నాడు - ఈనాడు ప్రత్యేకతలు
ఆనాడు 'ఈనాడు' తెలుగు దినపత్రిక వెలసిన రోజు - ఆగష్టు 10
ఈనాడు ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక. తెలుగు పత్రికా చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. వార్తలను సమర్పించడంలో కొత్తపుంతలు తొక్కి అశేష ప్రజల ఆదరాభిమానాలు పొందింది. తెలుగు పత్రికలలోనే కాక యావద్దేశంలోనే అత్యధిక ప్రజాదరణ కలిగిన పత్రికలలో ఒకటిగా నిలిచింది. ప్రజల జీవితాలతో మమేకమై, సమకాలీన చరిత్రలో విడదీయరాని భాగమైపోయింది. ఈనాడు తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన దిన పత్రిక. NRS 2006 సర్వే ప్రకారం 1,38,05,000 మంది పాఠకులను కలిగి, దేశంలోనే తృతీయ స్థానంలో నిలచినది.
1974 ఆగష్టు 10న రామోజీరావు విశాఖపట్నం శివార్లలోని, సీతమ్మధార పక్కన నక్కవానిపాలెం అనే ఊరిలో ఈనాడును ప్రారంభించాడు. చాలా సాధారణంగా, ఏ ఆర్భాటాలు లేకుండా 5000 ప్రతులతో ఈనాడు ప్రస్థానం మొదలైంది. ప్రారంభంలోనే ఈనాడుకు కొన్ని ప్రత్యేకతలుండేవి.
అప్పట్లో ఉన్న అన్ని పత్రికల పేర్లు ఎక్కువగా ఆంధ్ర శబ్దంతో మొదలయేవి. పైగా ఆ పేర్లు కాస్త సంస్కృత భాష ప్రభావంతో ఉండేవి. ఈనాడు అనే అసలు సిసలైన తెలుగు పేరుతో మొదలైన ఈ పత్రిక అప్పటి వరకు ప్రజలకు అందుబాటులో లేని కొత్త అనుభవాలను అందించింది.
ఆ రోజుల్లో పత్రికలు ప్రచురితమయ్యే పట్టణాలు, ఆ చుట్టుపక్కలా తప్పించి మిగిలిన రాష్ట్రం మొత్తమ్మీద పత్రికలు వచ్చేసరికి బాగా ఆలస్యం అయ్యేది; కొన్నిచోట్ల మధ్యాహ్నం అయ్యేది. అలాంటిది తెల్లవారే సరికి గుమ్మంలో దినపత్రిక అందించడమనే కొత్త సాంప్రదాయానికి ఈనాడు శ్రీకారం చుట్టింది. ఈ కొత్త అనుభవాన్ని ప్రజలు ఆనందంతో స్వీకరించారు.
అలాగే తెలుగు పత్రికల పేర్లు - ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, మొదలైనవి - తెలుగు భాషకు సహజమైన చక్కటి గుండ్రటి అక్షరాలతో అచ్చయ్యేవి. అయితే ఈనాడు ఈ సాంప్రదాయాన్ని పక్కనపెట్టి, తన పేరును పలకల అక్షరాలతో ముద్రించింది. ఇది కూడా పాఠకులకు కొత్తగా అనిపించింది.
విశాఖపట్నంలో ప్రముఖ దినపత్రికలేవీ అచ్చవని ఆ రోజుల్లో ఈనాడు స్థానిక వార్తలకు ప్రాధాన్యతనిస్తూ రావడంతో ప్రజలకు మరింత చేరువయింది. ఈనాడు సాధించిన విజయాలకు స్థానిక వార్తలకు అది ఇస్తూ వస్తున్న ప్రాధాన్యత ఒక కారణం.
తెలుగు భాష లో వార్తా దినపత్రిక కు ఒక కొత్త తరహాలో రూపుని, ఊపుని అందజేసిన ఘనత, గర్వం ఖచ్చితంగా చెరుకూరి రామోజీరావు గారిదే అన్నదాంట్లో ఏమాత్రం సందేహం, సంశయం రావు, రాకూడదు.
డెబ్బై రెండు సంవత్సరాల క్రితం తీసుకున్న ధైర్య సాహసోపేత నిర్ణయం, 'ఈనాడు' విషయంలో తెలుగు చరిత్రలో చిరస్థాయిగా నిలచియే ఉంటుంది.
No comments:
Post a Comment