Sunday, November 2, 2008

నవ్యకవితా ప్రస్తానాచార్యులు - దేవులపల్లి కృష్ణశాస్త్రి


దేవులపల్లి కృష్ణశాస్త్రి


నవ్యకవితా ప్రస్థానాచార్యులకు ఘన నివాళి
మనసున మల్లెల మాల లూగెనే, కన్నుల వెన్నెల డోలలూగెనే, ఎంతహాయి ఈ రేయి నిండెనో, ఎన్ని నాళ్ళకీ బ్రతుకు నిండెనో - యిలాంటివి ఎన్నో మధురిమ చిత్రాతిచిత్రగీతాలు.
వేదవిద్య నాటి వెలుగెల్ల నశియించె, గారె బూరె పప్పుచారు మిగిలె, బుర్ర కరిగి కరిగి బొర్రగా మారెరా! విశ్వదాభిరామ వినురవేమ - అని అభినవ వేమన శతకాది రచనలు.
చౌరస్తా! ఆహిస్తా! ఏక్ సవారీ, ఆఠణా, దో సవారీ బారాణా, సర్దీ, గర్మీ, చఢావ్, ఉతార్, రిక్షా జల్దీ తొక్కెస్తా!, అంటూ - బతికుంటే మరి కూడెట్టా? చావంటే మరి భయ మెట్టా, ఉండి ఉండి ఓ నాడెపుడో హుసేన్ సాగర్ చౌరస్తా - అంటూ ఆధునిక బడుగువర్గపు ప్రజాప్రతినిధిగా వత్తాసు తీసుకునే భావోద్వేగపూరిత కవితలు.
రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా! కౄష్ణార్పణం అంటూ సంక్రాంతి లక్ష్మి శోభను వర్ణిస్తూ పర్వశోభాసంస్కౄతిని వర్ణిస్తూ గీతాలు.
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధత్రి! జయ జయ జయ శత సహస్ర నరనారీ హౄదయనేత్రీ! అన్న ప్రముఖ ప్రియభారతీగీతం.
యిలా ఎన్నో, మరెన్నో, సాహితీప్రక్రియలు అన్నింటినీ తట్టిన వారు నవ్యకవితా ప్రస్థానాచార్యులు. ఆయనే దేవులపల్లి కౄష్ణశాస్త్రిగారు.
దేవులు పుట్టిన వంశాన ...
'దేవులపల్లి వంశమున దేవులు పుట్టిరీ అని చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారు.
మా కౄష్ణశాస్త్రి మామూలు మాటలలోనే కవిత్వం ఉంటుంది; చాలమంది వాటితోనే తౄప్తిపడిపోతారు; ఆయన కవిత్వం చెప్పదలచుకుంటే, అంతకన్నా పై స్థాయి ఉండాలి; అందువల్లనే ఆయన హెచ్చుగా వ్రాయలేకపోయాడు - అని కాటూరి వేంకటేశ్వరరావుగారు.
