ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం - ఛాయాచిత్రకళ విశ్వంభర విన్యాసం
కళలన్నీ సౄజనాత్మకాలు
మహాసౌందర్యపు మహావ్యక్తీకరణం కళలోనే సాధ్యం అన్నాడు ఒక మహానుభావుడు. అనుభూతిని ఆలోచనలకి ఘనీభవింపజేసి ఒకరూపంలో పొదగడమే కళ లక్ష్యం అని కూడ చాలామంది భావిస్తారు. అందుకే మన శాస్త్రాలు కళలను విస్తారంగా విభజించారు. అన్ని కళలూ ప్రకౄతికి అనుకరణలే. అటువంటి ప్రకౄతి తత్వాన్ని, నైజాన్ని కూడ బంధించగలిగి, మనం అనుకున్నప్పుడు దర్శనం చేసు చేసుకునేలా భద్రపరచుకునే కళ - ఫొటోగ్రఫీ. మానవుని సౄజనాత్మక ప్రతిభ సుందరరూపంలో వ్యక్తమయ్యేది కళల్లోనే. అటువంటి సౄజన, ఫొటోగ్రఫీ కళ లో మెండు గా కాంతివంతంగా, రంగులహంగులతో విరాజిల్లుతోంది.
ఫొటోగ్రఫీ అవతరణం
ఫొటోగ్రఫీ - పదం స్వతహగా, గ్రీక్ భాష నుంచి, ఫొటొ (కాంతి), గ్రాఫిస్ (చిత్రం) పదాలనుంచి వచ్చింది. అంటే వెలుగు, కాంతితో కూడిన చిత్రం అని అర్ధం చెప్పాలి. తెలుగులో ఛాయాచిత్రకళగా దినదిన ప్రవర్ధమానం అయి, కళల్లో చిత్రం, ఛాయాచిత్రకళగా రూపుదిద్దుకుని, సమాజంలో అనివార్యకళగా తిష్ఠ వేసుకుని కూర్చుంది. ఈ కళ ప్రారంభం యూరోపు లో అంకురించిందని చెప్పాలి. 19వ శ. చివరిపాదంలో అంకురించిన ఈ కళ తొలిదశల్లో గ్లాస్ ప్లేట్లు, తర్వాత ఫిల్మ్ ప్లేట్ల ఉపయోగంనుంచి క్రమేపీ ఫిల్మ్ రోల్స్ చుట్టలుగా దర్శనం యిచ్చాయి. వాటికి కూడ కాలం చెల్లి, డిజిటల్, చిప్ ల సాంకేతిక విప్లవయుగంలో అల్పంలో అనల్పంగా ప్రతీరంగం వ్యాపిస్తోంది. ఫొటోగ్రఫి కూడ ఏం తక్కువ కాదు. యిక వెలుగు, మెరుపు, కాంతి విషయానికొస్తే, పూర్వం మీథేన్ రసాయనద్రవంతో పెద్దగా మంటలవెలుగు సహాయంతో చిత్రాలను తీసేవారట. మంటలు, బల్బులుగాను, ఫ్లాషులుగాను మారి, ఆధునికత, సాంకేతికతల సమన్వయ సహకారాలతో, అధ్బుతాలను సౄష్టించడమే కాక, తీసిన చిత్రాలను యింటర్నెట్, వెబ్ ల మాధ్యమంతో చిరస్థాయిగా భద్రపరచుకోగలగడం, విశ్వవ్యాప్తంగా జరుగుతున్న అన్Yఊహ్య పరిణామం. చిన్నపాటి డిజిటల్ కెమేరాలనుంచి, చిప్ ల ద్వారా విరాజిల్లుతున్న ఈ ఛాయాచిత్రకళ కళలకే కళగా వ్యాప్తిచెందుతూండడం శుభపరిణామం గా చెప్పుకోవచ్చు. కాలాన్ని, చరిత్రని, భూగోళాంతరాళాల్లోని వింతల్ని, విడ్డూరాల్ని, ఈ కళామాధ్యమం ద్వారా దర్శనీయం చేస్తున్న వైనం అభినందనీయం.
