Thursday, January 24, 2008

కవిత శారద - స్వరసుగాత్రి - కవితా కృష్ణమూర్తి

కవిత శారద - స్వరసుగాత్రి

సౌందర్య సంభూతం - భారతీయ సంగీతం

విషయం లేకుండా అందాల్ని కల్పించ గలదు కనకనే గానం కళల్లోకన్నీటికీ వుత్కృష్టమైనదయింది - చలం (మ్యూజింగ్స్)

సంగీతానికి, సాహిత్యానికి అద్భుతమైన ఒక శక్తి ఉంది। రెంటికీ పులిగోళ్ళున్నాయి. ఆ గోళ్ళతో గుండెను గీకి వేదనల నెత్తురును తోడుతాయి। నెత్తురుతోపాటు అలౌకికమైన అమృతాన్ని కూడా వెలికితీస్తాయి. అందుకే ఆనాటి ప్రముఖ కవిపండితులు చెళ్ళపిళ్ళవారు తన కధలు - గాధలు లో, " సంగీతంగాని, కవిత్వంగాని జీవితానికి స్వాతంత్ర్యాన్ని కలిగించడంలో అందెవేసినవే" అంటారు. కొడవటిగంటివారు అన్నట్లు, దివ్య్తత్వంతో కూడినది ఒకటే వుంది, అది సంగీతం. కల్లబొల్లి న్యాయాలకూ, ధర్మాలకూ, నీతులకూ, ప్రేమలకూ, బోధలకూ, అతీతమైంది.

యింతటి పవిత్రమైన, మహత్వపూరకమైన కళకు సేవ చేస్తున్న కళాకారులు, ఎంతమందో. అందరూ మహానుభావులే,
అందరికీ వందనాలు - అని నాదబ్రహ్మ త్యాగరాజు విరచిత కీర్తనను స్వరపరచవలసిందే. అటువంటి కళారంగం, ఆ రంగానికి సేవలను జోడిస్తే, చిత్రరంగం, చిత్రసంగీతం వస్తే, దానికి సార్ధకతను, అర్ధపరమార్ధాలను అనూహ్యంగా అందించే కళాకారుల్లో చిత్రసీమలోని నేపథ్యసంగీత కళాకారులు, కళాకారిణిలు. గాయనీమణుల్లో, ప్రతిభామూర్తి, కవితా కృష్ణమూర్తి కొద్దిమందిలో ఒకరు.

శారద - కవిత

తల్లిదండ్రులకు శారద, తండ్రిపేరు కృష్ణమూర్తిని జోడించిన వైనం। కాని, కళాప్రపంచానికి కవితా కృష్ణమూర్తి గా బహుళప్రచారంలోకి రావడంజరిగింది. మరోప్రముఖ సంగీతకళారుడైన డా. యల్. సుబ్రమణ్యం కు అర్ధాంగి అయి, కవితా సుబ్రహ్మణ్యంగా పేరుపొందిన సంగీతకళాకారిణి. తమిళకుటుంబంలో డిల్లీనుండి పుట్టిన ఈ శారద, సంగీతకళను అభ్యసించే సంకల్పంతో వ్యాపార రాజధాని, ముంబయి లోకి అడుగుపెట్టింది. సంగీతాభ్యాసం కొనసాగుతూనే, 'మాంగ్ భరో సజన' అన్న హిందీసినీమా (1980) లో తన గానలహరిని అందించి చిత్రసంగీతలోకాన్ని ఉర్రూతలూగించింది. అంతేకాక, శారద, కవిత గా మారిపోయింది. ప్రముఖ హిందీ చిత్రనాయకుడు అనిల్ కపూర్ కు జోడీగా నటించిన అందాలరాశి శ్రీదేవి నాయికగా, 'హవా హవాయ్' అన్న పాట దశదిశలా వ్యాపించి, చెవులను, మనససులను కూడ రంజింపచేసింది।

కవిత ప్రతిభకు 'హాట్రిక్'

హిందీచిత్రసీమకు తిరుగులేని సంగీత దర్శకుడు, ప్రముఖ సంగీతదర్శ్కుడు యస్.డి.బర్మన్ కొడుకు ఆర్.డి.బర్మన్
సంగీతదర్శకత్వంలో వచ్చిన చిత్రం ' 1942 - ఎ లవ్ స్టోరీ ' లోని యిద్దరు గాయనీమణుల్లో - కవిత ఒకరు.
అయితే, ఆ మరొకరు ఎవరనుకున్నారు? గానకోకిల, భారతరత్న లతామంగేష్కర్. ఈ నూతన తరహాలో నడచిన
ప్రేమకధాచిత్రంలో యిద్దరూ పోటీపడుతూ పాడేసికూచున్నారు. కవిత చిత్రగాన మాధుర్యానికి తార్కాణంగా, 1994,
1995, 1996 ల్లో ఫిలింఫేర్ - అత్యధ్బుత గానకళాకారిణి కి వరుసగా 'హాట్రిక్ ' ను పొందారు. 2003 లో యిదే
పురస్కారం 2003 లో మళ్ళీ వరించడం జరిగితే, 2005 లో భారత ప్రభుత్వంవారు 'padmaSrI' పురస్కారంతో
కవితను గౌరవించారు।

జీవితం - భాగస్వామ్యం - సంగీతకళాసేవ

జీవీతభాగస్వామ్యం లోనూ సంగీతసేవ మరువలేని పర్వంగా నడుస్తోంది।జీవితభాగస్వామి, ప్రముఖ వైలన్ విద్వాంసుడు 'డా। యల్। సుబ్రహ్మణ్యన్' తో కలసి సంగీత కార్యక్రమాల్లో భాగస్వామ్యం మరొక ప్రముఖ అంశం, కవితకు.