దేవులపల్లివారి జీవితప్రస్థానం
దేవులపల్లి కౄష్ణశాస్త్రిగారు విద్వత్వంశంలో 1887 నవంబర్ 1 న ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరిజిల్లాలోని చందనపాలెం లో జన్మించారు. ఈ గ్రామం ప్రఖ్యాత కవి కూచిమంచి తిమ్మకవి నివాసం చేసిన కవనస్థలి. దేవులపల్లివారి తండ్రి కూచిమంచి తిమ్మకవి మునిమనుమడు వెంకట్రాయమంత్రి వద్ద కవిత్వపు మెలకువలను నేరుకున్నారని చెప్తారు. వీరి పూర్వీకులు పిఠాపురం ఆస్థానకవివర్యులు. కనుక 'అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవా అని అల్లసాన పెద్దన అన్నట్లు పుట్టుకతోనే గొప్ప సంస్కారం ఆవహించింది. పదాల సంగీతం, మధుర జ్ణానపు సంగతులు అవగాహనకు రావడం, వారు ఏడవ ఏటనే సామర్లకోటలో 'నంద నందన ఇందిరానాధ వరదా అని తొలి పద్యాన్ని చదివారు. విద్యార్ధిగా పిఠాపురం, కాకినాడలో గడిపారు. 1918 లో పట్టభద్రులై జీవితంలో ఒక మలుపు తీసుకునే దశలో, బ్రహ్మసమాజం, వ్యవహార భాషావాదాలు తీవ్రంగా విరాజిల్లుతున్న రోజులవి. కాకినాడ, పెద్దాపురం మిషన్ హైస్కూలులో ఉపాధ్యాయపదవిని నిర్వహించారు. 'ధర్మసాధనా అన్న పత్రికలో పిఠాపురం రాజావారికి వ్యతిరేకంగా వ్యాసం వ్రాయడం, ఫలితంగా రాజావారినుంచి వచ్చే ధనసహాయం ఆగిపోవడం, ఈ యిబ్బందుల్లోనే శాస్త్రిగారికి సతీవియోగం కలగడం దురదౄష్టకరం. శాస్త్రిగారి అంతరంగం కరిగి 'కన్నీరూ గా తరంగాలు, అలలుగా పేరుపొందాయి. ఇదే వారి తొలి ఖండకావ్యసంపుటి (1923). తిరిగి వివాహం చేసుకోవడం, పిఠాపురం హైస్కూలులో ఉద్యోగం దొరకడం జరిగాయి. ఏదైనా స్వల్పాలే. కవిగారి భావాలు రాజాగారికి నచ్చని కారణంగా పనికి వీడుకోలు యిచ్చారు. జరిగినవన్నీ మంచికనీ అనుకోవడం మనిషిమని అన్న సిద్ధాంతాన్ని నమ్మారు. దశాబ్దకాలంపాటు దేశయానం చేశారు. 1933 నుంచి పదేళ్ళు కాకినాడ కళాశాలలో ఉపాధ్యాయులుగా పనిచేశారు.
వౄత్తి-ప్రవౄత్తి మిశ్రమాలు
1942 లో చెన్నపురికి నివాసం మార్చారు. ఆనాటినుంచి నేటివరకూ చిత్రరాజమైన 'మల్లీశ్వరీ చిత్రానికి మాటలు, పాటలు రచించారు. రేడియో ప్రసారాలు, ప్రవక్త పాత్ర, యిలా ఎన్నో వైవిధ్యమైన విషయాల్లో తన ప్రతిభను ప్రదర్శించారు. శాస్త్రిగారి వైవిధ్య సాహితీ ప్రక్రియలను ప్రస్తావించాలంటే గేయాలు, వ్యాసాలు, నాటికలు, భక్తిరసాత్మకరూపకాలు, శ్రవ్యనాటికలు, చిత్రగీతాలు, ఆండాళ్ తిరుప్పావ్ కీర్తనలు, శౄంగార నాటికలు, యక్షగానాలు, సంగీత రూపకాలు - ప్రచురితమైనవి, సంకలనాలబట్టి చెప్పదగినవి. అప్రచురితాలు వేనకువేలు.
ప్రభావ, అనుభవ పరంపరలు, పలవరింతలు
1929లో రవీంద్రనాధ్ ఠాగూర్ ను కలవడం తర్వాత ఉప్పొంగిన భావనాలహరి.
వారి మామూలు మాటల్లోనే కవిత్వం గంతులేస్తుంది. ఒకసారి ఒక వౄద్ధునికి పరచియం చేస్తే, కంటిచూపు తగ్గింది బాబూ, చెబితేకాని తెలీదు నాయనా! అని అంటే, శాస్త్రిగారు - మీరు ఎంతో అదౄష్టవంతులు, చెబితే తెలుస్తున్నది, చెప్పినా తెలియనివారు ఎందరున్నారో భారతదేశంలో - అని నవ్వు ఆగని మనోల్లాసాన్ని కలిగించిన స్ఫూర్తిమంతుడు.