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం
1800 ప్రాంతంలో ఫ్రాన్స్ నివాసి, లూయిస్ జాక్వెస్ మాండె దాగురే అన్న చిత్రకళాకారుడి ద్వారా ఆనాటి సుసంపన్న కుటుంబాల్లోని వ్యక్తుల చిత్రాలను తీయించుకునేవారట. 1827 లో శాస్త్రవేత్త, జోసెఫ్ నేప్సే, జెల్ బాల్స్ ద్వారా యింటిలోని పావురాలగూడుని చిత్రించడం, ఎనిమిది గంటలు కాలాన్ని వినియేగించినా, ఈ అనుభూతికి, అనుభవానికి, నీప్సే హీలియోగ్రఫీ అని పేరులోకి వచ్చింది. వీటిని ప్రేరణకు తీసుకుని, దాగురే - నీప్సేల భాగస్వామ్యంలో అనేక ప్రయోగాలు జరగడం, ఛాయాచిత్రకళను ఆద్యంగా ఒక రూపునివ్వడం జరిగింది. ఫ్రెంచి ప్రభుత్వం నుంచి అనుమతి హక్కుల్ని పొందడం, ప్రతీ ఏడాది 19 ఆగష్టు, 1839 నుంచి సంప్రదాయబద్ధంగా ఉత్సవాల్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతూనేవుంది. దీనితోపాటు, ప్రపంచవ్యాప్తంగా, పిన్ హోల్ ఫొటోగ్రఫీ విషయంలో కూడ ఏప్రిల్ నెల, చివరి ఆదివారంనాడు జరుపుకోవడం కూడ సదాచారంగా వస్తూంది.
చిత్రాల సౄష్టి - ప్రపంచ పున:సౄష్టి
చిత్రాలను సౄష్టించడం, సేకరించడం, యావత్తు ప్రపంచాన్నే సేకరించడం, పున:సౄష్టి చేయడం అని, ప్రముఖుడు సుసన్ సోంటగ్, ఫొటోగ్రఫీ కళ పై తన పుస్తకం లో అంటాడు. కవిత్వం, చిత్రకళ, నాటకాలు, శిల్పకళలు కధనాన్ని వ్యక్తంచేస్తాయి. యివి ప్రాధమికంగా లలితకళల కోవలోకి చెప్పారు. ఛాయాచిత్రకళని కూడ కళ క్రింద చాలా ఆలస్యంగానే భావించారని చెప్పాలి. సకల జీవరాసులు, ప్రత్యేకంగా మానవుని జీవితంలోని వివిధదశల్ని, జన్మనివ్వడం నుంచి, మరణం వరకు, చిత్రీకరణం, భద్రపరచుకోవడం, కళను భద్రంగా పరిరకించుకోవడం లో భాగమనే చెప్పాలి. ఛాయచిత్రకళతో, సమాజాభ్యుదయానికి మరింత మేలు జరుగుతోందని నిర్ధారణ చేయవచ్చు.
ఎందరో కళాకారులు, అందరికీ వందనాలు
మనకున్న ప్రముఖ కళాకారుల్లో, రఘురాయ్, శరద్ హక్సర్ లాంటి వారు అనేకమంది ఈ కళారంగంలో నిష్ణాతులయి, ప్రపంచానికి ఒక సుందరమైన సవర్ణానుభూతిని అందించడంలో చరిత్రను సౄష్టిస్తునేవున్నారు. మన ప్రసార మాధ్యమంలోను, చిత్రసీమారంగంలోను కూడ అనేకమంది తన వౄత్తుల్ని, ప్రవౄత్తుల్ని రంగరించి, నభూతో న భవిష్యతి అన్న సూక్తిని సత్యం చేస్తున్నారు. నితిన్ బోస్, శైలెన్ బోసు, కమల్ ఘోష్, పి.యల్.రాయ్, మార్కస్ బారెట్లే, పి.శ్రీధర్, వి.యన్.రెడ్డి, రహమాన్, సి.నాగేశ్వరరావు, రవికాంత్ నగాయిచ్, వి.యస్.ఆర్.స్వామి, విన్సెంట్, నందమూరి మోహనకౄష్ణ, ఎందరో, ఛాయాచిత్రకళలో సేవ చేస్తున్నారు. చిత్రసీమలో కూడ అనేకమైన పాటలు, మాటలు, పాత్రలు, కెమేరాల చుట్టూ, ఫొటోగ్రఫీ వౄత్తి, ప్రవౄత్తిలను చిత్రీకరిస్తూ, ప్రశంసలను పొందడం కూడ జరిగింది.