గానకోకిల ప్రశంసలు, పొగడ్తలు

భారతరత్న, గానకోకిల లతామంగేష్కర్ తనదైన భావాన్ని జోడించి, కవిత గాన ప్రతిభ గురించి చెప్పిన తీరు యిలా వుంది:
" సంగీతానికి చరమదశ వచ్చిందని భావించాను। కాని, నేను తప్పుగా భావించాను " అని చెప్పడం తోటి కళాకారినికి
సమస్థాయి పురస్కారం అనన్యం। కవిత గానం చేసిన చిత్రం - ' హం దిల్ దే చుకే సనం 'లో యిస్మైల్ దర్బార్ చిత్రగీతాలు రసరమ్యగీతాలు. కవిత గానం ఒక విశిష్టమైన, సుస్వరసహితమైన, రాగబద్ధ, సుగాత్రీ ' అని పలవరించిన తీరు సరిసములులేని విశ్లేషణ అనే చెప్పాలి. పాకీస్తాను ప్రభృతుడు, మహమ్మద్ యిమ్రాం ఖాం కూడ కవితాగానాన్ని చాలా మెచ్చుకోవడం మరువలేని మరువం.

మచ్చుతునకలు - ఎన్నో, మరెన్నో

కవితాగళంలో అద్భుతమైన చిత్రగీతాలని కొన్ని మాత్రమే ప్రస్తావించి, ఆమె ప్రతిభను అంచనాలకు అందనిది అని నిరూపిస్తాను.మొహ్రా చిత్రంలో, 'తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్ - అన్న పాట ఉదిత్ నారాయణ తో పాడినది, ఓ యారా దిల్ లగానా (అగ్నిసాక్షి), యిల్లు యిల్లు అన్న పాట సౌదా కర్ సినీమాలోను, మేరా పియా ఘర్ ఆయా - అన్న పాట, యారనా సినీమాలోను, తాళ్ లో - యిష్క్ బినా అన్న పాట, అఛ్ఛీ లగతీ హో - కుఛ్ న కహో చిత్రంలోను, ఐ లవ్ మై యిండియా - పరదేశ్ లోను, ఛలో ఛలే మిత్వా - నాయక్ చిత్రం లోనూ కవిత పాడిన పాటల ప్రతిభాపాటవాలు, కవిత ప్రతిభ కుతూహల రాగానికి స్వరప్రతీక।

మన చిత్రాలకూ కవితాగానం

ప్రతిభ వున్న కళాకారులు, ఆంధ్రప్రదేశ్ ను దర్శించకుండా, తెలుగుప్రజలకు తమతమ ప్రతిభలను ప్రదర్శించకుండా తమ వృత్తులను కొనసాగించడం సుసాధ్యం కాదు, కానేరదు. మన తెలగు మూర్తులకు కవిత చిత్ర కవితలను కలిపిన గొంతుల్లో ఒక నూతనత్వం, నవ్యత్వం నిత్యం గోచరిస్తాయి। మచ్చుతునకలు, తెలుగు్ చిత్రగీతికలు కొన్ని యిలా సాగాయి. కలలో నువ్వే (చిరుజల్లు), ఆడపిల్లలు (హోలీ), పెళ్ళికి బాజా (జయం మనదేరా), నిన్న కుట్టేసినాది
(నరసింహనాయుడు), కొక్కొరోకోరో (సోగ్గాడు), నెల్లూరి నెరజాణ (విష్ణు), ఒకసారి (విష్ణు) సినీమాల పాటలు ఆనాటి
కవితా కృష్ణమూర్తి, ఈనాటి కవితా సుబ్రహ్మణ్యన్, మన తెలుగు ప్రజకు అందించిన అద్భుతచిత్రగీతరాజాలు.
కవిత కమనీయ జన్మదిన శుభదినోత్సవం సందర్భంగా, ఆమె సుస్వరగళం, సరసస్వరసురఝరీనాదం వేదఘోషలా వినిపించాలని,

ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలను అందజేసుకుంటూ, భగవంతుడు మరింత సుసంపన్నమైన వృత్తిని, ప్రవృత్తిని అందిస్తాడని భావిస్తూ, సర్వేజనా:సుఖినోభవతు:

కొంపెల్ల శర్మ - తెలుగురధం.

2 comments:

GKK said...

అతిగా పొగడ్త చేశారు మీరు. కవితా కృష్ణమూర్తి గొంతు కీచుగా ఉంటుంది. అన్ని పాటలను ఒకే modulation తో పాడుతుంది. ఈ వ్యాసం చదివితే వాశిరాజు ప్రకాశం సినీ ప్రముఖులను అతిగా పొగుడుతూ వ్రాయటం తలపిస్తుంది. చక్కెర మోతాదుఎక్కువైతే కాఫీ వికారం కలిగిస్తుంది.

Unknown said...

అయ్యా తెలుగు అభిమాని గారు, మీ అభిప్రాయానికి ధన్యవాదాలు. యింక అభిరుచి, అభిప్రాయం అంటారా, అందరికీ గాయకుల స్వరస్థాయి, గాత్రధోరణి ఒకే మూసలో అనిపిస్తే, యింతమంది మంద ఎందరు చెప్పండి. అయినా, మీరు కూడ, కవిత గాన ధోరణిపై ఒక ప్రత్యేక వ్యాసం నిర్భంతరంగా వ్రాసుకోవచ్చు. మీ పేరు తెలుగు అభిమాని అని పెట్టుకోవడమే నాకు ఎనలేని విచారం కలిగసస్తోంది. విషయం కన్నా, తెలుగులో వ్యాసాన్ని మొదట ఆస్వాదించడం నేర్చుకోండి. పున: పున: ధన్యవాదాలు. యిట్లు కొంపెల్ల శర్మ. 26.1.2008.