నా కవితలో నాన్నగారి లిరికల్ ఫెర్వర్, పెదనాన్నగారి జిగీ వచ్చాయి - అని ఆయనే చెప్పుకున్నారు.
జీవితంలోని ప్రతి అల్పానుభవాన్ని ఒక ఉదాత్తదౄష్టితో అనుభవించే శక్తీ గురువులవల్ల పొందగలిగాను - అని గురుభక్తిని ప్రకటించిన వినయశీలి.
నేనేదో భక్తకవిని కాను; మీరనుకునేంత భక్తుణ్ణీ కాను. కొందరు అనుకునేంత దుర్మార్గుణ్ణీ కాను. ఎప్పుడో హౄదయవేదన భరించలేనప్పుడు కేక పెడతాను. అది కీర్తన అవుతుంది అని రచనలోని పాయలన్నింటినీ వివరించారు.
నాకు కవిత్వం పుట్టలోని పాములాగ, తెల్లవారి తలుపులు తట్టి వచ్చిపడే అతిధిలాగ, రేకులు విచ్చుకున్న పూవులాగ రకరకాలుగా వస్తుంది అన్న వారి వాక్యాలే సత్యరచనలు.
రామాయణం మానస రచితమైన గొప్ప ఇతిహాసం; కలకాలానికి వర్తించేది; కాళిదాసు కవిత కవితాగుణాలన్నీ పుంజీభూతమైంది; పాతవారికి అంతా సత్యం, రామాయణం ఇప్పుడు ఎవరైనా వ్రాస్తే, నప్పదు; నన్నయ, తిక్కన, మానవుల లోతులు, ఎత్తులు సులభంగా తెలిపారు - అని ప్రబంధరచనకు పూనుకోనందుకు ఆయన యిచ్చిన వివరణ.
నేను హౄదయవాదిని; నాకు వేదాంతం తర్కం తలకెక్కవు; నన్ను ఎడారిలో కూర్చోబెట్టి వేయి పుస్తకాలు ఇస్తామన్నా వద్దు; ఒక్క పుస్తకమూ అక్కరలేదు; పనికిమాలినవారు, చెడ్డవారు, వికారరూపులు అయినా సరే - జనం మధ్యన నన్ను పడేయండి; నేను ఆరోగ్యంతో ఎంతకాలమైనా బ్రతుకుతాను; మనుష్యులు లేకపోతే కాయిలా (ఆరోగ్యంలేనితనం) పడుతాను - శాస్త్రిగారికి జనంలో నేను, నా చుట్టూ జనం అన్న వాదాన్ని వేదంలా భావించారు.
జాతి వయస్సులో ఉన్నప్పుడు ఠాగూర్ లాంటివారు పుట్టారు; సంఘదౄష్టి కలిగితే మంచి నాటకం, మంచి సాహిత్య విమర్శ వస్తాయి; కవిత ఆత్మాశ్రయం; వయస్సులో వచ్చేది; పెరిగాక నాటకకర్త అవుతాడు; నాటకకర్త ఇంటి యజమాని వంటివాడు అని సాహిత్యాన్నే కాక, సాహితీప్రక్రియను కవి ఏ వయసులో రచనకు పూనుకోవాలోకూడ వివరించిన విద్వన్మూర్తి.
నాది చిక్కని కవిత అని నా నమ్మకం; అన్ని వర్గాల పరిశీలనా ఉంది అని చెప్తూనే, నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు? నా ఇచ్చయే గాక నాకేటి వెరపు? అని ప్రకటించుకున్న ధైర్యశాలి మన దేవులపల్లి.
చివరగా కవి గురించి శాస్త్రిగారు యిచ్చుకున్న నిర్వచనం
కవికి నిజాయితీ ఉండాలి. ప్రేమ ఉండాలి. మానవత ప్లస్ నిజాయితీ అన్నమాట. కవులు రెండు రకాలవారు, తాము చెప్పదలచింది నిజాయితో చెప్పేవారు. వారిది కొంతకాలం నిలుస్తుంది. కాలానుగుణమైన సత్యాన్ని - యుగధర్మాన్ని నిర్వచించేవరు రెండవవారు. వారిది శాశ్వతంగా ఉంటుంది. మానవత అంటే విభేదాలకు అతీతమైన రసాస్వాదనం. ఈ దౄష్టితో కవులందరూ విశిష్టాద్వైతులు. నేను మానవోద్యమానికి చెందినవాణ్ణి. నా మానవతావాదానికి విశ్వమానవ దౄష్టి ప్రధానసూత్రం.
కవిత్వంలో జాతులు, మతాలు చూస్తే గంగవెర్రితనం ఆవహిస్తుంది శాస్త్రిగారికి. విశ్వమానవ భావన లేనివాడు గొప్పకవి ఎలా అవుతాడని తరచు ప్రశ్న వేసేవారు.
యిలా చెప్పుకుపోతే, అంతులేని అనంతం. అందుకే గురజాడవారు గిరీశం నోటంట ఆణిముత్యాల్ని దొర్లించాడు. శాస్త్రిగారితో సాంగత్యం కేవలం ఎడ్యుకేషనేకాదు; వీరి సాన్నిధ్యం ఒక మత్తు; అద్భుత వశీకరణశక్తి. కొంపలు మునిగి పోతున్నా, వదల మనసురాదు. అదేదో అసదౄశమైన అయస్కాంతశక్తి - అని అన్నారు తిరుమల రామచంద్ర.
కౄష్ణశాస్త్రిగారి భావకవితా కుటీరం
దేవులపల్లివారు ఎక్కడ వుంటే, ఆ స్థలంలో ఒక రంగస్థలి చిత్రించబడుతుంది. మధుర మధుమాసం. దానిలో విరగబూసిన గున్నమామిడి. కొమ్మనెక్కి పాడే కోయిల. నిండు జాబిల్లి, వెన్నెలజల్లు. వియోగగీతిక, పసిరిపచ్చని పెండ్లిపందిరి, కన్నెలు, పన్నీరు, అగరువత్తులు, మంచిగంధం, మల్లెలు సరేసరి అవి - దేవులపల్లివారి వెంటే తిరుగుతాయి. ఎందుకంటే, ఆయన బ్రాండ్ మార్క్ మల్లెపూలు వేరెవరూ సాగుచేయలేనివి కనక.
అందుకే - శాస్త్రిగారు వ్రాసింది ఎంత అన్నది బాలికుల ప్రశ్న అన్నాడు ఒక సహౄదయుడు. దేవులపల్లివారు ఒక పద్యం వ్రాసినా, అది ప్రబంధేతిహాస సరిసమానమే.
కౄష్ణశాస్త్రిగారి రచనలపై భిన్నాభిప్రాయాలుండవచ్చు. వారివారి భావనలు వారివి కనక. తాను నమ్మిన సత్యాన్నే, తాను చూచిన దౄక్కోణాన్నే రచనలో ప్రదర్శించిన ప్రజ్ణానమూర్తి. రచనను ఆస్వాదిస్తే, యితివౄత్తంపై కన్నా, కవిపై గౌరవం కలిగించే రచనే, వెంటనే రచయితపై కూడ రసాస్వాదులకు కవిపైకూడ విశ్వాసాన్ని పొందాలి. సరిగ్గా యిదే జరిగింది, దేవులపల్లివారి వ్యక్తిత్వంలో, రచనల్లో, నడకలో, నడతలో. అంతకన్నా, కవికి, సమాజం నుంచి వచ్చే కానుకలు, ఏం కావాలి?
దేవులపల్లి కౄష్ణశాస్త్రిగారి సాహితీసంహితలో సోదాహరణాలు
గేయాలు - ఆకాశవాణిలో వినిపిస్తే, శాస్రిగారే దర్శనం యిచ్చేవారు.
నీ పదములే చాలు రామా, నీ పద ధూళులె పదివేలుశివశివశివ అనరాదా? ఎందుకయా సాంబశివా!
నాటికలు
గుహుడు - సీతారామలక్ష్మణులను నది దాటించడం - 'పడవ నేను నడపటమేమిటి? సర్వమూ నడిపేవాడిని నడిపేవాడెవడమ్మా"? అంటాడు గుహుడు సీతతో. పడవ నడుపుము కర్ణధారీ, కడిమి విడువక కడలి మీరీ, దుడుకు పరువుల పడవ, సుడులు తిరిగే పడవ, తడసి రానే లేక తల్లడిల్లే పడవా అంటూ రాముణ్ణి ప్రార్ధించుకుంటాడు.
కవి పరంపర
కవి పరంపర వ్యాసావళిలో - వేమన గురించి, 'వేమన బాగా లోతుల్లోకి దిగినవాడు. కాళ్ళకి గులకరాళ్ళు తగిలేదాక; అయితే, లోకానుభవ సముద్రుడై పైకి తేలినవాడు. పడమటిదేశాల్లో పుడితే, ఏ 'షా', 'స్విఫ్ట్' లాగానో అవవలసినవాడు. మాట ఎంత కరుకుదో మనస్సంత కమ్మని జాతి కోవలోకి చెందినవారు అని అంటారు.
కవితాప్రశస్తి
సాహిత్యంలో శబ్దం సౄష్టించే భావచిత్రణలను యిలా ప్రస్తావించారు. కవిత్వంలో శబ్దం పలకడమే కాదు, పాడుతుంది. నడవడమే కాదు, ఎగురుతుంది.
కౄష్ణపక్షం - ప్రవాసము-ఊర్వశి
శాస్త్రిగారు బెజవాడ నుంచి బళ్ళారీ ప్రయాణంలోని రైలు నడకలోని సమాన లయకు స్పందించి, చుట్టూవున్న నల్లమల అడవుల సోయగానికి స్పందించి, పరవశించి - ఆకులో ఆకునై, పూవులో పూవునై, ఒదిగిపోవడమే కాక, భావకవిత్వానికి మొదటి శ్రుతిని, నుతిని పలవరించారు. యిది ఒక మెరుపు, మలుపు అయి తిష్ఠ వేసుకుని నేటివరకూ కూర్చుంది.
బదరిక-పల్లకి
మంచి పాటలు రాసేవాడికి, నిజమైన పాట రాసేవాడికి, లోపల కూడ అంతరాంతరాల్లో సంగీతం వచ్చి ఉండాలి. ఏ అనుభూతికి ఏ రాగమో, ఏ వరసో, విరుపో, నొక్కో, ఒదుగో, మాటతో కలసివస్తాయి. గేయానికి ఎక్కున నగలు తొడగకూడదని, శబ్దార్ధాలంకారాలు, వాటి బరువు పాటను ఎగరనీయదు. లోతులకు రివ్వుమని దిగనీయదు - అంటారు శాస్త్రిగారు. అధిక, స్వల్ప భారాలు గేయానికి తగవు అంటూ, సరిసమతులనంతో నిర్మాణం చెయ్యాలి అంటారు. ఉదాహరణ:గవాక్షాలు హౄదయానకు నీ కన్నులు, అవే తెలుపు నీ లోపలి తలపు తెన్నులు, అవి చీకటి తునుకలు, అవి నీడల మొలకలు. నిన్నెరిగిన పులుగునకవి నీలి నీలి మిన్నులు, కాకయున్న మొలుచుటేల నాకు రెక్కలు, ఆ కన్నుల నిలుచుటేల ఆకాశపు చుక్కలు. ఈ చిరుగేయంలో - కన్నులు, తెన్నులు, తునుకలు, మొలకలు, మిన్నులు, రెక్కలు, చుక్కలు - అంటూ సప్తవర్ణశోభితమైన సంగమస్థలిలో పునీతం చేశారో గమనించదగ్గ అంశాలు.