చిత్రాలమయం - మన జైహింద్ సత్యం
కదలని బొమ్మలపై తనదైన శైలిలో కధాకమామిషుల్ని సౄష్టించిన, మన సత్యంగా, జైహింద్ సత్యం గారిని ఈ సందర్భంగా ప్రస్తావించి తీరాలి. స్టిల్ ఫొటోగ్రఫీ పై అపార పరిశోధనలను చేసి, 60 రూపాయల చౌకబారు కెమేరాతో అధ్బుతమైన ఫొటోలు తీయడం, ఆయన మంత్రపుపెట్టెలో బంధించని నటీనటులు లేరనేచెప్పడం, అందరకూ నచ్చేట్లు, మెచ్చేట్లు, చిత్రాలను తీయగలగడం వల్లనే, జైహింద్ సత్యం, మన సత్యంగా మారారు. అందుకే ఆయన చిత్రాలను తీయడం, ఒక యాగమని, తపస్సు అనే భావించాలంటారు. స్టిల్ సత్యం గా చిత్రసీమలో చిరస్థాయిగా పేరు తెచ్చుకున్నారు.
ఫొటో యితివౄత్తంగా నాటిక
ప్రముఖ రచయిత భమిడిపాటి రాధాకౄష్ణ, మనస్తత్వాలు అనే నాటికలో, నౌకరు ఫొటో స్టూడియో నుంచి పరాయి స్త్రీ ఫొటోని తస్కరించి, తనుపనిచేస్తున్న కుటుంబం లోని వివిధ వ్యక్తుల జీవితాల్లో ఎన్నెన్నె రకాల అనుమానాలను, కుటుంబంలో తాత్కాలికమైనా, కలహ వాతావరణాన్ని సౄష్టించిందో రసరమ్యంగా సౄష్టించారు. చక్కని హాస్య, చమత్కౄతులతో సంభాషణల్ని గుప్పడం కూడ, మనోభావాల్ని ఆవిష్కరించడం కూడ జరిగింది.
ఎవరి ఫొటోలైనా, చచ్చిపోయిన తర్వాతే, పేపర్లో పడతాయట, అన్న చురకల్ని కూడ మనకు రచయితలు వివరించిన సందర్భాలు అనేకం.
మధుర జ్ౙాపకాల్ని, దౄశ్యకావ్యాల్ని సౄష్టించగలిగే, 'ఫొటోగ్రఫీ' కళ చెందిన అభివౄద్ధి పరంపర సాగిన తీరు యిలా వుంది:
- హెన్రీ షూల్జీ, 1725లో సొల్యూషన్ ప్లేట్ పై శాశ్వతంగా ఫొటోలను బంధించే పద్ధతిని ప్రారంభించాడు. యిదే జార్జ్ ఈష్ట్ మన్ రీల్ గా పేరుపొందింది.- జోసెఫ్ నైసిఫోరా నీప్స్ (ఫ్రాన్స్) 1826 లోనే తొలిసారిగా ఫొటోని తీసినా, ఎక్కువకాలం నిలవలేదు.- యల్.యం.జె.డాగ్రే (ఫ్రాన్స్) 1939, ఆగష్ట్ 19 న ఫొటోగ్రఫీ విధానాన్ని కనుగొన్నాడు.- అదే రోజు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం జరుపుకోవడం సంప్రదాయంగా మారింది.- జార్జి ఈస్ట్మన్ కొడక్ (న్యూయార్క్) 1888 లో నలుపు-తెలుపు రీలును కనుగొన్నాడు.- దేశంలో కలర్ రీల్ 1950 ల్లో పరిచయం.- డిజిటల్ కెమెరాలు 1990 లో కనుగొనబడ్డాయి; కానీ, కేవలం సంపన్న దేశాలే వాటిని వినియోగించుకున్నాయి.- 1998 నుంచి భారతదేశంలోకి డిజిటల్ కెమేరా విప్లవం ప్రారంభమైంది.
ప్రపంచ ఛాయాచిత్రకళోత్సవం సందర్భంగా, కళాకారులందరికీ, అభినందనలని, ప్రోత్సాహాలను అందజేయడం, ఈ రోజు ప్రత్యేకంగా అంకితమవ్వడం పట్ల ఆనందానుభూతుల్ని ప్రకటించడం, కూడ ఔచిత్యం, సమంజసం.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.
కాలాన్ని తెలుగురథం పై విహార, విజ్ఞాన, వికాస యాత్ర చేయిస్తాం. మన మాతృభాష తెలుగులో విశ్లేషిస్తాం. 'కాలరథమ్ము మీదనె జగత్పతి నిత్యము స్వారి చేయునో? కాలరథమ్ము చక్రముల ఘట్టన పుట్టుచు రాలుచుండు కెం థూళి కణమ్ములే అగునొ తోచెడి ఈ సకల ప్రజాళియున్?' కాల రహస్యమున్ తెలియగల్గుటె పుట్టుకకున్ ఫలమ్మొకో? (బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు)
Tuesday, August 19, 2008
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment