత దానిదే। త్యాగయ్య కీర్తనలన్నీ భక్తి ప్రపూరితాలు. రస, స్వర, మధుభరితగుళికలు. అయితే, ప్రత్యేకశోభతో రాణించే మణిప్రకాశంలా, ఘనంగా ప్రస్తావించతగ్గ, ఉత్తమోత్తమస్థానార్హాలుగా, 'త్యాగరాజు ఘనరాగ పంచరత్నా కీర్తనలను విశేషంగా వివరించాలి. ఈ పంచరత్న కీర్తనలుగా నిరంతరం చెప్పబడే వాటిలో, స్వరాలబిగి, కూర్పు, సంగీతంలో ఉదాత్తతల్లో వాటి మహత్త్వత బహుధా ఉగ్గడింపబడ్డాయి. కర్ణాటకసంగీతజగతిలో జ్ణానులు, విజ్ణానులు, ప్రజ్ణానులు, స్వామివారి ఆరాధనాక్రమంలో పునీతంగా, పులకరింతలతో, అనుభవిస్తూ,పలవరించే భక్తిపరంపర వర్ణనాతీతం. ముక్తకంఠాలతో, భక్తిభావం వెల్లివిరిసేలా గానం చేయడం విధిగా విధిని పాటిస్తూ, సద్విధిగా భావిస్తూ ఆచరిస్తారు. సంగీతపు విలువలు, కీర్తనలనాణ్యత, సంగీతసాహితీవిద్వత్తులోకానికి, తద్వారా రసికులకు సుపరిచితాలు. చరణాలు అధికం, సుదీర్ఘమైన కూర్పు, శబ్దాలసంతరిఫులో విశిష్టత, భావప్రసారంలో నైపుణ్యం, మొదలైన ప్రత్యేక నైజాలు, శైలీసంపదల్ని కలిగివుండడం కారణాన, సార్ధకనామధేయంగా 'ఘనరాగకీర్తనాలని భావించడం సర్వోచితం. కీర్తనయావత్తు అవగతమే కాకుండ, త్యాగరాజులవారు భక్తిబోధనామౄతధారను వీటిలో ప్రవేశపెట్టడం జరిగింది. పంచరత్నకీర్తనలను ఏకైక ప్రయోజనసూత్రంతో బంధించి, ఘనరత్నకీర్తనామాలగా సంతరించి, సంఘటించిన తీరుతెన్నుల్లో, ఒక పద్ధతి, క్రమం, సంపుటీకరణం సుస్పష్టత కనిపిస్తుంది.
ఘనరాగ పంచరత్న కీర్తనలు
'యిరువదిరెండు శ్రుతుల కలయికకు ఆస్కారములు కావడంచేతనూ, వీణలో యీ రాగాలని గానంచేసేటప్పుడు తానవిస్తరణకి ఎంతో అవకాశం ఉండడంచేతనూ, వీటిని ఘనరాగాలని, మంగళప్రదములై సుస్వనశోభితములైన రాగశ్రీలుగా సంప్రదాయంగా భావించడం జరుగుతుందీ అని ఘనరాగాల గురించి నిర్వచనాన్ని 'త్యాగరాజస్వామి భక్తికవితావైభవం' అన్న వ్యాసంలో ఆకెళ్ళ అచ్యుతరామం గారు విశదీకరించారు. కేవలం 'ఆదీతాళంలో స్వరపరచిన ఈ పంచరత్న కీర్తనలు - పల్లవి, అనుపల్లవి, వాటి తాత్పర్యం, యిలా వున్నాయి.
1। 'జగదానంద కారక; (నాట రాగం)
'జగదానందకారక జయ జానకీ ప్రాణనాయక, గగనాధిపసత్కులజ రాజరాజేశ్వర సుగుణాకర సురసేవ్య భవ్యదాయక సదా సకలా।
ఓ శ్రీరామా! నీవు జగములకు ఆనంద కారకుడవు, జానకీ ప్రాణనాధుడవు నీకు జయము. ఓ శ్రీరామా! నీవు ఆకాశాధిపతియైన మంచి సూర్య వంశమున జన్మించితివి. రాజులకు రాజులైన వారికి రాజువు పుణ్యములను శుభములను ప్రసాదించువాడవు, ఎల్లలోకములనూ ఎల్లప్పుడునూ ఆనందమును కలుగ చేయువాడవు.
2॥ 'దుడుకుగల నన్ను ...' (గౌళ రాగం)
'దుడుకుగల నన్నేదొరకొడుకు బ్రోచురా ఎంతో, కడు దుర్విషయాకౄష్ణుడై గడియ గడియకు నిండారూ
త్యాగరాజు స్వామి తను చెడ్డవాడనని, అందుచేతనే శ్రీరాముడు తనను రక్షించుట లేదని, దర్శనమీయుట లేదని తనలో తాను ఆత్మవిమర్శన చేసుస్కొనుచున్నారు। నిజమునకు, వారు ఈ కీర్తనలో తాను చేయుచున్న చెడ్డపనులు, చెడ్డ ఆలోచనలు తాను ఎప్పుడూ చేయలేదు. తన కాలమున (ఇప్పటి కాలమున కూడా) తక్కిన సంగీతజ़్జులు చేయు దుడుకు పనులు తన మీద ఆపాదించుకుని శ్రీరాముని వారి కొరకు ప్రార్ధించు చున్నారు. అనుక్షణము, ఎడతెగక, చెడ్డ పనులతో, చెడు ఆలోచనలతో నా మనస్సు నిండి యున్నది. చెడ్డ బుద్ధి నన్ను చుట్టుకొని యున్నది. అటువంటి నన్నుఏ భగవంతుడు రక్షించును?
3। 'సాధించెనే, మనసా' (ఆరభి రాగం)
'సాధించెనే ఓ మనసా! బోధించిన సన్నార్గవచనముల బొంకుజేసి తా బట్టిన పట్టు - సమయానికి తగుమాటలాడెనే'
ఈ కీర్తనయందు శ్రీ త్యాగరాజు స్వామివారు (శ్రీరాముని బదులు) శ్రీకౄష్ణుని సాధించుచున్నారు। నిందాస్తుతిని చేయుచున్నారు. శ్రీకౄష్ణుడు భగవద్గీత యందు సన్మార్గములను బోధించెను. కాని తాను బోధించిన సన్మార్గము వచనములను కల్ల చేసి, నాటికి భిన్నముగా తా పట్టిన మొండిపట్టును సాధించుకొనెను. శ్రీకౄష్ణుడు అవసరమునకు తగినట్లు, సందార్భానుసారముగా, సమయానుకూలముగా మాట్లాడుచూ, రాజకీయమును, తన మాయను ప్రకటించుచున్నట్లు పైకి కనిపించును. (కాని, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ లో శ్రీ కౄష్ణ పరమాత్మ తమ తలచిన పనిని నిర్విఘ్నముగా కొనసాగించుకొను సామర్ధ్యము కల మాయా మానుష విగ్రహుడు).
4॥ 'కనకన రుచిరా' (వరాళి రాగం)
'కనకనరుచిరా - కనకవసన నిన్ను, దిన దినమును మనసున చనువున నిన్ను, పాలుగారు మోమున శ్రీయ-పార మహిమదనరు నిన్నూ
బంగారు చేలములు ధరించిన ఓ రామా నీ సౌందర్యమును ఎంత చూచినను తనివి తీరదు। ప్రతి దినము నీ అంత: సౌందర్యమును నీ యందు గల చనువుతో భక్తితో ఎంత చూచినను తనివి తీరదు। త్యాగరాజస్వామి శ్రీరాముని బాలునిగా తన మనస్సు నందు చూడగలిగెను. పాలుగారు ముద్దుమోము గల రాముని అపారమైన మహిమ గల రాముని చూడ కలిగెను. అట్లు చూచి, తన్మయము చెంది వర్ణించుచున్నాడు.
5 ఎందరో మహానుభావులు (శ్రీ రాగం)
'ఎందరో మహానుభావులందరికి వందనములు। చందురు వర్ణుని యందచందమును హౄదయారవిందమునజూచి బ్రహ్మానంద మనుభవించువారెందరో'
మహాభక్తులు, మహాత్ములు మనకి తెలిసినవారు ఉన్నారు. మనకి తెలియని అజ़్జాతంగా ఉండిన మహానుభావులకు అందరికీ నా నమస్కారములు. పూర్ణ చంద్రునివలె ఆహ్లాదము కలిగించు, అందము, చందము, కలిగిన శ్రీరాముని హృౠదయ కమలమున నిల్పి ఎల్లప్పుడూ ఆ బ్రహ్మానందమున మునిగియుండు మహాభక్తులెందరో గలరు. వారికి అందరికీ నా ప్రణామములు.
వీటిని సవివరణాత్మకతకు ప్రత్యేక వ్యాసమే గత్యంతరం. అన్యధాశరణం నాస్తి.
యింతటి పరమోత్కౄష్టతను నింపుకొన్న వీటిని, పంచారామాలుగా, ఈ పంచరత్నకీర్తనలను భావించడంలో ఆశ్చర్యం లేదు। ప్రముఖ త్యాగరాజ సంగీతజ్ణులైన టి.వి.సుబ్బారావుగారు, పంచరత్నకీర్తనావైశిష్టతను, క్లుప్తంగా వివరించారు. "భగవంతుడు మానవునకు ప్రసాదించిన మహాభాగ్యాలలో అత్యంత అమూల్యమైనదీ, అతణ్ణి 'ఉద్ధరించేదే' యేదీ అంటే సంస్కౄతీ, సంస్కారమూ అన్న జవాబు తట్టుతుంది. ఆ సంస్కౄతీ మహానుభూతులకు కారకమైన వాటిలో మణిపూసలాగా సర్వోత్కౄష్టమైనది - సంగీతజ్ణానము, భక్తి. ఈ సంప్రదాయంలో అత్యుత్తమమైనది - కర్ణాటక కృౠతి, సంప్రదాయ సంగీతం. వీటిలో, ఉత్తమోత్తమ వాగ్గేయకారులెవరంటే, సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారన్నది రూఢి అవుతుంది. ఆ త్యాగరాజ స్వామివారి రచనల్లో అత్యంత ప్రభాసమానములై, ఉత్తమోత్తమంగా శోభించే కౄతులేవీ అంటే, అవి ఈ ఘనరాగపంచరత్నకీర్తనలే అనడం నిర్వివాదాంశం' అని సత్యప్రకటన చేశారు. ఈ కధనం, 'కావ్యేషు నాటకం రమ్యం, నాటకేషు శకుంతలం - చతుర్ధాంకం, శ్లోకచతుష్టయం' అన్న పంథాలో వుంది. సంస్కౄతీ మహద్భాగ్యాలు వెతుక్కూంటూ పయనం చేస్తే, సందేహం లేని జవాబు ఈ పంచరత్నాలు, ఘనరాగసహితకీర్తనలు, సర్వసౌభాగ్యనిధులు.
త్యాగరాజు నిర్యాణ సన్నివేశం
1847 - 'ప్లవంగీ సంవత్సరము, పుష్యశుద్ధ ఏకాదశినాడు భద్రాచల రాముడు దర్శనమిచ్చి, 'పదిపూటలలో కరుణింతూనని చెప్పెనట। అనగా తనలో లీనమొనర్చుకొందురని భావించి 'శహనారాగములో 'గిరిపై నెలకొన్న రాముని గురితప్పక గంటీ అని కీర్తించినారట. పుష్య శుద్ధ పూర్ణిమనాడే త్యాగరాజు బ్రహ్మము ఆపత్సన్యాసమును స్వీకరించిరి. నాటినుండి త్యాగరాజస్వామియను సంకేతము రూఢియయ్యెను. పుష్య బహుళ పంచమి నాడు శ్రీ త్యాగరాజుగారు ఉష:కాలమందే స్నానానుష్ఠానములను నిర్వహించుకొనియుండగా, శ్రీవారి భక్తులు శిష్యులు చేరి రామభజన చేయుచుండగా, మరికొందరిని స్రీరమమంత్రజపము చేయుడని ఆదేశించి, మనోహరి రాములో 'పరితాపముగని యాడిన పలుకులు మరచితివో' అను కీర్తనను పాడి 'ధన్యాసీరాగంలో శ్యామసుందరాంగ సకలశక్తియు నీవేరా, ఇలను త్యాగరాజువేరా' అని కీర్తించుట తర్వాత చిన్ముద్ర ధరించి సమాధి నిష్ఠలో కపాలమోక్షమైనట్లు ప్రసిద్ధి కలదు.
మంగళవచనాలు
త్యాగరాజకౄతిలోనే ఈ నాదబ్రహ్మ గురించి మంగళం 'నీ నామరూపములకు మంగళం, నిత్య శుభమంగళం' 'రాజీవనయన త్యాగరాజ వినుతమైనా అని సమాప్తం చేయడం, భారతీయకళాసంస్కౄతీవైభవానికి నీరాజనం.
వాగ్గేయకార శిరోరత్నం అనదగిన రామతారక బ్రహ్మవేత్త, నాదమూర్తి శ్రీ త్యాగరాజస్వామి వారిని స్మరించువారికి ముక్తి, మోక్షం హస్తసిద్ధములు। మంగళంమహత్. జయతు రామనామ.
తమిళనాడు - తిరువాయూర్ లో పుష్య బహుళ పంచమి - ఈ సంవత్సరం - జనవరి 27 - రోజున సంప్రదాయబద్ధంగా, సంస్కౄతీపరంగా, నిర్వహించడం జరుగుతోంది. ఆ సందర్భంగా సమర్పిస్తున్న ఈ వ్యాస నివాళి.
No comments:
Post a Comment