వ్యాసావళి
ఆపాతమధురం, సమస్తమూ ఇక్షురసార్ణవమే - చెరుకురసాల కడలి - అంటాడు శ్రీశ్రీ.మహావ్యక్తులు, విలక్షణమూర్తులను పరిచయం చేస్తూ - బ్రతికున్నప్పుడుమహాపురుషులను గొప్పవారు అనిస్వీకరించడానికి మనస్సు ససేమిరా ఒప్పుకోదు; వారిలో కూడా మనలో లాగే సమానంగా ప్రతీదినం, ప్రతీనిముషం, రోగాలు, రొష్టులు, రాగాలు, ద్వేషాలు, కనబడి, మనకన్న వారు అధికులని అనాలని అనిపించదు అని ప్రకటించే ధైర్యసాహసగుణం ఎవరినబ్బుతుంది? అలాగే, 'గతించిన మహాపురుషులను కూడా ఖచ్చితంగా, సరిగ్గా విలువకట్టలేం; వారిని దేవపదవికయినా ఎత్తుతాం; లేదా, ఔను, కాదూ అన్నట్లు గోడమీదిపిల్లివాటంగా చిరుప్రస్తావనలు చేసి వదులుతాం' అన్న శాస్త్రిగారి భావాలు వర్ణనాతీతాలు.
మంగళ కాహళి
విజయభారతి, ఆంధ్రగేహళి అన్న అధ్యాయాలుగా రచించిన దేశభక్తి పరంపరలు - శ్రద్ధాభక్తులతో దేశమాతను స్తుతించారు. ప్రముఖమైన్ - 'జయజయజయ ప్రియభారత, జనాయిత్రీ దివ్యధాత్రీ' అన్న గేయాన్ని పరిచయం చేసే ప్రయత్నం దుస్సాహసమే అవుతుంది కదా. అలాగే, ఎత్తండీ, ఎత్తరేం, స్వాతంత్ర్యపు జెండా - ఎత్తవోయి, ఎత్తు, ఎత్తు, ఆకాశం నిండా' అన్న అనుప్రాస గమనించదగ్గది.
ఆంధ్రమాతను - 'శ్యామల నవ సస్యాంబర, కోమల సుమవల్లీ చికురగా వర్ణిస్తూ, 'అటు తెలంగాణ, ఇటు కళింగాన - అటనట కోస్తారాయలసీమల ప్రత్యాంధ్ర మందిర గేహళి - సర్వదా మ్రోగు నీ మంగళ కాహళీ అంటూ సంపూర్ణాంధ్ర జనయిత్రిని స్తుతించారు.
చిత్రాతి చిత్రగీతాలు - మేఘమాల
చివరిగా ప్రస్తావిస్తున్నా, మొదటగా చెప్పదగ్గ, చిత్రగీతాల్లో సచిత్రసాహితీవిలువల వలువలను తొడిగినవారు మన దేవులపల్లి. మచ్చుకు, కొన్నిలో కొన్ని మాత్రమే.
కోతీబావకు పెళ్ళంట, పరుగులు తీయాలి, పిలచిన బిగువటరా, మనసున మల్లెల మాలలూగెనే, నీవుండేదాకొండపై, సడిసేయకో గాలి, మేడంటే మేడాకాదు, రావమ్మా మహాలక్ష్మీ, పాతాళగంగమ్మా రారా, పదములె చాలు రామా, అడుగుడుగున గుడివుంది, మావిచిగురు తినగానే, ఆకులో ఆకునై పూవులో పూవునై, గోరింట పూచింది కొమ్మ లేకుండా, ఆరనీకుమా ఈ దీపం. సామాన్యులకు, పండితులకు, పామరులకూ, అందరినీ సరిసమంగా మెప్పించి, ఒప్పించేలా అలరించే సాహితీపుష్పాలు, మేఘమాలా తటిల్లతలు.
అలాగే, శర్మిష్ఠ, శ్రీ ఆండాళ్ళు తిరుప్పావై, శ్రీ విద్యావతి, యక్షగానం అతిధిశాల, ఎన్నో ప్రస్తావించాలి. కాని, దేవులపల్లి వారి హాస్యోక్తులను స్మరించకుండ వారి ప్రతిభా వ్యాసం అసంపూర్ణమే అవుతుంది.
కౄష్ణశాస్త్రీయంగా హాస్యరస గుళికలు
'నిజలింగప్పాకు అనారోగ్ఫ్యం
శాస్త్రిగారిని ఎప్పుడు చిత్రానికి మాటలను రాయమన్నా, నిజలింగప్ప అనారోగ్యం తగ్గాక రాస్తాను అనడం ఎవ్వరికీ అర్ధం అయ్యేది కాదట. కాని ఆయన పరిభాషలో నిజలింగప్ప అంటే, కవితాత్మ - అంటే, కవిగా మంచి స్పందన రాగానే, సినీమా పాట రాస్తానని భావనా అని చాలా కొద్దిమందికే అర్ధం అయేదట.
వేమన పద్యాలకు అనుకరణలు
కలికాలపు కవి పండితులకు వేద విద్యల్లో అసాధారణ ప్రతిభ గురించి -
"వేద విద్యనాటి వెలుగె నశియించెగారె, బూరె, పప్పుచారు, మిగిలె,బుర్ర కరగి కరగి తొర్రగా మారెరా!విశ్వదాభిరామ వినురవేమ."
స్వతహాగా పిరికివారికి రాని ధైర్యం గురించి -
"ప్రొద్దుపోక బాబు, బొబ్బిలి కధ వినిగోడమీద బల్లెమూడలాగిఒక్క కేకపెట్టి ఊరుకున్నాడయా!విశ్వదాభిరామ వినురవేమ."
వౄద్ధులను పరిచయం చేస్తే, శాస్త్రిగారి ప్రతిస్పందన -
"కంటిచూపు తగ్గింది బాబూ' చెబితేగాని తెలియదు నాయనా?" అంటూ, ఆ వచ్చిన వ్యక్తి శాస్త్రిగారితో అంటే -
"మీరు అదౄష్టవంతులు! చెబితే తెలిసే స్థితిలో వున్నారు. చెప్పినా తెలియనివారు ఎందరున్నారో, భారతదేశంలో" అనేవారట శాస్త్రిగారు నవ్విస్తూ. శాస్త్రీయమంటే యిది మరి.
దేవులపల్లి కౄష్ణశాస్త్రిగారికి సాహితీనీరాజనాలు, నివాళులు. జయంతి (నవంబర్ 1) సందర్భంగా తెలుగురధం ఘనసంస్మరణం చేసుకుంటూ, వినమ్రతతో, వందనాలు సమర్పించుకుంటూ.
కొంపెల్ల శర్మ - తెలుగు రథం.

1 comment:

Unknown said...

దేవులపల్లి వారిగురించి చాలా విషయాలు తెలియజేసారు.ధన్యవాదములు.ఆయన పాటలు ముఖ్యంగా మీరు చెప్పిన కోతీబావకు పెళ్ళంట, పరుగులు తీయాలి, పిలచిన బిగువటరా, మనసున మల్లెల మాలలూగెనే, నీవుండేదాకొండపై, సడిసేయకో గాలి, మేడంటే మేడాకాదు, రావమ్మా మహాలక్ష్మీ, పాతాళగంగమ్మా రారా, పదములె చాలు రామా, అడుగుడుగున గుడివుంది, మావిచిగురు తినగానే, ఆకులో ఆకునై పూవులో పూవునై, గోరింట పూచింది కొమ్మ లేకుండా, ఆరనీకుమా ఈ దీపం.--వంటి పాటలను గుర్తు చేసుకుంటేనే మనసు పరవశమైపోతుంది.మరొక్కసారి ధన్యవాదాలు.word verification ను దయతో తీసివేయగలరు.