Friday, August 15, 2008

స్వాతంత్ర్య శుభాకాంక్షలు

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు


ఎందరో మహానుభావుల కలల పంటలు, మరెందరో అమరవీరుల త్యాగఫలాలు. అదే భారతావని స్వంతత్ర దినోత్సవం, సకల మానవాళి సంబరాల సమారోహోత్సవం. ఆరుపదేళ్ళ జీవనయానంలో ఎన్నో మజిలీలు, మలుపులు, సంచలనాలు, సంకలనాలు, కష్టాలు, నష్టాలు, చిరునవ్వుల ప్రక్కనే కల్లోలనాదాలు, కల్లబొల్లి నినాదాలు, ఆనందం, విషాదం చెట్టపట్టాలేసుకుంటున్న ప్రయాణం. మారేవి మారుతున్నాయి, మారని రూపాలు, రూపాయిలూ దర్శనం అవుతున్నాయి. రూపుమారుతున్నట్లు కనిపించే పల్లెలు, పరుగెడుతూ, అలసి సొలసిపోయి చతికిలబడుతున్న పట్టణాలు. అన్నిరంగాల్లోనూ దూసుకెళ్ళుతున్నాం, అగ్రరాజ్యాల్లో చేరిపోతున్నాం. అయినా - ఆకలి, అనాధలు, కుళ్ళు, కన్నీళ్ళు, సుళ్ళు, రవంతే పరవళ్ళు.
ఏది ఏమైనా, యిది సంబరాల సమయం. స్వతంత్ర భావాభిరామాలకు నిలయం. అంబరం వైపు పయనం కావించే సమయం. అర్థవంతపు నేతలకీ, పాలనకీ నిరీక్షణం.


ఉవ్వెత్తున ఎగసిపోతున్న రాజకీయ రక్కసి గాలులు, 'చిరూగాలి శౄతిమించి 'అల్లూకుపోతున్న 'నాగాబంధ 'పవనావీచికలు. దుమ్ము, దుమారం, దురహంకారం, దురాశ, దుర్నీతి సంగమం. ప్రవచనంలా చెప్పుకునే అడుగుజాడ గాంధీజీదే. కాని, ప్రతీ వాడలో, అడుకుకొక్క గాంధారీ సుతుడే మరి!

ఓ భగవాన్! ప్రభూ! ప్రజ్ౙానమూర్తీ! ప్రవక్తా!

నాదేశపు ప్రజని, భారతావనిని, కరుణించు, కటాక్షించు.
స్థితిగతుల్ని మార్చలేని స్తబ్ధతలో కనీసపు నిబ్బరాన్ని
అందించుమార్పు తేగలిగే స్థితుల్లో మార్పిడికి అవసరమైన ధైర్యాన్నివ్వు
పైరెంటికి నడుమ ఉత్పన్నమయ్యే అంతరాన్వేషణ కొరకు జ్ౙానాన్ని ప్రసాదించు.
మన జాతికి మరో మహాసంకల్పం అందించడానికి, మరో మహాత్ముడు అవతరించాల్సిన తరుణం ఆసన్నమైంది.

స్వాతంత్ర్యం ఒక పక్షివంటిది. ఎగరగలిగితేనే స్వేఛ్ఛ. లేకపోతే బానిసత్వం. - మహాత్మాగాంధి.
మనం స్వేఛ్ఛలో సంచరిస్తున్నామా? లేక యింకా బానిసత్వంలోనే మసలుతున్నామా?
ఆలోచించండి! అవలోకనం చేసుకొండి!
భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు - ఈ సందర్భంగా తెలుగురథం అందజేస్తోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.

No comments: